విజయానికి సహనం ముఖ్యం...
కష్టాలకు ధనవంతులనీ, పేదవారనీ భేదం ఉండదు. కష్టం ఎవరికైనా వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది. అయితే ఏ కష్టమైనా కలకాలం ఉండిపోదు. అలా ఉండిపోతే ఈ సృష్టి ఇలా ఉండేదే కాదేమో! గాలికి మేఘాలు కొట్టుకుపోయినట్టు కష్టాలు మెల్లగా తొలగిపోతుంటాయి. కాకపోతే, వచ్చిన కష్టం కనుమరుగయ్యే వరకూ మనం సహనంతో ఉండాలి.
స్త్రీ గర్భం దాల్చింది మొదలు ప్రసవం అయ్యేవరకు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అందుకే ప్రసవాన్ని పునర్జన్మ అన్నారు పెద్దలు. తన ప్రతి కదలికలోనూ గర్భంలోని శిశువును దృష్టిలో పెట్టుకుంటుంది. ఒకటా రెండా- తొమ్మిది నెలలు ఆ స్త్రీమూర్తి ఓపిక పడుతుంది. పండంటి శిశువుకు జన్మనిస్తుంది. ఇది ఒక్క స్త్రీ మూర్తికే సాధ్యమైన సహనం. అందుకే ఆమెను భూమాతతో పోల్చారు.
గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం ఒకరోజులో కలిగింది కాదు. సుమారు ఆరు సంవత్సరాలు ఏకాగ్రతతో ధ్యానం చేశాడు. నిద్రాహారాలు మానేసి కఠోర ధ్యానంలో మునిగిపోయాడు. కందమూలాలు, తృణధాన్యాలే అప్పుడు ఆయన ఆహారం. ఒక్కోసారి గుప్పెడు నువ్వు గింజలతో సరిపెట్టుకున్నాడు. అపారమైన సహనంతో ధ్యానం కొనసాగించాడు. చివరికి జ్ఞానోదయం పొంది లోకానికి వెలుగును పంచాడు.
ఇరవై ఏడేళ్లు ‘డి’ గ్రేడు జైలు జీవితం అనుభవించడమంటే మాటలు కాదు. ఆ తరగతి జైళ్లలో తక్కువ ఆహారం, అరకొర దుస్తులూ, ఇరుకు గది మాత్రమే ఇస్తారు. కుటుంబసభ్యుల నుంచి ఆర్నెల్లకు ఒక ఉత్తరం మాత్రమే అందుకోవచ్చు. అలా నెల్సన్ మండేలా ఇరవై ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించారు. ఆ సహనం ఆయనను దక్షిణాఫ్రికా ప్రజలకు ప్రియతమ అధ్యక్షుణ్ని చేసింది. ‘లాంగ్ వాక్ టు ఫ్రీడం’ పుస్తక రచయితగా మార్చింది.
అంత అందం సీతాకోకచిలుకకు ఊరికే రాలేదు. తన పుట్టుక వెనుక ఎంతో సహనం ఉంది. గుడ్డు లార్వా అవుతుంది. తరవాత అది ప్యూపాగా మారుతుంది. అప్పుడు అందమైన రెక్కలతో సీతాకోకచిలుక మనకు దర్శనం ఇస్తుంది. ఒక జన్మ కోసం నాలుగుసార్లు పుడుతుంది సీతాకోకచిలుక.
కష్టాలను అధిగమించడానికే కాదు, విజయం సాధించడానికి కూడా సహనం చాలా అవసరం. విత్తనం మట్టిపొరల్లో చాలా కాలం వేచి ఉంటుంది.వాతావరణం అనుకూలించినప్పుడు మొలకెత్తి మానై పూలూ ఫలాలతో వర్ధిల్లుతుంది. ఏ విజయమూ వడ్డించిన విస్తరి కాదు. ఒకరోజులో వచ్చి పడేదీ కాదు. ప్రతి విజేత వెనుక వారి అనంత సహనశక్తి దాగి ఉంటుంది. కార్యసాధనలో అవరోధాలు సహజం. తుది విజయానికి సహనమే తిరుగులేని సాధనం. మహాత్ములైనా,మామూలు మనుషులైనా...ఎవరికైనా సరే కష్టాలు వస్తాయి. కాస్త ఓపిక పడితే అవి మనల్ని మరింత ధైర్యవంతులుగానూ, బలవంతులుగానూ చేస్తాయి.
కాబట్టి జీవితంలో ఎప్పుడూ సహనాన్ని కోల్పోకూడదు. దాన్నే విజయానికి చోదక శక్తిగా మలచుకోవాలి. సహనం వహించడం అంటే కేవలం వేచిచూడటం కాదు, వేచి ఉండే సమయంలో మంచి వ్యక్తిత్వాన్ని నిలుపుకోగలగాలి ..
.
No comments:
Post a Comment