'ధూపం వ్యాపించి ఉండగా' అంటే?
----------
'సరిగ్గా' తిరుప్‌పావై
పాసురమ్ 9
-------------------
మూలంలోని శైలితో, శిల్పంతో
తెలుగులో సరైన, మేలైన అనువాదంగా తిరుప్‌పావై!
భారతదేశ భక్తి సాహిత్యంలో తిరుప్‌పావైకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కవిత్వం, భక్తి, తాత్త్వికతల పరంగా మనకు అలవాటైన సాహిత్యంలో తిరుప్‌పావై ప్రముఖమైంది. తమిళ్ష్ వైష్ణవ సాహిత్యం నాలాయిర దివ్యప్రబన్దమ్‌లో (దివ్యప్రబంధం కాదు)
తిరుప్‌పావై ఒకటి ఆపై విశేషమైంది. తిరుప్‌పావై
ముప్పై పాసురాల సంప్రయోగం. తిరుప్‌పావై
పాసురాల్ని సంభావించింది, సంధానించింది, సమర్పించింది ఆణ్డాళ్ లేదా కోదై లేదా నాచ్చియార్. (ఆండాళ్ అని రాయడం సరికాదు)
తిరు అంటే మేలిమి అనీ, పావై అంటే నోము అనీ అర్థాలు. తిరుప్‌పావై అంటే మేలిమినోము లేదా మేలినోము అని అర్థం. తిరు, పావై రెండు పదాలు. తమిళ్ష్ భాష నిర్మాణం ప్రకారం ఈ రెండు పదాల మధ్యలో ప్ వచ్చి తిరుప్‌పావై అని అవుతుంది. తమిళ్ష్‌లో పావై అన్నది పదరూపం కాబట్టి తెలుగులో పా అక్షరానికి ప ఒత్తు పెట్టి తిరుప్పావై అని ప్రకటించడంవల్ల పావై అనే పదరూపం పాడవుతుంది. కనుక తెలుగులోనూ తిరుప్‌పావై
అనే ఉండడం మేలుగా ఉంటుంది.
ఆళ్ష్వార్ పాడిన విష్ణుభక్తి గీతాన్ని పాసురమ్ అని అంటారు. పాసురమ్ అంటే జ్ఞానగీతం అని కూడా అర్థం ఉంది. పాశురం కాదు. తమిళ్ష్ భాషలో శ కారం లేదు. కనుక శు కాదు సు అక్షరం ఉంటుంది. అందువల్ల తెలుగులోనూ సు అక్షరమే ఉండాలి. పాసురమ్ సంస్కృత పదం కాదు.
పాసు తరువాత ర కారం పక్కన అనుస్వరం కాదు (తమిళ్ష్ అక్షరాల పక్కన అనుస్వరం ఉండదు) మ కారపు పొల్లు (మ్) ఉండాలి. పాసురమ్ అనడమే సరైంది.
తిరుప్‌పావై వంటి మేలి కృతులకు అనువాదాలు చిత్తశుద్ధితోనూ, సరైన 'చదువు'తోనూ, 'తెలివిడి'తోనూ, మేలైన 'భక్తి'తోనూ, నిజాయితీతోనూ ఉండాలి.
1953 నుంచీ తెలుగులో తిరుప్‌పావై సరైన అనువాదంతోనూ, మూలంతోనూ, అవగాహనతోనూ రాలేదు. అందుకు భిన్నంగా 'తెలుగులో సరైన, మేలైన తిరుప్‌పావై'ను మీ ముందుకు తీసుకువచ్చాను. అందుకుని ఆశీర్వదించండి.
పాసురమ్ 9
ఆణ్డాళ్ తొమ్మిదో పాసురాన్ని నిద్రపోతున్న గోపకన్యను లేపడానికి ప్రయోగిస్తోంది; ఇదిగో ఇలా...
