భారతీయ సంస్కృతిలో కుంకుమ ధారణ
(లలితా సహస్ర నామ స్తోత్ర భాష్యాం తర్గతం)
భారతీయ సంస్కృతిలో పసుపు, కుంకుమ దేవతా శక్తి కలిగిన పదార్థములుగా భావిస్తాం. ఇవి మానవులు తయారుచేసుకొని వాటియందు దేవత్వాన్ని ఆరోపించుకున్న వస్తువులు కాదు. మహర్షులు దర్శించి వాటిలో దేవతాశక్తి ఆవిష్కరింపబడుతుంది అని తెలియజేసి వాటిని మన ఆచారంలో భాగంగా పెట్టారు. అందుకే కుంకుమను అలంకరించుకోవడం అనేది మన సంప్రదాయం. పసుపు మిళితమైనదే కుంకుమ. దీనిని సంప్రదాయ బద్ధమైన పదార్థంగా చేయాలి. అంతేకానీ వర్ణం ప్రధానం కాదు. రంగు ప్రధానం చేసుకొని ఎర్రగా కనబడిన ఏదో ఒకటి కుంకుమ అని సరిపెట్టుకోవడం సరికాదు. పసుపులో కొన్ని దివ్య ద్రవ్యాలు కలిపి కుంకుమ చేస్తారు.
ఈకుంకుమ తయారు చేసేటప్పుడు సూర్యరశ్మి సోకి ఒక సూక్ష్మమైన ధ్వని వినబడుతుంది. ఆ ధ్వని 'కుం' అనే శబ్దంతో వస్తుంది. 'కుం ఇతి కూజతేతి కుంకుమా' - అని వ్యాఖ్యాతలు చెప్పారు. ఆ ధ్వనితో వస్తుంది గనుక దానికి ఆ పేరు పెట్టారు. ఈ పద్ధతిలో తయారుచేసే దానిలో దేవతాశక్తి జాగృతం చేసేటటువంటి మహిమ ఉంటుంది. సృష్టి అంతా కూడా భగవత్ శక్తితో నిండి ఉన్నప్పటికీ కూడా కొన్ని మాత్రం ఆ శక్తిని ప్రకటిస్తాయి, ప్రసరింపజేస్తాయి. సూర్యకాంతి విశ్వమంతా పరచుకున్నప్పటికీ అద్దం ఆ కాంతిని ప్రతిఫలింపజేయ గలుగుతున్నది.అదేవిధంగా కొన్ని వస్తువులు భగవత్ శక్తిని ప్రకటించ గలుగుతాయి. అటువంటి వాటిలో కుంకుమ ఒకటి. అందుకే మనం నుదుట కుంకుమ ధరిస్తాం. భృకుటీ మధ్య స్థానాన్ని ఆజ్ఞాచక్రస్థానం అని చెప్పబడుతున్నది. ఈ ఆజ్ఞాచక్ర స్థానానికి ఉన్న శక్తి ఏమిటంటే - విశ్వ చైతన్యంలో ఉన్న దేవతా శక్తిని గ్రహించ గలగడం, తనలో ఉన్న శక్తిని బయట ప్రసరింప జేయగలగడం - ఈ రెండూ చేయడానికి ఇది కేంద్రం అవుతుంది. అంతేకాకుండా ముఖ్యమైన నాడులకు ఇది కేంద్ర స్థానం. అందువల్ల ఆ స్థానంలో కుంకుమ పెట్టడం వల్ల దేవతా శక్తిని పొంది ఆ శక్తిని అణువణువూ వ్యాపింపజేసుకోగలం. అందుకు మహాత్ములు కుంకుమ ధారణ పెట్టారు. ఈ కుంకుమ కూడా గుండ్రంగా పెట్టుకోవడంలో ఆద్యంత రహితమైన బిందువును సూచించేవిధంగా పెట్టుకుంటాం. ఇది సత్సంప్రదాయం.
దీనిని కాదని మనవి కానివి, అసంప్రదాయమైనవి, నాగరికత పేరుతో తీసుకొని మనం ఈ దివ్య సంస్కృతి నుంచి దూరం అయిపోతున్నాం. కుంకుమ బదులుగా ఎర్రగా కనిపించే ఏదో అంటించుకుని తిరగడం కూడా మొదలైంది. ఇవి మన పెద్దలు పెట్టిన ఉద్దేశ్యానికి విరుద్ధమైనవి.కుంకుమ పెట్టడంలో ఉన్న పవిత్రత ఆ ఎర్ర రంగు అంటింపులలో ఉండదు. పైగా అది ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఉండవలసినది కుంకుమ.
ఇలా బొట్టు, కాటుక ఇత్యాదులన్నీ కూడా ఎంతో దివ్యమైనటువంటి అవగాహనతో సూక్ష్మ ప్రపంచంలో ఉన్న దేవతా శక్తులను దర్శించిన మహర్షులు పెట్టినటువంటి ఆచారములు అని తెలుసుకోవాలి. మనకు ఆ దర్శన శక్తి లేదు. మహర్షులు, మహాత్ములు చెప్పిన వాటిని ఆప్త వాక్యంగా అనుసరిస్తూ వస్తూ ఉన్నాం.
మహర్షికి ధ్యానంలో, తపస్సులో గోచరించిన దేవతా మూర్తిలో ఏ లక్షణాలు కనబడుతున్నాయో ఆ లక్షణాలను సంప్రదాయాలుగా మనకి చెప్పారు. అంతేకానీ మన అలవాట్లను దేవతకి ఊహించుకోవడం కాదు. దేవతలో ఉన్నటువంటి ఆకార విశేషాలను మన ఆచార విషయాలుగా చెప్పి దేవతాశక్తికి దగ్గరవడానికి మార్గాలు వేశారు మహర్షులు.
ఇంకొక అర్థంలో 'కుం' అనే శబ్దంలో కకారము, ఉకారము, మకారము, ఉన్నాయి. కకారము బ్రహ్మవాచి, ఉకారము ఉపేంద్రుడైన నారాయణుని తెలియజేస్తుంది. మకారము రుద్రుని తెలియజేస్తుంది.
No comments:
Post a Comment