Saturday, June 22, 2024

 “జ్ఞానగీత" (నిత్యజీవితంలో ఉపనిషత్తులు) - *కేనోపనిషత్తు* - 4వ భాగము.
- శాస్త్రి ఆత్రేయ(ఆకుండి శ్రీనివాస శాస్త్రి).
చతుర్థ ఖండము - మంత్రముల వివరణ :
అంత ఉమాదేవి ఇంద్రునితో, అది "బ్రహ్మము", ఆ బ్రహ్మము యొక్క అనుగ్రహము వలనే మీరు ఇంత వైభవమును పొందేరని తెలిపింది. ఆ యక్షస్వరూపము సాక్షాత్తు బ్రహ్మమేయని ఇంద్రుడు గ్రహించి ఆత్మజ్ఞానం పొందేడు. బ్రహ్మమును మొదటిసారిగా తెలుసుకొనుటచేత, దేవతలందరిలో ఇంద్రుడు శ్రేష్ఠుడయ్యెడు. బ్రహ్మమును దగ్గరగా దర్శించుటవలన అగ్ని, వాయువు దేవతులలో ఒక ప్రత్యేకస్థానాన్ని పొందగలిగేరు.
బ్రహ్మము ఒక మెరుపు వలే ప్రకాశించి కన్నుమూసి తెరిచేలోపల అదృశ్యమవుతాడు. దేవతలతో సరిపోల్చి చూసినప్పుడు ఇదే బ్రహ్మనిర్దేశమై యున్నది.
అలాగే జీవుని విషయానికొస్తే, దేని దగ్గరకు మనస్సు పదేపదే పరిగెడుతుందో, మనస్సు ద్వారా ఏదయితే పదేపదే స్మరించబడుతుందో అదియే "ఆత్మ". సంకల్ప, వికల్పాలను చేసేది జీవుని మనస్సే. అలాగే ఉపాసించేది కూడా మనస్సే. కాబట్టీ ముందుగా మనస్సును శుద్ధి చేసుకొని పరబ్రహ్మమును ఉపాసించాలని ఇక్కడ భావము.
"తద్వనం" (అది ఆనందకరమైనది) అనే నామంతో "బ్రహ్మము" ఉపాసింపబడుతుంది. ఆనందమే పరబ్రహ్మమని అర్ధము. ఏ జీవుడు బ్రహ్మమును ఇలా సాధనచేస్తాడో అతనిని సర్వభూతములు కీర్తిస్తాయి. ఈ విధంగా బ్రహ్మజ్ఞానమునకు సంబంధించిన ఈ ఉపనిషత్తు గురువు ద్వారా శిష్యునికి బోధింపబడింది.
ఈ ఉపనిషత్తునకు తపస్సు, దమము, కర్మ పునాదులవంటివి. వేదములే దాని యొక్క అంగములు. సత్యమే దాని నివాసస్థానము. ఈ ఉపనిషత్తు సారాంశమును గ్రహించినవాడు "బ్రహ్మము" నందు ప్రతిష్ఠితుడగుతాడు. ఇందులో సంశయం లేదు.
శాంతి మంత్రము : నా ఇంద్రియములన్నీ ఆనందంతోను, శక్తితోను నిండియుండాలి. బ్రహ్మమునందు నా మనస్సు లగ్నమై యుండాలి. ఆ స్థితిలో ఉపనిషత్తులలో సూచించబడిన ధర్మములన్నీ నాలో ప్రవేశించుగాక!! ఓం శాంతిః శాంతిః శాంతిః.
*ఈ భాగంతో "కేనోపనిషత్తు" సంపూర్ణమైంది. తదుపరి "కఠోపనిషత్తు"లో కలుసుకుందాము..🙏🏻

No comments:

Post a Comment