Saturday, June 22, 2024

శంబల - 2* 💮 రచన : శ్రీ శార్వరి *శంబల చరిత్ర*

 *శంబల - 2*
💮

రచన : శ్రీ శార్వరి 


*శంబల చరిత్ర*

చైనా వారి నమ్మకాలకు మన భారతీయుల విశ్వాసాలకు పెద్ద తేడా లేదు. భాగవత పురాణంలోని 'వాచస్పత్యం' లో జంబూద్వీప వర్ణన ఉంది. జంబూ ద్వీపం అంటే శంబల ద్వీపం అనే. అది హిమాలయాలకు ఉత్తర దిగ్భాగంలో ఉన్నదని ప్రతీతి.

నేటి టిబెట్ దేశం మొత్తాన్ని ఆర్యావర్తం అనేవారు. (ఆర్యులు నివసించిన ప్రదేశం అని) ఆర్యులు అంటే ఆత్మజ్ఞానం కలవారని, సంస్కృతి కలవారని అర్థం. అది లేని వారు అనార్యులు. అంటే భౌతిక వాదులు. కల్కి అక్కడే అవతరిస్తాడని ఒక నమ్మకం. కల్కి మనహిందువులకు దశమావతారం. కైలాస పర్వతానికి ఉత్తర భాగాన ఉన్నదే శంబల. అదే బౌద్ధ గురువుల ప్రధాన కేంద్రం.

కూర్మ పురాణం ప్రకారం ఉత్తరాన చాలా దూరంగా, సముద్రం మధ్యలో శ్వేత దీపం ఉంది. అది యోగ పురుషుల ఆవాసం. ఒకానొక కాలంలో గోబి ఎడారి ప్రాంతం మహా సాగరంగా ఉండేది. దానిలో ఉన్న ఒక ద్వీపం శ్వేత ద్వీపం. ఎత్తైన పర్వత పంక్తుల నడుమ లోతైన లోయలలో సర్వసుభిక్షంగా ఉండేది శంబల. అక్కడ అమృత సరోవరం ప్రస్థావన ఉంది. అమృత సరోవరం అంటే మానస సరోవరం. ఆ దీవి నిండా సుందర వనాలూ, ఆకాశ హర్మ్యాలూ ఉండేవట. అక్కడకు వెళ్లేవారు బంగారు విమానాల్లో వెళ్లేవారుట.

టిబెట్ గ్రంధాలలో శంబల పేరు 'డీజుంగ్'. ఫాదర్ స్టెఫన్ కాసెలా అనే పోర్చుగల్ మతాచార్యుడు ఇరవై మూడు సంవత్సరాలు శంబలలో ఉండి 1650లో అక్కడే సమాధి అయినాడు. శంబలకు 'టార్టారియా' అని మరొక పేరు ఉంది. ఇటీవల కాలంలో రష్యన్ పరిశోధకుడు ఫ్రెజ్ వల్ష్కీ ఇలా రాశాడు :

"ఉత్తరాన మహాసముద్ర మధ్యంలో 'శంబలింగ్' అనే దీవి ఉంది. అక్కడ బంగారం పండుతుంది. పాలు, తేనెలు నదుల్లా ప్రవహిస్తుంటాయి. శంబలలో బౌద్ధ విజ్ఞానం యావత్తు 'కాలచక్రం' పేర నిక్షిప్తమై నిగూఢంగా ఉంది. దానిని 'భగవాన్ వజ్రపాణి గుభ భదేశ' తంత్రరాజు (కాలచక్ర) అంటారు.

1447లో షిగాట్సే వద్ద బయటపడిన 'తాషీలుంపో' మఠం శంబల గురించి లోకానికి తెలియజేసింది. అక్కడ లామాసరి మఠంలో నాలుగు వేలమంది విద్యార్థులు ఉండేవారని, చాలా విద్యాలయాలు, ప్రార్థనా మందిరాలు ఉండేవని సమాచారం. 1923లో 6వ పెంచన్ లామా షిగాట్సే వదలి చైనాకు పారిపోవడం జరిగింది. టిబెట్ లో శంబల యాత్రికులకు పెంచన్ లామా అనుమతి పత్రాలు ఇచ్చేవాడట. లామాలలో అర్హులైన వారికే అనుమతి లభిస్తుండేది.

