Sunday, December 28, 2025

 *****            
                     *హంతకుడతడే*
                      ==========
                   (నేర పరిశోధన కధ)

రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్


(ఇది నేను రాసిన మొట్టమొదటి  క్రైమ్ కథ. 2019లో నేను రాసిన ఈ కథ, 2020 ఆగస్టు నెలలో ప్రతిలిపి అనే అంతర్జాల పత్రికలో ప్రచురితమైనది.  

ఈ కథ నాటకం రూపంలో ది. 19.11.2023 న టోరీ అనే అంతర్జాతీయ రేడియో స్టేషన్ లో ప్రసారం కూడా అయ్యింది)

*****

"హలో, హలో గొల్లపాలెం పోలీసు స్టేషనాండీ? నేను జగన్నాధగిరి జమిందార్ రంగబాబు గారి మేనేజరు రామ్మూర్తిని మాట్లాడుతున్నా. మీరు ఎస్సై శేషగిరి గారేనా?"

"లేదండీ. ఆయన ట్రైనింగ్ కి వెళ్ళారు. నేను యస్సై దివాకర్ ని. నిన్ననే ఛార్జ్ తీసుకున్నా. ఏం కావాలో చెప్పండి".

"సార్, మా అయ్యగారిని ఎవరో హత్య చేసారండీ. వచ్చిన జనాన్ని కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది. మీరు త్వరగా రావాలి సార్" వణుకుతున్న గొంతుతో చెప్పేడు రామ్మూర్తి.

"సరే, ఇప్పుడే బయలుదేరుతున్నా. ఈలోగా ఎవరినీ మృతదేహాన్ని తాకకుండా జాగ్రత్తగా చూడండి"

"ఎందుకైనా మంచిదని, ఆ గది తలుపులు కూడా మూసేసాం సార్. మీ రాక కోసమే ఎదురు చూస్తూంటాం సార్" చెప్పేడు రామ్మూర్తి.

     *****     *****     *****     *****

"రండి సార్. ఇందాకా ఫోన్ చేసింది నేనే" అంటూ పోలీసు జీపు లోంచి దిగుతున్న ఎస్సై బృందాన్ని గేటు వద్ద ఎదురేగి లోపలికి తీసుకుని వెళ్ళాడు, రామ్మూర్తి.

ఆ రెండతస్తుల బిల్డింగ్ వైపు ఓ సారి చూసి, 
"చూడండి రామ్మూర్తి గారూ, ఇంత పెద్ద ఇంట్లో ఎవరెవరు ఉంటారు ?" రామ్మూర్తి వెనకే మెట్లు ఎక్కుతూ అడిగాడు ఎస్సై.

"ఈ కింద వాటాలో అయ్యగారి ఏకైక పుత్రుడు రఘుబాబు ఉంటారు. నేను, వాచ్ మెన్ వీర్రాజు, వంటపనీ ఇంటి పనీ చేసే వరలక్ష్మి మొదలైన వాళ్ళందరం కుటుంబాలతో కలిసి వెనకవైపున్న క్వార్టర్స్ లో ఉంటా..ఇలా రండి బాబూ, ఇదిగో ఈ గదిలోనే అయ్యగారి హత్య జరిగింది" అని ఆ గది తలపులు తీసేడు రామ్మూర్తి.

     *****     *****     *****     *****

పాతకాలం నాటి పెద్దమంచం మీద వెల్లకిలా పడివుంది సుమారు ఓ అరవై ఏళ్ళున్న జమిందార్ గారి మృతదేహం. గుండెల్లో దిగబడి ఉంది కత్తి. శవాన్ని, అది పడివున్న తీరును, ఆ గది పరిసరాలను, తన పోలీసు కళ్ళతో క్షుణ్ణంగా పరిశీలించిన దివాకర్, మృతదేహానికి ఫోటోలు తీసి, ఆ గదిలో అన్ని వస్తువుల మీదా ఉన్న వేలు ముద్రలు సేకరించమని తన బృందానికి పురమాయించి, 

"రామ్మూర్తి గారూ, ఇంట్లో ఉన్న అందరినీ ఈ గదిలోకి రమ్మనండి. వారి అందరి వేలి ముద్రలు కూడా తీసుకోవాలి" అని చెప్పి, ఓ సారి గదిని పరిశీలించసాగేడు.

మృతదేహం ఉన్న మంచానికి ఎడమవైపు ఓ టీపాయి ఉంది. అందిమీద ఓ ప్లాస్టిక్ బుట్టలో ఓ మూడు ఆపిల్స్, ఓ ద్రాక్షపళ్ళ గుత్తి, ఓ మంచినీళ్ల చెంబు ఉన్నాయి. ఆ టీపాయి పక్కనే ఓ స్టూలు ఉంది.

ఇక మంచానికి కుడివైపు, ఓ పెద్ద చెక్క టేబుల్ ఉంది. దానిమీద నిన్నటి దినపత్రికలు రెండు, ఓ పేపర్ వెయిట్, ఓ బాల్ పెన్ను, భగవద్గీత పుస్తకం, ఓ రెండు పేజీలు ఉన్న లెటర్ హెడ్ బుక్కు ఉన్నాయి. ఆ టేబుల్ సమీపంలో ఓ పెద్ద చెక్క స్టూలు ఉంది.

వాటిలో అనుమానస్పద వస్తువులు ఏమీ లేవని నిర్ణయించుకుని, ఎందుకైనా మంచిదని, వాటి మీద కూడా వేలిముద్రలు తీసిన తరువాత వాటిని స్టేషన్ కి తరలించి జాగ్రత్త చేయమని పురమాయించాడు దివాకర్.

