Sunday, December 28, 2025

 *క్రమ సంఖ్య 157*
తేది 24/12/2025


*మృత్యోర్మా అమృతంగమయ*

by - సలీం

(కాటేసి ప్రాణాల్ని హరించే విషసర్పాలే, యాంటీవెనం మందుల తయారీలో ఉపయోగపడటం.. ‘మృత్యోర్మా అమృతంగమయ’ కథకు మూల వస్తువు. రచయిత సయ్యద్‌ సలీం. ఈయన స్వస్థలం ఒంగోలు సమీపంలోని తోవగుంట. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రంలో ఎమ్మెస్సీ (టెక్‌) చేశారు. ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో అడిషనల్‌ కమిషనర్‌గా ఉద్యోగ విరమణ పొందారు. ఇప్పటివరకు మూడు కవితా సంపుటాలు, పన్నెండు కథా సంపుటాలు, ముప్పై ఆరు నవలలు వెలువరించారు. ఈయన రాసిన కొన్ని నవలలు, కథలు.. ఆంగ్లం, హిందీ, మరాఠి, ఒడియా, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లోకి అనువాదం అయ్యాయి. బాలల కోసం ఆరు సై-ఫై నవలికలు రాశారు. సాహితీసేవలో భాగంగా అనేక పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు. వివిధ సాహితీ సంస్థలు నిర్వహించిన కథల పోటీల్లో బహుమతులు, సన్మానాలు పొందారు.)

ఇంతక్రితం నగేష్‌ని చూస్తే అసహ్యమేసేది. ఇప్పుడు కోపం వస్తోంది. చంపేయాలన్నంత కోపం… పగతో రగిలిపోతున్నాను. నేను పనిచేసే ‘ఎథ్నిక్‌ సీరం ఇన్‌స్టిట్యూట్‌’ నగేష్‌ స్థాపించిందే. ఇక్కడ పాముల నుంచి విషాన్ని తీసి, యాంటీవెనం సీరం తయారుచేస్తారు. టాక్సికాలజీలో పీజీ చేసిన నేను ఈ సంస్థలో చేరి నాలుగున్నర సంవత్సరాలు. నగేష్‌ మీద నాలో రగులుతున్న ప్రతీకారేచ్ఛ వయసు ఆరు నెలలు.

‘ఎలా చంపాలి?’ అని ఎన్ని రాత్రుళ్లు నిద్ర లేకుండా ఆలోచించానో.. పాముల నుండి విషం తీయడం అత్యంత ప్రమాదకరమైన ప్రక్రియ. చిన్న పొరపాటు జరిగినా.. పాముకాటుకి గురి కావల్సిందే! నగేష్‌ని పాము కాటుకి గురిచేయడం కష్టమేమీ కాదు. ఎటొచ్చీ యాంటీవెనం ఇంజెక్షన్‌ అందుబాటులో లేకుండా చేయాలి. ‘అదెలా!?’ అనేదే ప్రస్తుతం నా ముందున్న ప్రశ్న.

నేను పనిలో చేరిన మొదటి రోజే నన్ను అమితంగా ఆకర్షించిన వ్యక్తి రంగన్‌. ఐదున్నర అడుగుల పొడవు, నల్లటి శరీరఛాయ.. ఎంత చలాకీగా ఉంటాడో.. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ.. ఎంత ఒడుపుగా పాముల్ని ఒడిసి పట్టుకుంటాడో.. పాముల నుంచి విషాన్ని పిండటంలో అతని నైపుణ్యాన్ని చూడాల్సిందే. అవన్నీ తన తల్లి తరఫు బంధువులైనట్టు వాటితో ఎంత ప్రేమగా వ్యవహరిస్తాడో.. వాటికి రకరకాల పేర్లు పెట్టి.. ‘హాయ్‌.. ఎలా ఉన్నావు? ఆకలేస్తోందా? ఎందుకీరోజు డల్‌గా ఉన్నావు? నువ్వెంత మంది ప్రాణాల్ని కాపాడబోతున్నావో తెలుసా? యూ ఆర్‌ ద హీరో’ అంటూ వాటిని పలకరిస్తూ ఉంటాడు. అతనితో ప్రేమలో పడ్డాక తెలిసింది.. అతను డిగ్రీ తర్వాత హెర్పిటాలజీ కోర్స్‌ చేశాడని. తమిళనాడులోని ఇరుల తెగకు చెందినవాడని.. పాముల్ని పట్టుకోవడంలో వాళ్లు నిష్ణాతులు.

