పిల్లలో పరివర్తన రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
సీతాపతి మాష్టారికి ఆ రోజంతా ఒకటే ఆందోళనగా వుంది. గత కొన్ని రోజులుగా ఐదవ తరగతి పిల్లల డబ్బు, వస్తువులు మాయమవుతున్నాయి. ఆ రోజయితే ఏకంగా ఆయన ఖరీదైన పెన్నుని మాయం చేసారు. దురలవాట్లకు లోనయిన విద్యార్ధుల పనే అయి ఉంటుందని గ్రహించారు మాష్టారు.
దొంగతనం జరిగిన రోజు డబ్బు పోగొట్టుకున్న పిల్లలు ఆ విషయం చెప్పడం, మిగతావారు తమ వస్తువులు భద్రపరచుకోవడం, తమ డబ్బు దొంగిలిస్తారనే భయంతో దృష్టిని పాఠాల మీద లగ్నం చేయక పోవడం జరుగుతున్నందుకు బాధగా ఉంది మాష్టారుకి. పరిష్కారం కోసం తీవ్రంగా ఆలోచించారు మాష్టారు.
తరువాత రోజు పాఠం చెబుతుండగా కృష్ణ నిలబడి “నా సంచిలో డబ్బు కనబడలేదు” అని చెప్పాడు. అప్పటికే ఏమి చెయ్యాలో ఆలోచించి ఉండడంతో “పిల్లలంతా ఐదు నిముషాలు బయటకు వెళితే పుస్తకాల సంచులు వెతికి దొంగని కనిపెడతాను” అన్నారు మాష్టారు. విద్యార్ధులు బయటకు వెళ్ళగానే తలుపులు మూసి తనిఖీ చేసారు మాష్టారు.
కాసేపటికి తలుపులు తెరచి ‘దొంగ దొరికాడని’ మాష్టారు చెప్పగానే పిల్లలంతా ఉత్సాహంగా లోపలకు వెళ్ళారు. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. దొంగ ఎవరో తేలిపోతుందని ఆశ పడ్డారు పిల్లలు. “తరువాత చెబుతాను. ప్రస్తుతానికి పాఠం చెప్పుకుందాం” అని జవాబిచ్చి పోగొట్టుకున్న డబ్బుని కృష్ణకి అందించి తగు జాగ్రత్తలు చెప్పారు మాష్టారు.
పిల్లలకి మాత్రం మాష్టారి ప్రవర్తన వింతగాను, దొంగ పేరు రహస్యంగా వుంచడంతో ఆశ్చర్యంగాను వుంది. మరొకరైతే బెత్తం విరిగేలా కొట్టి, తోటి పిల్లల ముందు అవమానపరిచే వారని, తల్లి దండ్రులను పిలిపించి జాగ్రత్తలు చెప్పేవారని , అలాంటిదేమీ చేయకుండా సాధారణంగా ప్రవర్తించడం నచ్చలేదు వారికి.
తరువాత రోజు నుండి తరగతిలో దొంగతనాలు ఆగిపోయాయి. ఒకప్పటిలాగే శ్రద్ధగా పాఠాలు వింటున్నారు పిల్లలు. రోజులు వేగంగా గడుస్తున్నాయి.
ఒకరోజు ప్రధానోపాధ్యాయులు సీతాపతి మాష్టారుని స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కావలసిన రంగు కాగితాలు, బహుమతులు కొనుగోలుకు వెళ్ళమని చెప్పారు. ఒక విద్యార్ధిని తనతో రమ్మని అడిగారు సీతాపతి మాష్టారు. ఆయనతో కమల్ వెళ్ళాడు.
ప్రధానోపాధ్యాయుడు చెప్పిన వస్తువులు కొనుక్కుని తిరిగి వస్తుండగా మధ్య దారిలో ఒక చెట్టు క్రింద చాలా జనం మూగి ఉండడం, ఏదో గొడవ జరుగుతున్నట్టు కేకలు విని అక్కడకు వెళ్ళారు మాష్టారు. వెనుకే వెళ్ళాడు కమల్.
