Sunday, December 28, 2025

 అనిశ్చితిలోనే నిశ్చితి

'అనిశ్చితే నిశ్చితి. అభద్రతతో జీవించడంలోనే భద్రత' ఉంటుంది అని గణితశాస్త్ర జ్ఞుడు జాన్ అలెన్ పౌలస్ అంటారు. అనిశ్చితిని మనం స్వీకరించలేకపోతే అది భయంగా మారుతుంది. అదే స్వీకరిస్తే ఉల్లాసానికి, సృజనాత్మకతకు దారితీస్తుంది. ఉన్నదున్నట్లుగా స్వీకరించడం మనం ఎదుర్కొనే సవాలు. నిశ్చితికోసం వెతకడం అర్థ రహితం. అనిశ్చితిలోనే మన శక్తులను మనం తెలుసుకోగలుగుతాం. పరిస్థితులు ఎప్పుడెలా మారతాయో చెప్పలేం. శక్తికొద్దీ వాటిని ఎదుర్కోవాలి. కొన్నిసార్లు అద్భు తమైన ఫలితాలు చూస్తాం. కాని అవి మనం ఊహించినవి కాకపోవచ్చు. అయినా హుందాగా వాటిని స్వీకరిస్తూ ముందుకు సాగాలి. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎదుగుతూనే ఉండాలి.

ఒక సన్యాసి తన జీవితంలో వచ్చాడు. అయితే ఓ రోజు రాత్రి బౌద్ధసూత్రాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ చీకట్లో నడుస్తుండగా కీచుమన్న శబ్దంతో పాటు కాలికింద ఏదో నలిగినట్లు అనిపించింది. కప్పను కాలితో తొక్కి చంపేశాననుకుని చాలా బాధపడ్డాడు. నిద్ర కూడా సరిగా పట్టలేదు. పొద్దున్నే ఆ ప్రదేశానికి వెళ్లి చూస్తే నలిగి పడి ఉన్న వంకాయ కనిపించింది. తాను ఏ ప్రాణికీ హాని చేయలేదని తెలిశాకే అతడిలో అశాంతి మాయమైంది.
ఏవేవో భయంకరమైన విషయాలన్నీ ఊహిం చుకుంటాం. దుఃఖపడతాం. చెడు జరగక ముందే జరిగినట్లుగా ఊహించుకుని భద్రత లేదనుకుంటాం. ఏ క్షణంలో ఏమవుతుందో ఎవరికీ తెలియదు. జీవితం అంటేనే అనిశ్చితి. అంతమాత్రాన దాని గురించే ఆలోచిస్తూ కూర్చుంటే- అది ఒత్తిడికి దారితీస్తుంది. భౌతిక, మానసిక ఆరోగ్యానికి భంగం కలిగిస్తుంది. ఏ పనీ చేయలేం. అన్నీ చెడుగా ఊహించుకునే బదులు మంచి విషయాలు తలచుకోవాలి. ఏకాగ్రత పెంపొందించుకుని వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి. భవిష్యత్తు గురించి ప్రశ్నలు వేధిస్తే ఆందోళన, నిరాశ కలు గుతాయి. నిస్సహాయత ఎదురవుతుంది. చేపట్టిన పని సత్ఫలితాన్ని ఇస్తుందో లేదో తెలియదని అసలు చేయకపోవడం వివేకవంతుల లక్షణం కాదు. కష్టమో నష్టమో వెనకటి తరాల వారంతా చేయాలనుకున్నది ధైర్యంగా చేశారు కాబట్టే నాగరికత ఇంత దూరం వచ్చింది. మనకీ సౌకర్యాలన్నీ సమకూరాయి. అనిశ్చితి తాలూకు భయాలను వెనక్కి నెట్టి మన కర్తవ్యాన్ని నెరవేర్చాలి. పనిచేయడం వరకే మన కర్తవ్యం, ఫలితం మన చేతిలో లేదని భగవద్గీత చెబుతోంది.

చాలావరకు నిత్యజీవితంలో అనిశ్చితిని ఎదుర్కొనడానికే ప్రయత్నిస్తాం. భావోద్వేగా లను నియంత్రణలో ఉంచుకుంటాం. ప్రవర్తనను అదుపులో పెట్టుకుంటాం. అయితే అది అన్ని విషయాల్లోనూ చూపలేరు కొందరు. అలాంటి వాళ్లు శరీరంపట్ల, మనసుపట్ల శ్రద్ధ వహించాలి. కంటినిండుగా నిద్రపోవాలి. మనసును ఉల్లాసంగా ఉంచుకోవాలి. అంతా మంచే జరుగుతుందని, కోరుకున్న ఫలితం వస్తుందని ఆశించాలి. ఒకవేళ రాకపోతే మళ్లీ ప్రయత్నించాలి. అంతేకానీ నిరుత్సాహపడకూడదు. సహనాన్ని పెంపొందించుకోవాలి. నిత్యజీవితంలో మార్పులు స్వీకరించినట్లు పెద్ద సవాళ్లను కూడా స్వీకరించడం... అభిలషణీయం, ఆరోగ్యదాయకం.
తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి

No comments:

Post a Comment