*గంధర్వపురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా*
*జీవిస్తుండేవాడు గాని, ఎవరింటికీ భోజనానికి వెళ్ళేవాడు గాదు.* *అతడెంతో నిష్ఠతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ, తనకున్న దాంట్లోనే అతిథులను సేవిస్తుండేవాడు.* *ఆ కాలంలో శ్రీగురుని మహిమ వలన అచటికి ఆకర్షింపబడి వచ్చిన భక్తులెందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తుండేవారు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళే వాడు గాదు. ఒక సంవత్సరం మహాలయాలలో ఒక శ్రీమంతుడు గ్రామస్థులం దరినీ దంపత సహితంగా భోజనానికి ఆహ్వానించాడు.* *ఈ పేద బ్రాహ్మ ణుడు మాత్రం వెళ్ళడానికొప్పుకోలేదు. అతని భార్యకు అటువంటి సమారాధనలకు వెళ్ళి భోజనము, దక్షిణలు, క్రొత్త వస్త్రాలు, దానము తీసుకొని సుఖంగా జీవించాలని వుండేది. ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటివలే ఈసారి గూడ వప్పుకోలేదు. అతనితో తననొక్కదాన్నన్నా పంపమని, లేకపోతే అతనిని గూడ రమ్మని పట్టు బట్టింది! అతడు, 'నేను రాను, నీకంత ఆశవుంటే నీవు వెళ్ళవచ్చు అన్నాడు.* అప్పుడామె ఆ శ్రీమంతునితో, 'నేనొక్కదానైనా భోజనానికి రావచ్చా? అనడిగింది. అతడు, దంపతులే రావాలన్నాడు. నిరాశ చెంది, తన భర్తపై కోపంతో శ్రీగురుని వద్దకు వెళ్ళి తన బాధనంతా వెళ్ళబోసుకుని, తన భర్తగూడా ఆరోజు సమారాధనకు వెళ్ళేలా ఆదేశించమని కోరింది. అందుకు శ్రీనృసింహసరస్వతి నవ్వి, ఆమె భర్తను పిలిపించి, 'ద్విజోత్తమా, నామాటవిని ఈరోజుకు నీవుసమారాధనకు వెళ్ళు, భార్య యొక్కకోర్కె తీర్చడం భర్తయొక్క ధర్మం' అని హితం చెప్పారు. ఆ విప్రుడు, 'స్వామీ, మీ ఆజ్ఞానుసారం నా నియమం విడిచి నేడు సంతర్పణకు వెళతాను. గురువు ఆజ్ఞను ఉల్లంఘించగూడదు కదా?' అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు.
ఆనాడు అతడు జీవితంలో మొదటిసారిగా ఒక సత్రంవద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తిన భోజనానికి కూర్చున్నాడు. అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులిద్దరికీ అక్కడ తమ విస్తళ్ళలోనూ, మరికొందరి విస్తళ్ళలోనూ వున్న అన్నాన్ని ఒక కుక్క, ఒక పంది త్రాకి అపవిత్రం చేసినట్లు దర్శనమైంది. ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా, నిజంగానే ఒక కుక్క దడిలోంచి దూరివచ్చి, అన్నపురాశిని ముట్టుకున్నది. వెంటనే ఒకరు దానిని తరిమివేసి వడ్డన కొనసాగిస్తున్నారు. అది ఆ బ్రాహ్మణి చూచి, వెంటనే కోపంతో విస్తరిముందు నుండి లేచి, అందరితో ఆ విషయం చెప్పింది. ఆమె భర్త తల బాదుకుని, 'బుద్ధిలేనిదానా! నీవలన యీరోజు నాఖర్మ యిలా కాలింది!' అని చెప్పి, విస్తరిముందు నుండి లేచిపోయాడు. అప్పుడు ఆమెను తీసుకొని శ్రీగురుని వద్దకు వెళ్ళాడు. ఆయన ఆమెకేసి చూస్తూ, 'ఏమమ్మా! పరాన్నసుఖం అనుభవించావా? నీకోర్కె నెరవేరిందా?' అని అడిగి, నవ్వారు. ఆమె సిగ్గుతో తలవంచుకొని, 'స్వామీ! నాబుద్ధిహీనత వలన మావారిని గూడ యీ కుక్క కూటికి బలవంతాన తీసుకుపోయాను. నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలి' అని వేడుకొన్నది. ఆమె భర్త ఆమెను నిందించి తన తం భంగమైనందుకు ఎంతగానో వాపోయాడు. అప్పుడు శ్రీ గురుడు అతనిని ఊరడించి యిలా చెప్పారు: 'పోనీలే, ఏమైతేనేమి? నేటితో నీభార్య మనసు కుదుటపడ్డది గదా? ఆమె ఇంకెన్నడూ నిన్నలా వేధించదు. ఇంతమాత్రానికే నీకెట్టి గోషమూ రాదు. నీకు నియమభంగమూ కాదు. ఎప్పుడైనా దేవ, పిత్స కార్యాలలో భోక్త లభించక ఎవరికైనా కర్మానుష్టానికి ఆటంక మేర్పడినప్పుడు దానిని రక్షించడానికి భోక్తగా వెళ్ళినందువలన ఎట్టి దోషమూ వుండదు' అని చెప్పారు. అప్పుడా విప్రుడు, 'స్వామీ, ఎలాంటి భోజనం చేయవచ్చు, ఎలాంటిది చేయకూడదో దయతో వివరించండి' అని కోరాడు. శ్రీగురుడు యిలా చెప్పారు:
'గురువులు, మేనమామలు, ఆచారవంతులైన వేదవిదులు, అత్తమామలు, తోబుట్టువులూ పెట్టిన భోజనం చేయవచ్చు. తల్లిదండ్రులచేత సేవ చేయించు కునేవాడు, భార్యా బిడ్డలను ఏడిపించి, పేరు కోసం దానాలు చేసేవాడు, పొగరు బోతు, తగాదాలకోరు, వైశ్వదేవం చేయనివాడు, డబ్బుకాశించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేవాడు, క్రోధవంతుడు, భార్యను విడిచిపెట్టినవాడు, క్రూరుడు, పిసినారి, స్త్రీలోలుడు, దురాచారి, దొంగ, జూదరి, స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు, భగవన్నామస్మరణపట్ల శ్రద్ధాభక్తులు లేనివాడు, కనీసం సంధ్యావందన మైనా చేయనివాడు, డబ్బు తీసుకొని డాంబికంగా జపాలు చేసేవాడు, విశ్వాస ఘాతకుడు, పక్షపాతంతో అన్యాయం పలికేవారు, స్వధర్మం విడిచి పరధర్మం అవలంబించేవారు, బ్రాహ్మణులను, గురువును, సాధువులను, తన ఇంటి భోజనాన్నీ నిందించేవారు, తన ఇంటి కులదేవతను విడిచినవారు, దురాశాపరులు, భగవంతునికి నివేదించకుండా భోజనం చేసేవారు- ఇలాటి వారి భోజనం తిన్నవారూ పతితులౌతారు.