యేడాదిక్రితం నుంచి జరుగుతున్న సంఘటనలు ఒక్కటొక్కటిగా గుర్తుకు రాసాగాయి..

ఆరోజు ఎప్పటికిమల్లే ఇన్‌స్టిట్యూట్‌ భవనం ముందు కొన్ని క్షణాలు వినమ్రంగా నిలబడ్డాను. ప్రాణాలు హరించే పాము విషం నుంచే ప్రాణాలు కాపాడే యాంటీవెనం తయారుచేస్తున్న ఈ సంస్థ.. నా కళ్లకు పవిత్రమైన దేవాలయంలా కనిపిస్తున్నది. అందుకు ఉపయోగపడుతున్న పాములు, గుర్రాలు లోపల కొలువున్న దేవతల్లా అనిపిస్తారు.

ముఖద్వారం పక్కన ‘హెచ్చరిక: ప్రమాదకరమైన పాములుండే స్థలం’ అని రాసి ఉన్న బోర్డ్‌ ఉంది. బలంగా ఉన్న ఆ ద్వారాన్ని తెర్చుకుని లోపలికెళ్లాను.

విశాలమైన గది.. వరుసగా పేర్చి ఉన్న గాజు పెట్టెలు.. వాటిలో అసహనంగా కదులుతున్న రకరకాల పాములు.. దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఆ పెట్టెల్లో.. పాములకు అవసరమైన వేడితోపాటు పల్చటి వెలుతురును అందించే ప్రత్యేకమైన లైట్లు వెలుగుతున్నాయి.

నన్ను చూడగానే రంగన్‌ కళ్లు వింత కాంతితో మెరిశాయి.

“హాయ్‌ నీల్‌.. గుడ్‌ మార్నింగ్‌” అన్నాడు నవ్వుతూ.

నా పేరు వినీల. రంగన్‌ నన్ను ‘నీల్‌’ అనే పిలుస్తాడు. అతనలా పిలవడం నాకూ ఇష్టమే. నన్ను చూస్తే అతనికి నీలకురింజి పూలు గుర్తొస్తాయట. పన్నెండేళ్లకు ఒకసారి పూసే కురింజి పూలు.. నీలగిరి కొండల మీద నీలంరంగు తివాచీ పర్చినట్టు అత్యంత మనోహరంగా కనిపించే దృశ్యంలా ఉంటానట.

అతను ఓ గాజుపెట్టెను తెరిచి, తన చేతిలో ఉన్న పొడవాటి స్నేక్‌ హుక్‌తో లోపలున్న పాముని బైటికి తీశాడు. అది ఐదడుగుల పొడవున్న నాగుపాము…

పాముల నుంచి విషం పిండటం రంగన్‌ పని. వాటి సాయంతో యాంటీవెనం తయారుచేయడం నా బాధ్యత. రంగన్‌ విషం పిండటంలో ఎంతటి నేర్పరో చూడాల్సిందే.

రంగన్‌ స్నేక్‌ హుక్‌ సాయంతో పాముని అడుగున్నర పొడవున్న ప్లాస్టిక్‌ ట్యూబ్‌లోకి దూరేలా చేశాడు. పాము తల బ్యూబ్‌లోంచి కొద్దిగా బైటికి రాగానే.. చేత్తో దాని తల దగ్గర పట్టుకుని ట్యూబ్‌ని లాగేశాడు. టేబుల్‌ మీద సిద్ధంగా పెట్టుకున్న గాజుగిన్నెని తీసుకున్నాడు. దాని మూతి పల్చటి ప్లాస్టిక్‌తో బిగించి ఉంది. నాగుపాము తలమీద బొటనవేలు పెట్టి, దాని నోరు తెరిచి, గిన్నె అంచుకి ఆనించి.. మెల్లగా అదుముతూ పట్టుకున్నాడు. దాని కోరలు అందులో దిగబడి, బొట్లుబొట్లుగా గిన్నెలోకి పసుపుపచ్చ రంగులో బంగారంలా మెరుస్తున్న విషం జారింది. విషం పిండటం పూర్తయ్యాక, పాముని గాజు పెట్టెలోకి వదిలాడు.
నాగుపాము వైపు మెచ్చుకోలుగా చూస్తూ..

