Friday, August 19, 2022

అజ్ఞాత భక్తులూ... కాస్త ఆలోచించరూ...!!

 అజ్ఞాత భక్తులూ... కాస్త ఆలోచించరూ...!!

మనిషికి ఏదైనా కష్టం వస్తే వెంటనే చేసేది దైవాన్ని తల్చ్చుకోవటం..ఆపై ప్రార్ధించి మన కష్టాన్ని గట్టేక్కిస్తే తనను దర్శించుకుంటానని మొక్కుకోవటం. 

కాస్త ఉన్నోళ్ళు అయితే కళ్యాణం చేయిస్తామనో, తృణమో పణమో చెల్లించుకుంటామనో వేడుకుంటారు.

 ఇలా ఎవరి స్థాయికి తగ్గట్టు, వాళ్ళ మనోభావాలను అనుసరించి వారి వారి మొక్కులు తీర్చుకుంటారు.

 పాత తరం లోనిది ఈతరంలో మారకుండా ఉన్నది ఏదైనా ఉందంటే అది ఈ మొక్కులు తీర్చుకునే కార్యక్రమమే అని అనిపిస్తుంది.

ప్రసిద్ది దేవాలయాలు తప్పించి చిన్న చిన్న గుడులకు భక్తులు హుండీలో వేసిన డబ్బులే గుడి నిర్వహణకి వాడతారు. ఇతరత్రా ఇంకేమీ ఆదాయమార్గాలు ఉండవు. అలాంటి గుళ్ళకు శక్తి మేరకు కానుకలు సమర్పించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

కానీ తిరుపతి దేవుని విషయం తీసుకుంటే ఆ దేవాలయానికి ప్రభుత్వాల శ్రద్ద
(అది ఏ రకమైనది అన్నది పక్కన పెడితే) మెండుగా ఉంటుంది. 

దాన్ని చూసుకోడానికి ఒక సంస్థ కూడా ఉంది. 

నిత్యం భక్తులు నుండి వచ్చే కానుకలు విలువ కోట్ల లోనే ఉంటాయి. వాటితో టీ.టీ.డీ వారు అన్నదాన సత్రాలు, కళ్యాణ మండపాలు, హాస్పటల్లు ఇలా ఎన్నో నిర్మిస్తుంటారు. 

అవి కూడా తిరుపతిలోనే ఉంటాయి తప్పించి( కళ్యాణ మండపాలు మినహాయిస్తే..అవి కూడ డబ్బులకే ఇస్తారు)

ఒక్క ఊళ్ళో నైనా ఫలాన స్కూలు టీ.టీ.డీ వాళ్ళు కట్టారు..ఫలాన గ్రామానికి నిత్యం త్రాగు నీరు టీ.టీ.డీ వాళ్ళు ఏర్పాటు చేసేరని మీరు విన్నారా? లేదంటే అంటురోగాలు ప్రబలిన గిరిజన ఊళ్ళో మందులు ఉచితంగా పంచివ్వటం చూశారా?

"అజ్ఞాత భక్తుడు మూడు కోట్ల విలువైన వస్తువు సమర్పించాడు.."

"అజ్ఞాత భక్తుడు ఆరుకోట్ల విలువైన వజ్రాలు స్వామి వారికి ఇచ్చారు.."

"తిరుపతి హుండీలో వెయ్యినోట్ల కట్టలు భారీగా కనుగొన్న ఆలయ నిర్వాహకులు.."

ఇలాంటి వార్తలు నిత్యం వింటూనే/చూస్తూనే ఉంటాం.

 అంత పెద్ద పెద్ద మొత్తం వేసిన వారు పేరు ఎందుకు గోప్యంగా ఉంచుతారనేది పక్కన పెడితే అంతలా అభివృద్ది చెందిన దేవాలయానికి కోట్లు కోట్లు కుమ్మరించే బదులు వారి వారి ఊళ్ళకు ఏదైనా చెయ్యొచ్చు కదా అని అనిపించకమానదు.

 గతంలో ఓ సారి ఈనాడులో ఓ భక్తుడు తిరుపతి హుండీలో కోటి రూపాయలు వేశాడు అని వార్త పడింది. మరుసటి రోజే ఓ నిరుపేద గ్రామీణ అమ్మాయి ఆ అజ్ఞాత భక్తుడకు లేఖ రాసి ఈనాడుకు పంపించింది. దాన్ని ఈనాడులో మరుసటి రోజు ప్రచురించారు కూడా. 

ఆ లేఖలో ఆ అమ్మాయి 'అన్నికోట్లు దేవుని హుండీలో వేసే బదులు నాలాంటి కూలి చేసుకుని చదువంటే ఆసక్తి ఉన్నా చదవలేని వారికి కాసింత ఆర్ధికపరమైన అండ ఇచ్చి చదివించొచ్చు కదా' అని అడిగింది. ఆ అమ్మాయి కోరిక సబబైనదే. కాదంటారా?

ఓ కోటి రూపాయల్తో గ్రామీణ ప్రాంతాల్లో వర్షాకాలంలో ఎప్పుడూ బురదగా ఉండే రోడ్లు ను బాగు చేసి సిమెంట్ రోడ్డు వెయ్యిచ్చు. 

మంచి నీళ్ళకోసం కిలో మీటర్లు కాలినడకన వెళ్ళే ప్రాంతల్లో సురక్షిత నీరు ట్యాంకులు కట్టించి అందించవచ్చు. 

ఓ ప్రభుత్వ స్కూలుకు మంచి లైబ్రరీ సమకూర్చవచ్చు..

భర్త పీడిత మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చెయ్యొచ్చు.. 

మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే.

 మనసుంటే మార్గాలెన్నెన్నో..

 పైగా దేవుని హుండీలో వేస్తే వచ్చే తృప్తి కంటే వేల రెట్లు తృప్తి మన సొంతం అవుతుందంటే అతిశయోక్తికాదేమో! 

మనం చేసే పనిని దైవం తప్పక హర్షిస్తుంది.

కాబట్టి అజ్ఞాతలు కాస్త ఆలోచించండి. 

కోట్ల రూపాయలు వెచ్చించి దేవుడిని సంతోషపెడతారా లేక ఆ డబ్బుని మీ గ్రామ అభివృద్దికి గానీ, నిరుపేద వ్యక్తుల అభివృద్దికి గానీ వాడతారా? 

మీ ఎంపిక మొదటిదే అయితే మీరు చేస్తున్న పనికి ఏ దేవుడు ఎంతమాత్రం సంతోషపడడు.

 ఆయనను సంతోషపర్చాను అన్న భ్రమే మీకు మిగులుతుంది. మీ భక్తికి పెద్ద పెద్ద కానుకలు కొలమానంగా ఎప్పటికీ నిలవవు.

మీ... ✴మోహన్...

No comments:

Post a Comment