Saturday, December 20, 2025

 తెలుగు పుస్తకాన్ని చంపుతున్నది ఎవరు ?
మీరయితే కాదు కదా !!!

✍️ రాజేశ్వరరావు ములుగు

‘‘తెలుగు పుస్తకం చచ్చిపోతున్నది..అనీ, తెలుగు పుస్తకాన్ని చంపేస్తున్నాం… అనీ ప్రత్యేకంగా అంటున్నారు... తెలుగు భాషకే కాలం చెల్లింది కదా ?’’

‘‘కంప్యూటర్లు, సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు, విదేశాల్లో సంసారాలు, లక్షల్లో జీతాలు వచ్చిన తరువాత ఇంకా తెలుగు తెలుగు అంటారేం... తెలుగునే నమ్ముకుంటే ఇంత డెవలప్‌మెంట్ ఉండేదా ?’’

‘మిలీనియం, జన్ జెడ్‌ల యుగం సార్... గత 15-20 ఏళ్ళలో పదో తరగతితోనే తెలుగు చదవడం అయిపోతుంది కదండీ.. పైగా డిగ్రీ చదువులు కాంగానే దాదాపుగా మెజారిటీ యువత విమానాలెక్కేస్తున్నారు కదా. దానికి ముందు తరం వాళ్ళు తెరనుంచి మాయమయిన తరువాత మనం తెలుగు వాళ్ళమనే ఎరుక కూడా ఉండదండీ... ఇది నిజం...’’

‘స్మార్ట్ ఫోన్లు, అమెజాన్ కిండల్, ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ వచ్చి అద్భుతాలు చేస్తుంటే... ఇంకా తెలుగా !!!... అదీ తెలుగు పుస్తకాలా !!! అవెక్కడ ఉన్నాయి...చదివేవాళ్ళు ఎక్కడున్నారు, చదివే వాళ్ళే లేనప్పుడు రాసేవాళ్ళు ఎందుకుంటారు... అంతా వఠ్ఠి భ్రమ..’’

‘‘తెలుగులో వార్తా పత్రికలే చదవడం మానేస్తుంటే... ఇంకా పుస్తకాలు... అదీ కొని ఎవరు చదువుతున్నారు సార్... అసలు అవి పెట్టుకోవడానికి ఇంట్లో జాగా ఏదీ ?.. ఆఖరి పరీక్షయిపోగానే పిల్లల పుస్తకాలే ఏ ఏడాదికాయేడాది వదిలించేసుకుంటుంటే... ఇంకా కొత్తవి కొని ఏం చేసుకుంటాం... ఎక్కడ పెట్టుకుంటాం....’’.........కొన్ని సంవత్సరాలుగా ఇంటబయటా ఎక్కువగా వినిపిస్తున్న మాటలివి. 

నిజంగానే తెలుగు చదవడాన్ని,రాయడాన్ని యువ, నవతరం మర్చిపోయిందా ? తెలుగు పత్రికలు, పుస్తక ప్రచురణలు కొనఊపిరితో ఉన్నాయా ? అవే లేవు కాబట్టి తెలుగు రచనలు, రచయితలు ఎక్కడ కనిపిస్తున్నారు !!! వంటి అనుమానాలు, ప్రశ్నలు అనేకం ముసురుకొచ్చి...‘‘ తెలుగులో పుస్తక ప్రచురణకు కాలం చెల్లిందా ?’’ అన్న ధర్మసందేహాన్ని లేవనెత్తాయి, తెలుగు పుస్తక ప్రచురణ స్థితిగతులపై సమాచార సేకరణకు నన్ను పురిగొల్పాయి.

ఇంతవరకే అయితే ఈ సమాచారం అందరికీ తెలిసినదే. నేను ప్రత్యేకించి ఒక పాత్రికేయునిగా శ్రమించాల్సిన అవసరం లేదు.కానీ కొన్ని స్వానుభవాలు నన్ను కొన్ని చీకటి కోణాల్లోకి తొంగి చూసేట్లు చేసాయి. అదెలా అంటే........

‘నేను-బహువచనం’ పేరిట ఎమెస్కో ప్రచురణల సంస్థ సహకారంతోఒక పుస్తకాన్ని ఈ మధ్య ప్రచురించుకున్నా. 14 ఏళ్ళ క్రితం ‘నేను జర్నలిస్టునేనా ?’ అన్న పుస్తకాన్ని, 1990వ దశకం లో ‘టెలివిజన్, వీడియో, ఆడియో అండ్ ఎలక్ట్రానిక్స్’ మాసపత్రికను ప్రచురించినప్పుడు నేనే మార్కెటింగ్ చేసుకుని ఉండడంతో ... ఆ అనుభవం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో కొత్త పుస్తకం పంపిణీకి కూడా నేనే పూనుకున్నప్పుడు అడుగు తీసి అడుగు వేస్తుంటే విస్తుపోయే వాస్తవాలు కనిపించసాగాయి.

