Monday, August 19, 2024

భగవాన్ ఏమంటున్నారంటే .. మనం పెద్ధ అడవిలో ఉన్నాం. మన బుద్ధి పాడయిపోయి ఉంది. ఆ *బుద్ధి .. దేహమే నేనంటుంది, అహంకారమే నేనంటుంది, నా మాటే నగ్గాలంటుంది !

 *శ్రీ గురుభ్యోనమః*

     భగవాన్  ఏమంటున్నారంటే ..  మనం  పెద్ధ  అడవిలో  ఉన్నాం.  మన  బుద్ధి  పాడయిపోయి  ఉంది.  ఆ *బుద్ధి ..  దేహమే  నేనంటుంది,  అహంకారమే  నేనంటుంది,  నా మాటే  నగ్గాలంటుంది !*

చాలా  ఇళ్ళల్లో   అహంకారం  వల్లే   పేచీలు  వస్తాయి.  నేను  గొప్ప  అంటే,  నేను  గొప్ప ..  నా మాట  నగ్గాలంటే,  నా మాట  నగ్గాలి .. అవసరముండి  గొడవ  పడరు.  అహంకారం  కోసమే  చాలా  ఇళ్ళల్లో  గొడవలు  పడతారు.  అందుచేత,  మనం  చాలా  జాగ్రత్తగా  ఉండాలి.  మన  మాటలో  అహంకారం  ఉండకూడదు,  మన  చేతలో  అహంకారం  ఉండకూడదు,  మన  ఆలోచనలో  అహంకారం  ఉండకూడదు,  మన  చూపులో  కూడా   అహంకారం  ఉండకూడదు.  మిమ్మల్ని  ఎవరైనా  చూస్తున్నారంటే,  మీ చూపులో  ఎంత  దయ  ఉండాలంటే ..  ఎంత  అనుగ్రహముండాలంటే ..  ఎంత  శాంతి  ఉండాలంటే ..  మిమ్మల్ని  చూసేటప్పటికే  వాళ్ళకి  జ్ఞానం  రావాలి.  

ఈ చనిపోవటం,  పుట్టటం  ఇదంతా  ఒక  అడవి.  అదృష్టము,  దురదృష్టము  జీవుడిని  వెంబడిస్తూ  ఉంటాయి.  ఇదంతా  ఒక  అడవి.  నువ్వు  కానిదానిని  నువ్వు  అనుకుంటున్నావు.  *అనాత్మయందు  నీకు  ఆత్మ  బుద్ధి !*  ఏది  నువ్వు  కాదో  దానిని  నువ్వనుకునే  బుద్ధి  నీకు  ఉంది.  ఆ బుద్ధిలోంచి  బయట  పడటానికి  నీ తెలివితేటలు  సరిపోవు,  నీ కున్న  మనసు  సరిపోదు,  నువ్వు  చదువుకున్న  పుస్తకాలు  సరిపోవు,  నువ్వు  చేస్తున్న  స్నేహాలూ  సరిపోవు !  

గురువు  దయ  లేకుండా,  శాస్త్రం  యొక్క  దయ  లేకుండా,  దేవుని  యొక్క  దయ  లేకుండా  ఈ సంసారం  అనే  అరణ్యంలోంచి  నువ్వు బయటకు  రాలేవు.  నీకు  తెలివి  తెటలు  ఉంటే  మంచిదే !  ఆ తెలివితేటలవల్ల  నువ్వు  బయటకు  రాలేవు.  నువ్వు  గంగానదిలో  స్నానం  చేయచ్చు,  శివుడికి  అభిషేకం  చెయచ్చు,  ఏదైనా  సాధన  చేసుకోవచ్చు  మంచిదే !  అంతమాత్రంచేత  నువ్వు  ఈ అడవిలోంచి  బయటకు  రాలేవు.  ఎవరో  ఒక  మహాత్ముడు,  లేదా  ఒక  మహర్షి,  ఎవరో  ఒక  అవపతార  పురుషుడి  యొక్క  దయ  లేకుండా  మాత్రం  ఈ అజ్ఞానమనే  అరణ్యం  లోంచి,  అజ్ఞానమనే  సంసారం  లోంచి  నువ్వు  బయటకు  రాలేవు.  *ఎవరో  ఒక  దేవతా  పురుషుడి  దయ  నీకు  ఉండాలి.  వాడే  గురువు !*    

నీ బుద్ధి  ఇంద్రియాలతోటి,  మనస్సుతోటి,  హెచ్చుతగ్గులతోటి,  రాగద్వేషాలతోటి  కలుషితమైపోయి  ఉంది.  ఇటువంటి  మైలబుద్ధి,  ఇటువంటి  పాడుబుద్ధి  నీకు  మోక్షాన్ని  ఇవ్వదు.  ఈ పాడుబుద్ధిలోంచి  నువ్వు  బయటపడాలంటే,  ఆ భగవంతుని యొక్క ..  ఆ డివైన్  ఇంటర్ ఫియరెన్స్  లేకుండా  ఈ అజ్ఞానంలోంచి  బయటకు  రాలేవు.  

జ్ఞానం  గురించి  మీరు  శ్రవణం  చేయండి.  భగవంతుడు  చెప్పిన  వాక్యాలను  మననం  చేయండి,  భగవంతుడు  చెప్పిన  వాక్యాలను  ధ్యానం  చేయండి.  భగవంతుడు  చెప్పిన  ఆవాక్యాన్ని  విశ్లేషించుకోండి.  *భగవంతుడు  ఆ వాక్యాన్ని  ఎందుకు  చెప్పాడో ..  ఆలోతు  ఎంత  ఉందో ..  అని  విశ్లేషణ  చేయండి !*   

*శ్రీ నాన్నగారి  అనుగ్రహ  భాషణం -*
*మురమళ్ళ :*  2005 / 02 / 09 
                    
🪷🙏🏻🪷🙏🏻🪷

No comments:

Post a Comment