Sunday, December 28, 2025

 దేవాలయంలో ఇంకెవరికీ నమస్కరించకూడదు 

దేవాలయంలో దైవ దర్శనానికి కూడా కొన్ని పధ్ధతులున్నాయి. వరుసగా గణపతి, ఉపాలయాలు, తర్వాత ప్రధాన దైవాలు. ప్రధాన దైవ దర్శనం తర్వాత, ఆ దైవాన్ని పూజించిన తర్వాత ఆ దైవానికన్నా శక్తివంతులు ఆ ఆలయంలో ఇంకెవరూ దర్శనీయులుగానీ, పూజనీయులుగానీ వుండరు. అందుకనే ఆ దైవంముందు ఇంకెవరికీ నమస్కరించకూడదు. కొందరు, పరిచయస్తులకీ, ప్రముఖులకీ,దేవాలయాల్లోకూడా నమస్కరిస్తారు. దైవం కన్నా అంతా అన్నివిధాలా చిన్నవారే.అందుకనే దైవం ముందు మానవులకు నమస్కరించటం ఇరువురికీ మంచిదికాదు. మరి ఎలాగండీ తెలిసినవారు కనిపిస్తే పలకరించవద్దా అంటారా?పలకరింపులకు అనేక మార్గాలున్నాయి…చేతులు జోడించి నమస్కారమే కాదు.

కొందరు అక్కడవున్న అర్చకులపాదాలకు నమస్కరిస్తారు. అదికూడా మంచి పధ్ధతికాదు. నమస్కరించినవారు దైవంకన్నామానవులకు ఎక్కువ గౌరవాన్నిచ్చినట్లు..అలా చేయటంవల్ల వారికి పాపం. నమస్కారం అందుకున్నవారుకూడా దైవంకన్నా తాము అధికులమని అహంకరించినట్లు..వారికీ మంచిది కాదు. తప్పనిసరి పరిస్ధితుల్లో ఎవరికైనా నమస్కరించాల్సివస్తే అక్కడవున్న దైవం పేరు చెప్పి నమస్కరించాలి. అంటే ఆ నమస్కారం ఆ దైవానికే చెందుతుంది.

ఆలయాల్లోనేకాదు, కొన్ని ప్రధాన ఆలయాలున్న కొండలమీదకూడా…అంటే తిరుపతి, శ్రీశైలం లాంటి ఆధ్యాత్మికంగా మహోన్నతమైన ఆలయాలున్న కొండలమీద ఆ ఆలయాల్లోనే కాదు, ఆ కొండలమీదకూడా ఎవరికీ నమస్కరించకూడదు.అక్కడి దైవం పేరుచెప్పి నమస్కరించాలి..అంటే వారిలోకూడా ఆ స్వామినే చూసి ఆ స్వామికి నమస్కరించినట్లు.

🟢🔴🟣🔵🙏🔵🟣🔴🟢


వేంకటేశ్వరుని సందేశము
  
దివ్యమంగళకరం శ్రీవేంకటేశ్వరుని రూపం - ఆత్మజ్ఞానప్రబోధకరం.

ఆత్మజ్ఞాన చిహ్నాలతో అలరారే  వేంకటేశ్వరుని తేజోమూర్తి కడు రమ్యం.

హస్తముల ద్వారా ఇస్తున్న సందేశం :-
 
'సంసార సాగర సముత్తరణైక సేతో' అన్నట్లుగా –

కుడిహస్తముతో తన పాదములను చూపుతూ, వీటిని శరణువేడితే చాలు, మీ సంసార సాగరాన్ని మోకాళ్ళ లోతుమాత్రమే చేసి సులభముగా దాటిస్తాననే అభయహస్త సందేశం ఇస్తుండగా, ఎడమచేతితో నాభి క్రిందస్థానం చూపిస్తూ, ప్రాణవాయువును నాభి క్రింద నుండి ఊర్ధ్వముఖంగా తీసుకుపోయి సహస్రారంలో ఉన్న పరబ్రహ్మ యందు లయంచెయ్యమన్న సందేశముంది. కుడి హస్తంతో, నా పాదాలను శరణువేడితే ఎడమచేతితో నిను నా అక్కున చేర్చుకుంటానన్న సూచన ఉందని కూడా కొందరు పెద్దల విశ్లేషణ.

శంఖు నామ చక్రములు ద్వారా ఇస్తున్న సందేశం :-
 
శంఖం ద్వారా ఉద్భవించునది శబ్దం. శంఖారావం ద్వారా జనించే ధ్వనిలో రజో తమో గుణములను హరింపజేసి సత్వగుణమును పెంచే శక్తి ఉండడమే కాక, విశ్వచైతన్యమును ఎరుకలోనికి తెస్తుంది. 
కుడి ప్రక్కగల నామమును సూర్యనాడిగా, ఎడమ ప్రక్కగల నామమును చంద్రనాడిగా, మధ్యనగల నామమును బ్రహ్మనాడిగా చెప్తుంటారు.

చక్రము ద్వారా కర్మ అనే శత్రువును నశింపజేయమనే సందేశముంది. అంటే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఈశ్వారార్పితంతో కర్మలు చేయాలన్న సూచనకి గుర్తు చక్రం.

జ్ఞానమును పొందమని జ్ఞానచిహ్నముగా శంఖమును, మోక్షచిహ్నముగా నామమును, కర్మనాశనశక్తి చిహ్నముగా చక్రమును ధరించి, కర్తృత్వభావం లేకుండా జ్ఞామును పొంది, తద్వారా కుండలినీ జాగృతమొనర్చి మోక్షమును పొందవలేనన్న సందేశం ఈ శంఖు నామ చక్రములలో ఉంది. ప్రతిరోజూ జరిగే వేంకటేశ్వరుని కళ్యాణం కూడా ఇదే తెలియజేస్తుంది.

No comments:

Post a Comment