మూలం
తూమణి మాడత్తుచ్ చుఱ్ట్రుమ్ విళక్కెరియ,
దూబమ్ కమళ్షత్ తుయిలణైమేర్ కణ్‌వళరుమ్
మామాన్ మగళే! మణిక్కదవమ్ తాళ్‌తిఱవాయ్;
మామీర్! అవళై ఎళ్షుప్పీరో? ఉన్‌మగళ్‌తాన్
ఊమైయో వన్ఱిచ్ చెవిడో? అనన్దలో?
ఏమప్‌పెరున్తుయిల్; మన్దిరప్పట్టాళో?
మామాయన్, మాదవన్, వైకున్దన్ ఎన్ఱెన్ఱు
నామమ్ పలవుమ్ నవిన్ఱేలోరెమ్‌పావాయ్!
తెలుగులో
పవిత్రమైన రతనాల మేడలో చుట్టూ ఉన్న దీపాలు వెలుగుతూండగా,
ధూపం వ్యాపించి ఉండగా పరుపుపై నిద్రపోతున్న
మామకూతురా! రతనాల తలుపు గొళ్లెం తియ్యి;
అత్తా! తనను లేపవా? మీ అమ్మాయేమైనా
మూగదా లేక చెవిటిదా? మత్తులో ఉందా?
పిచ్చి నిద్ర; మంత్రానికి పడిపోయిందా?
మానల్లనివాడు, మాధవుడు, వైకుంఠవాసి అని అంటూ, అంటూ
నామాలు చాల చెబుతూ లేచి రాని; ఓలాల నా చెలీ!
అవగాహన
ఈ పాసురమ్‌లో "పవిత్రమైన రతనాల మేడలో చుట్టూ ఉన్న దీపాలు వెలుగుతూండగా" అనడం ఈ లోకంలో సత్యాలు రత్నాలై కాంతులీనుతూ ఉన్నాయి అనడానికి ప్రతీకగానూ, "ధూపం వ్యాపించి ఉండగా" అనడం లోకంపై దైవం వ్యాపించి ఉంది అనడానికి ప్రతీకగానూ చెప్పినట్టు తోస్తోంది. ఇలాంటి పరిస్థితిని గ్రహించకుండా నిద్రపోతున్నావా? అని మెత్తగా మందలిస్తోంది ఆణ్డాళ్.
మానల్లనివాడు (మామాయన్) అనడం మహావిష్ణువును సూచిస్తోంది (మాయన్ అంటే విష్ణువు, మామాయన్ అంటే మహావిష్ణువు).
ఆ గోపకన్య మాత్రమే కాదు మనమూ పిచ్చి నిద్రలోనే ఉన్నాం. దైవనామాలు చెబుతూ మనం నిద్రలేవాలి. దైవనామాలు విని కూడా నిద్రపోతున్నావా అని ఒకసారి (పాసురమ్ 7లో) అన్న తరువాత దైవనామాల్ని చెబుతూ నిద్రలేవాలి అని మళ్లా ఇక్కడ తెలియజేస్తోంది ఆణ్డాళ్.
నామోచ్చరణ మనల్ని దైవం వైపు నడిపించే తొలి అడుగు. "తస్యవాచకః ప్రణవః" అంటే పరమాత్మకు పేరు ప్రణవం అని ఒక పతంజలి యోగసూత్రం (సూత్రం 27)మనకు తెలియజేస్తోంది. నామం లేదా వాచకం మనకు దైవాన్ని స్ఫురింపజేస్తుంది. అందుకే దైవనామాల్ని చెప్పమని అంటోంది ఆణ్డాళ్.
రోచిష్మాన్
9444012279
ఎ.ఐ. మూలంగా మిత్రుడు దేవనాద(థ)న్ (శ్రీపూర్ణం) సంగీతబద్ధం చేసిన తమిళ్ష్ పాసురమ్ 9
https://youtu.be/eQ6rPSNl4nc?si=OS0ADledJXrborCw
No comments:
Post a Comment