శ్రీ రామ జయ రామ జయ జయ రామ।। అంటే అర్దం ఏంటి? ఇది మంత్రమా శ్లోకమా?
శ్రీరామ పట్టాభిషేకం తరువాత రాముడు సభలో కొలువుదీరి ఉన్నారు. వశిష్టుడు , విశ్వామిత్రుడు మొ.గు ఋషులందరూ సభలో ఉన్నారు. నారదులు, వానర వీరులు అందరూ అక్కడ ఉన్నారు.
వారికి ఓ ధర్మసందేహం వచ్చింది. భగవంతుడు గొప్పవారా భగవన్నామం గొప్పదా అని. ఎటూ తేలలేదు.
ఆ సమయంలో నారదులు హనుమ వద్దకు వచ్చి ఇంత మంది ఋషులు ఒకేసారి కనబడడం కష్టం. వారికి నమస్కరించి ఆశీర్వచనం తీసుకో అనగానే హనుమ ఆనందపడిపోయారు. ఒక్కొక్క ఋషి వద్దకు వెళ్ళి నమస్కరించారు. హడావిడిలో విశ్వామిత్రుడికి నమస్కారం చేయడం మర్చిపోయి వచ్చి కూర్చున్నారు.
విశ్వామిత్రులకు కోపం తారాస్థాయికి చేరింది. రాముడు వైపు తిరిగి హనుమ ఇంతమంది ఋషుల సమక్షంలో నన్ను అవమానించాడు. రేపు సూర్యాస్తమయంలోపు అతని తలను తొలగించు అనడంతో రాముడికి మతిపోయింది. ఆయన గురువు, ఇతను ప్రియభక్తుడు. అయినా గురువు మాట వేదం కనుక అలాగే అన్నారు రాముడు.
హనుమ బాధపడిపోయారు. నారదుల వద్దకు వెళ్ళి మీరు చెప్పినట్లు చేసాను ఇలా అయిందేమిటి అనగానే నారదులు " ఏమీ భయంలేదు, రేపు బ్రహ్మీ ముహూర్తంలో సరయూ నదిలో స్నానం చేసి శ్రీరామ జయరామ జయజయ రామ అనే త్రయోదశాక్షరనామ మంత్రాన్ని జపిస్తూ ఉండు చాలు " అన్నారు.
హనుమ అలా జపం చేస్తున్నారు. రాముడు వచ్చి అన్ని బాణాలు ప్రయోగించినా హనుమకు ఏమీ అవడం లేదు. అప్పుడు ఇక తప్పక బ్రహ్మాస్త్రాన్ని తీసారు.
అప్పుడు నారదులు విశ్వామిత్రుడి వద్దకు వెళ్ళి రాముడు అలసిపోతున్నాడు, బ్రహ్మాస్త్రప్రయోగం మంచిది కాదు. మీరు హనుమను క్షమించి ఈ విపత్తు తప్పించండి అనగానే ఆయన అలాగే అన్నారు.
హనుమ విశ్వామిత్రుడి పాదాలకు, రాముడి పాదాలకు నమస్కరించి ఆశీర్వచనాలు తీసుకున్నారు.
అప్పుడు నారదులు రామనామం రాముడి కన్నా గొప్పదని ఇప్పుడు అందరికీ అర్ధం అయిందని అనుకుంటున్నాను అన్నారు.
రామనామం తారకనామం. తరించడానికి రామజపమే మార్గం.
" శ్రీరామ జయరామ జయజయ రామ " అని జపించండి. శ్రీరాముడు, సీతమ్మ, హనుమ కూడా సంతోషించి అనుగ్రహిస్తారు.
ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు.
No comments:
Post a Comment