ఆ కొత్త దారుల్లో ముందుకుపోవడానికి, చీకటి కోణాల్లోకి తొంగి చూడడానికి నా పుస్తకం నాకు టార్చిలైట్ గా ఉపయోగపడింది. ఇది లేకుండా కేవలం ఒక పాత్రికేయునిగా ముందుకెళ్ళి ఉంటే... ఈ గుంతలు, గతుకులు... వాటికి మించి మందుపాతరలు కనిపించి ఉండేవి కావు. 

అందువల్ల ఒక రచయితగా,ఒక సెల్ఫ్ పబ్లిషర్ గా, నేను చాలా సమాచారం సేకరించగలిగాను. అయితే ఇది ఎంత వరకు నిజం ? అని ప్రతి ఒక్క క్షణం నేను ప్రశ్నించుకుంటూ నిజనిర్ధారణకు ఇప్పటికే ఇక్కడ నిలదొక్కుకుని ఉన్న రచయితలను,ప్రచురణకర్తలను, పుస్తక విక్రేతలను...వీరుగాక ఆధునిక, సాంకేతిక ఆఫర్లతో సరికొత్త ఆకర్షిత పథకాలతో మార్కెట్లో ప్రతిరోజూ పుట్టలుపుట్టలుగా పుట్టుకొస్తున్న ప్రచురణకర్తలను కలిసా, మాట్లాడా, ఇదంతా.. సమాచార సేకరణలో భాగంగా ... అలా చాలామటుకు నిజనిర్ధారణ చేసుకున్న తరువాత మీ ముందుకు వచ్చా. మీలో కూడా చాలా మందికి ఇటువంటి అనుభవాలే ఉండవచ్చు. లేదా మరోరకంగా ఉండవచ్చు.

ఈ వ్యాసం ద్వారా నా ఉద్దేశం- తెలుగు పుస్తక ప్రచురణ ప్రస్తుత స్థితిగతులను నాకు తెలిసినంత మేర వివరించడంతోపాటూ, తెలుగురచయితలను, తెలుగు ప్రచురణరంగంలోని వారిని, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలలో నిర్ణయాధికారం ఉన్న నాయకులను, అధికారులను చైతన్యపరచడం, చర్చకు పెట్టడం, తద్వారా తెలుగు పుస్తకానికి పూర్వవైభవం కట్టబెట్టడానికి తెలుగు భాషకు జవజీవాలు అందించడానికి తద్వారా మన తెలుగు సమాజానికి సరియైన దిశ-దశ అందించడానికి నా వంతుగా ఒక చిన్న ప్రయత్నం ఇది. 

వ్యాసం కొద్దిగా పెద్దదే...మీకు ఇబ్బంది లేకుండా... వాటిని మూడు, నాలుగు ముక్కలుగా విడగొడుతున్నా... ఇవన్నీ కలిపితే సమగ్రంగా అవగాహన కలుగుతుంది. ముందు భాగాల్లో అయితే మీ మనసు కకావికలమతుందని...చివరి భాగంలోనే మాఫియాలు, మోసాలు, మందుపాతరల వివరాలిస్తా.. అయితే కొద్దిగా విరామం ఇచ్చిన తరువాతే.....

బ్రాహ్మణుడు – మేక
బ్రాహ్మణుడు- మేక కథలాంటిదే ఇది. యజ్ఞకార్యంకోసం ఒక బ్రాహ్మణుడు మేకను కొని తీసుకెడుతుంటే.. దాన్ని తస్కరించాలనుకున్న దొంగలు... వ్యూహం ప్రకారం.. ఒకడు ముందుగా ఎదురొచ్చి..‘కుక్కను ఎక్కడికి తీసుకెడుతున్నారు?’ అని అడుగుతాడు. 

మరికొంత దూరం పోయిన తరువాత మరొకడు మాటలు కలిపి ‘చనిపోయిన దూడ’ను మోసుకెడుతున్నారా ?’ అని అని ప్రశ్నిస్తాడు, మూడవ వాడు దారిలో తారసపడి ‘గాడిదపిల్ల కదా అది ?’ అని అనుమానం వ్యక్తం చేస్తాడు. తనకు మేకగా కనిపిస్తున్నది మేక కాదనీ, దయ్యమని భ్రమించి ఆ బ్రాహ్మణుడు దానిని అక్కడే వదిలేసి వెడతాడు. 

