Wednesday, June 12, 2024

ధ్యాస మారటమే సరళత్యాగం

 [6/11, 05:11] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 8🌹
👌ధ్యాస మారటమే సరళత్యాగం👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, 
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

🌈 8. ధ్యాస మారటమే సరళ త్యాగం 🌹

✳️ ఆధ్యాత్మిక సాధనలో లౌకిక విషయాలు మర్చిపోవాలన్నది నిబంధన కాదు. అది సహజంగా జరాగాల్సిన ప్రక్రియ. మనకి ఇష్టమైన పనిలో ఇతర విషయాలు ఎలా మర్చిపోతామో భక్తిలో లోకాన్ని మర్చిపోవాలి. ఇలా ధ్యాస మారటాన్నే శ్రీ రమణ భగవాన్ సరళత్యాగం అంటున్నారు.

✳️ ఆధ్యాత్మిక సాధన అనగానే చాలామందికి కుటుంబాన్ని, బాధ్యతలను వదిలివేయాలేమో అన్న భయం ఉంటుంది. వామ్మో! విడిచిపెట్టాలేమో అన్న పరిత్యాగ భావనే ఆధ్యాత్మిక సాధనకు ఆటంకం. పనిలోపడి కుటుంబాన్ని, పిల్లలను ఎన్ని సార్లు మర్చిపోవడం లేదు! అలాగని వారిని వదిలెయటంలేదు కదా! ఆత్మవిచారం కూడా అంతే. మనం రోజు చవిచూసే కొద్దికొద్ది సంతోషాలను, సుఖాలను, శాంతిని శాశ్వతం చేసుకోవడం కోసం ఇష్టం చేత ఆత్మానుభవం కోసం ప్రయత్నించాలి. మనం పూజించే దైవం మనలోనే ఉన్నాడని అనుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందాన్ని సొంతం చేసుకోవాలన్న శుభేచ్చ (ఇష్టం) కారణంగానే మనకి తెలియకుండా మనసులోని అనుబంధాలను త్యజిస్తాం. అక్కడ ఏ బాధ ఉండదు. కనుకనే ధ్యాస మారటమే సరళత్యాగం అంటున్నారు శ్రీ రమణ భగవాన్. 

✳️ దైవధ్యానం ఎంత సేపు చేయాలి అన్న ప్రశ్నలోనే మనకి ఉన్న ఇష్టం అర్థమౌతుంది. ధ్యానం ఒక గంటకో, గదికో పరిమితమైతే మనది వ్యాపారమే అవుతుంది. పీల్చే ప్రతి శ్వాసలో, తినే ప్రతి మెతుకులో అది ప్రసాదించిన దైవాన్ని గుర్తుకు తెచ్చుకోవడం నిరంతర ధ్యానం అవుతుంది. సాధన ప్రవృత్తిగా మారాలి. అంటే ఇష్టంతో మొదలై అలవాటుగా మారి చివరకు అప్పుడు నేను సాధన చేస్తున్నాననే భావన కూడా ఉండదు. భగవంతుడే మనకి ఈ జన్మనిచ్చాడని భావిస్తూనే ఆయన మనకి నిర్ణయించిన సాంప్రదాయాన్ని విడిచిపెట్టేస్తున్నాము. దేవతామూర్తులను మార్చినంత మాత్రాన ధ్యానం కుదరదు. పైగా మన ఇలవేల్పులను, సాంప్రదాయాన్ని విడనాడిన దోషం వస్తుంది. మన ఇష్టదేవతను, గురువుని విడనాడిన స్వార్థం మనని దైవానికి మరింత దూరం చేస్తుంది. నిజమైన ప్రేమ భావనలో ఈ భేద భావన ఉండదు. ప్రేమ గుణానికి కేవలం వర్తమానం చాలు. కాని ద్వేష భావానికి గతం, భవిష్యత్ రెండు అవసరం. అది మనని వర్తమానానికి దూరంచేసి శాంతి లేకుండా చేస్తుంది. అందుకే నిరంతర దైవ ధ్యానం ద్వారా మనం ఆ ప్రేమ గుణాన్ని సంపాదించుకోవాలి. 

✳️ స్తోత్రాలు, పారాయణాలు, భజనలు దేహాన్ని పవిత్రం చేస్తాయి. మంత్ర జపం మనస్సును పవిత్రం చేస్తుంది. ధ్యానం మన హృదయ మాలిన్యాలను, చిత్తాన్ని శుభ్రం చేస్తుంది. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలను పరిశుద్ధంగా ఉంచుకోవటం ద్వారానే దైవం మన అనుభవంలోకి వస్తాడు.

✳️ అలా కాక నేను కేవలం ధ్యానం చేస్తానని మిగిలిన వాటిని విస్మరిస్తే, అది పరిపూర్ణ ఆధ్యాత్మిక సాధన కాదు. మన భారతీయ జీవన విధానం నేర్పుతున్న సాధన ఇదే. శక్తి మేర నిత్య దేవతార్చన, ఆలయాల సందర్శనము, మంత్రజపము, ధ్యానం అన్ని అవసరమే. జ్ఞానులు సైతం భావితరాలకు అందించడంకోసం వీటిని ఆచరించి చూపారు. మరి ఆ క్రమణికను మనం ఎలా విస్మరిస్తాం? సద్గురువుల శరీరం, మనస్సు, ఆత్మ అన్ని పరిశుద్ధంగా ఉంటాయి. అదే వారికీ మనకీ తేడా. అందుకే వారి సన్నిధి, దర్శనం, స్పర్శనం అన్నీ ఆత్మానుభవంతో సమానం. సద్గురువులు అద్దంలా ఉండి మనలని మనకి చూపుతారు. మనని మనమే సంస్కరించుకునేలా చేస్తారు. 