     *****     *****     *****     *****

"సార్, మీరు చెప్పినట్లుగానే అందరినీ తీసుకుని వచ్చా. వీరు మా జమిందార్ గారి ఏకైక సంతానం రఘుబాబు" పరిచయం చేయసాగేడు రామ్మూర్తి, ఓ నలభై ఏళ్ల వ్యక్తిని.

"సారీ రఘు గారూ, మిమ్మల్ని ఇలా కలవాల్సి వస్తుందనుకోలేదు. ఈరోజో, రేపో వచ్చి నాన్న గారిని కలుద్దామనుకున్నా. ఈ లోగా ఇలా !  సరే,  మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది ?" 

"సార్, నేను ప్రతీరోజూ సాయంత్రం, క్లబ్ కి వెళ్ళేముందు,  నాన్నగారి గదిలోకి వెళ్లి, రాత్రి మందులు వేసుకొని, పెందరాళే పడుకోమని జాగ్రత్తలు చెప్పి, తరువాత కారులో కాకినాడ వెళ్లి, అక్కడ క్లబ్ లో పదకొండు గంటల వరకూ ఉండి వస్తూ ఉంటా. రోజూలాగే, నిన్న కూడా అలాగే వెళ్లి, రాత్రి పన్నెండు గంటలకు సిటీ నుంచి వచ్చేను. రాత్రి పడుకున్న నాకు ఉదయం రామ్మూర్తి గారు,  వీర్రాజు, వరలక్ష్మిల అరుపులతో మెలుకువ వచ్చింది. నిన్నటి చూపే ఆఖరి చూపు ఔతుందనుకోలేదు సార్ !" భోరున ఏడవసాగేడు రఘు.

"సరే, అసలు మృతదేహాన్ని ముందు చూసింది ఎవరు ?'

"నేనేనయ్యా, ప్రతీరోజూ ఉదయం ఏడు గంటలకు పెద్దసారుకు కాఫీ పట్టుకుని వస్తాను. ఈరోజు కూడా అలాగే వచ్చేను. తలుపు దగ్గరకు వేసిఉంది. తీసి చూస్తే సారు మంచమీద….." వస్తున్న కన్నీటిని ఆపుకోలేక ఏడుస్తూ ఉండిపోయింది వరలక్ష్మి.

"వీర్రాజూ, నిన్నటి రోజున జమిందార్ గారిని కలవడానికి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చేరా ?" అడిగాడు ఎస్సై దివాకర్.

"కొత్త వ్యక్తులు ఎవరూ రాలేదు బాబూ, కానీ తరచూ పెద్దయ్య గారిని కలవాడానికి వచ్చే రాజేషు గారు నిన్న రాత్రి వచ్చేరు." 

"ఈ రాజేష్ ఎవరండీ?" రామ్మూర్తిని అడిగాడు దివాకర్.

"మా పెద్దయ్య గారి స్నేహితుని కుమారుడు. ఆయనంటే అయ్యగారికి చాలా ఇష్టం.  మా రఘు బాబుగారూ, రాజేష్ గారూ ఇద్దరూ రెండు కళ్ళు, మా పెద్దయ్య గారికి."

"సరే, వీర్రాజూ, ఆ రాజేష్ ఏ టైం లో వచ్చి వెళ్ళారు?" 

"రాత్రి ఎనిమిది గంటలకు వచ్చేరు బాబూ. సుమారు ఓ గంట తరువాత తిరిగి వెళ్లి పోయారు. ఆ, జ్ఞాపకం వచ్చింది బాబూ, ...వెళ్ళిపోతూ, 'వీర్రాజూ! పెద్దయ్య గారికి ఆపిల్ ముక్కలు కట్ చేసి ఇచ్చాను. రెండు మూడు ముక్కలు తిన్నారు. మందులు వేసుకుని,  పడుకుంటానన్నారు. అలాగే, రాత్రి పది గంటలకు తాగే పాలు తీసుకుని రావద్దని వరలక్ష్మికి చెప్పమన్నారు' అని చెప్పి వెళ్లి పోయారు సార్. నేను ఈ సంగతి వరలక్ష్మి కి కూడా చెప్పాను సార్" చెప్పాడు వీర్రాజు కొంచెం భయంతో కూడిన స్వరంతో.

"మరి ఆ తరువాత ఎవరూ రాలేదా ?"

"వచ్చేరు బాబూ. అర్ధరాత్రి ఎప్పడో రఘుబాబు గారు వచ్చేరు. ఆరిక్కూడా తలుపు తీసి, రాజేష్ బాబు గారు వచ్చి, చెప్పి వెళ్లిన సంగతులన్నీ  చెప్పా"

"రఘు గారూ, మీకు ఎవరిమీదైనా అనుమానం ఉందా ??" అడిగాడు ఎస్సై దివాకర్.

"ఎవరిమీద లేదు కానీ, వీర్రాజు చెప్పిన సంగతులు విన్న తరువాత ఆ రాజేష్ విషయమే కొంచెం అనుమానాస్పదంగా ఉంది సార్." 

"రామ్మూర్తి గారూ, మరి రాజేష్ ని తీసుకు రాలేదేం?" అడిగాడు ఎస్సై.

"ఆయన ఇక్కడ ఉండరు సార్. దాక్షారామం లో ఉంటారు. అక్కడే ఓ అర్బన్ బేంకులో పని చేస్తారు. కబురు పెట్టాం సార్. ఇంట్లో లేరుట. ఏదో పనిమీద ఉదయమే బయలుదేరి కోటిపల్లి వెళ్ళేరుట" చెప్పాడు రామ్మూర్తి. 

