Sunday, December 28, 2025

 ధర్మమేవ జయతే!

ధర్మో రక్షతి రక్షితః! ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందంటారు. ఈ సూక్తిలో దైవానుగ్రహమూ, పురుషార్ధమూ రెండూ ఇమిడి ఉన్నాయి. ధర్మార్థకామమోక్షాలు చతుర్విధ పురుషార్థాలు. వీటిలో ధర్మం మొదటిదే కాదు ప్రధానమైంది కూడా!

విశేషమేమిటంటే ధర్మ సాధనాల్లో మొదటిది శరీరమే 'శరీరమాద్యం ఖలు ధర్మసాధనం' అన్నారు కదా. అందువల్ల ధర్మకార్యాలు చేయడానికి వీలుగా శరీరానికి తగినంత పోషణనివ్వాలి. ధ్యానం, వ్యాయామాదులతో ఆరోగ్యంగా ఉండాలి. మనిషి జీవితంలో అర్థం, కామం ధర్మబద్ధంగా ఉన్నప్పుడే మోక్షప్రాప్తి కలుగుతుంది. అధర్మమైన కామ ప్రయత్న ఫలితాలే... రామాయణంలోని రావణవధ, మహాభారతంలోని కీచకవధ. ధర్మం అత్యంత ఆవశ్యకమైంది, ఆదర్శ ప్రాయమైంది కాబట్టే ధర్మ స్వరూపుడైన శ్రీ రామచంద్రుణ్ని ఆరాధిస్తాం. 'రామో విగ్రహవాన్ ధర్మః'' అని తొలుత అన్నవాడు మారీచుడు. ఎవరు చెప్పినా అది మంచి మాటే. అందుకే ఇప్పటికీ ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తోంది. ధర్మ సంస్థాపన కోసమే ప్రతి యుగంలోనూ పుడతానన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ధర్మదేవత కృతయుగంలో నాలుగు పాదాలతో, త్రేతాయుగంలో మూడు పాదాలతో, ద్వాపరయుగంలో రెండు పాదాలతో నడిచిందనీ, ఇప్పుడు కలియుగంలో ఒక్క పాదంతోనే నడుస్తోందని పెద్దలు చెబుతుంటారు. ధర్మవర్తనను బట్టే యుగం స్థాయిని నిర్ణయించడం విశేషం. కల్యాణానికైనా, లోక కల్యాణానికైనా ధర్మం తప్పనిసరి. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ విజయం ఉంటుంది. అధర్మం తాత్కాలికంగా విజయం సాధించినా, అంతిమ విజయం మాత్రం ధర్మానిదే. ఇందుకు కురుక్షేత్రం ఒక తార్కాణం. అందుకే కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రమంటారు.
ధర్మాన్ని అనుసరించేవాడు ఫలానా వృత్తినే చేయాలనే నియమనిబంధనలేమీ లేవు. ఇందుకు ధర్మవ్యాధుడు అద్భుతమైన ఉదాహరణ. మిథిలానగరంలో మాంసం అమ్మే వృత్తిలో ఉన్న అతడు తపోధనుడైన కౌశికుడికి ధర్మబోధ చేయడం అందరికీ తెలిసిందే. మనిషి బ్రహ్మచర్యంలో ఉన్నా, గృహస్థాశ్రమ ధర్మంలో కొనసాగుతున్నా, సన్యాసం స్వీకరించినా, వానప్రస్థాశ్రమానికి వెళ్లినా దేని ధర్మం దానిదే. అయితే ధర్మం వేరు, ధర్మసూక్ష్మం వేరు. దాన్ని కూడా తెలుసుకుని పాటించాలి. లేకపోతే అప్పుడప్పుడు తడబడాల్సి వస్తుంది.

మనుషులందరూ ఒకే రకంగా పుడతారు. కానీ పెరిగేకొద్దీ ధర్మాచరణను బట్టి మంచి చెడ్డలు నిర్ణయమై వారికి గుర్తింపు లభిస్తుంది. 'ధర్మమే నృపులకు తారకయోగంబు' అంటాడు యోగి వేమన. మాన్యులూ సామాన్యులు... ఎవరికైనా యోగమదే. నీతినిజాయతీలు, సత్యాహింసలు, న్యాయం లాంటివి ధర్మానికి పర్యాయపదాలే. మనిషిలోని అసలైన జ్ఞానమిదే. ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకుని తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగితే అతడే ధర్మపరుడు. అతడే జ్ఞాని. అతడే విద్యావంతుడు. స్వీయ లోపంబు లెరుగుట పెద్ద విద్య అన్నారు కదా! ఆచరణకు దూరంగా ఉండి ధర్మాధర్మాల తర్క వితర్కాలు చేయకుండా... ఆత్మసాక్షిగా మంచి వైపు ముందుకు సాగడమే ధర్మం.

శంకర నారాయణ

No comments:

Post a Comment