Sunday, December 1, 2024

****అబద్ధపు ప్రయాణం

 *అబద్ధపు ప్రయాణం*

కలంతా అసత్యం...
కలకనేవాడు సత్యం...
జీవితం అంతా అసత్యం....
జీవించేవాడు సత్యం...
ఇదే వేదాంతసారం...

ఆ అనుభవం ఎలా కలుగుతుంది...? 
అని అడుగుతుంటారు...
"కలుగుతుంది"...అంతే...అంటాడు  గురువు ....
ఎలా అనేది మనసు జేసే మాయాజాలం..
ఎలా అనేది వదిలేస్తే అక్కడే ఉంటుంది మాయాతీతం...

పై పక్షి వద్దకు చేరాక తెలుస్తుంది 
క్రిందపక్షి లేదని..
కలిగాక తెలుస్తుంది....
కలగడం అనేది లేదని....
ఆ అనుభవం కలిగేవరకు...
అబద్ధపు ప్రయాణం తప్పదు.....
ఆ అబద్ధపు ప్రయాణానికే సాధన అని పేరు....
సాధన వద్దన్నా ఆపరు...
చేయమన్నా చేయరు....
ఇదే లోకం తీరు...

సాధ్యం కానిదాని కోసం సాధన ఏమి...?
అప్రయత్నంగా ఉన్నదాని కోసం ప్రయత్నమేమి...?
ఏ సాధనా చేయకపోవడమే గొప్ప సాధన...
ఏ ప్రయత్నమూ చేయకపోవడమే గొప్ప ప్రయత్నం...

నిద్ర లేవడానికి అలారం ఉంటుదేగానీ....
నిద్ర రావడానికి అలారం ఉండదు కదా...
మొదటిది ప్రయత్నం...
రెండవది అప్రయత్నం...
నీవు చేసే ప్రతి ప్రయత్నమూ...
నీవు అప్రయత్నంగా ఉండటానికే...

తనువు కదులుతుంటుంది...
కదలనీ...
చిత్తం చలిస్తుంటుంది...
చలించనీ...
ఆత్మ అచలంగా ఉంటుంది...
ఉండనీ...
తనువు, చిత్తం కదలడం ఆగదు...
ఆత్మను కదిలించడం కుదరదు...
అది అంతే...
ఇది ఇంతే...

"అనుభవం" ఉంది...ఇది నిశ్చయం...
"అనుభవి" లేడు...ఇది నిశ్చింత...
"అనుభవం" ఉందని ఎలా చెప్పగలవు?
ప్రతిబింబం ఉందంటే బింబం ఉండబట్టే కదా... 
కానీ ఉనికి ఉండేది బింబం ఒక్కదానికే...
ప్రతిబింబం బింబాన్ని ఎలా పొందగలదు?
"అద్దం" మాయ...

కలలోనివాడు ఆ కలను కనేవాణ్ణి ఎలా పొందగలడు?
"కల" మాయ...
జీవుడు దేవుణ్ణి ఎలా పొందగలడు?
"మెలకువ" మాయ...

* * *

నేను ఉద్యోగస్తుణ్ణి అనుకున్నంత మాత్రాన...
ఉద్యోగస్తుడివి కాలేవు...
నీకు ఉద్యోగం వస్తేనే ఉద్యోగస్తుడివి కాగలవు...
కానీ ముక్తి విషయంలో అలా కాదు...
ముక్తి పొంది, ముక్తుడవడం కాదు...
నేను ముక్తుణ్ణి అని అనుకోవడం వలన...
ముక్తుడవుతావు...

లౌకికవిషయాల్లో...
అవడం అయ్యాక అనుకోవడం జరుగుతుంది...
ఆధ్యాత్మిక విషయంలో...
అనుకోవడం జరిగాక అవడం అవుతుంది...

నేను శ్రీధర్ అనే అబద్దాన్ని అనుకుని అనుకుని...
నిజం చేసేసుకున్నావు...
నేను బ్రహ్మమును అనే నిజాన్ని అనుకుని అనుకుని...
నిజం ఎందుకు చేసుకోలేవు...

ముక్తుడే నా గడప దాటి లోపలికి రాగలడు...
నేను ముక్తుణ్ణి కానని నీవనుకుంటే,
నీవు కూర్చున్న చాపకి కూడా అవమానం.

No comments:

Post a Comment