"ఓకే రఘు గారూ, మీ అనుమానం నిజమే కావచ్చు. అంతా విచారణలో తేలుతుంది. మీరు సాయంత్రం లోగా ఓ సారి స్టేషన్ కి వచ్చి రిపోర్ట్ మీద సంతకం పెట్టాల్సి ఉంటుంది. రామ్మూర్తి గారూ, ఆ రాజేష్ గారిని సాయంత్రం లోగా స్టేషన్ కి వచ్చి వేలిముద్రలు ఇవ్వాలని, లేకపోతే మా డ్యూటీ మేము చేస్తాం అని వాళ్ళింట్లో చెప్పండి. ఓకే కానిస్టేబుల్స్, వీళ్ళందరి వేలుముద్రలు తీసుకుని, నేను చెప్పిన ఆ వస్తువులు తీసుకుని, ఈ రూమ్ కు సీల్ వేసి స్టేషన్ కు రండి" అని పురమాయించి అక్కడి నుండి బయలుదేరాడు ఎస్సై.

     *****     *****     *****     *****

మూడు రోజుల తరువాత, స్టేషన్ లో కూర్చుని పాత కేసుల బాపతు ఫైల్స్ చూస్తున్న ఎస్సై వద్దకు హెడ్ కానిస్టేబుల్ వచ్చి,  

"సార్, జమిందార్ గారి హత్య తాలూకు ఫింగర్ ప్రింట్ రిపోర్టులు, పోస్ట్ మార్టం రిపోర్టు కూడా వచ్చాయి సార్" అంటూ కవ‌ర్లు చేతిలో పెట్టాడు.

"సరే, మీరు చూసేరా ? ఏవైనా విశేషాలు ఉన్నాయా వాటిలో ??"

"పోస్ట్ మార్టం రిపోర్టు లో కేవలం గుండెల్లో కత్తి పోటే కాకుండా, మెడని ఎవరో తాడుతో గట్టిగా బిగించినట్లు కమిలిపోయిఉందిట. ఇక వేలుముద్రలు సంభందించి, మెయిన్ డోర్ మీద వేలు ముద్రలు చాలా మందివి ఉన్నాయిట. కానీ రాజేష్ గారి వేలు ముద్రలు హతుని గుండెల్లో ఉన్న కత్తి మీద, ఆపిల్స్ మీద, ఎడమవైపు ఉన్న స్టూలు మీద ఉన్న వాటితో సరిపొయాయిట. పనిమనిషి వేలు ముద్రలు మంచి నీళ్లు చెంబు మీదా, ఇక జమిందార్ గారి అబ్బాయి రఘుబాబు గారి వేలు ముద్రలు కుడి వైపు ఉన్న చెక్క స్టూలు మీద, పేపర్ వెయిట్ మీద మాత్రం ఉన్నాయిట. కొత్త విషయాలు ఏమైనా తెలుస్తాయేమో మీరు కూడా ఓ సారి చూడండి సార్" అంటూ కవర్ టేబుల్ మీద పెట్టాడు.

"సరే చూస్తాను. ఈ లోగా మనం అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు కూడా నా టేబుల్ మీద పెట్టండి. ఓ రెండు రోజుల్లో కేసు క్లోజ్ చేసెయ్యాలి. పైనుంచి ప్రెషర్ వచ్చేస్తోంది" అంటూ రిపోర్ట్స్ చదవడంలో లీనమయ్యాడు ఎస్సై దివాకర్.

ఆ రిపోర్టులు, స్వాధీనం చేసుకున్న ఆ వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించిన దివాకర్ బుర్రలో ఏదో తళుక్కున మెరిసింది.

వెంటనే తన పరివారంతో జీపులో ఆఘమేఘాల మీద బయలుదేరాడు, మరికొన్ని విషయాలు నిర్ధారణ చేసుకోవడానికి మరియు నిందితులను అరెస్ట్ చేయడానికి.

     *****     *****     *****     *****

ఉదయం 10 గం. 45 ని.లు

స్టేషన్ నుంచి బయలుదేరిన జీప్ పావుగంటలో ద్రాక్షారామం లోని ఒక బేంకు ముందు ఆగింది. నేరుగా మేనేజర్ దామోదర్ గదిలోకి వెళ్ళి, తనని పరిచయం చేసుకున్న ఎస్సై దివాకర్,

"మీకు తెలుసుగా, జమిందార్ రంగబాబు గారి హత్య గురించి !  ఆ విషయమై మీ వద్దనుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. రాజేష్ మీద మీ అభిప్రాయం ఏమిటి ? అతని వ్యక్తిత్వం గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి".

"ఔను సార్ నాకూ తెలిసింది. అంతేకాదు మా రాజేష్ కూడా అనుమానితులలో ఉన్నాడని తెలిసింది. నేను ఈ బ్రాంచి కి వచ్చి రెండేళ్ల య్యింది.సార్, నాకు తెలిసి అతని మీద ఎటువంటి కంప్లైంట్స్ లేవు. ఈ రోజు కూడా అతను డ్యూటీ లో భాగంగా పక్క ఊళ్ళో లోన్ రికవరీ కోసం వెళ్ళాడు" చెప్పాడు దామోదర్.

"ఓకే, జమిందార్ రంగబాబు గారికి ఈ బేంకులో అకౌంట్ ఉందా ?"

"ఉంది సార్. ఆయన పేరున ఓ లాకర్ కూడా ఉంది."

"లాకర్ తాళాలు ఎవరి వద్ద ఉంటాయ్"

"నాకు తెలిసి, జమిందార్ గారి వద్దే ఉంటాయి."

"ఈ మధ్యలో ఎపుడైనా లాకర్ తీసేరా ?"

"రెండు నెలల నుంచి ఎవరూ ఓపెన్ చేయలేదు.ఒక  కీ నా వద్దే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం చెప్పగలను."

"ఓ సారి ఆ లాకర్కు సంభందించిన కాయితాలు చూపిస్తారా ??"

"ఓ, తప్పకుండా" అంటూ ఓ ఫైలు చూపించారు దామోదర్. 

