365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో
♥️ *కథ* - *111* ♥️
మీరు ఏమి అవ్వాలని కోరుకుంటున్నారు?
*జియా*
ఖలీల్ గిబ్రన్ అందంగా చెప్పినట్లు, “మీరు వారికి మీ ప్రేమను ఇవ్వగలరు, కానీ మీ ఆలోచనలను కాదు…” దీనికి మనం సాక్షిగా ఉందాం.
ఇది నా జీవితంలో జరిగిన యధార్థ సంఘటన. ఈ కథ నవంబర్ నెలలో ఒక రోజున జరిగింది. అది నా కుమార్తె పాఠశాల నుండి వచ్చే సమయం, నేను ఆమె కోసం భోజనం సిద్ధం చేస్తున్నాను.
నా నాలుగేళ్ల కుమార్తె ఇటీవలే పాఠశాలలో చేరింది. ప్రతిరోజూ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, ఆ రోజు జరిగిన విషయాలన్నీ చాలా ఉత్సాహంగా, వివరంగా పంచుకునేది.
కానీ ఆ రోజు, ఏదో తేడాగా ఉంది. సాధారణంగా, ప్రతీరోజు తన స్కూల్ విశేషాలను పంచుకోవడానికి చాలా ఉత్సాహం చూపేది, ఈ రోజు చాలా నిశ్శబ్దంగా ఉండడమే కాకుండా ఆమె మనస్సులో ఏవో ఆలోచనలు తిరుగుతున్నట్లుగా నేను గ్రహించాను.
చాలా ఆసక్తిగా నేను,"జియా, ఈ రోజు ఎలా గడిచిందమ్మా?", అని అడిగాను.
స్పందించకుండా తన స్వంత ఆలోచనలలోనే మునిగివుంది.
నేను మళ్ళీ అడిగాను, "జియా ఏమి ఆలోచిస్తున్నావు?"
నన్ను చూసి,“అమ్మా, ఈరోజు నేను నా స్నేహితురాలు మాట్లాడుకుంటూండగా, ఆమె, తన తల్లి డాక్టర్ అని, తల్లిని చూస్తే తనకు చాలా గర్వంగా ఉంటుందని చెప్పింది. అమ్మా, నేను కూడా పెద్దయ్యాక డాక్టర్ ని కావాలనుకుంటున్నాను!", అని చాలా విశ్వాసంగా చెప్పింది.
నాకు చాలా ఆనందం కలిగింది. ఒక నాలుగేళ్ల చిన్నారి, కేవలం ఒక్క క్షణంలో తన సంపూర్ణ జీవితం గురించి ఆలోచించింది. నేను ఆమె ఆలోచనలను పరిమితం చేయదలుచుకోలేదు, నేను ఆమెను ఇంకేమీ అడగకుండా, "వెళ్లి కన్నయ్యను (కృష్ణుడు) ప్రార్థించు. ఆయన నీకు మార్గనిర్దేశం చేస్తాడు" అని మాత్రం చెప్పాను.
దృఢ నిశ్చయంతో ఉన్న ఆమె వెంటనే పూజ గదిలోకి వెళ్లి, సంతోషంగా ప్రార్థించింది.
కొన్ని రోజుల తర్వాత, ఇలాంటిదే ఇంకొకటి జరిగింది, ఆ రోజు ఆమె ముఖంలో నేను చూసిన అదే దృఢ నిశ్చయం మళ్లీ కనిపించింది.
నేను ఆమెను మళ్లీ అడిగాను, “ఈ రోజు ఎలా గడిచిందమ్మా?”
ఆమె ఇలా బదులిచ్చింది, “అమ్మా, నాకు డాక్టర్ అవ్వాలని లేదు. నేను ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను!"
లోలోపల నవ్వుకుంటూ, మార్గనిర్దేశం చేయమని కన్నయ్యను ప్రార్థించమని మళ్లీ చెప్పాను.