ఆ మేకలాగానే ‘తెలుగు’ విషయంలో తలా ఒక రకంగా మాట్లాడుతుంటే..దానికి ఆరోగ్య పరీక్షలు చేసి నిర్ధారించుకోకుండానే ... చివరకు అది ‘చావుకు ఎదురు చూస్తున్న భాష’ అని తెలుగు సమాజం దాదాపుగా ఒక నిర్ణయానికొచ్చేసినట్లు కనిపిస్తున్నది.

నిజంగానే తెలుగుకు అంత దుర్దశ ఉందా ???
మొదట ‘తెలుగు భాష’ సంగతి చూద్దాం. వాస్తవానికి తెలుగును చదివేవారి సంఖ్య అంత దారుణంగా పడిపోతే... తాజా గణాంకాల ప్రకారం.... ఫేస్ బుక్‌లో ప్రచురించే తెలుగుపోస్టుల సంఖ్య ఏడాదికి సగటున 150-200 కోట్ల వరకు ఉంటుందట. 

మరి వీటిని రాస్తున్న వారు,చదువుతున్న వారు తెలుగు వాళ్ళే కదా.. రాయడం అంటే... పెన్నూపేపరే ఉండక్ఖర్లేదుగా. చదవడం అంటే... తాళపత్రాలు, పుస్తకాలే కాదు కదా !!! కాబట్టి చదవడం,రాయడంలో భాష భేషుగ్గానే ఉందన్న మాటేగా.

అలాగే ప్రచురణరంగం చావుబతుకుల్లో ఉందన్నది నిజమయితే... ఏటా డిసెంబరులో హైదరాబాదులోని ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో నిర్వహించే ‘బుక్ ఫెయిర్’లో రు.50-60 కోట్ల వ్యాపారం జరుగుతున్నదని ప్రముఖ ప్రచురణకర్తలే ప్రకటిస్తున్నప్పుడు... ఎలా అర్థం చేసుకోవాలి. దీనిలో అత్యధిక వాటా తెలుగు పుస్తకాలదే. తెలుగు పుస్తకాలు ఎక్కువగా ప్రచురించే వాటిలో ఒక్క ఎమెస్కో సంస్థ నిరుడు ఆ పది రోజుల్లో రు.35-40 లక్షలమేర అమ్మకాలు జరిపిందని వారే చెబుతున్నారు.

తెలుగు పుస్తకం కానీ తెలుగు రచనలు కానీ అంత అవసానదశలో ఉంటే... లక్షల రూపాయల పెట్టుబడిపెట్టి కొత్త ఆలోచనలతో, సరికొత్త మార్కెటింగ్ వ్యూహాలతో శ్వేత యర్రం(అజూ పబ్లికేషన్స్), పూర్ణిమ తమ్మారెడ్డి(ఎలమి పబ్లికేషన్స్), శేషు కొర్లపాటి(ఎన్నెలపిట్ట పబ్లికేషన్స్), అనిల్ డ్యాని, శ్రీరామ్ పుప్పాల(హోరా ప్రచురణలు), కె.శ్రీదివ్య(ఝాన్సీ పబ్లికేషన్స్), వి.సాయివంశీ, గుండ్ల వెంకట నారాయణ(రేగి అచ్చులు), సిద్ధార్థ కట్టు(ఒక.. పబ్లికేషన్స్),కడలి(కడలి రైట్స్ అండ్ పబ్లికేషన్స్), కవిత కుందర్తి (ఫ్రీవర్స్ ఫ్రంట్), ఉషా ప్రత్యూష(బాల బుక్ పబ్లికేషన్స్)వంటి వారు కొత్త పుస్తకాలను పుంఖానుపుంఖంగా ప్రచురిస్తూ ఎలా విజయవంతంగా, ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు. ? 

అజూ పబ్లికేషన్స్ ప్రచురించిన ఒక పుస్తకం కేవలం 8 నెలల్లో 1.75 లక్షల కాపీలు అమ్ముడై భారతీయ భాషల్లోనే ఒక సరికొత రికార్డు సృష్టించిందని వారు ప్రకటిస్తున్నారు కదా ! మరి ఇవన్నీ ఎలా సాధ్యం ???

అంటే ... తెలుగు భాషకు కానీ, రచనకు కానీ, ప్రచురణకు కానీ ఏ ప్రమాదమూ లేదు.పాఠకుల అభిరుచులు తగ్గనూ లేదు. 

బ్రాహ్మణుడు-మేక సామెత లాగా మాతృభాషపట్ల ఒక అపోహ... తెలుగు సమాజాన్ని నిర్వీర్యం చేసేంతగా దుష్పచారం అవుతున్నది. అయితే రాశి, వాసిని కూడా స్కాన్ చేసినప్పుడు మాత్రం కొన్ని నిజాలు భయంకరంగా కనిపిస్తున్నాయి.

https://mideabox.blogspot.com/2025/12/blog-post_54.html?spref=tw
..............

No comments:

Post a Comment