ఆ ఫైలు క్షుణ్ణంగా పరిశీలించి, తిరిగి ఇస్తూ,
"ఓకే దామోదర్ గారూ, అవసరమైతే మళ్ళీ వస్తాం. థాంక్యూ" అంటూ బయటకి నడిచేడు ఎస్సై దివాకర్.

     *****     *****     *****     *****

ఉదయం 11 గం. 15 ని.లు

అక్కడి నుంచి బయలుదేరిన జీప్ నాలుగు వీధుల అవతల ఉన్న రిటైర్డ్ టీచర్ సత్యమూర్తి గారి ఇంటి ముందు ఆగింది. పోలీసు జీప్ చూసిన సత్యమూర్తి గారు, వారికి ఎదురెళ్లి, భయంభయంగా,

"ఎస్సై గారూ, మా రాజేష్ ని అరెస్టు చేయడానికి వచ్చేరా సార్. మా వాడు అలాంటి వాడు కాదు. చాలా క్రమశిక్షణలో పెంచాను" అంటూ దివాకర్ చేతులు పట్టుకున్నారు.

"సత్యమూర్తి గారూ, మీరు సహకరిస్తే మీ వాడు నిర్దోషిగా బయటపడతాడు. ముందు ఇది చెప్పండి, మీ రాజేషుకు, జమిందార్ గారికి ఎలా పరిచయం? "

"రంగబాబు, నేనూ బాల్యం నుంచి స్నేహితులం సార్. ఈ మధ్య కాలంలో వాళ్ళబ్బాయి రఘుబాబు వ్యసనాలకు అలవాటు పడడం, మా వాడు బుద్ధిగా ఉండడం చూసి, మెచ్చుకుని, తరచూ మా వాడిని తన ఇంటికి పంపమని నన్ను కూడా కోరేవాడు. కాదనలేక నేనూ పంపేవాడిని. అంతే తప్ప ఆయన్ని చంపేటంత నీచుడు కాదు సార్ మా రాజేష్" గద్గధ స్వరంతో చెప్పారు.

"సరే సార్, ఆధారాలు చూస్తే అన్నీ కూడా మీ వాడే హంతకుడు అని నిరూపించేలా ఉన్నాయి. ఒక రెండు రోజుల్లో మీ వాడిని అరెస్ట్ చేయక తప్పదు. ఐ యామ్ సారీ" అంటూ లేచాడు ఎస్సై.

"సార్, ఒక్క నిమిషం అలా  కూర్చోండి" అంటూ భార్య, కోడలు ఉన్న గది తలుపులు దగ్గరకు వేసి వచ్చి, చెప్పడం మొదలెట్టారు సత్యమూర్తి గారు.

     *****     *****     *****     *****

మధ్యాహ్నం 12 గం. 45 ని.లు

గంట తర్వాత సత్యమూర్తి గారి ఇంటి నుంచి బయలుదేరిన జీప్, పది నిమిషాల తరువాత నాలుగు మైళ్ల దూరంలో ఉన్న రామచంద్రపురం లోని అడ్వకేట్ రమణరావు గారి ఇంటి ముందు ఆగింది.

"రమణరావు గారూ, నమస్తే నేను కొత్తగా గొల్లపాలెం ఎస్సైగా ఛార్జ్ తీసుకున్న ఎస్సై దివాకర్ ని. మీరు జమిందార్ రంగబాబు గారి ఫామిలీ లాయర్ కాబట్టి, ఆయన హత్య కేసులో కొన్ని వివరాలు మీ నుంచి తెలుసుకోవడానికి వచ్చేను." 

"ఔనండీ, ఓ  కేసు గురించి హైదరాబాద్ లో నాలుగు రోజులు ఉండి, ఈ రోజు ఉదయమే వచ్చేను. చాలా దారుణం. అనుమానితులు ఎవరినైనా కష్టడీలోకి తీసుకున్నరా ?" అడిగారు రమణరావు.

"లేదు సార్, ఇంతవరకూ ఎవరినీ కష్టడీలోకి తీసుకోలేదు. అనుమానం మటుకు ముగ్గురు మీద ఉంది. కేసు త్వరగా పూర్తి చేయమని పైనుంచి ప్రెషర్ వస్తోంది సార్. సరేకానీ,  ఈ మధ్య కాలంలో మీరూ, జమిందార్ గారూ కలుసుకోవడం జరిగిందా ?"

"సుమారు మూడు వారాల క్రితం అనుకుంటా, ఓ రోజు ఆయనే డైరెక్ట్ గా మా ఆఫీసుకు వచ్చేరు."

"ఔనా, ఆయన దేని గురించి మాట్లాడేరు సార్ ? " అతృతగా అడిగాడు దివాకర్.

"ఆయన దేని గురించి వచ్చేరంటే….." చెప్పడం మొదలెట్టారు రమణరావు గారు.

     *****     *****     *****     *****

సాయంత్రం 04 గం. 15 ని.

జమిందార్ గారి ఇంటి ముందు ఆగిన పోలీసు జీపును చూసి, పరుగెత్తికొని వచ్చాడు రామ్మూర్తి.

"రామ్మూర్తి గారూ, ఓ సారి జమిందార్ గారి ఆఫీసు గదిని పరిశీలించాలి" చెప్పాడు దివాకర్.

"మేడమీదకి రండి సార్, ఆయన పడకగది పక్కన ఉన్నదే ఆఫీసు గది" అంటూ దోవ తీసాడు.

ఆయనని అనుసరిస్తూ, "ఫోర్ నాట్ త్రీ, మీరు మెయిన్ గేటు వద్ద ఉండి ఎవరినీ బయటకు పోకుండా చూడండి" అని ఆర్డర్ వేసి రామ్మూర్తిని అనుసరించాడు ఎస్సై దివాకర్.