“థ్యాంక్యూ బ్రదర్‌! నీ కష్టం వృథా పోదు. చాలామంది ప్రాణాల్ని కాపాడటానికి పనికొస్తుంది. నీకు సంతోషమేగా! నీకో కానుకనివ్వనా?” అంటూ ప్లాస్టిక్‌ కంటెయినర్లో ఉన్న ఎలుకల్లోంచి ఓ ఎలుకను పట్టుకారుతో పట్టుకుని, గాజుపెట్టెలోకి విసిరేసి తాళం వేశాడు.

‘ఎక్సలెంట్‌!’ అంటూ అతని వైపు మెచ్చుకోలుగా చూసి, మొదటి అంతస్తులో ఉన్న లాకర్‌ రూం వైపు నడిచాను. ఆ గదిలో ఓవైపు మైనస్‌ నలభై డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో విషాన్ని భద్రపరిచే రిఫ్రిజిరేటర్లు ఉన్నాయి. మరో వైపున్న రిఫ్రిజిరేటర్లలో యాంటీవెనం వయల్స్‌ భద్రపరిచి ఉన్నాయి. విషం ఉన్న బాటిల్‌లోంచి సిరంజితో కొద్దిపాటి విషాన్ని తీసుకుని.. గుర్రాలున్న ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాను.

వాటిల్లో నాకు చాలా ఇష్టమైన గుర్రం షిఫా. షిఫా అంటే.. హీలింగ్‌ అని అర్థం. నేను రావడం గమనించిన షిఫా.. తన మెడను నావైపు సాచింది. దాని మెడను ప్రేమగా కౌగిలించుకుని, జూలుని మెల్లగా దువ్వసాగాను. షిఫా సంతోషంతో వింత శబ్దాలు చేయసాగింది.

“నేనంటే నీకెంతిష్టమో.. నాక్కూడా నువ్వంటే అంతిష్టం. ప్రజల ప్రాణాలు కాపాడటానికి నువ్వు చేస్తున్న త్యాగం చాలా గొప్పది” అన్నాను.

నా మాటలు షిఫాకు అర్థం కావని తెలుసు. కానీనా ఆంతర్యం దానికి తెలుసు.

“తయారుగా ఉన్నావా? నీలోకి విషం ఎక్కించబోతున్నాను” అన్నాను దాని కళ్లలోకి చూస్తూ.
అది గట్టిగా సకిలించింది. నా చెవులకది.. ‘యస్‌! నేను రెడీ’ అన్నట్టు వినిపించింది.
అదే సమయంలో నగేష్‌ వచ్చి నా పక్కన నిలబడ్డాడు. అతని వయసు నలభైకి దగ్గరగా ఉంటుంది. భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని నేను చేరిన కొత్తలో చెప్పాడు. అప్పటినుంచి నావెంట శనిగ్రహంలా పడుతున్నాడు. నన్ను ప్రేమిస్తున్నాడట. ‘పెళ్లి చేసుకుందాం!’ అంటూ వేపుక తింటున్నాడు.

“నేనా గుర్రమంత విలువ కూడా చేయనా? దాని మెడని ఎంత ప్రేమగా కౌగిలించుకున్నావో చూశాగా. నాకా అదృష్టం ఎప్పుడు కలుగచేస్తావు?” అన్నాడు.

నేనేమీ సమాధానం ఇవ్వకుండా షిఫాకు ఇంజెక్షన్‌ ఇవ్వడంలో మునిగిపోయాను.

“సమాధానం చెప్పవేంటి? నీ అనుగ్రహం కోసం ఎదురుచూస్తున్నానని తెలుసుగా. ఎప్పుడు కరుణిస్తావు?” అన్నాడు మళ్లా.
మరో గుర్రానికి ఇంజెక్షన్‌ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు నా వెనకే వచ్చాడు.

“నువ్వు షిఫాని ప్రేమగా తాకినా.. నా గుండె జెలసీతో మండిపోతుందని తెలుసా?” అన్నాడు.
దానిక్కూడా నేనేమీ సమాధానం ఇవ్వలేదు.

“ఆ రంగన్‌ గాడిలో ఏముందని వాడితో సన్నిహితంగా ఉంటున్నావు? వాడు ట్రైబల్‌. ఎంత నల్లగా ఉంటాడో గమనించావా? పాలమీగడ లాంటి నీ ఒంటి రంగుకి వాడి కాకి నలుపుకి ఏమైనా జోడీ కుదుర్తుందా? నన్ను చూడు. అందంగా లేనా? ఎందుకు నన్ను కాదంటున్నావు?” అన్నాడు.

