Saturday, December 20, 2025

 రుద్రః అంటే శివుడా, విష్ణువా?. వేదంలో రుద్రారాధనే కదా ముఖ్యంగా ఉన్నది?


" రుద్రః " విష్ణుసహస్రనామాలలో ఒక అద్భుత నామం. ఈ రుద్రః నామం గురించి ఆదిశంకరులు అద్భుతమయిన భాష్యం చెప్పారు.

రుద్రహృదయోపనిషత్తు - యజుర్వేదం - శ్రీరుద్రః రుద్రః రుద్రః అని 3 సార్లు అంటే సమస్త పాపాలు దగ్ధమయిపోతాయి అని తెలియచేస్తూంది. కరుణామూర్తి.

" రోదయతి అంతఃకాలయితి రుద్రః " - ప్రళయ సమయంలో అందరినీ ఏడిపించేవారు రుద్రుడు అని.

" రురుం ద్రావయతి ఇతి రుద్రః " - రురుం అంటే దుఃఖము, దుఃఖహేతువు రెండింటినీ కరిగించేస్తాడు, పోగొడుతాడు అని.

శివపురాణం " రుత్ దుఃఖం దుఃఖహేతుర్వా తద్రావయతి యః ప్రభుః రుద్రయిత్యుచ్యతే తస్మాత్ శివః పరమ కారణం " అని తెలియచేస్తూంది - దుఃఖం, దుఃఖ కారణం రెండూ పోగొడుతాడు అని.

" అత్యంతిక దుఃఖనాశకః " - ఏ దుఃఖం పోతే ఇక దుఃఖమే ఉండదో ఆ స్థితిని రుద్రుడు ఇస్తారు అని - ఆనందప్రదాత.

" ప్రణత దుఃఖద్రావకః " - దుఃఖాన్ని ద్రవింపచేయువాడు. అందుకే కష్టం రాగానే రుద్రాభిషేకం చేసుకో, పంచాక్షరి చెయ్యి అంటారు.

ఋగ్వేదం " ఋషీణాం దృతమస్య రూపముపలభ్యతే " - ఋషులకు ధ్యానం చేస్తే వెంటనే కనిపిస్తాడుట రుద్రుడు.

" రుదంతే నాదాంతే ద్రవతి ద్రావయితి ఇతి రుద్రః " - వేదం - నాదం చివర లభించి ఆనందస్వరూపుడిగా ద్రవించువాడు అని. ఓం అని స్మరించి నప్పుడు మ్..... అంటాం చివరలో. మ్... చివరలో ప్రకృతిలో లీనమయినప్పుడు సాధకుల మీద అమృతధార కురిపిస్తారుట రుద్రుడు.

వేదం " ఓం నమోభగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే బాహి " అంది. రుద్రుడైన విష్ణువునకు నమస్కారములు అని.

అందుకే ఓ పండితుడు " రుద్రుడు కాని విష్ణువు, విష్ణువు కాని రుద్రుడు నాకు వద్దు " అన్నారు. అంటే దుఃఖం ( రుద్రుడు పోగొడుతాడు ) పోగొట్టని విష్ణువు ఎందుకు. విష్ణువు ( సర్వత్రా వ్యాపించిన వాడు ) కాని రుద్రుడు ఎందుకు అని.

" శివాయ విష్ణురూపాయ
శివరూపాయ విష్ణవే "

ఇంకా రుద్రుడు వేరు, విష్ణువు వేరు అనుకుంటే మూర్ఖత్వం. అటువంటి వారికి జ్ఞానం ప్రసాదించమని అమ్మవారిని కోరుకుందాం.

No comments:

Post a Comment