ఆఫీసు రూములో, టేబుల్ మీద ఉన్న ఫైల్స్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు ఎస్సై. ఓ ఫైలులో చేతి రాతతో ఉన్న ఓ లెటర్ కాపీని చూస్తున్నాడు. 

"సార్, మా అయ్యగారు ఇంట్లో ఉన్నప్పుడు ఏమైనా ముఖ్యమైన ఉత్తరాలు రాయవలసి వస్తే, స్వదస్తూరితో ఆయన లెటర్ హెడ్ మీద రాసి, వాటి కార్బన్ కాపీలు ఇలా ఫైలు చేసుకుంటారు. రిఫరెన్స్ గా ఉంటాయని" వివరించాడు రామ్మూర్తి.

"ఏంటి ఎస్సై గారూ, ఇంకా ఆ రాజేష్ ని అరెస్టు చేయలేదుట. ఇలా వదిలేస్తే పారిపోతాడు సార్. అప్పుడు వెతకలేక చావాలి" అంటూ ఆ గదిలోకి ప్రవేశించాడు రఘుబాబు.

"ఆ పని మీదే ఉన్నాం, మిష్టర్ రఘూ, అతనే హంతకుడనడానికి ఆధారాలు దొరకడం లేదు."

"గుండెలో దించిన కత్తిమీద ఉన్న వేలు ముద్రలు అతనివేగా ??" ఎస్సై ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ అడిగాడు రఘు.

"ఔనా ? మీకెలా తెలుసు ?"

"దీనికి పెద్ద ఆలోచన ఏముంది ఇనస్పెక్టర్, ఆపిల్ పండు కత్తితో కోసి ముక్కలు నాన్నగారికి పెట్టింది అతను. అదే కత్తితో హత్య చేసాడు" సింపుల్ గా చెప్పాడు 

"కానీ, అతనితో పాటు అస్పష్టంగా వేరొకరి వేలు ముద్రలు కూడా ఉన్నయి మిష్టర్ రఘూ. కానీ, మీరు కొంచెం కోపరేట్ చేస్తే హంతకుడ్ని పట్టేస్తాం !"

"చెప్పండి, నా నుంచి మీకు ఎలాంటి సహాయం కావాలి ?? నాన్న గారి ఆత్మ శాంతించడానికి ఏమీ చేయాలన్నా చేస్తాను" అన్నాడు కొంచెం ముందుకు వంగి.

"అయితే మీ వద్ద ఉన్న ఆ నైలాన్ తాడు, లెటర్ ఇవ్వండి. తక్షణమే నిందితుడ్ని అరెస్టు చేస్తాం" సౌమ్యంగా అడిగాడు ఎస్సై దివాకర్.

"ఏ తాడూ, ఏ లెటరూ ? నా దగ్గర ఎందుకు ఉంటాయి ?ఏం మాట్లాడుతున్నారు ?" అంటూ విసురుగా కుర్చీలోంచి లేచాడు రఘు.

"సీ మిష్టర్, నువ్వు ఇస్తే ఓకే. లేదంటే మా పని మేము చేస్తాం,  అండర్ స్టాండ్" అంటూ గర్జించాడు ఎస్సై.

విధిలేక అవి తీసుకుని వచ్చి, ఎస్సై దివాకర్ కు అందించి తల వంచుకుని నిలబడ్డాడు రఘు.

     *****     *****     *****     *****

సాయంత్రం 6 గంటలు

"వాట్, మిష్టర్ దివాకర్ ! తొందరగా జమిందార్ గారిని హత్య చేసిన హంతకుడిని పట్టుకోమంటే, నువ్వు ఏకంగా వాళ్ళ అబ్బాయినే తీసుకొచ్చి లోపలేసావుట?" బూట్లు టకటక లాడించు కుంటూ, స్టేషన్ లోపలికి వస్తూ అడిగారు కాకినాడ నుంచి వచ్చిన డీయస్పీ ప్రభాకరరావు.

"లేదు సార్, పక్కా ఆధారాలతోనే అదుపులోకి తీసుకున్నా." చెప్పాడు దివాకర్ వినమ్రంగా.

"ఇంట్లో పనివాళ్ళమీదకానీ, రామ్మూర్తి, రాజేష్ ల మీద కానీ నీకు అనుమానం రాలేదా ?" అడిగారు కుర్చీలో కూర్చుంటూ.

"ముందుగా రామ్మూర్తి మీద అనుమానం వచ్చింది సార్. హత్య చేసి, వేలు ముద్రలు కనపడకుండా తుడిచేసేడేమోనని. కానీ ఆయన గత చరిత్ర, నడవడిక, పరిశోధనలో ఆయన సహకరించిన తీరు చూసి, నా అనుమానం తప్పని తెలుసుకున్నా సార్."

"మొదటి నుంచి ఆ రాజేషే నిందితుడు అని అనుమానిస్తున్నాం కదయ్యా ? "

"ఔను సార్, కానీ పోస్ట్ మార్టం రిపోర్టు చదివిన తరువాత హంతకులు ఇద్దరని నాకు అనుమానం వచ్చింది సార్. ఎందుకంటే, అందులో పీకకు గట్టిగా తాడు బిగించి ఊపిరి ఆడకుండా చేయడంవలన ప్రాణం పోయిందనీ, ఆ తరువాతే గుండెల్లో కత్తి దింపి హత్య చేసారని."

"అంటే రాజేషే తాడుతో ఊపిరి ఆడకుండా చేసి వెళ్లి పోతే, ఆ తర్వాత రఘు వచ్చి కత్తి గుండెల్లో దింపి వెళ్లి పోయాడంటావా ?" కొంచెం వెటకారం ధ్వనించింది డీయస్పీ ప్రభాకరరావు మాటల్లో.

