Monday, September 7, 2026

 *భట్టివిక్రమార్క కథలు-27*
(శ్రీ ఇచ్ఛాపురపు రామచంద్రం)
145/374

*అతనే ఆమె భర్త*

పట్టువదలని విక్రమార్కుడు మరల మోదుగ చెట్టునెక్కి భేతాళుడిని తాళ్ళతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు.

అప్పుడు శవంలోంచి భేతాళుడు, "విక్రమార్కమహారాజా! నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను. విను. అంటూ ఇలా ప్రారంభించాడు.

"రాజా! నిత్యానందమనే నగరముండేది. దానికి రాజు కీర్తికేయుడు. అతని పుత్రిక పుష్పవేణి.

ఒకనాడామె తలంటికుని మేడమీద తల ఆరబెట్టుకుంటూ అటూ యిటూ పచార్లు చేస్తూంటే.. ఆ వూరివాడే ధనస్వామి అనే విప్ర కుమారుడు హఠాత్తుగా ఆమెని చూసి ఆమె రూపలావణ్యాలకు ఆశ్చర్యపడి ఆమెను మోహించి విరహతాపం చెందసాగాడు. 

ఆమె కూడా అతనిని వలచి, తన వలపుని దూతిక ద్వారా అతనికి తెలియజేసింది. ఆమె కూడా తనని వలచినందుకతనెంతో సంతోషించాడు. కాని.. వారు కలుసుకుందుకు వీలుపడడం లేదు.

కొన్నాళ్ళు అలా గడిచాక ధనస్వామి పుష్పవేణి మీద మోహం తాళలేక ఒక సిద్ధుడు తటస్థపడగా అతని పాదాలమీద పడి వేడుకున్నాడు. ఆ సిద్ధుడికి, అతని మీద జాలివేసింది. "ఎలాగైనా రాజకుమార్తెతో కలిపి తన ప్రాణాలు నిలబెట్టమని పాదాలమీద పడిన ధనస్వామికి స్త్రీ వేషం వేసి రాజు దగ్గరికి తీసుకువెళ్ళాడు. 

రాజు నుంచి సత్కారాలు పొంది - "రాజా! నేనొక పనిమీద వెళ్తున్నాను. తిరిగి వచ్చి తీసుకువెళతాను.. అంతవరకూ యీ స్త్రీని మీయింట్లో ఉంచు.” అని కోరాడు. రాజు అంగీకరించి, అప్పుడే తన కుమార్తె వద్దకు అంతఃపురానికి పంపాడు. సిద్ధుడు వెళ్ళిపోయాడు.

ఆ రాత్రి, స్త్రీ వేషంలో ఉన్న ధనస్వామి రాజపుత్రికతో శయనించి ఎంతో సంతోషించి అతనితో జరిగినది చెప్పగా, ఆమె అతని చాతుర్యానికి సుఖాలను భవించసాగింది. ఇలా జరుగుతూండగా

ఒక రాజపుత్రుడు స్త్రీ వేషంలోని ధనస్వామిని చూసి ఆమెను తనకిచ్చి పెళ్ళి చేయమని రాజునడిగాడు. 

సిద్ధుడు వెళ్ళి చాలాకాలం అవడంతో అతను తిరిగొస్తాడో రాడో అని సందేహించి రాజు ఆ వివాహం జరిపించేశాడు. అప్పటికి పుష్పవేణి నాలుగు మాసాల గర్భవతి. 

కపట స్త్రీని రాజకుమారుడు పడకగదిలో కలియబోతే- ఆమె దూరంగా తొలగి - "అయ్యో! నన్ను ముట్టుకోకండి. నన్నొక మహాభూతం ఆవేశించింది. అది అప్పుడప్పుడు ఆవహించి 'నిన్ను పెళ్ళాడినవాడు తీర్థయాత్ర చేసివస్తే నిన్ను వదులుతాను అప్పుడు సుఖంగా ఉండొచ్చు.' అంటూ ఉంటుంది. కాబట్టి, తొందరపడక యాత్రకి వెళ్ళివచ్చి భూత బాధ వదిలాక నన్ను కూడి సుఖించు." అంది. ఆ మాటలు నిజమే అని నమ్మి అతను తీర్ధయాత్రలకి పోయాడు. అప్పుడు ధనస్వామి తప్పించుకుపోయి ఆడవేషం తీసేశాడు. ఎప్పటిలా తిరగసాగాడు.

కొద్దిరోజులకే సిద్ధుడు ఒక యువకుడిని వెంటబెట్టుకుని రాజు వద్దకు వచ్చి - "రాజా! నీ కప్పగించి వెళ్ళిన యువతిని పంపు. ఇతని నామెకిచ్చి పెళ్ళి చేయాలి." అన్నాడు.

రాజు భయపడి, అతని పాదాలమీద పడి - "అయ్యో! మీరింక రారనుకుని తప్పుచేశాను. మీరు నా వద్ద వదలిన యువతికి బదులుగా నా కుమార్తెనిస్తాను. తీసుకుపొండి." అని జరిగినది చెప్పాడు. సిద్ధుడు సరేనని పుష్పవేణిని తీసుకుపోయి తాను తీసుకువచ్చిన యువకుడికిచ్చి
పెళ్ళి చేశాడు. 

