365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథ తో
♥️ *కథ*-*316* ♥️
మన జీవితం మనకు ఒత్తిడితో కూడిన ఒక సవాలుగా ఉందా లేక ఒక మధురమైన పాటలా ఉందా?
*ఖాళీ* *కాగితం*
ఒక ఆధ్యాత్మిక గురువు వద్దకు ఒక పూజారి వచ్చాడు. పూజారి చాలా ప్రజాదరణ పొందినవాడు, ఆ గురువు కంటే కూడా ప్రసిద్ధుడు, గ్రంధాల గురించి ఉన్నతమైన జ్ఞానం కలిగి ఉన్నవాడు. అతనికి అన్ని గ్రంథాలు కంఠతాః వచ్చినా కానీ, అతను ఇప్పటికీ ఇంకా అసంపూర్ణంగా ఉన్నట్లుగానే భావించేవాడు. అతను అన్నీ శాస్త్రాలను నేర్చుకున్నా, కంఠస్థం చేసినా కానీ, అతను సత్యానికి కనీసం సమీపంలో కూడా లేడని భావించేవాడు.
అతను అక్షరాలను, పదాలను గుర్తుంచుకోగలిగాడు, కానీ పదాలు అవసరంలేని నిశ్శబ్దాన్ని చేరుకునే తలుపును కనుగొనలేకపోయాడు.
అందుకే తన జీవితపు చివరి క్షణాల్లో గురువు కోసం వెతికాడు, ఒక గురువును కనుగొన్నాడు కూడా. ఆధ్యాత్మిక గురువు పూజారి వైపు చూసి, " నేను మీలో చాలా అవరోధాలను చూస్తున్నాను! మీ జ్ఞానం అపారమైనది. మీకు తెలిసినవన్నీ మీరు వ్రాసి తీసుకురండి. మీకు ఇప్పటికే తెలిసిన వాటి గురించి ఎందుకు మాట్లాడడం? మనం వాటన్నింటినీ వదిలేద్దాం. అప్పుడు నీకు తెలియనిది చెబుతాను", అని అన్నారు.
అలా శిష్యుడు వెళ్ళిపోయాడు. అతనికి ఒక సంవత్సరం పట్టింది. అతనికి చాలా గ్రంథాలు తెలుసు, అందువల్ల అతను వ్రాస్తూనే ఉన్నాడు, వ్రాస్తూనే ఉన్నాడు.... కొన్ని వేల పేజీలను నింపాడు. వెయ్యి పేజీల పుస్తకంతో తిరిగి వచ్చాడు.
గురువుగారు ఇలా అన్నారు,"మీరు తిరిగి వచ్చారే! మీ తలలో చాలా సమాచారం ఉంది కాబట్టి మీరు వ్రాయలేరేమోనని నేను సందేహించాను. ఎంత సమయం పడుతుందో నేను అంచనా వేయలేకపోయాను."
ఆ వెయ్యి పేజీల పుస్తకాన్ని చూసి గురువుగారు ఇలా అన్నారు, "ఇది చాలా ఎక్కువ. నాకు ఇప్పుడు వయసు పైబడింది, మరణం దగ్గర పడింది. ఇంత చదవలేను. అన్నీ క్లుప్తంగా వ్రాసి తీసుకురండి. దీనంతటి సారాంశం తీసుకురండి" అన్నారు.
దీనికి అతనికి 3 నెలలు పట్టింది. పూజారి తిరిగి వచ్చాడు, సారాంశం తీసుకొచ్చాడు. ఇప్పుడు కేవలం 100 పేజీలు మాత్రమే ఉన్నాయి. గురువుగారు చూసి, "ఇది కూడా చాలా ఎక్కువ. నా రోజులు దగ్గరపడ్డాయి, ఇప్పుడు నేను ఈ వంద పేజీలు కూడా చదవలేను.. ఇంకా తగ్గించండి", అన్నారు.
శిష్యుడు తిరిగొచ్చాడు. ఒక్క పేజీలో సారాంశాన్ని రాసి తీసుకొచ్చాడు. కానీ అప్పుడు గురువుగారు మరణానికి చేరువలో ఉన్నాడు. "సోదరా, ఇది కూడా చాలా ఎక్కువ, ఇంకా క్లుప్తంగా చెయ్యి. ప్రక్కగదిలోకి వెళ్లి త్వరగా దాని తాత్పర్యం చెప్పు" అన్నాడు. శిష్యుడు మొత్తం సారాంశాన్ని ఒకే వాక్యంలో, ఒక శ్లోకంలో వ్రాసాడు.
గురువు ఆఖరి శ్వాస తీసుకుంటూ ఇలా అన్నారు, "నేను మీ కోసమే ఆగి ఉన్నాను, మీకు ఎప్పుడు అర్థం అవుతుంది? దీన్ని ఇంకా చిన్నదిగా చేయండి. మీరు దానిని క్లుప్తంగా చేయడంలో అంత పిసినారితనం ఎందుకు చూపిస్తున్నారు?"
అప్పుడు శిష్యుడు స్పృహలోకి వచ్చాడు. అతను అవతలి గదిలోకి పరిగెత్తి, ఒక ఖాళీ కాగితం తెచ్చాడు. గురువుగారి చేతిలో ఆ ఖాళీ కాగితం పెట్టాడు.
గురువుగారు ఇలా అన్నారు, "నువ్వు శిష్యుడివి అయ్యావు! నేను వెళ్ళిపోతున్న సమయంలో అయినా నువ్వు శిష్యుడివి అయ్యావు. అలా నాతో నీ అనుబంధం కొనసాగుతూనే ఉంటుంది. నేను బ్రతికున్నప్పుడు కూడా నీకు నాతో సంబంధం లేదు, ఎందుకంటే జ్ఞానం మన మధ్యలో నిలిచి ఉంది. ఇప్పుడు నువ్వు ఖాళీ కాగితంలా అయిపోయావు. నేను వెళ్ళిపోతున్నా నువ్వు ఖాళీగా ఉన్నావు. కానీ చింతించకు, మన సంబంధం స్థిరపడింది! మృత్యువు కూడా దాన్ని ఛేదించలేదు. జీవితం కూడా నన్ను ఈ విధంగా మీతో కలుపలేదు."
శూన్యమైపోయిన ఆ క్షణంలో శిష్యుడు దైవత్వాన్ని పొందాడు.
కాబట్టి ఏమి జరిగింది?
నిజానికి ఇది చాలా ప్రత్యేకమైన కథ.
అతను ఖాళీ కాగితం తీసుకురాగానే ఏం జరిగింది?
ఖాళీ కాగితాన్ని తీసుకురావటం అంటే లోపల నుండి శూన్యమయినట్లు!
♾️
దాజీ ఇలా చెప్తారు -
భాగవత పురాణంలో ఒక అందమైన కథ ఉంది. ఆ కథ ప్రకారం శ్రీకృష్ణుడు ఎప్పుడూ వేణువు పట్టుకుని తిరుగుతుంటే చూసి రాధ అసూయపడేది. ఒకసారి ఆమె కృష్ణుడిని ఇలా ప్రశ్నించింది, "ఈ వేణువును ఎప్పుడూ పెదవులపై ఎందుకు ఉంచుకుంటావు? ఒక్క క్షణం కూడా అది నీ నుండి విడిపోదు! నువ్వు ఈ వేణువుతో గడిపినంత సమయం కూడా నాతో గడపడం లేదు. దీని వెనుక కారణం ఏమిటి?" అని అడిగింది. సమాధానంగా శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వాడు అంతే!
రాధ శ్రీకృష్ణుని వేణువును చూసి ఎంతగా అసూయపడిందంటే ఆ వేణువులో ఏముందో తెలుసుకోవడం కోసం ఆ వేణువును పగలగొట్టింది. కానీ వేణువును పగలగొట్టిన తర్వాత, వేణువు లోపల నుండి పూర్తిగా ఖాళీగా ఉన్నట్లు ఆమె తెలుసుకుంది.
అదేవిధంగా, భగవంతుని అనుభూతి చెందాలంటే, మనలో నుండి అనుచితమైనవాటన్నింటిని తొలగించి, సంపూర్ణ శూన్యతను పెంపొందించుకోవాలి. భగవంతుడు ఆ దివ్యమైన సంగీతాన్ని వేణువులాగా మన హృదయాల్లో వాయించాలంటే, మన హృదయంలో అనవసరమైన కోరికలు, ఆలోచనలు, మలినాలను, సంక్లిష్టతలను తొలగించుకోవాలి. వేణువులో కొంచెం మురికి లేదా మరేదైనా ఉంటే, మీరు ఆ వేణువు నుండి ఎటువంటి మధురమైన సంగీతాన్ని సృష్టించలేరు. 🌼
హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌
HFN Story team
No comments:
Post a Comment