Sunday, July 5, 2026

 *స్వధర్మం - సంఘ ధర్మం*

‘స్వధర్మో నిధనం శ్రేయః, పరధర్మో భయావహః’ అన్న గీతా శ్లోకానికి ఆధునిక వ్యాఖ్యానం ఏంటంటే - ఒక వ్యక్తి తన నైజానికి, సహజ స్వభావానికి అనుగుణంగా జీవించాలి. ఆ మార్గంలో ఇబ్బందులు పడినా నయమే గానీ ఇతరులను అనుకరించడం మాత్రం అత్యంత ప్రమాదకరం.

సమానత్వం, స్వేచ్ఛ వంటి విలువలపై నిర్మితమైంది నేటి సమాజం. స్వామి వివేకానంద, అరవింద మహర్షి, సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి ఆధునిక తాత్వికులు ‘స్వధర్మాన్ని’ కేవలం సామాజిక పాత్రగా, నైతిక బాధ్యతగానే కాక, మనిషి సహజ ప్రవృత్తికి అనుగుణమైన జీవనమార్గంగా చూశారు. జన్యుపరంగా వచ్చిన లక్షణాలు, పెరిగిన వాతావరణం వంటి అనేక కారణాల వల్ల ప్రతి ఒక్కరికీ తమదైన అంతరంగ స్వభావం సహజంగా ఏర్పడుతుంది. వయసు, జీవితానుభవాలను బట్టి ఇది కాలక్రమేణా మారుతుంటుంది. ఒక వ్యక్తి స్వధర్మం ఇదీ అని ఇతమిద్థంగా తేల్చడం కష్టం. నిరంతర స్వీయ పరిశీలన ద్వారా దీనిపై స్పష్టత వస్తుంది. పుట్టుకతో వచ్చే సహజ సామర్థ్యాలు, పెంపొందించుకున్న నైపుణ్యాలు, దీర్ఘకాలం నిలిచే అభిరుచులు, విసుగు లేకుండా, ప్రతిఫలం ఆశించకుండా చేసే పనులు- ఒకరి స్వధర్మాన్ని గుర్తించడానికి ఇవే ముఖ్యమైన గీటురాళ్లు. ఈ వ్యక్తిత్వ కోణాలను శాస్త్రీయంగా అంచనా వేయడానికి నేడు మనోవైజ్ఞానిక పరీక్షలు కూడా ఉన్నాయి.

అయితే- నేటి ప్రపంచంలో మార్కెట్‌ అవసరాలు, సామాజిక ఆకాంక్షలే విద్య, ఉపాధి, జీవనశైలిని ప్రధానంగా ప్రభావితం చేస్తున్నాయి. వ్యక్తి స్వధర్మానికి పెద్దపీట వేయగలిగే పరిస్థితులు అరుదు. ఫలితంగా, చాలామంది తాము నిజంగా ఉండాల్సిన స్థానానికి బదులు ఇతర పాత్రల్లో జీవించాల్సి వస్తోంది. దీర్ఘకాలంలో ఈ మౌలిక వైరుధ్యం ఒక లోతైన సంఘర్షణకు కారణమవుతుంది. వ్యక్తిలోని ఒక భాగం బయటి ప్రపంచంలో సమర్థంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. మరోభాగం లోలోపల మౌనంగా, అశాంతితో మిగిలిపోతుంది.

జపాన్‌లో ప్రసిద్ధమైన ‘ఇకిగై’ అనే జీవన దృక్పథం ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీని ప్రకారం, మనకు ఇష్టమైనది, బాగా చేయగలిగినది, ప్రపంచానికి అవసరమైనది, తగిన ప్రతిఫలం లభించేది- ఈ నాలుగు వృత్తాల కూడలిలోని కార్యకలాపాల్లోనే జీవితానికి అర్థం, ఆనందం లభిస్తాయి. కానీ, ఇది అందరి విషయంలో, అన్ని సందర్భాల్లో కుదరదన్నది వాస్తవం. ముఖ్యంగా, ప్రస్తుత ప్రపంచంలో- ఆర్థిక కారణాలు, కుటుంబ బాధ్యతలు, స్వీయ అవగాహనా లోపం, విఫలమవుతామనే భయం- ఇవన్నీ ప్రవృత్తిని వృత్తిగా మార్చుకునే మార్గంలో అవరోధాలుగా నిలుస్తున్నాయి. అయితే, స్వీయజ్ఞానం, స్వధర్మాన్ని గురించిన అవగాహన బలంగా ఉంటే పాక్షికంగానైనా దానికి అనుగుణంగా నడచుకోవచ్చు. ఈ సంతులనం సాధించడమే జీవన కళ అని చెప్పవచ్చు. దీనివల్ల వ్యక్తిగత స్థాయిలో తృప్తి, సంతుష్టి కలగడంతో పాటు సమాజంలో ఆయా రంగాల్లో సృజనకు దోహదపడుతుంది. అలా స్వధర్మాన్ని సంఘధర్మంతో మేళవించడంలోనే మనిషి జీవనసాఫల్యం దాగి ఉంది. 


꧁•••🪷•••┉┅━❀🕉❀━┅┉•••🪷•••꧂

No comments:

Post a Comment