ఆమె చాలా ప్రేమతో కన్నయ్యను ప్రార్థించింది.
రెండు రోజుల తర్వాత మళ్లీ అదే జరిగింది. కానీ నేను అడక్కుండానే ఆమే స్వయంగా చెప్పింది, “అమ్మా, ఈసారి నేను సరిగ్గా నిర్ణయించుకున్నాను! నా ఇంగ్లీష్ టీచర్ అంటే నాకు చాలా ఇష్టం, నాకు ఆమెలా ఉండాలని ఉంది! నేను టీచర్ అవ్వాలని అనుకుంటున్నాను."
నేను ఆమె ఆలోచనలలో జోక్యం చేసుకోవాలనుకోలేదు. నేను తాను చెప్పేది వింటూ, ఆమె ప్రతి ఆలోచనలకు సాక్షిగా ఉన్నాను. కాబట్టి నేను నవ్వి, మళ్లీ కన్నయ్యను ప్రార్థించమని చెప్పాను.
ఈసారి అలా చెప్పగానే, నా వైపు వింతగా చూసి, ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళింది, కానీ ఆమె ఒక కలవరపాటుతో, అసంతృప్తిగా, కొంచెం కోపంగా ఉన్నట్లు కనిపించింది. నేను నా పనిలో మునిగిపోయాను.
కొద్దిసేపటికి అడుగులు చాలా దృఢంగా, స్థిరంగా వేస్తూ నా వద్దకు వచ్చి, నన్ను చూసింది, కానీ ఇప్పుడు తన కళ్ళలో ఉత్సాహం, ఆత్రుత కనిపించాయి. ఆమె ఇలా చెప్పింది, "నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అమ్మా. నేను ఏమవుదామని అనుకుంటున్నానో ఇప్పుడు ఖచ్చితంగా నిర్ణయించుకున్నాను."
అదే ఆత్రుతతో ఆమెవైపు చూస్తూ, "సరే! ఐతే నువ్వు ఏమవుదామని అనుకుంటున్నావో చెప్పు జియా?" అడిగాను.
"నేను కన్నయ్యగా మారాలనుకుంటున్నాను."
నేనూహించినదానికంటే మించి, చాలా దూరం ఆలోచించిన ఆమె వైపు చాలా ఆశ్చర్యంగా చూశాను.
ఆ రోజు నేను ఇంక ఆగలేక ఆమెను ఇలా అడిగాను, "జియా నువ్వు కన్నయ్యగా ఎందుకు మారాలనుకుంటున్నావు?"
"ఎందుకంటే నేను ఏది అవ్వాలనుకున్నా, దానికి నువ్వు సరే అని, వెళ్లి దాని కోసం కన్నయ్యను ప్రార్థించమని, తానే మార్గనిర్దేశం చేస్తాడని చెప్తున్నావ్. కాబట్టి, అందరికీ మార్గనిర్దేశం చేయగలగేదానిగా నేనే ఎందుకు అవ్వకూడదు?" అని ఆమె బదులిచ్చింది.
ఆ సమయంలో ఓ నాలుగేళ్ళ పాప తన ఆలోచనలతో నన్ను నిశ్శబ్ద పరిచింది! జియా నవ్వుకుంటూ ఆడుకోవడానికి వెళ్ళింది, కానీ ఆ క్షణంలో నా 'జియా' (హృదయం) దివ్య ప్రేమతో నిండిపోయింది, నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి!
మన ఆలోచన అత్యున్నతంగా ఉంటే, అది మనలని అత్యున్నతమైన దానితో అనుసంధానం చేస్తుంది - అన్న ఈ విషయాన్ని ఆమె ఎంత సులభంగా గుర్తించిందా అని నేను ఆశ్చర్యపోయాను.
♾️
అందరినీ ప్రేమించే ‘ఆయనని’ నీవు ప్రేమించు.🌼
బాబూజీ మహారాజ్
హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌
HFN Story team
No comments:
Post a Comment