కూతురును, అల్లుణ్ణి బాధించేవారికి మరు జన్మలో బిడ్డలు కలరు. కేవలం అద్వైతం చెప్పి దేవపూజ చేయనివాడు, పొట్ట కూటి కోసం కపటంగా ప్రవర్తించేవాడు పెట్టిన భోజనం వలన మరుజన్మలో గ్రుడ్డితనము, అల్పాయుష్షు, లేక చెప్పుడూ కల్గుతాయి. నిత్యమూ యితరుల యింట్లో భోజనం చేసేవారి పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది. పూర్ణిమ, అమావాస్యలలో పరులయింట భోజనం చేస్తే మాసమార్జించిన పుణ్యఫలం నశిస్తుంది. సాటి వారికి కర్మాను షానంలో లోపం తీర్చడానికి తప్ప యితరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు. అలా చేసిన దోషం గాయత్రీ జపంతో తొలగుతుంది. సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి యింటికి గూడ వెళ్ళకూడదు. మనుమడు పుట్టేదాకా అల్లుని ఇంట్లో గూడా భుజించకూడదు. గోవు, భూమి, బంగారం మొ॥నవి దానం తీసికోవడం పుణ్య తీర్థాలలోనూ దానాలుతీసుకుంటే దోషమొస్తుంది. ఇటువంటి అనుచిత గూడా అంత చెడ్డవి గాదు గాని, గ్రహణ సమయంలోనూ, సూతకమప్పుడు, భోజనం చేయకుండా స్వధర్మమాచరించేవారికి దైన్యమెన్నటికీరాదు. దేవతలు, సిద్ధులు, కామధేనువూ గూడ వారిని సేవిస్తుంటాయి'.
అప్పుడా విప్రుడు నమస్కరించి, 'స్వామీ, స్వధర్మమంటే ఎలాటిదో కొంచెం వివరించండి' అని ప్రార్ధించాడు. స్వామి యిలా చెప్పారు: 'నాయనా, పూర్వ మొకప్పుడు నైమిశారణ్యంలో పరాశరమహర్షిని మునులిలా కోరారు: "మునీంద్రా, స్వధర్మానుష్టానంలోమాకు అడుగడుగునా సందేహాలు కలుగుతున్నాయి. ఆచారము, మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకోగూడదంటారు. కనుక దయతో మాకవి వివరించండి". అప్పుడా మహర్షియిలా చెప్పారు: "ఋషులారా, సదాచారం వలన సర్వమూ సిద్ధిస్తుంది. బ్రాహ్మణుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి, భక్తితో త్రిమూర్తులను, నవగ్రహాలు, సనకాది సిద్ధులను, పితృదేవతలను, సప్త సముద్రాలు,చతుర్దశ భువనాలు, సప్తద్వీపాలు, సప్త ఋషులను మొదట స్మరించాలి. అప్పుడు గోవుకు మ్రొక్కి, ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి. స్నానము, భోజనాలకు ముందు, తర్వాత గూడ కూర్చొని ఆచమనం చేయాలి. చూడగూడనివి చూచినప్పుడు, మాట్లాడగూడనివి మాట్లాడినప్పుడు, వినరానివి వినినప్పుడు ఆచమనం చేస్తే శుద్ధికల్గుతుంది. అందుకు నీరు లేకుంటే కుడి చెవును తాకాలి. కారణం, అందులో అగ్ని, జలము, వరుణుడు, సూర్యుడు,
వాయువు మొ||గా గల సకల దేవతలూ వుంటారు. తర్వాత మానసిక స్నానంతో పరిశుద్ధుడై సూర్యోదయం వరకూ గాయత్రీ దప్ప మిగిలిన వేద భాగంలో ఏప్రార్ధనా శ్లోకాలైనా చదువుకోవచ్చు. తర్వాత ఊరికి నైరుతి దిక్కున ఆరుబయట-దేవా లయాలు, పవిత్రమైన చెట్లూ లేనిచోట, బాటకు, నీరుకూ దూరంగాను, ఆకులూ -గడ్డీ లేని చోట మలవిసర్జనం చేయాలి. ఆ సమయంలో జందెము వేరుగా వేసు కొని, అంగవస్త్రం తలకు చుట్టుకొని వుండాలి. దిక్కులకేసి, ఆకాశంకేసి చూడ గూడదు. పగటివేళ ఉత్తర దిక్కుకు, రాత్రి వేళ దక్షిణ దిక్కుకూ తిరిగి కూర్చోవాలి. తర్వాత ఆచమించి కుల దేవతను స్మరించాలి'.
ఇలా శ్రీగురుడు ఆచారకాండ గురించి యింకెన్నో అంశాలు బోధించారు.”
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః
శ్రీ నృసింహ సరస్వత్యై నమః.
No comments:
Post a Comment