✳️ మోక్షం లక్ష్యంగా ఉన్నప్పుడే ధర్మాచరణకు కూడా సార్థకత. లేకపోతే అది గమ్యం లేని మార్గం అవుతుంది. అంటే మోక్షం అనేది అందరికి సమాన పరమధర్మంగా ఉంది. ధర్మం అంటే ప్రకృతి సహజత్వానికి భంగం కలగని రీతిలో మానవుడికి ఉండాల్సిన సహజత్వం. మోక్ష సాధనలో ఈధర్మం మరింత విస్తృతమై మానవుడిని ఉన్నతుడిని చేస్తుంది. మంచు తన చల్లదనాన్ని నిరంతరం వ్యక్తం చేసినట్లు మనలో ఉన్న దైవం నిరంతరం 'చిత్' గా ఉంటాడు. చిత్ అంటే మనలో జీవంగా కేవలం ఉండటం అనే లక్షణాన్ని వ్యక్తం చేయటం. సృష్టిలోని ప్రతి ప్రాణికి తాను ఉన్నట్లు తనకి తెలియటం, ఈ 'చిత్' వల్లనే. కానీ మనిషి మాత్రమే తనలో ఉన్న ఆదైవాన్ని దర్శించగలడు. 

✳️ మనం మనలోని దైవాన్ని అనుభవించగలంగాని మనమే దైవంగా మారలేం. మనలో ఉన్న - దైవత్వపు కిరణాన్ని తెలుసుకున్నంత మాత్రాన ఆయనకు ఉన్న అపరిమితత్వం మనకి రాదు. ఈ శరీరానికే పరిమితం అయిన మనం విశ్వవ్యాప్తమైన ఆయనతో పోల్చుకోకూడదు. అంతటి సామర్థ్యం ఉన్న బ్రహ్మజ్ఞానులే మనకు ఆదర్శంగా ఉండటం కోసం సామాన్యులుగా చరిస్తుంటే సాధకులు అహంకరించటం అవివేకం అవుతుంది. ఒక విత్తనంలో సూక్ష్మంగా ఉన్న మొక్క, చెట్టు, వాని ఆకులు, కాయలు మనకి కనిపించక పోయినా నేలను తాకగానే అవి బయటకు వ్యక్తం అవుతాయి. ఏ పదార్థం అయినా పరమాత్మకి భిన్నంగా లేదు. పూత, పిందె, కాయ, పండు అనే వాటిలో పరిణామ భేదం తప్ప మూల పదార్థ భేదం లేనట్లే మన దేహం, మనస్సులు కూడా ఆత్మశక్తి యెక్క వ్యక్తి కారకాలే, ఒకే నాణానికి రెండు ముఖాలు ఎలా ఉంటాయో మన మనస్సుకి అంతరంలో ఆత్మవస్తువు, బాహ్యంలో ఈ దేహం (ప్రకృతి) ఉంటాయి.
[6/11, 05:11] +91 73963 92086: మనం నాణాన్ని ఎటుతిప్పితే ఆవైపు కనిపించినట్టుగానే మనసుని ఎటు తిప్పితే అది కనిపిస్తుంది. ప్రకృతి లక్షణమైన దేహభావన చేత మనిషి మొదట తాను దేహం అన్న భావనలోనే ఉంటారు. భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చిన వివేకంచేత క్రమేణా ఆ మనసుని అంతరంగంలోనికి మరలిస్తే అది దైవదర్శనం అవుతుంది. ఆత్మానుభవ సమయంలో మనిషి ఈ బాహ్య ప్రపంచాన్ని అనుభవించలేడు. నాణెంలో బొమ్మ ఎప్పుడు ఒకటే ఉంటుంది. బొరుసులో మాత్రమే అంకెలు మారుతూ ఉంటాయి. అలానే మనసుకు అంతరంగా ఉన్నా దైవం శాశ్వతత్వంతో మార్పు లేకుండా ఉంటుంది. బాహ్యంగా కనిపించే దేహం, ప్రకృతి మారిపోతూ ఉంటాయి. బాహ్య జగతిలో మనిషికి తెలివి, ప్రపంచజ్ఞానం అలా సహజమై పోవాలి. అవసరమో అంతర్ జగతిలోకి వెళ్ళాలంటే శ్రద్ధ, భక్తి తోపాటు ఆ విజ్ఞానాన్ని విడనాడటం అవసరం. 

✳️ మారుతున్న జగతితో ఆగక, మారని శాశ్వత వస్తువుని తెలుసుకోమని చెప్పేదే మన సనాతన ధర్మం. ప్రకృతిని జయించటం అంటే దాని లక్షణం అయిన దేహత్మ భావన వదలటమే. అది ప్రయత్నంతో చేసేది కాదు. దైవం పై ఉన్న ఇష్టంతో జరగాల్సింది. అందుకే... 'ధ్యాస మారటమే సరళ త్యాగం అంతే' అన్నారు భగవాన్.

    🙏 ఓం నమోభగవతే శ్రీరమణాయ 🙏

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

No comments:

Post a Comment