Saturday, December 20, 2025

 విదురుడు జీవితాంతం ధృతరాష్ట్రుడితోనే ఎందుకు కలిసి ఉన్నాడు? దాసీపుత్రుడు కాబట్టి ధృతరాష్ట్రుడికి జీవితకాలం దాస్యం చేసాడా? కురు క్షేత్రయుద్ధానంతరం ధర్మరాజు పరిపాలనలోనే శేష జీవితం గడపవచ్చు కదా?

🕉️ విదురుడు, ధృతరాష్ట్రుడితోనే కలసి ఉండడానికి కారణం :

~ విదురుడు కేవలం దాసీపుత్రుడు కాదు - అతను కురువంశపు సభ్యుడు, ధృతరాష్ట్రుడి సవతి సోదరుడు. అతను ధృతరాష్ట్రుడిని చిన్నప్పటి నుండి కలసి బ్రతికిన సంబంధం, అన్నదమ్ముల సంబంధం. భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా ఆ కాలంలో, కుటుంబ బంధాలు సేవకుల బంధాల కంటే చాలా లోతైనవి.

~ ధృతరాష్ట్రుడు జన్మాంధుడు. అతనికి నిత్యజీవితంలో ఎవరో ఒక విశ్వసనీయ వ్యక్తి కావాలి. విదురుడు అతని కళ్ళు మాత్రమే కాదు, అతని మనస్సాక్షి కూడా. యుద్ధంలో వంద మంది కుమారులను కోల్పోయిన తర్వాత, గాంధారి విచారంలో మునిగిపోయినప్పుడు, ధృతరాష్ట్రుడికి విదురుడి ఎంతో మద్దతు నిచ్చాడు.

~ విదురుడు ధృతరాష్ట్రుడిని తప్పు దారికి వెళ్ళకుండా ఆపడానికి జీవితాంతం ప్రయత్నించాడు. అతను విఫలమయ్యాడు, కానీ ఆ బాధ్యతను విడిచిపెట్టలేదు. యుద్ధానంతరం కూడా, ధృతరాష్ట్రుడి మనస్తాపానికి, అతని శేష జీవితానికి విదురుడు తోడుగా ఉండాలి అనుకున్నాడు.

🕉️ విదురుడు దాస్యుడా ?


~ విదురుడు ధర్మదేవత అవతారం. మహావిద్వాంసుడు. నీతి, రాజధర్మంలో అపూర్వ నిపుణుడు. రాజసభలో అతనిది మంత్రిస్థానం. రాజులకు ఉపదేశించే అధికారం. కావున అతని జన్మ దాసీపుత్రుడైనప్పటికీ, సామాజికంగా అతను బానిస కాడు, నైతికంగా స్వతంత్రుడు. ధృతరాష్ట్రుడిని ఎన్నోసార్లు గట్టిగా మందలించాడు.దుర్యోధనుడి ఎదుటే అనేకసార్లు ధర్మం చెప్పాడు. కౌరవులు వినకపోతే రాజసభను వదిలి వెళ్లిపోయాడు కూడా. కాబట్టి అతనిది దాస్యం కాదు, ధర్మం కోసం చేసిన సేవ.

🕉️ ధృతరాష్ట్రుడితో ఎందుకు జీవితాంతం ఉన్నాడు ?

~ ధృతరాష్ట్రుడు అంధుడు. ధర్మబుద్ధి ఉన్నా, పుత్రాసక్తితో తప్పు చేసేవాడు. సరిదిద్దే వ్యక్తి లేకపోతే పూర్తిగా అధర్మంలోకి జారేవాడు .విదురుడు వదిలితే ధృతరాష్ట్రుడు పూర్తిగా నాశనమవుతాడు . అది కూడా అధర్మమే.”

~ అందుకే ధృతరాష్ట్రుడు విన్నప్పటికీ, అతని మాటలు పరిగణనలోకి తీసుకోకపోయినా తన ధర్మబాధ్యతను ఏనాడు వదలలేదు. అతను ఫలితం మీద ఆశ లేకుండా, చేయాల్సిన కర్తవ్యాన్ని చేయడం, కర్మయోగం

🕉️ యుద్ధానంతరం ధర్మరాజు దగ్గర ఉండవచ్చు కదా ?

అది సులభమైన మార్గం. కానీ విదురుడు ఎంచుకున్నది సులభ మార్గం కాదు,, ధర్మ మార్గం.ధృతరాష్ట్రుడు అన్నీ కోల్పోయిన వృద్ధుడు. గాంధారి శోకసముద్రంలో మునిగిపోయి ఉంది. వారు మానసికంగా మరియు అంధత్వంతో మరింత తీవ్రమైన, లోతైన బాధలో ఉన్నారు.ఆ సమయంలో వారిని వదిలిపెట్టడం ధర్మమా ?” విజయం పొందిఉన్న వారిని సేవించడం సులభం. ఓడిపోయి, పతనమైన వారిని నిలబెట్టడం నిజమైన ధర్మ పరీక్ష

🕉️ చివరికి విదురుడు ఏం చేశాడు ?

ధృతరాష్ట్రుడు వానప్రస్థానికి వెళ్లినప్పుడు విదురుడూ అతనితోనే అడవికి వెళ్లాడు. రాజసుఖాలు వద్దని విసర్జించాడు. చివరికి తన జ్ఞానాన్ని యుధిష్ఠిరునికి ప్రసాదించి శరీరాన్ని త్యజించాడు

🕉️ చివరి మాట : విదురుడు ధృతరాష్ట్రుడితో ఉండటం, దాస్యం కాదు, బలహీనత కాదు, తప్పనిసరి పరిస్థితి అంతకూ కాదు అది స్వచ్ఛంద ధర్మత్యాగం.

No comments:

Post a Comment