Sunday, July 5, 2026

 *ఒక పేదవాడు సంతలో తిరుగుతున్నాడు.*

*చాలా ఆకలిగా ఉంది. అతని దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది.*

*ఎలా తిండి సంపాదించాలా అని ఆలోచిస్తూనే చివరికి ఒక దుకాణం వద్ద ఇత్తడి దీపం కనిపించింది.*

*“ఒక రూపాయి మాత్రమే” అని రాసి ఉంది.*

ఆశ్చర్యపోయిన వాడు అడిగాడు –

“ఎందుకు ఇంత తక్కువ డబ్బుకి అమ్ముతున్నావు?” అని.

దుకాణదారుడు చెప్పాడు –

“ఇది అద్భుత దీపం బాబూ! ఇందులో ఒక భూతం ఉంటుంది. నువ్వు చెప్పిన కోరిక తీరుస్తుంది.

కానీ ఒక షరతు ఉంది. ఈ భూతం ఎప్పుడూ పనిలోనే ఉండాలి. పనిలేకపోతే, ఇస్తున్న వరాలు తిరిగి తీసుకుపోతుంది.”

పేదవాడు వెంటనే దీపం కొనుక్కొని ఇంటికి వచ్చాడు. రుద్దగానే భూతం ప్రత్యక్షమైంది.

“ఏమి కావాలి నీకు?” అని అడిగింది.

ఆకలిగా ఉన్నవాడు భోజనం అడిగాడు → క్షణాల్లో పంచభక్ష్య పరమాన్నాలు వచ్చాయి.

తర్వాత మంచం అడిగాడు → హంసతూలికా తల్పం ప్రత్యక్షమైంది.

తర్వాత ఇల్లు అడిగాడు → రాజభవనం లాంటి ఇల్లు వచ్చింది.

భూతం అడుగుతూనే ఉంది – “ఏమి కావాలి నీకు?”

అతను అడుగుతూనే ఉన్నాడు… కాని చివరికి విసిగిపోయాడు.

ఎంతవరకు అడగగలడు? అడగకపోతే, దానికి పని లేక సంపదలు పోతాయి!

అపాయం గ్రహించిన వాడు తన ఊరిలో ఉన్న ఒక వృద్ధ సన్యాసి దగ్గరకు వెళ్లాడు. తన సమస్య చెప్పాడు.

సన్యాసి ఒక మార్గం చూపించాడు.

వెంటనే ఇంటికి వెళ్లి, భూతాన్ని పిలిచి చెప్పాడు:

“భూమిలో ఒక గొయ్యి తీయి” అని.

భూతం క్షణాల్లో పెద్ద గొయ్యి తీయింది.

“ఇప్పుడు ఈ స్థంభం నాటుకో” అని చెప్పాడు.

తర్వాత: “ఇప్పుడు ఆ స్థంభం మీద ఎక్కి దిగుతూ ఉండు. నేను చెబుతానంటే వరకూ ఇది నీ పని.”

భూతం స్థంభం మీద ఎక్కుతూ దిగుతూ పనిలో పడిపోయింది.

పేదవాడు తన పని చేసుకుంటూ, పొరుగువారికి సహాయం చేస్తూ సుఖంగా జీవించాడు.

ఒక రోజు తిరిగి వెళ్లి చూసాడు – భూతం అలసిపోయి స్థంభం పక్కనే నిద్రపోతోంది!

సంతోషంగా తన విజయగాధను ఆ సన్యాసికి చెప్పాడు.

అక్కడితో కథ ముగియలేదు… *అసలు కథ ఇప్పుడే మొదలైంది.*

✨ *కథలో నీతి* ✨

*ఆ భూతం మన మనస్సు.*

ఎప్పుడూ ఆలోచనలతో పరుగెడుతూ, కోరికలతో విసుగుపెట్టేది.

ఆ స్థంభం *“మంత్రం”*.

*దైవనామస్మరణ, జపం* మనసుకు క్రమం నేర్పుతుంది.

మనసును మంత్రజపంలో నిమగ్నం చేస్తే అది శాంతిస్తుంది, ధ్యాన స్థితిలోకి చేరుతుంది.

ధ్యానంలో మునిగితే మనలోని *ఆత్మజ్యోతి వెలుగుతుంది.*

*ఆ వెలుగు మనకే కాక, ఇతరుల సౌఖ్యానికి మార్గం చూపిస్తుంది.🍁.    *ఆధ్యాత్మిక కుటుంబం*                        

No comments:

Post a Comment