"అదేం కాదు సార్, పోస్ట్ మార్టం రిపోర్టులో రాత్రి పది గంటల సమయంలో ఊపిరి ఆడకుండా చేయడం వలన ప్రాణం పోయిందని, ఆ తరువాత అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో కత్తి వలన గుండెల్లో గాయం అయ్యింది అనీ,  ఈ సంఘటనలు మధ్య కొంచెం అటూఇటూగా  రెండు మూడు గంటలు గేప్ ఉందని పేర్కొన్నారు. అయితే, ఆ సమయాలలో రాజేష్ ఆ స్థలంలో లేడనీ, అతను రాత్రి తొమ్మిది గంటలకే అక్కడ నుంచి వెళ్లి పోయాడని వీర్రాజు తన వాంగ్మూలంలో చెప్పాడు.  అంతే కాదు అతని ప్రవర్తన గురించి ఎవరూ కూడా చెడుగా చెప్పలేదు. అందుకే రాజేష్ ని అనుమానించలేక పోయాను సార్. " చెప్పాడు దివాకర్.

"సరే, బాగానే ఉంది కానీ, అదే వీర్రాజు, ఆ రోజు రాత్రి రఘుబాబు కూడా అర్ధరాత్రి తరువాత వచ్చేడు అని ఇదిగో ఈ వాంగ్మూలంలో చెప్పాడు కదా ? మరి రఘు అక్కడ లేనపుడు,రాత్రి పది గంటలకు జమిందార్ గారిని ఊపిరి ఆడకుండా చేసి చంపింది ఎవరు ? " సందేహం వ్యక్తం చేశారు డీయస్పీ.

"అది చేసింది ఎవరో మనం రఘు బాబు గారి ద్వారానే విందాం సార్" అంటూ ఆయనను తీసుకుని రమ్మని కానిస్టేబుల్స్ కు చెప్పాడు ఎస్సై దివాకర్.

     *****     *****     *****     *****

"సీ, మిష్టర్ రఘు, మీరు మాకు సహకరిస్తే, శిక్ష తగ్గించే విషయంలో ఏదైనా సహాయం చేయగలం. అందుచేత ఏం జరిగిందో వివరంగా చెప్పండి" శాంతంగా చెప్పారు డీయస్పీ ప్రభాకరరావు.

చెప్పడం ప్రారంభించేడు రఘుబాబు తల వంచుకుని.

"అమ్మానాన్నలుకు నేను ఒకడినే సంతానం కావడం, దానికి తోడు మా అమ్మగారు నా చిన్న తనంలోనే పోవడంతో నన్ను చాలా గారాబంగా పెంచారు నాన్నగారు. నేను అడిగినదల్లా తీర్చడం, పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో నేను చిన్న తనంలోనే వ్యసనాలకు లోనయ్యాను. చదువు సరిగ్గా రాకపోవడమూ, వ్యసనాలు తగ్గకపోవడంతో, పెళ్లి చేస్తే బాగుపడతానేమో అని నాలుగేళ్ల క్రితం వివాహం జరిపించారు. అయితే ఆమె నాతో ఇమడలేక రెండేళ్ల క్రితమే విడాకులు తీసుకుని వెళ్ళి పోయింది" చెప్పడం ఆపి అందరి వైపు ఓ సారి చూసేడు రఘు.

"వాట్, రఘూ, వాటర్ కానీ ఏదైనా కూల్ డ్రింక్ కానీ తెప్పించమంటారా ?" అడిగారు డీయస్పీ.

"నో. నాట్ నెసెసరీ సార్…... అప్పటినుండి మా నాన్నగారు తన చిన్న నాటి స్నేహితుడు సత్యమూర్తి గారితో తరచూ భేటీ అవ్వడం మొదలెట్టారు. ఆయనతో పాటు తరచుగా ఆయన కొడుకు రాజేష్ కూడా వచ్చేవాడు. ఇక ప్రతీరోజూ మా నాన్న గారు నన్ను ఆ రాజేష్ తో పోల్చడమూ, అతడిని చూసి బుద్ధిగా ఎలా ఉండాలో నేర్చుకోమని సాధిస్తూ ఉండేవారు. ఆ కారణంగా నాకు అతనంటే ఓ ధ్వేష భావం ఏర్పడిపోయింది. అంతేకాక నాన్నగారు బేంక్ అకౌంట్, లాకర్ కూడా రాజేష్ చేస్తున్న బేంకులోనే ఉండడంతో, అతన్ని అడ్డు తొలగించుకోకపోతే నాకు ఎప్పటికైనా ప్రమాదమే అని నిర్ణయించుకుని ఆ సమయం కోసం చూస్తున్నా" చెప్పడం కాసేపు ఆపి, తిరిగి మొదలెట్టాడు రఘు.

"హత్య జరిగిన రోజు రాత్రి ఇంటికి వచ్చిన నాకు, ఆ రోజు రాత్రి కూడా రాజేష్ వచ్చి వెళ్ళాడని తెలిసి రక్తం మరిగిపోయింది. ఈ విషయం ఏదో ఇప్పుడే తేల్చేసుకోవాలని హడావుడిగా నాన్నగారి వద్దకు వచ్చేను. తలుపు దగ్గరగా వేసి ఉండడంతో ఆశ్చర్య పోయిన నేను లోపలి దృశ్యం చూడగానే కొయ్య బారిపోయాను" చెబుతున్నాడు రఘు.

"ఇక్కడ నుంచి నేను చెబుతాను సార్" అంటూ చెప్పడం మొదలెట్టాడు దివాకర్.

