మీ కంటే ధనవంతుడు ఉన్నాడా?” బిల్ గేట్స్ ని ఎవరో అడిగారు.
“ఒకవ్యక్తి ఉన్నాడు” అని సమాధానమిచ్చి - ఇలా చెప్పాడు.
నేను డబ్బు, పేరు సంపాదించక ముందు ఒకరోజులలో ఒక నాడు న్యూ యార్క్ ఎయిర్ పోర్ట్ లో దిగాను. దినపత్రిక కొందామని చేతిలోకి తీసుకుని సరైన చిల్లర నావద్ద లేకపోవడం వలన తిరిగి పేపర్ ను అమ్మే కుర్రాడికి ఇచ్చేశాను.
“పర్లేదు...మీవద్ద చిల్లర లేకపోయినా, ఈ పేపర్ తీసుకోండి” బలవంతంగా నాచేతిలో పెట్టాడు. నేను తీసుకోక తప్పలేదు.
మరో రెండు సంవత్సరాల తర్వాత చాలా విచిత్రంగా మళ్ళీ అదే ఎయిర్ పోర్ట్ లో అదే పేపర్ కుర్రాడి వద్ద మళ్ళీ దిన పత్రిక కొనాలని ప్రయత్నిస్తే నా వద్ద చాలినంత చిల్లర లేకపోయింది.
ఆ కుర్రాడు నా చేతిలో బలవంతంగా పేపర్ పెడుతూ “ఈ పేపర్ మీకు ఉచితంగా ఇచ్చినందు వలన నేనేమీ నష్టం పోను, ఆ ఖరీదును నా లాభం లోంచి మినహాయించుకుంటాను” అన్నాడు.
ఆ తర్వాత పందొమ్మిది సంవత్సరాలకు నేను బాగా డబ్బు, పేరు సంపాదించిన తర్వాత ఆ పేపర్ కుర్రాడి కోసం వెదికాను. నెలన్నర తర్వాత అతడు దొరికాడు.
“నేనెవరో తెలుసా, నాకు ఉచితంగా దినపత్రిక ఇచ్చావు ఒకసారి” అడిగాను.
“మీరు తెలుసు...బిల్ గేట్స్.... ఒకసారి కాదు రెండు సార్లు ఇచ్చాను”
“ఆ రోజు నువ్వు చేసిన సహాయానికి కృతఙ్ఞతలు, నీకు ఏమి కావాలో అడుగు, నీ జీవితంలో పొందాలను కున్నది ఏదైనా సరే నేను ఏర్పాటు చేస్తాను “
“సర్... మీరు ఏ సహాయం చేసినా నేను చేసిన దానికి ఎలా సరితూగుతుంది? అతడు ప్రశ్నించాడు.
“ఎందుకు సరితూగదు?” నేను ఆశ్చర్య పోయాను.
“నేను పేదరికంతో బాధ పడుతూ, దినపత్రికలు అమ్ముకుంటూ కూడా మీకు సహాయం చేసాను. ఈ రోజు మీరు ప్రపంచం లోనే పెద్ద ధనవంతులై వచ్చి నాకు సహాయం చేస్తానంటున్నారు... ఎలా సరితూగుతుంది?”
అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. అతడు ఇతరులకు సహాయం చెయ్యాలంటే తాను ధనవంతుడు కావడం కోసం ఎదురు చూడలేదు. అవును... నాకంటే ఆ పేపర్ కుర్రాడే ధనవంతుడు.
అప్పుడు నాకు అనిపించింది-
కుప్పలు కుప్పలు డబ్బు ఉండే కంటే...ఇతరులకు సహాయ పడాలనే హృదయం కలిగి ఉండటమే నిజమైన ఐశ్వర్యం.
ఇతరులకు సహాయ పడటానికి కావలసింది అదే..........
No comments:
Post a Comment