“మీకు తెలుసు. నేనూ, రంగన్‌ ప్రేమలో ఉన్నామని. తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని తెలిసి కూడా ఇలా వెంటబడటం సంస్కారం కాదు. ఇక రంగంటారా? రంగన్‌ చర్మం రంగు నలుపు. కానీ అతని హృదయం మాత్రం స్వచ్ఛమైన తెలుపు. అతను ట్రైబల్‌ అని అన్నారు కదా. ట్రైబల్స్‌ మనుషులు కారా? కుళ్లూ కుతంత్రాలు తెలియని, అమాయకమైన మనుషులు వాళ్లే. నరాల నిండా విషం నింపుకొని తిరిగే మనుషులకన్నా అమృత హృదయుడైన రంగన్‌ వెయ్యిరెట్లు నయం” అన్నాను.

నాగుపాము బుసకొట్టినట్టు హూంకరిస్తూ వెళ్లిపోయాడు.

షిఫా నుంచి రక్తాన్ని తీసి, యాంటి బాడీస్‌ ఉన్న ప్లాస్మాని వేరుచేసే యంత్రంలో పెట్డాను. యాంటీవెనంగా ఉపయోగపడే సీరంని వేరే బాటిల్‌లో నింపి, లాకర్‌ రూంలో ఉన్న ఫ్రిజ్‌లో పెట్టాను. ప్లాస్మా వేరుపడిన రక్తాన్ని షిఫా శరీరంలోకి తిరిగి ఎక్కించడం కోసం గుర్రాలశాలలోకి వెళ్తూ, బాధతో కూడిన సకిలింపులు విని, ఏమైందో అని కంగారుపడుతూ పరుగెత్తాను.
నగేష్‌.. చర్నాకోలాతో షిఫాని దారుణంగా కొట్టడం కళ్లబడింది. అతని చేతుల్లోంచి చర్నాకోలాని లాక్కుని దూరంగా విసిరేస్తూ..
“దాన్నెందుకలా కొడుతున్నారు?” అని కోపంగా అడిగాను.

“దీన్ని లక్షలు పోసి కొన్నది నేను. దీనికి తిండిపెట్టి పోషిస్తోంది కూడా నేనే. ఇది నన్ను కదా ఇష్టపడాలి. నన్ను చూసి బుసలు కొడ్తోంది. పళ్లు బైటికి పెట్టి, కళ్లు పెద్దవి చేసి, కరవడాని కొచ్చింది. ఈసారికి కొట్టి వదిలేశాను. మరోసారి ఇలా చేస్తే తుపాకీతో కాల్చిపారేస్తాను” కోపంతో అనేసి అక్కణ్నుంచి విసురుగా వెళ్లిపోయాడు.
షిఫా వైపు బాధగా చూశాను. దాని కళ్లనుంచి నీళ్లు కారుతున్నాయి. అది ఓదార్పు కోసం తన మెడని నా మెడకు ఆనించింది. దాని జుట్టుని ప్రేమగా దువ్వుతూ..

“సారీ షిఫా! నా మీదున్న కోపాన్ని నీమీద చూపించాడు” అన్నాను.

రక్తం తిరిగి ఎక్కించాక, యాంటి సెప్టిక్‌ ఆయింట్మెంట్‌ తెచ్చి, దాని ఒంటి మీదున్న గాయాలకు పూస్తున్నప్పుడు అనాయాసంగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

మాది చిన్న పల్లెటూరు. నా చిన్నప్పుడు పాముకాట్లతో మనుషులు చచ్చిపోవడం చూసి మనసు వికలమయ్యేది. ఓరోజు చీకటిపడ్డాక పొలం నుంచి తిరిగొస్తున్న నాన్న.. తాచుపాము కాటేసి చనిపోయాడు. ఆరోజే నిర్ణయించుకున్నాను. విషసర్పాల బారిన పడిన ప్రజల్ని రక్షించడానికి పనికొచ్చే చదువే చదవాలని. అందుకే టాక్సికాలజీ కోర్స్‌ చేశాను. ఏ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లినా నాకు ఉద్యోగం దొరుకుతుంది. కానీ రంగన్‌ని వదిలి వెళ్లలేని పరిస్థితి.

