-----------
'సరిగ్గా' తిరుప్‌పావై
పాసురమ్ 4
----------------------
మూలంలోని శైలితో, శిల్పంతో
తెలుగులో సరైన, మేలైన అనువాదంగా తిరుప్‌పావై!
భారతదేశ భక్తి సాహిత్యంలో తిరుప్‌పావైకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కవిత్వం, భక్తి, తాత్త్వికతల పరంగా మనకు అలవాటైన సాహిత్యంలో తిరుప్‌పావై ప్రముఖమైంది. తమిళ్ష్ వైష్ణవ సాహిత్యం నాలాయిర దివ్యప్రబన్దమ్‌లో (దివ్యప్రబంధం కాదు)
తిరుప్‌పావై ఒకటి ఆపై విశేషమైంది. తిరుప్‌పావై
ముప్పై పాసురాల సంప్రయోగం. తిరుప్‌పావై
పాసురాల్ని సంభావించింది, సంధానించింది, సమర్పించింది ఆణ్డాళ్ లేదా కోదై లేదా నాచ్చియార్. ('ఆండాళ్' అని రాయడం సరికాదు)
తిరు అంటే మేలిమి అనీ, పావై అంటే నోము అనీ అర్థాలు. తిరుప్‌పావై అంటే మేలిమినోము లేదా మేలినోము అని అర్థం. తిరు, పావై రెండు పదాలు. తమిళ్ష్ భాష నిర్మాణం ప్రకారం ఈ రెండు పదాల మధ్యలో ప్ వచ్చి తిరుప్‌పావై అని అవుతుంది. తమిళ్ష్‌లో పావై అన్నది పదరూపం కాబట్టి తెలుగులో పా అక్షరానికి ప ఒత్తు పెట్టి తిరుప్పావై అని ప్రకటించడంవల్ల పావై అనే పదరూపం పాడవుతుంది. కనుక తెలుగులోనూ తిరుప్‌పావై
అనే ఉండడం మేలుగా ఉంటుంది.
ఆళ్ష్వార్ పాడిన విష్ణుభక్తి గీతాన్ని పాసురమ్ అని అంటారు. పాసురమ్ అంటే జ్ఞానగీతం అని కూడా అర్థం ఉంది. పాశురం కాదు. తమిళ్ష్ భాషలో శ కారం లేదు. కనుక శు కాదు సు అక్షరం ఉంటుంది. అందువల్ల తెలుగులోనూ సు అక్షరమే ఉండాలి. పాసురమ్ సంస్కృత పదం కాదు.
పాసు తరువాత ర కారం పక్కన అనుస్వరం కాదు (తమిళ్ష్ అక్షరాల పక్కన అనుస్వరం ఉండదు) మ కారపు పొల్లు (మ్) ఉండాలి. పాసురమ్ అనడమే సరైంది.
తిరుప్‌పావై వంటి మేలి కృతులకు అనువాదాలు చిత్తశుద్ధితోనూ, సరైన 'చదువు'తోనూ, 'తెలివిడి'తోనూ, మేలైన 'భక్తి'తోనూ, నిజాయితీతోనూ ఉండాలి.
1953 నుంచీ తెలుగులో తిరుప్‌పావై సరైన అనువాదంతోనూ, మూలంతోనూ, అవగాహనతోనూ రాలేదు. అందుకు భిన్నంగా 'తెలుగులో సరైన, మేలైన తిరుప్‌పావై'ను మీ ముందుకు తీసుకువచ్చాను. అందుకుని ఆశీర్వదించండి.
పాసురమ్ 4
----------------
ఆణ్డాళ్ నాలుగో పాసురమ్‌లో కన్నయ్యను ఆనందంగా మార్గశిర స్నానం చేసేందుకు అనుగ్రహించమని కోరుతోంది ఇలా...
మూలం
ఆళ్షి! మళ్షైక్ కణ్ణా! ఒన్ఱు నీ కైకరవేల్;
ఆళ్షియుట్ పుక్కు ముగన్దు కొడార్తేరి,
ఊళ్షి ముదల్వన్ ఉరువమ్ పోల్ మెయ్ కఱుత్తుప్
పాళ్షియన్ తోళుడైప్ పఱ్బనాబన్ కైయిల్
ఆళ్షిపోల్ మిన్ని, వలమ్పురిపోల్ నిన్ఱదిర్‌న్దు
తాళ్షాదే సార్‌ఙ్గమ్ ఉదైత్త సరమళ్షైపోల్
వాళ్షవులగినిఱ్ పెయ్‌దిడాయ్; నాఙ్గళుమ్
మార్గళ్షి నీరాడ మగిళ్ష్‌న్దేలోరెమ్‌పావాయ్!
