Wednesday, June 12, 2024

శ్రీ రమణీయం - 7 B🌹 👌మోక్షమైనా.. బంధమైనా... మనసే కారణం (2)

 🌹 శ్రీ రమణీయం - 7 B🌹
👌మోక్షమైనా.. బంధమైనా... మనసే కారణం (2)👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, 
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

✅ ఈ (ఇంటి) లోపలి పనంతా ఈశ్వరునిదే 🌈

✳️ ఈ ప్రకృతి అందించిన ఆహారాన్ని మన చేతులతో నోటిలోకి చేర్చినంత మాత్రాన ఈ దేహం మన వల్లనే పోషించబడుచున్నదని భ్రమిస్తున్నాం. ఆహరం గొంతు దాటింది మొదలు శక్తిగా మారేవరకు మన సంకల్పమే లేదన్న విషయం మరచిపోతున్నాం. 

✳️ మన ఇంటి పనంతా ఇల్లాలు చేసిపెట్టినట్లే మనలో ఉండే ఒకానొక పరాశక్తి దేహంలో జరిగే అన్ని పనులు చేస్తుంది. దేహంలో ఉన్న కొన్ని కోట్ల అణువులకు శక్తినిస్తూ ఆహారాన్ని అరిగించడం 32 అడుగుల పొడవున్న ప్రేగులలోనికి పంపించడము, శక్తిని రక్తానికి అందించటం, అది శరీరమంతా ప్రవహించేలా చూడటం మలాన్ని బయటకి విసర్జించటం వంటి పనులన్నీ పూర్తి చేస్తుంది. ఇవన్నీ మన సంకల్పాలు కావు. అసలు ఆకలి, దాహం అయ్యే విషయం కూడా ఆ సంకేతం వస్తేనే కదా మనకు తెలిసేది. మనంగా ప్రయత్నించి తెలుసుకునేవి కాదుకదా! మనం త్రాగే నీరు మూత్రంగా మారి బయటకు వెళ్ళే వరకు, మనం పీల్చే గాలి రక్తాన్ని శుభ్రం చేసి తిరిగి బయటకు వెళ్ళే వరకు ఈ శక్తే నడిపిస్తుంది. గుండె, ఊపిరితిత్తులు, మెదడు ఇవన్నీ క్రమశిక్షణతో మనం నడిపించటం లేదు. 

✳️ సబ్బుతో రుద్ది దేహానికి స్నానం చేయించగలము గాని లోపల నుంచి పుట్టుకువచ్చే చర్మ వ్యాధులను మనం ఆపలేం. అజీర్ణం చేస్తే బియ్యం గింజంత మాత్ర చేసే పని మన సంకల్పంతో చేసుకోలేము. ఏదో ఒక పరాశక్తి మనలో ఉండి ఈ సకల కార్యాలు చేస్తున్నదని మరచి అహంకరించడం సమంజసం కాదు. ఈ పనులన్నీ అజ్ఞానం చేత గుర్తించక పోవడం, అతిజ్ఞానం చేత పట్టించుకోకపోవడం మానుకొని మనలో ఉండి ఆ (ఇంటి) పనులన్నీ పూర్తిచేసే ఈశ్వరశక్తిని గుర్తించడం కూడా మానసిక తపస్సే అవుతుంది. ఒకనొక పరాశక్తి చేత జరిగే ఈ పనులను గుర్తించి మన సంకల్పం లేదని తెలుసుకొని మసలుకోవడమే కర్మఫలత్యాగం. 

✳️ ఇల్లాలు చక్కదిద్దని ఇల్లు పాడుబడినట్లే ఈశ్వర చైతన్యంలేని శరీరం సైతం పాడుబడుతుంది. మన శరీర అవయవాల్లో లోపించిన ఈశ్వరచైతన్యం వ్యాధిగా వ్యక్తం అవుతుంది. ఔషధరూపంలో తిరిగి ఆప్రాణశక్తిని అందిస్తే తగ్గేవికొన్నైతే, అలా తగ్గనివి మరికొన్ని తీర్థయాత్రలు చేసి ఈశ్వరానుగ్రహంతో తిరిగి ఆ చైతన్యాన్ని సంపాదించి అలాంటి వ్యాధులు తగ్గించుకోవడం చరిత్రలో ఉన్నవే. అలాంటి ఈశ్వరశక్తిని కేవలం మనకోర్కెలు తీర్చడానికే అని భావించడం, పూజించడం విజ్ఞతకాదు. ఈశ్వరానుగ్రహాన్ని గుర్తించి కృతజ్ఞతతో పూజిస్తే క్షేమకరమైన అభిష్ఠాలు నెరవేరుతాయే తప్ప ఈశ్వరప్రార్థన కేవలం కోర్కెల కోసం చేసే ప్రార్థన కాకూడదు.
          ❀┉┅━❀🕉️❀┉┅━❀
🌈 ఈశ్వర సృష్టి, జీవుని దృష్టి వేరువేరుగా ఉన్నాయి 🌈

✳️ ఈశ్వరసృష్టి అనంతంగా ఉన్నా జీవుని దృష్టి మాత్రం పరిమితంగానే ఉంటుంది. ఈ కారణంగానే మన అవగాహన అసంపూర్ణంగానే (సంకుచితం గానే) మిగిలిపోతుంది. ఈ విశ్వం మొత్తం ఈశ్వరుడి దయతో ఏర్పడిన ప్రకృతే అయినా మనతో (జీవునితో) దానికున్న సంబంధం మాత్రమే మనకు కనిపిస్తుంది. అంటే మన (జీవుని) దృష్టిలో ఉన్నంత వరకే సృష్టిగా స్వీకరిస్తున్నాము. 

✳️ ఈ విశ్వంలో జరిగే ఈశ్వరుని కదలికలు గమనించకుండా కేవలం మన దృష్టిలో ఉన్న 'జీవుని సృష్టి'ని మాత్రమే మనము చూస్తున్నాం. అంటే ఈశ్వరుడ్ని మన కుటుంబం, పిల్లలు, వ్యాపారం, ఉద్యోగం, లాభం, క్షేమం వంటి స్వార్థంతో ముడిపెట్టి ఆయన దయకు కొలతలు వేస్తున్నాము. లేదంటే అసలు ఈశ్వరుడే లేడని నాస్థికత్వాన్ని సమర్థిస్తున్నాం. సత్య పరిశీలన లేకపోవడమే ఇందుకు కారణం. 

✳️ మనం చేసే పనులను (క్రియాశక్తిని) అందుకు కారణమైన ఆలోచనను (జ్ఞానశక్తిని) గమనిస్తున్నాం కాని, ఆ ఆలోచనకు కూడా కారణమైన మూలభావాన్ని (ఇఛ్ఛాశక్తిని) గమనించడం లేదు. ఏపని జరిగినా భగవంతుని సంకల్పం ఆ ఇచ్ఛాశక్తిగా మూలంగా ఉంటుంది. అందుకే ఈశ్వరప్రార్థన వల్ల ఈ మూలంలోని భావనలోనే మార్పులు వచ్చి ఆలోచనలు క్రియలు సక్రమంగా ఉంటాయి. మన దుఃఖ కారణమైన కోర్కెలను నిర్మూలించాలన్నా, వాటికి మూలమైన ఈశ్వరప్రేరిత భావనలోనే మార్పు తెచ్చుకోవాలి. భావం ఏర్పడిన తరువాత కోర్కెగా మారకుండా ఆపడం కష్టం. ఈశ్వర ప్రార్థనతోనే మనకు భావశుద్ధి జరిగి జీవితం సుఖమయంగా సాగుతుంది. మనలో స్పృహగా ఉన్న ఆ ఈశ్వర చైతన్యం వల్లనే మనం కళ్ళు తెరుస్తున్నాం. ఈ దృష్టి వల్లనే ఈ సృష్టి ఉన్నట్లు తెలుసుకోగలుగుతున్నాం. కనుక, సృష్టి అంతా మన స్పృహలోనే (ఈశ్వర చైతన్యంలోనే ఉందికదా! వాస్తవానికి సుఖదుఃఖాలు కూడా ఈశ్వరుని సృష్టిలోనివి కావు. సంబంధంచేత ఏర్పడిన జీవుని సృష్టిలోనివి మాత్రమే. మనం సృష్టించుకున్నవే. సాఫీగా సాగే జీవనది తన ప్రవాహంలో అడ్డువొచ్చిన రాళ్ళకు తగిలి వెనక్కి పడినట్లు మనం జీవితంలో ఏదో ఆశించి వాటిని పట్టుకునే ప్రయత్నంలో జీవన మాధుర్యాన్ని కోల్పోతున్నాం. అందుకే మన మనసుని మన అంతర్యామిగా ఉన్న ఈశ్వరునిపై ఉంచి మోక్షాన్ని పొందాలే గానీ ఈ లౌకిక విషయాలపైకి మళ్ళించి బంధాన్ని పెంచుకోకుడదు.

🙏 ఓం నమోభగవతే శ్రీరమణాయ 🙏
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

No comments:

Post a Comment