*భక్తి.....*
*భక్తి ఒక పవిత్రమైన భావన. మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు. వైష్ణవులకు భక్తి ప్రక్రియ విష్ణువు, కృష్ణుడు లేదా అతని అవతారాలకు సంబంధించింది. అదేవిధంగా శైవులకు శివుడు, శక్తి లేదా వారి అంశలకు సంబంధించింది.*
*భక్తి యోగం గురించి భగవద్గీతలో వేదాంతాల సారంగా పేర్కొన్నది. నారద భక్తి సూత్రాలు పలురకాల భక్తి విధాల గురించి పేర్కొన్నది.*
*భక్తిలో రకాలు...*
*భగవంతుని పొందడానికి భాగవతంలో నవవిధ భక్తులు, అనగా 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పబడినాయి. ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉంది. ఆ... శ్లోకం...*
*శ్రవణం కీర్తనం విష్ణోః*
*స్మరణం పాద సేవనం*
*అర్చనం వందనం దాస్యం*
*సఖ్యమాత్మ నివేదనం*
*'పై శ్లోకాన్ని పోతన తెనిగించిన విధం*
*తను హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనం బను నీ తొమ్మిది భక్తి మార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి సజ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా... అనగా భగవంతుని పూజింపడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి.*
*శ్రవణ భక్తి...*
*సత్పుతురుషుల వాక్యాలు, సంద్గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి వీలవుతుంది. ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీని వలన మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. పరీక్షిత్తు శ్రవణ భక్తి నాశ్రయించి మోక్షాన్ని పొందాడు.*
*కీర్తనా భక్తి...*
*భగవంతుని గుణ విలాసాదులను కీర్తించుట కీర్తనా భక్తి. భగవంతుని సాక్షాత్కరింప చేసుకోడానికి కీర్తన భక్తి ఉత్తమమైనది. నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు, ఆళ్వారులు, నయనార్లు, రామదాసు మొదలైన వారు కీర్తన భక్తితో పరమపదం పొందారు.*
*స్మరణ భక్తి...*
*భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకొని స్మరించుట స్మరణ భక్తి. ఇది నామ స్మరణం, రూప స్మరణం, స్వరూప స్మరణం అని మూడు విధాలు. మునులు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, తులసీదాసు త్యాగరాజు మొదలైన వారు స్మరణ భక్తితో ధన్యులైనారు.*
*పాదసేవన భక్తి...*
*భగవంతుని సర్వావయవాలలో ప్రాముఖ్యం వహించినవి పాదాలు. వీటిని సేవించడం భక్తులు భగవంతుని పవిత్ర సేవతో సమానం. భరతుడు, గుహుడు మొదలైన వారు ఈ పాదసేవ ద్వారా ముక్తులైనారు.*
*అర్చన భక్తి...*
*ప్రతిరోజు తులసి పుష్పాదులు, ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చారూపంలో దేవుని పూజించడం అర్చనా భక్తి. మానవులు తాము నమ్ముకున్న భగవంతుని అర్చనా మూర్తులను ప్రతిష్ఠించుకొని పూజాద్రవ్యాలతో ధూప దీప నైవేద్యాలతో దేవతలను అర్చించడం ప్రస్తుత సమాజంలో ఎంతో ప్రాచుర్యంలో ఉంది.*
*వందన భక్తి...*
*వందనం అనగా నమస్కారం. తన యందు మనస్సు నుంచి భక్తులై పూజింపుమని, నమస్కరింపుమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉద్భోవించాడు. ఎన్ని యాగాలు చేసినా, శాస్త్రాలు చదివినా భగవంతుని నమస్కరించని వాడు ఆ ఫలితాన్ని పొందలేడు.*
*దాస్య భక్తి...*
*ప్రతి మానవుడు తనకు ఇష్టమైన దేవునకు ఎల్లప్పుడు సేవకుడై, దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి. కులశేఖర అళ్వారు దాస్య భక్తికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. హనుమంతుడు, లక్ష్మణుడు మొదలైన వారు దాస్య భక్తి నాశ్రయించి ముక్తిని పొందారు.*
*సఖ్య భక్తి...*
*సఖ్యం అనగా స్నేహం. స్నేహం కలగని మంచిలేదు. భగవంతునితో సఖ్యమేర్పరచుకున్న వారు ధన్యులు. అర్జునుడు, సుగ్రీవుడు మొదలైన వారు సఖ్య భక్తితో స్వామికి ప్రీతి పాత్రులైనారు.*
*ఆత్మ నివేదన భక్తి లేదా ప్రపత్తి...*
*ఆత్మ నివేదన మనగా భగవంతుడు తప్ప అన్యులెవరూ లేరని శరణాగతి కోరడం. భక్తి మార్గాలన్నిటికన్నా ఆత్మ నివేదన మోక్ష మార్గానికి సులభమైన మార్గం. ఈ మార్గాన ద్రౌపతి, గజేంద్రాదులు ముక్తులైనారు...*
*⚜️|| ఓం నమః శివాయ ||⚜️*
🌷🌷🌷 💢🕉️💢 🌷🌷🌷
No comments:
Post a Comment