కాశీ యాత్రలో మనం ఏదో ఒకటి వదిలెయ్యాలి అని పెద్దలు అంటారు కదా ! అది ఎలాంటి వాటిని వదలాలి దాని అర్థమూ పరమార్థం ఏమిటి ? కాశీ టు రామేశ్వరమా లేక ముందు రామేశ్వరం టు కాశీనా ? ఈ జంట తీర్థయాత్రలో వున్న నియమ , నిష్టలు ఏమిటి ? ఏ వయసులో ఈ యాత్రలు
కాశీయాత్రలో వదిలేయవలసినది " కాయ, ఫలం " అన్నారు. కాయ అంటే కాయాపేక్ష - శరీరంమీద మమకారం, ఫలం అంటే ఫలాపేక్ష - ఫలాన్ని ఆశించకుండా కర్మలు చేయమని - ఉదాహరణకు దానం/సహాయం.
ఏ యాత్రకు అయినా నియమనిష్టలు ఒకటే. భక్తి, శ్రద్ద, నమ్మకం. ఏ వయసులో అయినా అద్భుత ఫలితాన్ని ఇస్తుంది ఈ యాత్ర.
" కాశీ దివ్యక్షేత్రంలో కాలభైరవుని ఢీ కొట్టిన హనుమ"
" కాశీ రామేశ్వరం యాత్ర " అంటూంటారు. భక్తులు కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి విశ్వనాధుని దర్శించుకుని అక్కడి గంగా జలాన్ని, గంగ మట్టిని తీసుకుని రామేశ్వరం వెళ్ళి అక్కడ లింగాన్ని గంగాజలంతో అభిషేకించి గంగమట్టిని అక్కడ సముద్రంలో కలుపుతారు. ఆ సముద్రంలోని ఇసుకను తీసుకుని మళ్ళీ కాశీ వెళ్ళి అక్కడ గంగలో కలుపుతారు. అలా చేయడంతో కాశీ రామేశ్వరం యాత్ర పూర్తి అయినట్లు భావిస్తారు.
ఎందుకని అలా చేస్తారు అని ఆశ్చర్యం కలుగుతుంది. దీని వెనుక ఓ చక్కని పురాణగాధ ఉంది.
శ్రీరామ పట్టాభిషేకం అయింది రావణ వధానంతరం. రామరాజ్యంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవిస్తున్నారు. స్వర్ణయుగం అది ప్రజలకు. కాని శ్రీరాముడి హృదయంలో ఓ మూల కించిత్ కలవరం. ఎంతయినా రావణుడు బ్రాహ్మణుడు, శివభక్తుడు, వేదవేదాంగ పారంగతుడు. అతని వధ తనకు బ్రహ్మహత్యా దోషం కలిగించేదేమోనని రాముడి ఆవేదన.
వశిష్టుడిని ఇతర మహర్షులను సంప్రదించారు రాముడు. వారు బాగా ఆలోచించి " కాశీలో గంగలో స్నానం చేసి అక్కడి స్వయంభూ శివలింగాన్ని తీసుకుని వచ్చి ప్రతిష్ఠిస్తే బ్రహ్మహత్యా దోషం తొలగుతుందని తెలియచేసారు ". స్వయంభూలింగాన్ని తీసుకుని వచ్చి రామేశ్వరంలో ప్రతిష్టించాలని నిర్ణయించారు. మరి కాశీలోని పవిత్రమైన శక్తివంతమైన ఆ లింగాన్ని తేగలిగిన వారు ఎవరు. శ్రీరాముడు ఈ పవిత్ర కార్యక్రమానికి హనుమే సరైన వ్యక్తి అని భావించి పిలిపించారు. విషయం తెలియచేయగానే హనుమ " మీ ఆజ్ఞ శిరోధార్యం " అని తెలియచేసి క్ణణం ఆలస్యం చేయకుండా దేహాన్ని పెంచి గాలిలోకి ఎగిరి కాశీకి బయలుదేరారు వాయువేగంతో.
కాశీ సృష్టిలో అతి పురాతన నగరం. శివుడి త్రిశూలంపై నిలిచిన ధామం. కర్మభూమి. మోక్షధామం. భూమిపై ఉన్నా భూమికి చెందని దివ్యధామం. ఆ కాశీకి క్షేత్ర పాలకుడు రుద్రుని రౌద్రరూపం, కాలానికి అధిపతి అయిన కాలభైరవుడు. ఆయన అనుమతి లేకుండా దేవతలే కాదు యముడు కూడా కాశీలో అడుగు పెట్టలేరు. వేల సంవత్సరాలుగా మారని నియమం ఇది.
