Saturday, December 20, 2025

 #బాపుజన్మదినం

పైకప్పులేకుండా ఇల్లుండదని మనకి తెలుసు. కానీ మేకప్పులేని హీరోయినుంటుందా? ఉండొచ్చని సెలవిచ్చాడాయన! నీయింటో వాళ్ళే అక్కడ పాత్రధారులైనప్పుడు రంగులెందుకూ? మీయావిడా, చెల్లీ మేకప్పేసుకోకుండా ఇంటో తిరగట్లా? అలానే ఇదీనూ!

ఆ కుంచెకి రంగులక్కర్లేదు. నల్లగా గీతలెట్టేసినా కింద బాపు అంటూ ఓ సంతకం పడేస్తే రాములోరి ప్రసాదంలా కళ్ళకద్దుకు పట్టుకుపోతాం. అలానే అనుకున్నాడేమో? 

చిమ్మచీకట్లో గోరంతదీపాన్ని వెలిగించి అసలే నల్లమ్మాయి వాణిశ్రీని మేకప్పెయ్యకుండా లాక్కొచ్చి మనముందు నిలబెట్టాడు. 

ఫొటోల్లో చూసి డోక్కున్నారు. ‘ఇలాక్కూడా వుంటారా హీరోయిన్లూ? హన్నా! బొత్తిగా భయంలేదీ బాపూకి. ఇతగాడికి జతగాడు ఆ రవఁణొకడు! ఇద్దరూఇద్దరే!’ అనుకుని నోళ్ళు నొక్కేసుకున్నారు. 

ఆనక వెండితెరమీద అతనెలా చెప్తే అలా చూపించే ఇషానార్యాతో కలిసి నోళ్ళునొక్కుకున్న వేళ్ళు ముక్కునేసుకునేలా చేసాడు. ‘ఒకమ్మాయి కళ్ళని ఇలాక్కూడా చూపించొచ్చన్నమాట!’ అనిపించాడు!

ఇహ తెల్లారేలేచి ముగ్గులెట్టే కొత్తకోడలు, విలాసంగా సిగరెట్టుకాల్చే శ్రీధరంబాబు కథ మనవెఁరిగిందే! 

ఎంత తెలివంటే రాముణ్ణీ సీతనీ విడదీసే కాంట్రాక్టరాసురుడూ, మళ్ళీకలిపే లవకుశుల్లాంటి పిల్లలూ...ఇదీకథ! ఇదేకథ!

కానీ...ఇందులో

నీకిష్టమైన గోదారుంటుంది. 

చేతికందని మావిడికాయల్ని ఎగురుతూకోసే పడుచుపిల్లలుంటారు.

ఓమూల పెళ్ళవుతోంటే అరుగులమీద చేరి విసనకర్రతో విసురుకుంటూ మాటలు విసిరే మధ్యవర్తులుంటారు. 

వెన్నెల్లో గోదారిమీద నవదంపతులతో పాటు మనకీ ఊరేగింపుంటుంది. దానికితోడు మనదైన భాషలో మనసైన పాటుంటుంది.

అనురాగాన్ని సూచించడానికి అందమైన మాండొలిన్ సంగీతముంటుంది. 

ఆ కాసేపూ (అలవాటుంటే) రవణ అలా పక్కకెళ్ళి సిగరెట్టు కాల్చుకోవచ్చన్నమాట! మాటల్రాయక్కర్లేదుగా!😜 

దగుల్బాజీ మనుషుల కుట్రలూ, మళ్ళీ వాళ్ళే అందించే వినోదమూ వుంటుంది.

ముక్కుపచ్చలారని పసివాళ్ళ మూఢభక్తీ, మంకుపట్టూ చూపిస్తాడు. సత్యమేవజయతే అంటూ ముగిస్తాడు.

ఈమధ్యలో మనం మాత్రం మన మనసుల్ని హాల్లో పారేసుకుని సినిమా అయిపోయాక వెతుక్కుని, దొరక్కుండానే వెళిపోతాం. 

ఆనక తెలుస్తుంది ..అవన్నీ బాపూరవణా అట్టేపెట్టేసుకున్నారని! మళ్ళీ మనం మామూలు మనుషుల్లో పడ్డానికి ప్ఫదిరోలు పడుతుంది. 

ఇలా నిన్నూనన్నూ కట్టిపడేసే చిత్రాలెన్నో తీసాడూ, గీసాడూ ఈయన!

బీదాగొప్పా కలిసీమెలిసీ ఒకసారే పడవెక్కితే వచ్చే సందడంతా ఓ సినిమాగా తీసేసారు.

వినోదాల పెసరట్లూ, 
విషాదాల రామదాసు కీర్తనలూ, 
విజ్ఞతను బోధించే సమూహభోజనాలు...

వెరసి ఆ అందాలరాముడికి పానకంలాంటి పాటలూ, వడపప్పులాంటి కమ్మటి మాటలూనూ!

ఎన్నో కష్టనష్టాలకోర్చిన వీళ్ళిద్దరికీ చాలాకాలం తరవాత ఓ పుస్తకం రాయాలనిపించింది.

అందులో నువ్వుంటావు. నీ వైపు ఆలోచించే నీ వైఫుంటుంది. మధ్యలో మనస్పర్ధలుంటాయి. 

సరికొత్త చీరల్నీ, సరదా పిక్కునిక్కుల్నీ చూపిస్తాడు. 

మంచీచెడూ వేరేవేరే రాసులుగా పోసుండవంటూ నీతివాక్యాలుంటాయి. కానీ అవి నేతిఅరిసెల్లా వుంటాయి.

కళ్ళకి పెట్టుకునే గోరింటాకులూ...
అరిపాదాల్లో పుట్టుమచ్చలూ...
అరమరికల్లేని నిర్మలహృదయాలు...
ఆర్ధికంగా బలహీనంగావున్నా హార్దికంగా ఎంతో గొప్పవాళ్ళైన మొగుడూపెళ్ళాలు...

మళ్ళీ మన మనసుల్ని వాళ్ళ ఆఫీసు బేగుల్లో వేసి పట్టుకెళ్ళిపోతారు.

ఇన్ని కబుర్లుచెప్పినాయనా ఇంకేమీ చెయ్యలేడా? అంటే..

మన భారతానికి వ్యాసుడు గీతాకారుడైతే 
మన భారతావనికి ఈ బాపూ గీతకారుడు!

ఆ కుంచెకి రంగులవసరంలేదు
ఆ భావాలకి భాషతో పనిలేదు
ఆ బొమ్మలు చెప్పని కథే లేదు
ఆయన పేరేంటో చెప్పక్కర్లేదు
ఆ రెండక్షరాల సంతకవేఁ చాలు

రవఁణ ఒకటనుకుంటాడు. తనకి చెప్తాడు. బాపూ ఓ బొమ్మేస్తాడు. హర్రే! హాచెరం! అచ్చం తను ఎలానుకున్నాడో అలానే వేశాడే బొమ్మా??? అంటూ నోరుతెరుచుకునుండిపోతాడు.

అలా ఎన్నింటికని నోరుతెరుచుకు చూస్తాడు ఎవడైనా?

సీతాకల్యాణాలు, శ్రీరామపట్టాభిషేకాలు...
శివధనుర్భంగాలు, గంగావతరణాలు...
దశావతారచిత్రాలు, దిశలెరుగని కీర్తిపతాకలు!

తాళ్ళలాగూ బుడుగు, రెండుపిలకల సీగానపెసూనాంబ
పువ్వులచొక్కా బాబాయి, రెండుజెళ్ళ సీత

నవలలకి బొమ్మలు...
నవిలేసే బొమ్మలు...
నవవిధ నాయికలు...
నవరసాల చిత్రాలు...

నవనవోన్మేషమూ,
నభూతోనభవిష్యతీ!!

బ్రహ్మకడిగిన పాదాలను పదాలతో అభిషేకించిన అన్నమయ్య బ్రతికుంటే ‘బాపురే’ అనేవాడు!

పదకవితాపితామహుడికి
పదచిత్ర మహితాత్ముడి
పరమాద్భుత నివేదన అది!

చివరగా

తెల్లటిచీరకి అంచులో చుక్కలముగ్గెట్టి కళ్ళుతిప్పుకోలేనంత అందాన్ని అలదిన
ఈ చిత్రకారుడి వైచిత్రికి వేరే నిదర్శనాలవసరంలేదు!

అవును,
ఆ కుంచెకి రంగులవసరంలేదు!

నువ్వుపుట్టిన భూమ్మీద పుట్టావన్న ఒక్కవిషయం చాలదూ, మేమందరం దర్జాగా ఎనక సీట్లో కాలుమీద కాలేసుక్కూచోడానికి?

నీ పుట్టినరోజటగా? 

మన ఇల్లేరమ్మ చెప్పినట్టు చక్కహా ముందురోజు రాత్రే కుంకుడుకాయలు కొట్టి అట్టేపెట్టమని చెప్పు ఆ సూరేకాంతానికి! కాసిని వేణ్ణీళ్ళు పోస్తే బోల్డు నురగొస్తుంది.

చీకట్నే లేచి తలంటుకుని ఆ రెండు వెంట్రుకలూ పక్కకి దువ్వుకుని పండులా తయారై ఇంద్రులవారికి ఓ నమస్కారంచేసి మా లోకానికి రా!

నువ్వొచ్చేటప్పటికి కాసిని జీళ్ళూ, కారబ్బూందీ, ఇంకా తేగలూ అట్టేపెడతాను నీకోసం. అంతకుమించి నీకింకేంకావాలి?

పద్మశ్రీ తప్ప ఇచ్చుకోలేని పేదవాళ్ళంకదా!
భారతరత్నాలు వేరే తయారుగా వున్నారు!

నీ పాదాలకి నమస్కరిస్తోంటే తడితగిలితే అది మా తప్పుకాదు. కష్టాన్ని ఎదుర్కోగలంగానీ...

కన్నీళ్ళనెదుర్కోగలమా చెప్పు?

........జగదీశ్ కొచ్చెర్లకోట

No comments:

Post a Comment