నగేష్‌ ఎంతటి దుర్మార్గుడో నాకు తెలుసు. పట్టుకొచ్చిన పాముల్ని నాలుగు వారాల తర్వాత మళ్లా అడవిలో వదిలేయాలి. వారానికి ఒక్కసారే వాటినుంచి విషం పిండాలి. నగేష్‌ ఈ నిబంధనల్ని ఖాతరు చేయడు. ఈ ల్యాబ్‌లో ఉన్న పాములు చనిపోయేవరకు ఇక్కడ బందీలుగా ఉండాల్సిందే. ఇరుల కోఆపరేటివ్‌ సొసైటీ నుంచి విషాన్ని కొంటే లాభాలు తగ్గుతాయని, కొంతమంది ఇరుల కుర్రవాళ్లని ప్రలోభపెట్టి, వాళ్లు పట్టుకొచ్చిన పాముల్ని తక్కువ ధర చెల్లించి కొంటాడు.

నగేష్‌ నన్ను వేధిస్తున్నాడని రంగన్‌కి తెలిస్తే తట్టుకోలేడు.. షిఫా కేవలం కొరకబోయింది. రంగన్‌ వాడ్ని తన్నకుండా వదిలిపెట్టడు. అందుకే నగేష్‌ని నేనే ధైర్యంగా ఎదుర్కోడానికి సిద్ధపడ్డాను.

“రేపు ఆదివారం కదా. మనం ముగ్గురం అడవిలోకి షికారుకెళ్దామని నగేష్‌ అంటున్నాడు. వెళ్దామా?”.. ఆర్నెల్ల క్రితం ఓ శనివారం రోజు అడిగాడు రంగన్‌.

“అడవిలోకి షికారుకా? మనం చూడాల్సింది ఏం మిగిలుందని?” అన్నాను.

“అడవి మధ్యలో సరస్సు ఉందట కదా. అక్కడికి దుప్పులు, జింకలు నీళ్లు తాగడానికి వస్తాయట. అక్కడ రెండు గంటలు గడిపి, చీకటి పడేలోపల తిరిగొచ్చేద్దాం అంటున్నాడు”

సరస్సు గురించి నేనూ విన్నాను కానీ ఎప్పుడూ వెళ్లలేదు. అమ్మకు నిన్నటి నుండి జ్వరం. లేచి పనులు చేసుకునే స్థితిలో లేదు.
“నేను రాలేను. నేను లేకుండా నువ్వు కూడా వెళ్లొద్దు” అని చెప్పాను.

ఆదివారం ఉదయం తొమ్మిదింటికి అడవిలోకి బయల్దేరుతున్నట్టు రంగన్‌ ఫోన్‌ చేసి చెప్పాడు.
‘వెళ్లొద్దన్నాగా’ అంటూ మెసేజ్‌ చేశాను.
‘బాగా బలవంతపెడితేనూ.. తప్పలేదు’ అంటూ మెసేజ్‌ పంపాడు.
మధ్యాహ్నం పన్నెండున్నరకు ఫోన్‌ చేసి..

“ఇక్కడెంత బావుందో తెలుసా? నువ్వో అందమైన అనుభవాన్ని మిస్‌ అయ్యావు” అన్నాడు.
మూడింటికి నగేష్‌ నుంచి ఫోనొచ్చింది. నేను రిసీవ్‌ చేసుకోలేదు. మరో రెండుసార్లు మోగి ఆగిపోయింది.
కొద్దిసేపటి తర్వాత రంగన్‌ ఫోన్‌ నుంచి కాల్‌ వచ్చింది.

“హలో రంగన్‌..” అన్నాను.

నగేష్‌ గొంతు వినిపించింది.

“నువ్వు నా ఫోన్‌ ఎత్తడం లేదని రంగన్‌ ఫోన్‌ నుంచి చేస్తున్నా. రంగన్‌ని పాము కరిచింది” అన్నాడు.
“పాము కరిచిందా?” అంటూ పెద్దగా అరిచాను.

