Monday, September 7, 2026

 🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
        *ప్రాతఃస్మరణీయులు*
      ➖➖➖✍️

తల్లిదండ్రుల తరవాత ఆచార్యులే``` పూజనీయులని చెబుతుంది మన సంస్కృతి. 

*జన్మనిచ్చి పునీతమవుతుంది అమ్మ. 

*సొంతకాళ్ల మీద నడిచే శక్తి వచ్చే వరకూ పిల్లలకు ఆసరాగా ఉండి ఉత్తమ గతులు పొందుతాడు నాన్న. 

*ఏమి పొందినా, పొందకున్నా తనను నమ్మి అనుసరించిన వారిని వెలుగు దిశగా నడుపుతాడు గురువు.

*అనంతమైన ఈ ప్రకృతిలో మనిషే కాదు జీవం ఉన్న ఏ ప్రాణికైనా ఆకలి నిద్రా భయమైథునాలు సర్వ సామాన్యం. 
కానీ మనిషి మాత్రమే వివేచనశీలి. జ్ఞాన సముపార్జనకు అవకాశం ఉన్నవాడు. అందుకోసం సరైన గురువులు అవసరం. 

గర్వం, అహంకారం లేకుండా సత్యశీలత, త్యాగం, సమర్పణ భావం, నిష్పక్షపాతం, నిర్మొహమాటం కలిగిన సద్గురువులనే ఆచార్యులు అనడం సబబు.

*గురువులు అనేక రకాలు. కేవలం చదువు చెప్పేవారు సూచక గురువులు. వీరు మనందరికి తెలుసు. బాధ్యతగా చదువు చెప్పే ఉపాధ్యాయ వృత్తిలో ఉంటారు. 

*ఆశ్రమ ధర్మాలను బోధించేవారు వాచక గురువులు. జీవిక కోసం ఈయనను ఆశ్రయించడం అవసరం. 

*తర్వాతి వారు బోధక గురువులు. మహామంత్రాలను ఉపదేశించే మహాజ్ఞానులు. 
వీరు వసిష్ఠ,విశ్వామిత్రుల వంటివారు. మంత్రోపదేశం చేసే ఆచార్యులు. 

*తులసివనంలో గంజాయి మొక్కల్లా ఇంకొందరు ఉంటారు. వాళ్లను నిషిద్ధ గురువులుగా చెబుతారు. విపరీత బుద్ధులు కలిగిన వీళ్లు ప్రమాదకారులు. స్వార్థం కోసం సమాజాన్ని నాశనం చేసే విద్యావంతులు.

ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు. 

*ఇక, విహిత గురువు- విషయ భోగాల మీద విరక్తి కలిగించేవాడు. మనిషి బతికినంతకాలం వెంట ఉండి పాపం వైపునకు నెట్టే అరిషడ్వర్గాలపై విరక్తిని కలిగించి ఆధ్యాత్మికత వైపు నడిపించే సద్గురువు. ఆది శంకరులు అందుకు ఉదాహరణ. 

జీవబ్రహ్మైక్యాన్ని బోధించేవాడు కారణ గురువు. కేవలం కారణజన్ములకు మాత్రమే కారణ గురువులు లభిస్తారు. శ్రీరామచంద్రుడికి ఆదిత్య హృదయం ప్రసాదించిన అగస్త్యుడి మాదిరి అప్పటికప్పుడు కనిపించి బోధజేసి అదృశ్యమైపోతారు. 

*మానవ జీవనానికి ఓ కారణం ఉంటుంది. అది తెలుసుకోవాలంటే, కారణ గురువులు అవసరం. 

జీవాత్మ, పరమాత్మ ఒకటే అని ప్రత్యక్షానుభవాన్ని కలిగించేవారు పరమగురువులు. 
ఇది అత్యున్నత స్థితి. భారతీయ పరంపరలో ఎంతోమంది పరమ గురువులు ఉన్నారు. వారు ప్రపంచానికి మార్గదర్శనం చేసిన ఆత్మస్వరూపులు.

గురువులు ఎవరో, ఏమేం చేస్తారో తెలుసుకున్నాక, గురువు పట్ల శిష్యుల ప్రవర్తన ఎలా ఉండాలో కూడా తెలియాలి. 

వివేకం లేని విద్య, వినయం లేని వ్యక్తిత్వం వృథా. గురువు ఒక మణి దీపం. ఆలోచనల్లోని చీకటిని తొలగించే కాంతి పుంజం. కాబట్టి సద్గురువుల పట్ల గౌరవ ప్రపత్తులతో మెలగడం శిష్యుల కనీస బాధ్యత. 

*ఆధునికతకు ఆధ్యాత్మికతను అనుసంధానించి ఆలోచిస్తేనే జీవిత పరమార్థం అనుభవంలోకి వస్తుంది. అలాంటి దారిలో శిష్యకోటిని చెయ్యి పట్టుకుని నడిపించే సద్గురువులందరూ ప్రాతఃస్మరణీయులే!✍️```
` *సేకరణ* 
.        *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
         🌷🙏🌷
 `🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏`
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment