Sunday, December 28, 2025

 దుర్మార్గులైన దుర్యోధన, దుశ్శాసనాదులకు సభలో శ్రీకృష్ణుడు ఎందుకు విశ్వరూపాన్ని చూసే అదృష్టం కల్పించాడు?
భగవంతుడు ఇంకా ఎన్నో అవతారాలు దాల్చాడు. కానీ, ఆ అవతారాల్లో దేనిలోను ఆయన విశ్వరూపాన్ని చూపలేదు. ఒక్క కృష్ణావతారంలోనే విశ్వరూపాన్ని చూపించాడు. అది కూడా ఒక్కసారి, ఒక్కరికి కాదు. చాలాసార్లు చాలామందికి చూపించాడు. అందులో దుర్మార్గులైన వాళ్ళు కూడా ఉండడం విశేషం. అసలు ఈ విశ్వరూపం ఎవరు ఎవరికి చూపించాడన్నది ఒకసారి చూద్దాం.

మొదటగా ఈ అదృష్టం దక్కింది కృష్ణయ్యను పెంచిన యశోదకు. ఆయన నోరు తెరచి అందులో పద్నాలుగు లోకాలను, సమస్త బ్రహ్మాండాన్ని, దేవీ దేవతలను చూపించాడు కదా. తర్వాత రాయబారంలో సభాసదులకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. చివరగా భగవద్గీతను బోధించేప్పుడు అర్జునుడికి విశ్వరూపాన్ని చూపాడు. ఆయన పుణ్యాత్ములకు, దుర్మార్గులకు కూడా సమానంగానే తన విశ్వరూపాన్ని చూపించాడన్నమాట. కౌరవులకు విశ్వరూపాన్ని చూపించినప్పుడు వాళ్ళకు అదొక అవకాశం అని వేరే సమాధానంలో వెంకట రమణ గారు అన్నది చాలా కరెక్ట్. ఇదే మాట సద్గురు శివానందమూర్తి గారు కూడా చెప్పేవారు. అలాగే ఆయన విశ్వరూపాన్ని చూపించేప్పుడు "మీరు నన్నేమీ చేయలేరు, నా సంపూర్ణ స్థితి తెలియజేయడానికి ఈ విశ్వరూపాన్ని చూపిస్తున్నాను." చూడండి అంటూ చూపించాడు కాబట్టి ఇది స్పష్టంగా ఉంది. తాము ఎదుర్కోబోతున్నది ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన విష్ణుమూర్తినే అన్న విషయం తెలుసుకుని తమ ప్రవర్తన మార్చుకోవడానికి వాళ్ళకు అవకాశం ఉంది. ధృతరాష్ట్రుడికైతే ఈ విశ్వరూపాన్ని చూడడానికని అడిగితే కళ్ళు కూడా ఇచ్చాడు కదా. మిగిలిన దుర్మార్గులు చూడలేకపోయారు. కానీ, జరిగింది ఒక అద్భుతం అని వాళ్ళకు అర్థమైంది మరి. పైగా భయం సంభ్రమాశ్చర్యాలు కూడా కలిగాయి. అలాగైనా కూడా దాన్నొక కనికట్టు అని కొట్టిపారేస్తే దానికి బాధ్యత వాళ్ళదే కదా. ఎవరి కర్మకు వాళ్ళే కర్తలు అంటారు కదా పెద్దవాళ్ళు. ఇక్కడ అదే జరిగింది. కృష్ణుడి విశ్వరూపాన్ని అంతగా అడిగి మరీ చూసిన ధృతరాష్ట్రుడు రాజుగా ఈ రాయబారాన్ని అంగీకరించలేదు ఎందుకుని? అతను గట్టిగా శాసిస్తే జరిగేది ఏదో జరిగేది. కానీ, చేయలేదు. ఎందుకంటే - వాళ్ళ బుద్ధులు వాళ్ళను నాశనం వైపుకే నడిపాయి. కృష్ణుడి కర్తవ్యం తన ధర్మం తాను నిర్వర్తించడం, లోకంలో ధర్మాన్ని స్థాపించడం. ఆ పని ఆయన చేశాడు. ఆయనను పాండవ పక్షపాతి అంటారు. కానీ, ఈ ఘట్టం అదంతా అసత్యం అని, ఆయన వచ్చింది ధర్మాన్ని నిలబెట్టడానికేనని నిరూపించింది. ఆయన పాండవ పక్షపాతే అయివుంటే అంతటి పాపాత్ముల ఎదుట తన విశ్వరూపం ప్రదర్శించే పని లేదు. కాదు కాబట్టే లోకంలో సూర్యుడు ఎలాగైతే అన్ని జీవుల మీద ఏ పక్షపాతమూ లేకుండా వెలుగులు విరజిమ్ముతాడో అలాగే కృష్ణుడు కూడా తన దయ చూపించాడు.

శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

No comments:

Post a Comment