"గదిలో పైనున్న కొక్కేనికి వేలాడుతున్న తండ్రి శవాన్ని చూసేడు ఈ రఘు. పక్కనే చెక్క టేబుల్ మీద ఎగిరిపోకుండా ఓ పేపర్ వెయిట్ పెట్టి ఉన్న ఓ కాయితం చూసేడు. అది జమిందార్ గారు ఆయన లెటర్ పేడ్ మీద రాసిన సూసైడ్ నోటు. అందులో 'తన చావుకు ఎవరూ కారణం కాదనీ ఆరోగ్య సమస్యలు మరియు వ్యసనాలకు బానిసైన రఘు బాబు జీవితం మీద బెంగతో ఈ నిర్ణయం తీసుకున్నాననీ' రాసి ఉంది. వెంటనే ఆ లెటర్ తీసి జేబులో పెట్టేసుకున్నాడు. అప్పుడే రఘుబాబులో దాక్కున్న రాక్షసుడు నిద్ర లేచాడు. తన ప్రతీకారానికి దీన్ని అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు" చెప్పడం ఆపేడు దివాకర్.

"ఏమిటి, జమిందార్ గారిది ఆత్మహత్యా ? ఇదేం ట్విస్ట్. అయినా ఈ విషయం నీకెలా తెలిసింది ?" ఆశ్చర్యంగా అడిగారు డీయస్పీ.

"సార్, పోస్ట్ మార్టం రిపోర్టు లో వెన్నుపూస కూడా విరిగినట్టు కూడా ఉంది. అంతేకాకుండా ఫింగర్ ప్రింట్ రిపోర్టులో చెక్క స్టూలు మీద, పేపర్ వెయిట్ మీద కూడా రఘుబాబు వేలిముద్రలు ఉన్నాయి అని రావడంతో, నాకు అనుమానం వచ్చింది. జమిందార్ గారు ఆత్మహత్య చేసుకుని ఉంటారనీ, ఆ సూసైడ్ నోటు రఘు మాయంచేసాడనీ. నేను చెప్పింది నిజమేనా రఘూ ?" అడిగాడు ఎస్సై దివాకర్.

"ఔను సార్. అదే జరిగింది. ఉత్తరంలో కూడా నా పేరే పేర్కొనడంతో, దీనికంతకూ కారణమైన రాజేష్ ని ఇరికించడానికి ఇదే తగిన సమయమని భావించాను. వెంటనే చెక్క స్టూలు తీసి పక్కన పెట్టేసి, పేపర్ వెయిట్ కింద ఉన్న లెటర్ జేబులో పెట్టుకుని,  నాన్న గారి బాడీని మంచం మీదకు చేర్చిన నాకు, రాజేష్ మీద ఉన్న ధ్వేషానికి తోడు అతిగా సేవించిన మద్యం కూడా తోడవడంతో, ఏం చేస్తున్నానో కూడా తెలియని ఆవేశంలో, విచక్షణ మరచి కన్న తండ్రి అని కూడా చూడకుండా, రాజేష్ వేలు ముద్రలు చెరిగిపోకుండా, నా వేలుముద్రలు పడకుండా,  అక్కడ ఉన్న కత్తిని తీసుకుని నాన్న గారి గుండెల్లో కసికొద్దీ దింపి, ఏమీ ఎరగనట్టు కిందకు వచ్చి పడుకుండి పోయాను" చెప్పడం ముగించి, ఏడుస్తూ రెండు చేతుల్లోనూ మొహం దాచేసుకున్నాడు.

     *****     *****     *****     *****

"రఘుబాబు, పూర్ ఫెలో, ఒక అమాయకుడ్ని ఇరికించబోయి తనే ఇరుక్కన్నాడు." కొంచెం బాధగా చెప్పారు డీయస్పీ, రఘుబాబును అక్కడి నుండి పోలీసులు తీసుకెళ్ళిన తరువాత. 

"రఘుబాబు ఇరికిద్దాం అనుకున్నది ఒక అమాయకుడ్నే కాదు. రక్తం పంచుకుపుట్టిన తమ్మడ్ని కూడా !" చెప్పాడు దివాకర్, ఆశ్చర్యంగా తన వైపు చూస్తున్న డీయస్పీ ప్రభాకరరావు గారితో.

"ఇన్ని ట్విస్టులు ఏమిటయ్యా ? ఏమిటీ ! రఘు రమేష్ లు స్వయానా అన్నదమ్ములా ? అయినా ఈ విషయం నీకెలా తెలుసు ?"

"ఈ విషయాన్ని రాజేష్ తండ్రి సత్యమూర్తి గారు చెప్పారు సార్.  రఘు చిన్నతనంలోనే జమిందార్ గారి భార్య చనిపోయింది. ఇంకో వివాహం చేసు కుంటే ఆమె తన కొడుకును సరిగ్గా చూడదని, ఒక ఆయాను ఏర్పాటు చేసుకున్నారు. వయసులో ఉన్న జమిందార్ గారు తన కోరిక అణుచుకోలేక ఓ రాత్రి, ఆమె వారిస్తున్నా వినకుండా ఆమెను ఆక్రమించు కున్నారు. ఫలితం.. మూడు నెలలు తరువాత గర్భం రూపంలో బయటపడింది. కంగారు పడ్డ జమిందార్ గారు వెంటనే తన మిత్రుడు సత్యమూర్తి గారిని రప్పించి ఆ ఆయా సంరక్షణ భాద్యతను ఆయనకు అప్పగించారు. కానుపు కొంచెం కష్టమై, పండంటి బిడ్డకు జన్మనిచ్చి తను తనువు చాలించింది ఆయా. పెళ్లి అయ్యి ఐదేళ్ళయినా పిల్లలు లేకపోవడంతో ఆ అబ్బాయినే తమ స్వంతబిడ్డగా పెంచుకున్నారు  సత్యమూర్తి దంపతులు. అతనే రాజేష్" చెప్పడం ముగించాడు దివాకర్.