“నేనిప్పుడే ఇన్‌స్టిట్యూట్‌కి బయల్దేరుతున్నా. మీరొచ్చే లోపల యాంటీవెనం ఇంజెక్షన్‌ని తయారుగా ఉంచుతాను” అన్నాను.
యాంటీవెనంని భద్రపరిచే లాకర్‌ గది తెర్చుకోవాలంటే నాది కానీ, నగేష్‌దికానీ బొటనవేలి ముద్ర అవసరం. మేము తయారుచేసేది పాలీవలెంట్‌ యాంటీవెనం. నాగుపాము, కట్లపాము, రక్తపింజరి, ఇసుక పింజరి అనే నాలుగు రకాల పాము విషాలకు విరుగుడుగా పనిచేస్తుంది. వీటిలో ఏ పాము కరిచినా ప్రాణం పోవడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. నేను లేచి కారు తాళాలు తీసుకుంటున్న సమయంలో..

“రంగన్‌ని కరిచింది కింగ్‌ కోబ్రా. పొదల్లో ఎక్కడో నక్కి ఉండింది. రంగన్‌ పాస్‌ పోసుకోడానికి ఆ పొదల్లోకి వెళ్లాడు. పొరపాటున దాన్ని తొక్కి ఉంటాడు” అని నగేష్‌ అనడం వినిపించింది.
ఆ మాటలు నా గుండెల్లో అణుబాంబుల్లా పేలాయి.

కళ్లు తిరిగాయి. ఒళ్లు తూలింది. పడిపోకుండా గోడని గట్టిగా పట్టుకున్నాను. కింగ్‌ కోబ్రా చాలా ఎక్కువ పరిమాణంలో విషాన్ని శరీరంలోకి పంప్‌ చేస్తుంది. మనిషి అరగంటలోనే చనిపోతాడు. ఎంత బలవంతుడైనా గంటకు మించి బతకడు. మొండిధైర్యంతో ల్యాబ్‌ని సమీపించాను. నేను చేరుకున్న అరగంట తర్వాత.. రంగన్‌ శరీరాన్ని మోసుకుంటూ లోపలికొచ్చాడు నగేష్‌. అతన్ని టేబుల్‌ మీద పడుకోబెట్టడమే ఆలస్యం.. వేగంగా వెళ్లి, అతని నాడిని పరీక్షించాను. నాడి అందలేదు. శ్వాస ఆడటం లేదు. కన్నీళ్లతో తలెత్తి నగేష్‌ వైపు చూశాను.

“సారీ వినీల.. దారిలోనే ప్రాణాలు పోయాయి” అన్నాడు.
నాలో సుడులు తిరుగుతూ ఎన్ని అనుమానాలో.. రంగన్‌ ఇరుల తెగకు చెందినవాడు. పాముల్ని పట్టుకునే టెక్నిక్‌లు, వాటి నుంచి రక్షించుకునే మెలకువలు వాళ్ల రక్తంలోనే జీర్ణించుకుని ఉంటాయి. పాము శరీరం నుంచి వచ్చే వాసనని పదడుగుల దూరం నుంచే పసిగట్టి, అది ఏ జాతిపామో చెప్పగలరు. కాళ్ల దగ్గరున్న పాము కాటేసే లోపల.. ఒడుపుగా తప్పుకోగల నేర్పరి రంగన్‌. అంతవేగంగా స్పందిస్తాడు. అలాంటిది కింగ్‌ కోబ్రా మీద కాలేసి తొక్కుతాడా? నేను నమ్మను. అదను చూసి, నా రంగన్‌ని కాటేసి చంపింది వీడే. కింగ్‌ కోబ్రా విషాన్ని తనతోపాటు తీసుకెళ్లి ఉంటాడు. కానీ, దాన్ని నిరూపించడానికి నా దగ్గర ఆధారాలేమీ లేవు. రంగన్‌ చనిపోయాక నగేష్‌ ఆగడాలు మరింత పెరిగాయి. పెళ్లి చేసుకుందామని బలవంత పెడుతున్నాడు. బెదిరిస్తున్నాడు.

రంగన్‌ చనిపోయి ఆరు నెలలు.. ఇప్పుడు రంగన్‌ స్థానంలో ఉమేష్‌ పనిచేస్తున్నాడు. వయసు పాతికకు మించి ఉండదు. పాముల్ని హ్యాండిల్‌ చేయడంలో అనుభవం తక్కువ. దానికి తోడు కంగారు, భయం ఎక్కువ..

