Friday, June 28, 2024

కర్మ, విధి, మానవసంకల్పము

 *శ్రీ గురుభ్యోనమః*

   *కర్మ,  విధి,  మానవసంకల్పము*

*ప్రశ్న :  దుష్కార్యాల  ఫలితాలను  తుడిచి  వేయటానికి ..   మంత్రాలు,  జపాలు  చాలవా ?  లేక  వాటి  ఫలితాన్ని  అనుభవించాల్సిందేనా ?*
*జవాబు :*  "నేను  జపాన్ని  చేస్తున్నాను"  అనే  భావముంటే  దుష్కార్యాల  ఫలితాలు  నిలుస్తాయి.  ఆ భావం  లేకపోతే  నిలవవు.

*ప్రశ్న :  పుణ్యం  పాపాన్ని  తుడిచిపెట్టి  వేయలేదా ?*

*జవాబు :*  ఒక  పనితో  మరొక  పనిని  ఎట్లా  ముడిపెట్టటం ?  "నేను  చేస్తున్నాను"  అనే  భావమున్నంత  వరకూ  మంచి  పనులకైనా,  చెడు  పనులకైనా  ఫలితాలను  అనుభవించాల్సిందే !  "నేను  చేస్తున్నాను"  అనే  భావం  లేకపోతే  మనిషిపై  ఏ ప్రభావమూ  ఉండదు.  ఆత్మసాక్షాత్కారమయితేనే  గాని  *నేను  చేస్తున్నాను*  అనే  భావం  పోదు.  ఆత్మసాక్షాత్కారమయిన  వానికి  జపమవసరమేమిటి ?  తపస్సు  అవసరమేమిటి ? ఆత్మసాక్షాత్కారం  పొందిన  వాడు  దేనినీ  కోరడు.  కాని,  ప్రారబ్ధం  వల్ల  జీవితం  కొనసాగిపోతుంది.
 
*ప్రారబ్ద  కర్మ  మూడు  రకాలు -  ఇచ్ఛ,  అనిచ్ఛ,  పరచ్ఛ  అని !*  అంటే ..  స్వయంగా  కోరుకున్నది,  కోరికలేనిది,  ఇతరుల  కోరిక  వల్లనయేది.

ఆత్మసాక్షాత్కారమయిన  వానికి  ఇచ్ఛా  ప్రారబ్ధముండదు.  కాని  మిగిలిన  రెండూ  ఉంటాయి.  జ్ఞాని  ఏమి  చేసినా  ఇతరుల  కోసమే !  ఇతరుల  కోసమేదైనా  చేయవలసి  వస్తే  చేస్తాడు,  కాని  ఫలితాలు  అతనినేమీ  ప్రభావితం  చేయవు.  *జ్ఞాని  చేసిన  పనులకు  పుణ్యము  గాని,  పాపము  గాని  అంటవు.  జ్ఞాని  ఏమి  చేసినా ..  లోకం  దృష్టిలో  ప్రామాణికము,  ఉచితమూ   అయినదే  చేస్తాడు.*

*ఈ జన్మలో  తమ  ప్రారబ్ధం  ప్రకారం  కొన్ని  అనుభవించి  తీరాలి,  అని  తెలిసిన  వాళ్ళు  ఆ అనుభవాల వల్ల  ఏ వ్యాకులపాటునూ  చెందరు.  నీ సంకల్పమున్నా,  లేకపోయినా  నీవనుభవించాల్సింది  నీ మీద  తప్పకుండా  పడుతుంది.  దీనిని  గ్రహించు.*
           
*"నీ సహజస్థితిలో  ఉండు"*
      *భగవాన్ శ్రీ రమణమహర్షి బోధనలు*
                         
🪷🙏🏻🪷🙏🏻🪷

No comments:

Post a Comment