హనుమ పైనుంచి కాశీని చూసి ఆశ్చర్యపోయారు. ఆ తేజస్సు, చుట్టూ ఉన్న దివ్యవాతావరణం ఆయనను ముగ్ధుణ్ణి చేసింది. కాశీ వెలుపల గౌరవంగా క్రిందకు దిగారు. క్షేత్రానికి నమస్కరించి కాలు కాశీలోపల పెట్టబోతే ఏదో కనిపించని గోడలాంటిది అడ్డుకుంది. ఆశ్చర్యపోయారు హనుమ. ఎంత ప్రయత్నించినా సర్వశక్తులూ ఉపయోగించినా అడుగు ముందుకు పడలేదు.
అదే సమయంలో ఆయన ముందు ఓ భయంకరమయిన ఆకారం ప్రత్యక్షమయింది. నల్లని ఆకారం, చేతిలో దండం, నిప్పులు కక్కుతూన్న కళ్ళు. ఆయనే కాశీ క్షేత్రపాలకుడు కాలభైరవుడు.
కాలభైరవుడు గంభీరమయిన స్వరంతో గర్జించాడు " ఓ వానరవీరా ఎవరవయ్యా నీవు. నా అనుమతి లేకుండా కాశీలోకి ప్రవేశించడానికి ఎలా ధైర్యం చేసావు. ఇది మహాదేవుని నిలయం. దీనికి రక్షకుడను అయిన నా అనుమతి లేకుండా గాలి కూడా లోపలికి చొరబడదు. అసలు ఎందుకు వచ్చావో చెప్పు " అని. హనుమ వినయంగా నమస్కరించి " మహాత్మా, నేను శ్రీరాముడి దాసుడను. నా పేరు హనుమంతుడు. నా ప్రభువు ఆజ్ఞ మీద ఓ ముఖ్యమైన పని కోసం వచ్చాను. లోకకళ్యాణం కోసం, రావణసంహార దోషపరిహారార్ధం ఇక్కడ నుంచి స్వయంభూలింగాన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చాను. ఇది శ్రీరామకార్యం. దయచేసి అడ్డుచెప్పకండి " అనగానే కాలభైరవుడు కోపంతో " శ్రీరామకార్యమా, విష్ణువు అవతారమయిన రాముడు గొప్ప వాడే కావచ్చు. కాని ఇది శివక్షేత్రం. శివుడి మాటే శాసనం. నువ్వెంతటివాడవయినా దూతవయినా ఇక్కడ మట్టిని కూడా తాకలేవు. శివలింగాన్ని తీసుకుని పోలేవు. నీకు నీ స్వామికార్యం ముఖ్యమయితే నాకు నా క్షేత్రపాలన ముఖ్యం. మర్యాదగా ఇక్కడ నుండి తిరిగివెళ్ళు " అని ఖరాఖండిగా చెప్పేసాడు కాలభైరవుడు.
హనుమ ఆశ్చర్యపోయాడు. సముద్రాలు దాటాడు, ఎందరో రాక్షసులను సంహరించాడు. ఎప్పుడూ ఇటువంటి ప్రతిఘటన చూడలేదు. అయినా మళ్ళీ వినయంగా " స్వామి, నేను మిమ్మల్ని ఎదిరించడానికి రాలేదు. నా స్వామి ఆజ్ఞ నెరవేర్చడం నా ధర్మం. దయచేసి దారి ఇవ్వండి " అని ప్రార్థించాడు. అప్పుడు కాలభైరవుడు నవ్వి ధర్మమా, నా నియమం తప్పడం ధర్మమా. ఇక మాటలతో పని అవదు. సరే నీ భక్తి ఎంతో, శక్తి ఎంతో పరీక్షిస్తాను. నీకు అంతటి శక్తి ఉంటే లోపలికి వచ్చి లింగాన్ని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించు. ఈ కాశీ క్షేత్రపాలకుడి శక్తి ఏమిటో రుచి చూపిస్తాను అని అనడంతో వారిద్దరి మధ్య సంభాషణ ముగిసి సంఘర్షణ మొదలైంది. ఒకరు రామభక్తుడు, మహాబలి. ఇంకొకరు శివుని అంశ, కాశీకి అధిపతి. ఈ అద్భుత పోరాటానికి కాశీ వేదిక అయింది.
కాలభైరవుని సవాలుతో హనుమలోనూ పౌరుషం పెరిగి యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇది మామూలు యుద్ధం కాదు. అదొక దివ్యమైన అసాధారణమైన శక్తి పరీక్ష.