*పెంచన్ లామా*

టిబెట్ పేరు చెప్పగానే, టిబెట్ బౌద్ధం పేరు వినగానే దలైలామా పేరు జ్ఞాపకం వస్తుంది సహజంగా. ఆయన టిబెట్ బౌద్ధానికి ఏకైక ప్రతినిధి. కానీ ఆయనకన్న ఆరాధనీయుడు పెంచన్ లామా. అతను గొప్ప యోగి, శక్తివంతుడు అంటారు. ఆయన అసలు పేరు పండిత చెన్ పొ. ఆయనకు అనేక సిద్ధులు ఉండేవి.

పెంచన్ లామా 1915లో ఒక మందిరం కట్టించాడు. అందులో మైత్రేయ భారీ విగ్రహం ఏర్పాటు చేశాడు. మైత్రేయ గౌతమ బుద్ధుని రాబోయే అవతారం. ఆ సంవత్సరం 'శాంగ్ పొ' లోయలో పంటలు విపరీతంగా పండాయి. 1923లో ఆయన టిబెట్ వదలిపోగానే మంచు వర్షాల వల్ల దేశం మొత్తం నీటిపాలైంది. కొంత జన నష్టం జరిగింది. సత్పురుషుల ఆగ్రహం దేశానికే అరిష్టం!

పెంచన్ లామా ఇండియా వచ్చినపుడు ఆయనను ఒకరు ప్రశ్నించారు -

"లామా! టిబెట్ లో గొప్ప గొప్ప యోగులు ఉంటారని విన్నాం. ఇప్పుడు అటువంటి అతీంద్రియ సిద్ధులు కల యోగులు ఉన్నారా?"

దానికి పెంచన్ లామా నవ్వి ఊరుకున్నా డు. మరుక్షణంలో ఆయన అక్కడ లేడు. అదృశ్యమైనాడు. పరిసరాల్లో ఎక్కడ వెదికినా కనిపించలేదు. ఊరి చివర ఒక చెట్టు క్రింద పెంచన్ లామాను చూచిన వారు వచ్చి చెప్పారు ఆ విషయం.

ప్రార్థనా మందిరంలోకి పెంచన్ లామా రాగానే దీపాలు వాటంతట అవే వెలిగేవి. విగ్రహాలు మాట్లాడేవి. భవిష్యత్తు చెప్పేవి.


*శంబల లాంయిగ్*

"Road to Shambhala" (శంబల లాంయిగ్) అనే పుస్తకంలో మూడవ పెంచన్ లామా రాశాడిలా!

"శంబల దేశం పర్వత ప్రాంతం. నాలుగు వైపులా ఎత్తయిన పర్వతశ్రేణులు. భయంకరమైన మంచు పర్వతాలు. ఒక్కటి మాత్రం నిజం. శంబల పెద్దల ఆమోదం లేకుండా అక్కడకు చేరే అవకాశం లేదు. వెళ్లదలచిన వారికి 'శంబల సందేశం' వినిపిస్తుంది. లేదా శంబల పక్షాన ఎవరో ఒకరు వస్తారు, దారి చూపిస్తారు. పరమ గురువులు (Great Masters) ఎవరో ఒకరు సందేశం పంపిస్తారు. కావలసిన వారిని తమ వద్దకు రప్పించుకుంటారు.”

నికొలస్ రోరిక్ తన అనుభవం ఇలా రాశాడు :

"ఉర్ఫాన్ లో టుర్కిస్థాన్ లోని లామాలు నాకు గుహ మార్గాలను చూపించారు. ఆ గుహలలోకి ఎప్పుడూ జనం వెళ్లినట్లు అనిపించలేదు. అవి ఎంతెంత దూరమో అంచనాకు అందవు."

"ఆ మార్గం గుండా వెళితే శంబల చేరవచ్చా?" అని అడిగాను.

