Monday, December 15, 2025

 జన్మ జన్మ ల పేరుకుపోయిన పాప కర్మలను దగ్దం చేసే ఉత్తమ సాధన ఏమైనా ఉన్నదా? లేక అనుభవించటమేనా?


కపిలమహర్షి పాపక్షయం ఎలా చేసుకోవాలి, నరకాన్ని ఎలా తప్పించుకోవాలి అనే అద్భుత విషయాలను తెలియచేసారు కపిలగీతలో.

" తస్మాత్ పురైవాద్దిహ పాప నిష్కృతౌ

యతేత మృత్యో రవిపధ్యరాత్మనా "

" ఈ జీవితంలోనే మరణానికి ముందే దేహం రోగగ్రస్తం కాకముందే చేసిన పాపాలకు నిష్కృతి చేసుకోవాలి " అని తెలియచేసారు.

రోగాన్ని గుర్తించి వైద్యులు చికిత్స చేసినట్లుగా మనకు మనమే ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. ప్రశాంతంగా కూర్చుని ఆలోచన చేస్తే ఎవరికి వారు తాము చేసిన పాపపు పనులను గుర్తుచేసుకోవచ్చు అన్నారు.

స్వర్గం సుఖం. నరకం దుఃఖం. మనది మిశ్ర లోకం. సుఖం దుఃఖం రెండూ ఉంటాయి/అనుభవించాలి. అవి అనుభవ/భోగ లోకాలు. ఇది కర్మలోకం. ఇక్కడ జన్మ ఎందుకు అంటే జాగ్రత్తపడడం, పాపక్షయం, పుణ్యం సంపాదించుకోవడం కోసం. నరకంలో రామజపం చేసుకోవడం కుదరదు. ఆ ఆలోచన, సంకల్పమే కలుగదు.

అందుకని తెలిసి చేసిన పాపపు పనులకు ఓపిక ఉన్నప్పుడే ప్రాయశ్చిత్తాలు చేసుకోవడానికి ప్రయత్నించాలి.

ఈ ప్రాయశ్చిత్తాలు కూడా కష్టమయినవి కావు. ఎందుకంటే ఎక్కువ మంది చేసే పాపపు పనులు హత్యలు, దారిదోపిడీల వంటి మరీ భయంకరమయినవి కావు. ఏదో మాయలో పడి చేసే చిన్న చిన్న తప్పుడు పనులే.

శివపురాణంలో ఓ అద్భుత విషయం ఉంది. " తప్పుడు పనులు చేసాను. ఇకపై చేయను. క్షమించు " అని వేడుకుంటే చాలు సహం పాపాలు నశిస్తాయి అని. ఇకపై అటువంటి పాపపు పనులు చేయకుండా ఉంటే ఇంకో పావు శాతం పాపాలు నశిస్తాయి అని. తగిన ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే మిగతా పాపం కూడా నశిస్తుంది అని.

భగవంతుని నామజపం చేసుకోవడం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, సహాయం కోరిన వారికి వీలయిన సహాయం చేయడం, కలలో కూడా ఎవరికీ చెడు జరగాలని కోరుకోకపోవడం వంటి పనులు చేస్తూ ఉంటే పాపక్షయం జరగడం తథ్యం.

No comments:

Post a Comment