తెలుగులో
సాగరమా! వానవేల్పు కన్నయ్యా! నువ్వు ఇవ్వడం ఆపెయ్యకు;
సాగరంలోకి దిగి తోడుకుని చప్పుడు చేస్తూ పైకి వచ్చి,
ఆదిపురుషుడి ఆకారంలాగా నల్లని మేనుతో,
విశాల బాహువుల పద్మనాభుడి చేతిలోని
చక్రంలా మెఱిసి, పాంచజన్యంలా మోగి
ఎడతెఱపి లేకుండా సారంగం నుండి వచ్చే శరవర్షంలా
అందఱూ వర్ధిల్లేట్టుగా వర్షించు; మేమూ
ఆనందంగా మార్గశిర స్నానం చేసేందుకు; ఓలాల నా చెలీ!
అవగాహన
ఆణ్డాళ్‌కు అంతా కన్నయ్యే; అన్నీ కన్నయ్యే. "సాగరమా" అని కన్నయ్యను సంబోధించాక "వానవేల్పు కన్నయ్యా" అంటూ వరుణదేవుడిగా కూడా కన్నయ్యనే పరిగణిస్తోంది ఆణ్డాళ్. వర్షం సాగరం వల్లే వస్తుంది కదా? "సాగరంలోకి దిగి తోడుకుని చప్పుడు చేస్తూ పైకి వచ్చి" అనడం వర్షంతో పాటు వచ్చే శబ్దాన్ని సూచిస్తోంది. మెఱిసే మెఱుపును సుదర్శన చక్రం అనీ, పాంచజన్యం మోగడం అంటే ఉరుము అనీ చెప్పకుండానే చెబుతోంది ఆణ్డాళ్. వర్షాన్ని శరవర్షం అనడం ఉదాత్తంగా ఉంది.
ఈ పాసురమ్‌లో చెప్పబడిన పాంచజన్యం విష్ణువు చేతి శంఖానికి పేరు, సారంగం మహావిష్ణువు ధనుస్సుకు పేరు.
వర్షాన్ని కరుణకు ప్రతీకగా ఆణ్డాళ్ చెబుతున్నట్టు తెలుస్తోంది. పాసురమ్ చివర "మేమూ ఆనందంగా మార్గశిర స్నానం చేసేందుకు" అనడం ఆ కరుణలో తడసిపోవడానికి అని గొప్పగా తెలియజెబుతోంది ఆణ్డాళ్. ఆ కరుణను "అందఱూ వర్ధిల్లేట్టుగా వర్షించు" అని కోరుకోవడం ఆణ్డాళ్ మాతృహృదయానికి అద్దం పడుతోంది. ఈ మాతృహదయాన్ని అర్థం చేసుకునే వేదాంత దేశికులు గోదా స్తుతి(మొదటి శ్లోకం)లో "కరుణయా కమలామివాన్యాం గోదాం" అంటే కరుణ కారణంగా ఇంకొక శ్రీదేవి లేదా లక్ష్మి వంటిది గోదా అని తెలియజేస్తూ ఇలా అన్నారు:
"శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం
శ్రీ రంగరాజ హరిచందన యోగ దృశ్యాం
సాక్షాత్ క్షమాం! కరుణయా కమలామివాన్యాం
గోదాం అనన్య శరణః శరణం ప్రపద్యే"
(శ్రీ విష్ణుచిత్తుడి వంశమనే నందన వనంలోని కల్పవల్లీ!
శ్రీ రంగరాజుని హరిచందన వృక్షంతో కలిసిపోయి కనిపించే దానా!
సాక్షాత్ క్షమ అయిన దానా! కరుణ పరంగా కమలంలో ఉన్న ఇంకో లక్ష్మీ!
గోదా! అన్య శరణం లేదు నిన్నే శరణు కోరుతున్నాను)
గొప్ప భావన, భావం, శైలి, శిల్పం వీటితో ఆణ్డాళ్ ఈ పాసురాన్ని మనకు అందించింది. ఎంత అర్థం చేసుకుంటే అంత అర్థం ఔవుతుంది ఈ పాసురమ్.
రోచిష్మాన్
9444012279
ఎ.ఐ. మూలంగా మిత్రుడు దేవనాద(థ)న్ (శ్రీపూర్ణం) సంగీతబద్ధం చేసిన తమిళ్ష్ పాసురమ్ 4:
https://youtu.be/EjpLtuhfAj4?si=IqfLEqHoWEcGC8AP
No comments:
Post a Comment