కాలభైరవుడు తన భయంకరరూపాన్ని ఇంకా పెంచి ఆకాశమంత పెరిగాడు. ఆయన శ్వాస నుండి అగ్ని జ్వాలలు వస్తున్నాయి. చేతిలోని దండం లోంచి మెరుపులు వెలువడుతున్నాయి. భూమి కంపించింది. " ఓ వానర వీరుడా, నా ఈ విశ్వరూపం చూసి అయినా తిరిగి వెళ్ళిపో " అన్నారు కాలభైరవుడు. బదులుగా హనుమ కూడా తన బంగారు శరీరాన్ని పెంచారు. అది కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతూంది. ఒక పర్వతంలా నిలిచి ఉన్నారు. తోక ఆకాశమంతా చుట్టుకుంది. హనుమ జైశ్రీరామ్ అని గర్జించగానే కాలభైరవుని శక్తి కొద్దిగా తగ్గింది.
కాలభైరవుడు తన మాయాశక్తిని ఉపయోగించి లక్షలాది భైరవులను సృష్టించి హనుమ మీదకు పంపించారు. వారు రకరకాల ఆయుధాలతో హనుమను చుట్టుముట్టారు. హనుమ చిరునవ్వుతో తన ఒంటిమీద ఉన్న ఒక్కొక్క రోమం నుంచి ఒక్కొక్క తనలాంటి వానరవీరుని సృష్టించారు. వారు కాలభైరవుని సైన్యాన్ని ఓడించారు. కాలభైరవుడు కోపంతో కాలశక్తిని ప్రయోగించి హనుమ చుట్టూ ఒక కాలచక్రాన్ని సృష్టించారు. అందులో చిక్కుకున్న వారు ముసలివారుగా అయిపోయి శక్తిని కోల్పోతారు. కాని హనుమ చిరంజీవి. కాలచక్రం పనిచేయలేదు. హనుమ శ్రీరాం అనగానే కాలచక్రం ముక్కలయిపోయింది.
ఈ అపూర్వ యుద్ధాన్ని దేవతలందరూ పైనుంచి చూస్తున్నారు. ఒకరు రుద్రాంశ. ఇంకొకరు శివాంశ. ఒకరు క్షేత్రధర్మం కాపాడడానికి, ఇంకొకరు స్వామికార్యం నెరవేర్చడానికి తలబడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే లోకాలకే ప్రమాదమని దేవతలు భయపడుతున్నారు. యుద్ధం భీకరరూపం దాల్చింది. హనుమ లింగాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తూంటే కాలభైరవుడు సర్వశక్తులతో అడ్డుకుంటున్నారు. సమాన బలంతో తలబడుతున్నారు. గెలుపు ఎవరిదో తేలడం లేదు. ఈ యుద్ధం యుగాలపాటు సాగేలా కనిపించింది. ఒకరిది రామభక్తి. ఇంకొకరిది శివభక్తి.
ఇక లాభంలేదని బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలు అక్కడ ప్రత్యక్షమయారు. బ్రహ్మ కాలభైరవునితో " నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తున్నావు. నీ శక్తి అమోఘం. కాని నువ్వు ఎవరితో తలబడుతున్నావో ఆలోచించు. హనుమ ఒక వానరుడు మాత్రమే కాదు. ఏకాదశరుద్రులలో ఒకరయిన శివుని అంశ. అతను కూడా రుద్రాంశే. నిజానికి ఈ కాశీక్షేత్రానికి అతను పరాయివాడు కాదు " అని అనగానే కాలభైరవుడు ఆశ్చర్యపోయారు " తను పోరాడుతూన్నది శత్రువుతో కాదు, సోదరసమానుడయిన ఇంకో శివాంశ తోనా " అని. అప్పుడు విష్ణువు " కాలభైరవా, హనుమ వచ్చినది శ్రీరామ కార్యంకోసం. విష్ణువు అవతారం అయినా శ్రీరాముడు కూడా శివభక్తుడే. శివలింగాన్ని తీసుకుని వెడుతూన్నది కూడా లోకకళ్యాణం కోసమే. అందుకని దీనికి సహకరించడమే నీవు చేయదగినది " అని చెప్పగానే కాలభైరవునికి సత్యం బోధపడింది.
కాలభైరవుడు " హనుమా, నీ స్వామిభక్తి, నీ దీక్ష అమోఘం. శివలింగాన్ని తీసుకుని వెళ్ళే విషయంలో నీ ఆలోచన లోకకళ్యాణమే. నేను నా ధర్మపాలన కోసమే నీతో తలబడ్డాను. నువ్వు నిరభ్యంతరంగా లింగాన్ని తీసుకుని వెళ్ళవచ్చు " అనడంతో హనుమ కాలభైరవునికి వినయంగా నమస్కరించి, కాశీలో అడుగు పెట్టి, గంగలో స్నానం చేసి, విశ్వనాధుని పూజించి, ఆత్మలింగాన్ని తీసుకుని రామేశ్వరం వైపు ప్రయాణమయాడు.
ఈ వృత్తాంతంలో భక్తి ధర్మం రెండూ ఎంత ఉత్కృష్టమైనవో తెలుస్తూంది.
No comments:
Post a Comment