అతను పాముని బైటికి తీసి, విషం పిండబోయే సమయంలో కొద్దిగా భయపెడితే చాలు.. పాముని వదిలేస్తాడు. నగేష్‌ కొన్నిసార్లు అతని పక్కన నిలబడి మాట్లాడుతుంటాడు. ఆ సమయంలో ఉమేష్‌ని కంగారు పెడితే చాలు. పాముని నగేష్‌పైకి విసిరేసినా విసిరేస్తాడు. అలా చాలాసార్లు ప్రయత్నించబోయి.. అదను దొరక్క ఊరకుండిపోయాను.
ఓరోజు ఉమేష్‌ నాగుపాముని పట్టుకుని, విషం తీయబోతున్నప్పుడు.. అది బలంగా కదలడంతో పట్టుజారింది. అతనికి కొద్దిగా ఎడంగా నిలబడి ఏదో మాట్లాడుతున్న నగేష్‌ కాళ్ల సమీపంలో పడిన పాము.. కోపంతో పడగ విప్పి అతని పిక్క మీద కాటువేసింది. దాన్నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అతను పెద్దగా అరుస్తూ వెనక్కి విరుచుకుపడ్డాడు.
గుర్రాల నుంచి రక్తం తీయడానికి వెళ్లబోతున్న నేను.. ఆ దృశ్యం చూసి అక్కడే నిలబడిపోయాను. కాగల కార్యం గంధర్వులే తీర్చడమంటే ఇదేకదా అనుకున్నాను. అయినా లాభం లేదు. నగేష్‌ లాకర్‌ రూంకి వెళ్లి యాంటీవెనం ఇంజెక్షన్‌ తీసుకుంటే చాలు. బతికిపోతాడు. దాన్నెలా ఆపాలో అర్థం కాలేదు.

ఉమేష్‌ నాగుపాముని గ్లాస్‌ కంటెయినర్లో పెట్టి..

“సారీ సర్‌!” అంటూ నగేష్‌ని భుజం పట్టుకుని లేపే ప్రయత్నం చేస్తున్నాడు.
నగేష్‌ కొద్దిగా లేచి, కాలు పట్టుకుని బాధతో అరుస్తూ కూలబడిపోయి..

“కాలు బెణికింది. చాలా నొప్పిగా ఉంది. నడవలేను” అంటూ నా వైపు చూసి..
“తొందరగా యాంటీవెనం ఇంజెక్షన్‌ చేయి” అన్నాడు.

పగతో రగులుతున్న కళ్లతో కింద పడిఉన్న నగేష్‌ వైపు చూశాను. అతను శ్వాసని బరువుగా తీసుకుంటూ, నావైపు దీనంగా చూస్తున్నాడు.

‘చావు.. గిలగిలా కొట్టుకుని చావు. నా రంగన్‌ చనిపోయినట్టే నువ్వు కూడా హింసపడి చావాలి’ అని మనసులో అనుకున్నాను.

“ఇంజెక్షన్‌ ఇవ్వండి మేడం” అంటూ ఉమేష్‌ పదేపదే వేడుకుంటున్నాడు.

నా కళ్లముందు మా నాన్న బాధతో విలవిల్లాడుతున్న దృశ్యం కనిపించింది. అప్పటివరకు ఏదో ట్రాన్స్‌లో ఉన్న నేను.. స్పృహలోకొచ్చాను. మా నాన్న చనిపోయినట్టు, పాముకాటుతో ఎవరూ చనిపోకూడదన్న దృఢనిశ్చయంతో కదా టాక్సికాలజీ చేశాను.

విషంతో నిండిన పాములే ప్రాణాలు కాపాడే యాంటీవెనం కోసం శ్రమిస్తున్న సంస్థలో కదా పనిచేస్తున్నాను. నాలో అతన్ని చంపాలన్న కసిలోంచి పుట్టుకొస్తున్న విషాన్ని, యాంటీవెనం కింద మార్చి.. అమృతాన్ని కదా పంచాలి. అలా అనుకోగానే వెన్నుమీద ఎవరో గట్టిగా చరిచినట్టు ఉలిక్కి పడ్డాను.

లాకర్‌ రూం వైపు పరుగెత్తి, యాంటీవెనం ఇంజెక్షన్‌ రెడీ చేసి.. నగేష్‌కి ఇంజెక్ట్‌ చేశాను. మూతలు పడబోతున్న అతని కళ్లు అరగంట తర్వాత తెరుచుకున్నాయి.

ఇంకా ఆ సంస్థలో పని చేయాల్సిన అవసరం ఏదీ కనిపించలేదు. రాజీనామా లేఖని టేబుల్‌ మీద పెట్టి బైటికొచ్చేశాను.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment