Friday, August 19, 2022

హృదయ భాష

 *హృదయ భాష*

*ధ్వని రాహిత్యమే ‘మౌనం’!

*కానీ, మౌనంలోనూ మాటలున్నాయి. అవి నిర్దిష్టమైన భాషకు చెందకపోయినా వాటి తరంగ దైర్ఘ్యాలను(wave-length) ఒడిసిపట్టగల హృదయానికి వినిపిస్తాయి.

*భౌతిక ప్రక్రియకు భిన్నమైన ‘ఆధ్యాత్మ అనుభూతి’గా జ్ఞానులు దీన్ని అభివర్ణించారు.

 *ఈ మాధ్యమం ద్వారానే ఆది గురువు దక్షిణామూర్తి తన శిష్యులకు జ్ఞానాన్ని ప్రసాదించాడని, దీన్ని ‘వైఖరి’, ‘మధ్యమ’, ‘పశ్యంతి’ స్థాయులకు మూలాధారమైన ‘పర’ అనుభూతిగా ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొన్నాయి.

*ఈ పరిజ్ఞానాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే ఉపమానాలతో, ఉదాహరణలతో మహాత్ములు అందించారు.

*అందులో భాగంగానే‘ అంతర్వాణి’, ‘హృదయ భాష’ లాంటి మాటలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అంతర్ముఖంగా ప్రయాణించడం, ఎవరిని వారు తమకు తాముగా తరచి చూసి విశ్లేషించుకోవడం ఇందులోని ప్రాథమిక అంశాలు.

*మనలోని ఒక్కో పొరను చీల్చుకుంటూ వెళ్తే హృదయం మాట్లాడుతుంది. అది వినాలంటే మనిషికీ హృదయానికీ మధ్య తెరలు ఉండకూడదు. మబ్బులు, మసకలు లేని పారదర్శక స్థితిని సందర్శించుకోవాలి. ఆ ధ్యానావస్థలో హృదయవాణి స్పష్టంగా వినిపించి, దివ్యజ్యోతి మూలం విస్పష్టమవుతుంది. దీనికి ‘శ్రద్ధ’ తో పాటు ‘సహనం’ కూడా అవసరమని దార్శనికులు బోధించారు.

*ఓసారి బుద్ధభగవానుడు శిష్యులతో కలిసి పర్యటిస్తున్నాడు. మధ్యాహ్న భోజనం వేళ ఓ గ్రామంలో భిక్ష లభించలేదు. భగవానుడు సరేనంటూ నడక సాగించాడు. గ్రామీణుల ప్రవర్తన పట్ల బృందంలోని ఓ శిష్యుడు మనసు కష్టపెట్టుకున్నాడు. లోలోపల నిందించుకున్నాడు. జ్ఞాన సిద్ధుడైన గురుదేవుని వెంట నడుస్తున్నా, తనలో తాను మథనపడుతున్నాడు.

*ఫలితంగా శిష్యుడిలో అశాంతి హెచ్చింది. క్రమంగా బుద్ధి వశం తప్పుతోంది. ప్రశాంతంగా సాగిపోతున్న బుద్ధభగవానుడు అది గ్రహించాడు. శిష్యుడి వైపు తిరిగి, ‘దాహంగా ఉంది నీళ్ళు తీసుకురా!’ అంటూ ఆ శిష్యుణ్ని సమీపంలోని చెరువుకు పంపించాడు.

*వెళ్ళిన శిష్యుడు వెంటనే ఖాళీ పాత్రతో తిరిగి వచ్చాడు. తన కన్నా ముందు ఓ ఎడ్లబండి చెరువులోంచి వెళ్ళడం వల్ల నీళ్ళలో బురద తేలిందని చెప్పాడు.

* కాసేపు పోయాక ఆ శిష్యుణ్ని బుద్ధుడు మరోసారి పంపించాడు.

*అతడు తొలిసారి లాగే ఖాళీ పాత్రతోనే తిరిగి వచ్చాడు.

*ఇలా అయిదు సార్లు జరిగాక, ఆరోసారి తేట నీటితో వచ్చిన శిష్యుణ్ని చూసిన బుద్ధుడు, ‘చెరువులో రేగిన కలకలం వల్ల బురదనీరు తేట పడటానికి సమయం పడుతుంది. అలాగే కలత పడ్డ మానసిక స్థితి కుదుటపడేందుకు సహనం అవసరమవుతుంది. చెరువులో పాత్రను ముంచి, మరింత కల్లోల పరచడం వల్ల తేలేది బురదే! కల్లోలిత అంతరంగాన్ని రెచ్చగొడుతున్న కొద్దీ అధికమయ్యేది అశాంతే!

*నీరు తేటబారే వరకు ఓర్మిని వహించాలి. శ్రద్ధగా గమనించాలి. అప్పుడే స్వచ్ఛమైన జలం లభిస్తుంది. దాహార్తి తీరుతుంది. అంతరంగానికీ ఇదే సూత్రం వర్తిస్తుంది’ అంటూ నవ్వుతూ పాత్రను అందుకున్నాడు.

*హృదయ భాషను అర్థం చేసుకునే సాధనా మార్గాల గురించి అనేకులు సూచించారు.

*అనువైన మార్గాన్ని ఎంపిక చేసుకుంటే ఒడుదొడుకులు లేని జీవనశైలి సాధ్యపడుతుంది.

 *‘ప్రార్థనామయ స్థితిలో ఉన్నప్పుడే హృదయాన్ని వినే కళ పట్టుబడుతుంది’ అంటారు. ఆ స్థితి సంతరించు కోవాలంటే సహనం ఉండాలి. శ్రద్ధ తోడు కావాలి. జీవితంలోని ప్రతీ పార్శ్వానికీ వర్తించే మాటలివి.

            సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏

*రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయతను కూడా నేర్పుదాం. 

No comments:

Post a Comment