జీవితమే ఒక యాగం
సృష్టిలో నిత్యం ఎన్నో జీవులు పుడుతుంటాయి... గిడుతుంటాయి. మనిషీ వాటిలో భాగమే అయినప్పటికీ- మనసు, బుద్ధి, వ్యక్తీకరణ లాంటి మంచి లక్షణాలెన్నో కలవాడు. అందువల్ల ఎందుకు జీవించాలి? ఎలా జీవించాలి? అన్న ప్రశ్నలు వేసుకుంటాడు. వీటికి తృప్తికరమైన సమాధానాలు దొరకాలి.
మామూలుగా బతకడం అంటే- 'తెల్లారిందా? తిన్నామా? పడుకున్నామా?' అంటూ కాలక్షేపం చేయడం. ఏ లక్ష్యం, ఆశయం, ప్రణాళిక, ప్రయత్నం, కృషి లేకుండా కాలం గడుపుతున్నారంటే కేవలం తినడానికే బతుకుతున్నారా? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. మనిషి ఇలా నిరర్థకంగా, నిరుపయోగంగా బతుకు వెళ్లదీసుకోవడం కాదు. జీవించాలి. జీవితానికో పరమార్థం ఉండాలి. మనిషికి మనసుంటుంది. దానికి కోరికలుంటాయి. ఆ కోరికలకు ధర్మం... స్నేహితుడి వంటిది. హితబోధలో గురువు లాంటిది. రణరంగాన సైనికుడికి సమమైనది. ధనార్జనలో మంత్రి మాదిరిది. ఇలా గ్రహించినప్పుడు మనసు పెడదారి పట్టదు. వ్యసనాలకు బానిస కాదు.
జీవితం ఓ తపస్సు, యాగం. అంత పవి త్రంగా దాన్ని గౌరవించుకోవాలి. ఏమీ చేయకుండా ఉండటం కన్నా తప్పులు చేస్తూ, సవరించుకుంటూ, నవనవోన్మేషంగా తనను తాను తీర్చిదిద్దుకోవడమే జీవితాన్ని సార్థకం చేస్తుంది. దేవేంద్రుడి అభ్యర్ధన మేరకు వజ్రాయుధం కోసం దధీచి తన తనువును అగ్నికి ఆహుతి చేశాడు. ఈ శరీరం పరోపకారానికే అనుకునేవారికి సద్గతులే కలుగుతాయి. మనిషికి గెలుపోట ములు సహజం. గెలుపునకు అర్థం చెప్ప గలిగేది ఓటమి మాత్రమే అన్న వాస్తవం గ్రహించగలిగితే భావోద్వేగాలకు, నిరాశా నిస్పృహలకు తావే ఉండదు. బాల్యం, కౌమారం, యవ్వనం, గార్హస్థ్యం, వార్ధక్యం ఈ దశలన్నీ వేటికవే గొప్పవి. ఏ దశలోనైనా సాధకుడు తన విధ్యుక్త ధర్మసూత్రాలను సద్వినియోగ పరచుకోవాల్సిందే! మంచి మరణం ప్రాప్తించిందంటే అతడు చాలా గొప్పగా జీవించాడనీ, మరణించిన తరవాత కూడా జీవించాడనీ చెప్పుకొంటాం!
దొరికిన సమాచారాన్నంతా మెదడులో కుక్కేస్తే, మంచివాటిని గ్రహించేందుకు, భద్రపరచుకునేందుకు అందులో చోటుండదు. వ్యక్తిత్వ వికాసానికి కొన్నే చదవాలి. కొన్నే వినాలి, కొన్నే చూడాలి, కొన్నే పలకాలి. ఆ 'కొన్ని' ఏవో తెలుసుకోవడమే జ్ఞానం. మనిషి స్వభావం, నడత, ఆలోచన, సాంగత్యం- వీటి మీదనే ఆ నేర్చుకోవాల్సిన 'కొన్ని' ఆధారపడతాయి.
జీవితానికి అర్థం మనం జీవించడమే కాదు, సాటివాడికీ మంచి జీవితాన్ని ఇవ్వాలి. 'ఇతరులను దోచుకునేవారు పైకి ఎన్ని పూజలు చేసినా జీవిత సౌఖ్యాన్ని, శాంతిని ఎన్నటికీ పొందలేరు. సంతృప్తికి మించిన సంపద లేదు. ఇతరుల సుగుణాలతో తన దోషాలను సవరించుకునేవాడు జ్ఞానమార్గంలో జీవిస్తాడు. ఆధ్యాత్మిక కవచం జీవన రణరంగంలో సర్వదా కాపాడుతుంది. జీవన నిర్వహణకు పరిమితమైన లౌకిక వ్యవహారాలు కీడు చేయవు. హద్దు మీరితేనే హాని. బతకడమనే మాట మరచిపోయి సార్థక జీవన ప్రభాతాన్ని ప్రేమతో ఆహ్వానిద్దాం!
చిమ్మపూడి శ్రీరామమూర్తి
No comments:
Post a Comment