Saturday, December 20, 2025

 *#పంచభూతాలు, సూర్యనాడి, చంద్రనాడి కలిపి శరీరం ఏడు భూమికలు. వీటన్నింటికి అధిపతి ఆత్మ. అయితే మనిషి శరీరాన్ని ధరించి జీవించాల్సినందున, అతడికి తొమ్మిది శక్తులు అవసర మవుతాయి.*

*నింగి, గాలి, నిప్పు, నీరు, భూమి ప్రధానమైన అయిదు శక్తులు కాగా మనసు, వాక్కు వంటి మిగిలిన నాలుగు శక్తులు కలిసి మనిషిని నడిపిస్తయ్. ఇదంతా ఒక సమైక్య, సమాఖ్య చైతన్య భూమిక.*

 ఈ తొమ్మిది శక్తులను కంటికి కనబడకుండా నడిపించేదే ప్రాణశక్తి. 
ప్రాణమన్నా, వాయువన్నా ఒకటే. సర్వేంద్రియాలను నడిపించే శక్తంతా వాయుశక్తే. అదే మనిషి ఆయువు. వాయువు తన కార్యకలాపాలను ఆపి శరీరం నుండి బయటకు వెళ్లడాన్ని ఆయువు తీరడమని అంటాం. అదే మరణం. 

అంటే శరీరం, దాన్ని ఆశ్రయించి తమ తమ కార్యకలాపాలను సాగించే ఇంద్రియాలు, ప్రాణశక్తికి లోబడి ఉంటాయన్నమాట. ప్రాణం ఉంటే అమరత్వ స్థితి! ప్రాణం పోతే మృతత్వం!! 

ప్రాపంచిక సమస్త కార్యక్రమాల నిర్వహణకు ప్రాణశక్తే మూలం. విద్యాభ్యసనం మొదలుగా కడ శ్వాస వరకు ప్రాణశక్తే మనిషిని నడిపిస్తున్నది. ఈ ప్రాణశక్తే ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తులుగా మనిషిని ధీర, వీర, గంభీర, ఉదాత్త స్థితులలో నడిపిస్తున్నది. ఇదొక అద్భుతమైన శక్తి త్రిపుటి. 

తల్లి గర్భంలో పిండంగా, ఆపై శిశువుగా, కౌమార, యవ్వనాది దశలలో మనుష్యత్వాన్ని పరిపూర్ణమైన అనుభవంగా ఆవిష్కరించేది, ఈ ప్రాణశక్తే. కన్ను చూడాలన్నా, చెయ్యి కదలాలన్నా, చెవి వినాలన్నా.. ఆయా ఇంద్రియాలకు వాయు ప్రసారం ప్రసన్నంగా జరగాలి. అంటే ప్రాణశక్తి సమానంగా, ప్రశాంతంగా ప్రవహించాలి. ఇదొక సమన్వయ క్రీడ. 

దీనికి ధీశక్తి, నిగ్రహం, సహనం, సమభావన, సమతుల్యం అవసరం. ఈ సమన్వయ సాధనే అధ్యాత్మ సాధన! ఇదే నిజమైన యోగం. సర్వత్రా వ్యాపించి ఉన్న వాయుతత్వమే సత్యం! అదే ఆత్మ!!

 ఆత్మ నుండి వెలువడే శక్తే ప్రాణం! బింబ ప్రతిబింబాల వలె ఆత్మ, ప్రాణశక్తి భిన్నం కావు. వస్తువు లేకపోతే నీడ ఏర్పడని విధం ఇది. ఆత్మ వలె ప్రాణశక్తి సర్వవ్యాపకం. మూల వాసనల నుండి వాసనలు, వాసనల నుండి సంస్కారాలు, సంస్కారాల నుండి ఆలోచనలు, ఆలోచనల నుండి వాక్కు, వాక్కు నుండి కర్మలు, కర్మల నుండి జన్మలు, జన్మల నుండి కర్మలు.. పునరావృత్తిగా అంటే మరల మరల జరిగే కార్యకలాపంగా నిరంతరాయంగా సాగుతూనే ఉంటుంది.ఆదిత్యయోగీ.

ఈ కలాపమంతా శరీరంలోపలే జరుగుతుంది. జరిపిస్తున్నదెవరు? అన్న ప్రశ్నకు ప్రాణశక్తే అన్నది సమాధానం. కాల, కార్య, కారణ, కర్తవ్య విధి విధానంలో భాగంగానే అప్పుడప్పుడు ఈ ప్రాణశక్తి, తాను నిర్మించుకున్న శరీరం నుండి బయటకు, తిరిగి శరీరంలో ప్రవేశించనపుడు ఆ స్థితిని మరణం అంటాం. అంటే మరణం ప్రాణశక్తికి చివరి స్థితి కాదు. 

శరీరం దహింపబడుతున్నది. కానీ ప్రాణశక్తి అవ్యయంగా ఉంటున్నది. ఇదే ఎరుక! ఈ ప్రాణశక్తి శరీరంలో అగ్ని రూపంలో ఉంటున్నది. ఇదొక సప్తజ్వాలికా మాలిక. అది వైశ్వానర రూపం! 

కనటం, వినటం, అనటం, శ్వాసించటం, నిశ్వాసించటం.. ఈ ఐదు కలాపాలు ముఖ్య ప్రాణ శక్తుల వల్లనే. నిలపటం, ఆపై వదలటం ఈ రెండూ అంతర్జాలలు. ఈ ఏడు నాలుకలతో ఆహారం ఒంటిలోని అని అవయవాలకు తగు శక్తిని మోసుకొని వెళతాయి. కనుక వీటిని వాహకాలు అంటాం. 

మోసుకువెళ్లే శక్తి మాత్రం వాయువుదే. అంటే ప్రాణశక్తిదే. నాలుగు విధాలుగా ఆహారం మనిషికి పంచబడుతుంది, ప్రాణశక్తి ద్వారా! ఒక భాగం గత జన్మల సంచిత కర్మలను శమింపచేయడానికి, రెండో భాగం వర్తమాన జీవితాన్ని శక్తిమంతం చేయడానికి, మూడో భాగం జీవితాన్ని అధ్యాత్మ మార్గంలో నడిపించడానికి, నాలుగో భాగం రాబోయే జీవితాన్ని సమగ్ర సుందరం చేయడానికి... కనుక ప్రాణశక్తే సర్వశక్తుల నిలయం. 

ఏ శక్తినీ దుర్వినియోగం చేయరాదు. అంటే మనిషి తన శరీరాన్ని శక్తిక్షేత్రంగానే అనుభవించాలి.... పిప్పలాద మహర్షి హృదయం అద్భుత రహస్యాలను ఆవిష్కరిస్తున్నది.జిజ్ఞాసువులకు మహర్షి అనుగ్రహించిన సమాధానం, అమృతోపమానమై రసాస్వాదన కలిగిస్తున్నది..*

No comments:

Post a Comment