ఒక నడివయసు వ్యక్తిని చెట్టుకి కట్టేసి కర్రతో కొడుతున్నాడు ఒక యువకుడు. కట్టేసి వున్న వ్యక్తి మీదకు చెప్పు విసిరారు మరొకరు. గిన్నె నిండా సున్నపు ద్రావణాన్ని ఆ వ్యక్తి ముఖం మీద పోసారు ఇంకొకరు. అంతలో ఒక స్త్రీ “వాడికి గుండు గీయించి గాడిద ఎక్కించి ఊరంతా తిప్పితే సిగ్గు వస్తుంది” అని సలహా ఇచ్చింది.
జరుగుతున్నది చూసి, మాటలు విన్న సీతాపతి మాష్టారు “అతడేమి నేరం చేసాడు?” అని అడిగారు. కర్రతో కొట్టిన యువకుడు ముందుకి వచ్చి “మా బీరువాలో దాచిన బంగారం, డబ్బు దొంగతనం చేసాడు. పారిపోతుంటే పట్టుకున్నాం. దండించకుండా ముద్దు పెట్టమంటారా?” అని అడిగాడు కోపంగా.
“అతడిని శిక్షించడానికి పోలీసులు ఉన్నారు. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు. అతడికి ఏమయినా జరిగితే మీకే ప్రమాదం” అని బోధపరిచి పోలీసులకు ఫోనులో సమాచారం అందించారు మాష్టారు.
అక్కడ నుండి కదలి వెళ్తుండగా కమల్ తో “ఆ దొంగకి ఏ గతి పట్టిందో చూసావా? దొంగని ఎవరూ గౌరవించరు. దొంగతో ఎవరూ స్నేహం చెయ్యరు. దూరంగా పెడతారు. భవిష్యత్తులో ఎక్కడైనా దొంగతనం జరిగితే ముందుగా అతడినే అనుమానిస్తారు. పోలీసుల కళ్లెప్పుడూ అతడిని కనిపెడుతూ ఉంటాయి” అన్నారు.ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు మాష్టారూ” అని అడిగాడు కమల్.
“ఆ రోజు మీ తరగతిలో పోయిన డబ్బు తీసింది నువ్వే కనుక. నీ పేరు చెప్పి వుంటే ఏమయ్యేదో ఒకసారి ఊహించు” అన్నారు మాష్టారు. ఆ మాటలకు కమల్ షాక్ అయి తల దించుకున్నాడు.
“స్నేహితుల సరదాల కోసం దొంగతనం చేసాను. దొంగతనం చేస్తే ఎదురయ్యే కష్టాలు ఇప్పుడు చూసాను. ఆ రోజు నా పేరు చెప్పకపోయేసరికి క్షేమంగా బయటపడ్డానని సంబరపడ్డాను. కొన్నాళ్ళు ఆగి దొంగతనం చేయాలనుకున్నాను. అదెంత నేరమో ఇప్పుడు తెలిసింది. ఈ రోజు నుండి చెడ్డ స్నేహితులను వదిలేస్తాను. మరెప్పుడూ దొంగతనం చేయనని ప్రమాణం చేస్తున్నాను. బుద్ధిగా చదువుకుంటాను. నా పేరు బయట పెట్టవద్దు మాష్టారు” అని కాళ్ళ మీద పడ్డాడు కమల్.“నీలో పరివర్తన రావడం కంటే ఆనందమేముంది” అన్నారు మాష్టారు.
కమల్ తనతో రావడం, చెట్టు దగ్గర జరిగిన సంఘటన రెండూ యాధృచ్చికమే అయినా అతడు రావడం వల్లనే దొంగతనం గురించి చెప్పే అవకాశం వచ్చిందని, చాలా రోజులుగా దాచుకున్న విషయం మంచి ఉదాహరణతో పరివర్తన కలిగించేలా చెప్పగలిగినందుకు సంబర పడ్డారు మాష్టారు.
ఈనాటి కాలంలో ఇలాంటి మాస్టర్ ఉండటం చాలా అరుదు కదూ!
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏
No comments:
Post a Comment