“అక్కడకు ఎవరూ రావడాన్ని పరమ గురువులు ఇష్టపడరు. వారి తపస్సుకు భంగం కలుగుతుందని భయం. వారు తపోభంగం క్షమించరు. ఇతర ఆశ్రమాల నుండి, బౌద్ధారామాల నుండి వచ్చేవారు లోపలికి వెళ్లలేరు. నేల పగుళ్ల నుండి విషవాయువులు పైకొచ్చి మతులు పోగొడతాయి. కళ్లు కనిపించవు. బుర్రలు పనిచేయవు. చచ్చిపోయిన భ్రమలు కలిగిస్తాయి. ఆ విషవాయువులు శంబల చుట్టూ తిరుగుతూ శంబలను ఎప్పుడూ రక్షిస్తుంటాయి. ఆ దాపులకు వెళ్లేసరికి మనుషులే కాదు జంతువులు, పక్షులు సైతం దారి తప్పుతాయి. తమ స్పృహ కోల్పోతాయి. అదృశ్యశక్తులేవో వారిని అడ్డుకుంటాయి.

"అసలు టిబెట్ లో కొన్ని ప్రాంతాలకు గైడ్లు (Guides) రారు. ఎవరు గాని మొండిగా ముందుకుపోతే కొండచరియ లు విరిగి మీద పడతాయి. మరీ మూర్ఖంగా ముందుకు సాగితే రాళ్ల వర్షం కురిసి దారి తప్పడం జరుగుతుంది. గురువుల ఆమోదం లేకుండా శంబల చేరడం అసంభవం. ఎన్ని అగడ్తలున్నా, అవరోధాలు ఏర్పడ్డా మాస్టర్ల పిలుపు అందుకుని వచ్చేవారికి సరిహద్దుల్లోనే స్వాగతం.. లభిస్తుంది. అన్ని ఏర్పాట్లు వారే చేస్తారు.

“అక్కడ పరమ గురువులు అంతా ఒక్క చోట ఉండరు. వందలు, వేల మైళ్ల దూరంగా ఉంటారు. కారకోరం పర్వత పంక్తుల నుండి కల్గన్ వరకు, మానస సరోవరం నుండి గోబీ ఎడారి లోని లోబ్నది వరకు మాస్టర్ల ఆశ్రమాలు విస్తరించి ఉన్నాయి. మాస్టర్లు ఉండే తావుల్లో మనకి తెలియని అద్భుతాలు జరుగుతుంటాయి.”

"క్రిందటి శతాబ్దాల్లో చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం టిబెట్ లో ప్రతి అంగుళం గాలించి శోధించింది. పెట్రోలు బావులు బయటపడ్డాయి. టిబెట్ లో చైనా అణు పరీక్షలు నిర్వహించించింది. ఆ ప్రదేశాలు అన్నీ శంబలవే. అయా విపత్కర సమయాలలో శంబల జ్ఞానులు కొండల్లో, కోనల్లో తలదాచుకున్నారు.

టిబెట్ హిమ పర్వత శ్రేణుల గురించి నికోలన్ రోరిక్ చాలా పరిశోధనలు చేశాడు. "ఆ లోయలలో వేడి నీటి చలమ లున్నాయి. వృక్ష సంపద పుష్కలంగా ఉంది. బయట వారికి అక్కడ కొండలు తప్ప ఏవీ కనిపించవు. అంతటి విశాల దేశంలో మాస్టర్ల ఆచూకీ తెలియడం ఏ మాత్రం సులభం కాదు. పర్వతాలలో పరమ గురువుల్ని గుర్తించడం అసంభవం. స్వచ్చమైన నడవడి, పవిత్రమైన హృదయం, మహా సంకల్పం, పూజ్య భావన ఉన్నవారికే శంబల చేరడం సాధ్యం.”

అనాది కాలం నుండి శంబల దేవ భూములనే ప్రశస్తి ఉంది. అక్కడి స్త్రీలను రోరిక్ చిత్రించాడు. వారు కొండల్లో నగ్నంగా తిరుగుతుంటారు. అయినా వారి 'నగ్నత్వం' ఎబ్బెట్టుగా ఉండదు. వారు దిగంబరం అనిపించదు. పూజ్య భావం కలుగుతుంది. ఆ భావనే వారికి రక్షణ.

హిమాలయాల క్రింద వరుసలో అనేక గుహలున్నాయి. ఆ గుహలు ఎక్కడికి దారి తీస్తాయో తెలియదు. ఎవరూ వెళ్లిన వారు కనిపించరు. అవి 'కాంచన ఝంగా క్రింది నుండి పోతాయంటారు. అంటే శంబలకు. ఆ గుహలకు పెద్ద రాతి బండలు అడ్డంగా ఉంటాయి. వేరే ఇంకే తలుపులుండవు. ఎవరూ ఆ బండల్ని కదిలించిన దాఖలాలు లేవు. 

హిమాలయాల్లోని దక్షిణ గుహలన్నీ శంబలకు దారి తీస్తాయి. వాటి ఆనుపానులు పరమ గురువులకే ఎరుక. వారు మృత్యుంజయులు. వారు ఎంతో వేగంగా, విమానాల కన్నా వేగంగా ప్రయాణం చేస్తారు. వాయు వేగం, మనో వేగం అంటామే! అంత వేగం!


*ఎగిరే పళ్లాలు*

నా చిన్నతనంలో 'ప్లైయింగ్ సాసర్లు' చూచాను. అవే ఎగిరే పళ్లాలు. అవి ఏమిటో అప్పుడు నాకు బొత్తిగా తెలియదు. మరీ కప్పుసాసర్లంత చిన్నవి కావు, ఇరవై అడుగుల ప్రమాణంలో ఉండి గిరగిర తిరుగుతూ ఆకాశంలో కనిపించేవి. తర్వాత కనిపించలేదు. అవి రానూ లేదు. ఆ రోజుల్లో జనం వింతగా చెప్పుకునేవారు. వాటిల్లో దేవతలు సంచారం చేస్తారనేవారు. అవి శంబల నుండి వచ్చిన బుల్లి విమానాలని ఇప్పుడు నా అనుమానం.

ఆకాశ మార్గంలో రథంలో వెళ్లడం లాంటి పురాణ కధలు ఉన్నా అవి నిజంగానే జరుగుతాయని నా అనుభవం. దేవతలు, గంధర్వులు, అప్సరసలు పూల తేరులపై వస్తారుట. ఇటీవల రమణ మహర్షి నిర్యాణం చెందినపుడు ఆయన ఆత్మ జ్యోతిగా మారి ఆకాశ మార్గాన వెళ్లడం చాలామంది చూచారు. ఆ మందిలో నేనూ ఒకడిని. 

రాజాజీ పోయినపుడు ఆయన 'ఆత్మ' బంగారు రథంలో పోవడం మద్రాసు బీచ్ లో నేను చూచాను. అలాగే టిబెట్ యోగి మిలారేపా నిర్యాణం చెందినపుడు ఆయన 'ఆత్మ' ఆకాశయానం ఆయన శిష్యులు, భక్తులు అయినవారు చాలా మంది చూచారు. ఇవన్నీ సత్యాలు. ఫ్లయింగ్ సాసర్లు నిజం. ఏ పుణ్యాత్ముల ఎన్నిక కోసం అప్పట్లో శంబల ప్రతినిధులు ఆ ఫ్లయింగ్ సాసర్లలో ప్రయాణం చేశారో నాకు తెలియదు. అది శంబల విజ్ఞాన రహస్యం.

కారకోరం పర్వతాల పై 1926లో రోరిక్ బృందం పర్యటించారు. వారికి స్పేస్ షిప్స్ (space ships) కనిపించాయి. అవి పశ్చిమంగా ఆకాశంలో వెళ్లి శంబల ప్రాంతంలో అదృశ్యమైనాయి. 1933లో బ్రిటిష్ పర్వతారోహక బృందం లోని ఫ్రాంక్ స్మిత్ అనే ఆయన ఎవరెస్టు శిఖరం పైన ఉన్నప్పుడు ఆకాశ మార్గాన ఎగిరే రెండు వస్తువుల్ని చూచాడు. ఒక దానికి రెక్కలున్నాయట. ఒక దానికి ముక్కు ఉంది. వాటి చుట్టూ దేదీప్యమానమైన వెలుగు ఉంది. అప్పుడు వాటిని చూచిన యాత్రీకులు భయంతో మూర్ఛపోయారు ట. అవి భూమికి 200 అడుగుల ఎత్తుగా ఎగిరిపోయాయి. వాటిని ప్రత్యక్షంగా చూచిన 'స్మిత్' అవి శంబలకు చెందినవేన ని అంటాడు.

చాలా శతాబ్దాలుగా ప్రపంచానికి తెలియని శంబల, ఇటీవలి కాలంలో అందరి దృష్టిని ఆకర్షించింది.
🪷
*సశేషం* 

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆

No comments:

Post a Comment