విరిగిన దారాలు.
ఓ నా మిత్రమా,
ఆస్తిని అడగకు.. అది భూమి దాహం...
సహోదరుల హృదయాల్లో వెలిగే ప్రేమ దీపంపై
ఎగసిపడే జ్వాలై....
నిప్పు రవ్వలా
ఒక చీకటి మంటను సృష్టిస్తుంది...
అప్పుడు... కేవలం బూడిద మాత్రమే మిగులుతుంది...
అదేమి శాంతి?
మాట అనేది... నీ గొంతులోంచి వచ్చే ఒక గానం కాదా?
కానీ, అది ఇప్పుడు పదునైన కత్తిగా మారింది...
నిశ్శబ్దం నిండిన ఆలయంలో..,
రెండు ఆత్మలను ఒకే నదిలో కలిపిన బంధాన్ని
ఒక్క ఆవేశపు క్షణంలో ముక్కలు చేస్తుంది...
అంతే, బంధం విరిగిపోయిన వీణలా మిగులుతుంది...
పట్టుదల ...
అదొక మంచు పర్వతం అంచు...
గట్టి స్నేహబంధాల వసంతాన్ని ఆపేసి...
అనవసరమైన మొండితనం వెనుక దాగుంటుంది...
దాని కింద, ఆత్మల నడుమ ప్రవహించే
ఆప్యాయత నది స్తంభించిపోతుంది...
అదెలాంటి బంధం?
చివరికి,
ఈ విత్తం...
ఈ ధనము...
అది దేవుడిచ్చిన మనలోని
మానవీయ గుణాల సుందర తోటను
నిస్సత్తువతో తొక్కేసి, అణచివేస్తుంది...
ప్రేమ,
దయ,
సత్యం
అన్నీ మరుగున పడిపోతాయి...
మానవా...
ఆస్తి,
మాట,
పట్టుదల,
డబ్బు ...
వీటి బరువు మోసి,
నీవు ఎందుకంత అలసిపోయావు?
బంధ విచ్ఛిత్తి సాధనాలు నీ ఆత్మ శాంతిని
దొంగిలించడానికి వచ్చిన చీకటి మేఘాలు...
నీ మనసును
నిర్మలమైన ఆకాశంలా.. ఉంచుకో!
Bureddy blooms.
No comments:
Post a Comment