"ఔనూ, ఆ రఘుబాబు ఏంటీ, ఏదో లాకరూ,  బేంకు అకౌంటూ అంటాడు. అవి నిజంగానే ఆ రాజేష్ కంట్రోల్ లోనే ఉన్నాయా ?" అడిగారు డీయస్పీ.

"సార్, ఆ అనుమానంతోనే జమిందార్ గారి ఫామిలీ  లాయర్ రమణరావు గారిని సంప్రదించా. ఆయన చెప్పిన దాని ప్రకారం నెల రోజుల క్రితమే జమిందార్ గారు తన స్వార్జితమైన మొత్తం ఆస్తిని రెండుగా చేసి ఒక భాగం తన కుమారుడు అయిన రఘుకు, ఇంకో భాగం తన రక్తం పంచుకుని పుట్టిన రాజేష్ కు వచ్చేలా వీలునామా రాసేసారుట. అంతేకాదు, బేంకు లాకర్ కీ కూడా లాయర్ గారికే ఇచ్చారుట."

"ఔనా ? ఈ విషయం జమిందార్,  రఘుబాబుకి తెలిపి ఉంటే ఇంత అనర్ధం జరిగిఉండేది కాదేమో ? అవునూ, ఆయన సూసైడ్ లెటర్ రాసినట్టు నీకెలా తెలిసిందీ ?" అడిగారు ప్రభాకరరావు.

"సార్, మేము సేకరించిన వస్తువులలో జమిందార్ గారి లెటర్ పాడ్ ఉంది. అందులో కేవలం రెండు పేజీలే ఉన్నాయి. అది చూస్తున్న నాకు చివరి అట్టమీద జమిందార్ గారి సూసైడ్ నోటు కనపడింది. తర్వాత నా విచారణలో తేలింది ఏమిటంటే, జమిందార్ గారికి ఏదైనా లెటర్ రాసేటప్పుడు కార్బన్ పేపర్ పెట్టి, ఇంకో కాపీ తీసుకుని, ఫైలు చేసుకొనే అలవాటు ఉందని. కానీ ఈ సూసైడ్ లెటర్ రాసినపుడు కాపీ తీసుకోలేదు కానీ, ఆ కార్బన్ పేపర్ ఆఖరి పేజీకి, అట్టకి మద్య పెట్టడం వలనా, అందులో ఇంక రెండు పేజీ లే ఉండడం వలన అట్టమీద ఆ లెటర్ స్పష్టంగా కాపీ అయ్యింది. దీని వల్లనే నా పరిశోధన చాలా ఈజీ అయ్యింది సార్ " అంటూ దానిని డీయస్పీ గారికి చూపించాడు.

"ఎనీహౌ.  వెల్డన్ మై బోయ్. మరి జాగ్రత్తగా ఛార్జ్ షీట్ ఫైల్ చెయ్యి. ఏ ఏ సెక్షన్లు ప్రకారం వెళ్ళాలో లీగల్ అడ్వైజ్ తీసుకో" అంటూ లేవబోయారు డీయస్పీ.

ఈ లోగా పెద్ద శబ్దం రావడంతో ఉలిక్కి పడ్డారు స్టేషన్ లో ఉన్న అందరూ.

"నే చెప్పానా, జాగ్రత్తగా ఉండాలని. ఇప్పుడు చూడు , రఘుని అరెస్ట్ చేసేమని తెలిసి, ఆయన మిత్రబృందం మన స్టేషన్ మీద రాళ్ళు విసురు తున్నట్టున్నారు" ఆందోళనగా అన్నారు డీయస్పీ ప్రభాకరరావు.

ఈ లోగా…..

"సార్, సార్ రఘుబాబు గారు ఆత్మహత్య చేసుకున్నారు" అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు ఓ కానిస్టేబుల్. 

"వ్వా...ట్.".అంటూ అదిరిపడి కుర్చీల్లోంచి లేచారు ఆఫీసర్లు ఇద్దరూ.

"ఔను సార్. రఘుబాబు గారిని, ఇక్కడ నుంచి సెల్ కి తీసుకువెళ్తున్న సమయంలో, డీయస్పీ దొరగారిని కలవడానికి పామర్రు ఎస్సై గారు వచ్చేరు. అంతే, ఒక్క క్షణంలో రఘుబాబు గారు, మమ్మల్ని నెట్టేసి,  ఆ ఎస్సైగారి బెల్టుకి ఉన్న రివాల్వర్ తీసుకుని కణతకు పెట్టుకుని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చుకుని అక్కడి కక్కడే చనిపోయారు సార్."

"ఇదిగో దివాకర్, ఈ కేసు ఏ ముహూర్తంలో మొదలెట్టావో కానీ అన్నీ ట్విస్టులు మీద ట్విస్టులే. బావుంది, అయితే రఘు తన తీర్పు తనే చెప్పేసుకున్నాడన్న మాట. ఎంతైనా తండ్రికి తగ్గ తనయుడు కదా ? సరే ఈ వ్యవహారం ఏదో జాగ్రత్తగా చూడు,  ఆధారాలు పోకుండా ! లేకపోతే మనమే లాకప్ డెత్ చేసేమని రాసేస్తారు. నడు, ఆ డెడ్ బాడీని చూసి, నేను అర్జంటుగా వెళ్లి యస్పీ సూర్య గారికి రిపోర్ట్ చేయాలి" అంటూ లేచారు డీయస్పీ ప్రభాకరరావు.

"ఆత్మహత్య చేసుకున్న తన తండ్రిని హత్య చేసి, తను కూడా ఆత్మహత్య చేసుకున్న ఈ కేసును ఎలా క్లోజ్ చేయాలో ? " అనుకుంటూ ఆయన్ని అనుసరించేడు ఎస్సై దివాకర్.

     *****     **సమాప్తము**     *****

No comments:

Post a Comment