అది తెలిసిన ధనస్వామి వేగంగా వచ్చి పుష్పవేణిని పెళ్ళాడిన వాడి వద్దకు వెళ్ళి ఆమె తన భార్య అనీ, తనవల్ల గర్భం దాల్చిందనీ కలహానికి దిగాడు. పుష్పవేణి తన భార్య అని ధనస్వామి, తన భార్య అని కొత్తవాడూ వివాదానికి దిగగా సిద్ధుడు వచ్చి తగవు తీర్చాడు.

విక్రమార్కా! పుష్పవేణి ఆ యిద్దరిలో ఎవరి భార్య కావడం యుక్తం!" అడిగాడు భేతాళుడు.

"ధనస్వామి దొంగ భర్త. రెండవవాడు విద్యుక్తంగా పెళ్ళాడాడు. కనుక అతనే ఆమె భర్త.” అని చెప్పాడు విక్రమార్కుడు.

విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే భేతాళుడు కట్లు విడిపించుకుని రివ్వున ఎగిరిపోయి మోదుగ చెట్టుకొమ్మకి తలకిందులుగా వ్రేలాడసాగాడు.

విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు.

*గరుడ - నాగకుమారుల కథ*

పట్టువదలని విక్రమార్కుడు మరల మోదుగ చెట్టునెక్కి భేతాళుడిని తాళ్ళతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు.

అప్పుడు శవంలోంచి భేతాళుడు, “విక్రమార్కమహారాజా! నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను. విను. అంటూ ఇలా ప్రారంభించాడు.

రత్నపురం అనే పట్నాన్ని సుధర్ముడనే రాజు పాలించేవాడు. సకల సద్గుణాలూ కల అతనిని ప్రజలందరూ ప్రశంసించేవారు.

అతని రాజ్యానికి కొంత దూరంలో గొప్ప అరణ్యముండేది. దానిలో ఉండే సర్పాలను గరుత్మంతుడు వచ్చి యిష్టమొచ్చినన్ని తిని,
పట్టుకుపోతూండేవాడు. అందువల్ల అతనెప్పుడొచ్చి ఏ సర్పాలను చంపుతాడో అని తల్లడిల్లుతూ, ఆ ఉపద్రవం తప్పించుకుందుకు పాములన్నీ ' సమావేశమై ఒక తీర్మానం చేసుకుని, పక్షి రాజు రాగానే నమస్కరించి అతని అనుమతి పొంది - "అయ్యా! నువ్వు ప్రతిరోజూ యిచ్చవచ్చినన్ని సర్పాలని చంపిపోతూండడం వల్ల తొందరలోనే ప్రపంచంలో ఒక్క పాముకూడా కనపడకపోవడం తథ్యం. అప్పుడు నువ్వేం తింటావు? 

రోజూ అనేక సర్పాలని చంపడం న్యాయం కాదు. మేము మనవి చేసేదేమిటంటే - ప్రతీరోజూ మేము వరసప్రకారము మాలో ఒకరం నీకు ఆహారమౌతాం. తినిపో. అలాఐతే మా జాతి కొంతకాలం లోకంలో నిలచి ఉంటుంది.' అని ప్రార్థించాయి. గరుడుడు కనికరించి అంగీకరించాడు. ఆ వేళ నుంచీ రోజుకొక పామునే తిని పోసాగాడు.

ఇలా చాలా రోజులు జరిగాక శంఖచూడుడనే సర్పం వంతు వచ్చింది. తల్లికి అతనొక్కడే కుమారుడు. కనుక తన ఏకైక పుత్రుడు మరణించవలసి వచ్చినందుకు ఎంతో విచారిస్తూ విలపించసాగింది.

ఆ సమయంలో - సుధర్మమహారాజు వేటకు వచ్చి ఆ అరణ్యంలో తిరుగుతూ ఆర్తనాదాలు విని వచ్చి.. కొడుకుని ముందుపెట్టుకుని ఏడుస్తున్న సర్పమాతని చూసి ఆశ్చర్యపడి విషయమేమిటని అడిగాడు.

ఆమె అంతా చెప్పి - "రాజా! ఒక్కడే కుమారుడు. ఇతనికి చావు మూడడం వల్ల పుత్ర వ్యామోహంతో దుఃఖిస్తున్నాను. దీనిని తప్పించడం ఎవరితరం? నువ్వేం చెయ్యగలవు?" అంది నిరాశగా.

అందుకు సుధర్ముడు - "అమ్మా! చింతింపకు. నీ కుమారుడిని బదులుగా నేను గరుడుడికి ఆహారమౌతాను.” అన్నాడు. "అయ్యా! మా
కోసం నీప్రాణాలు కోల్పోడం న్యాయం కాదు. వద్దు. మా కర్మ ఎలా ఉంటుందో అలా ఔతుంది." అని అందామె కాని రాజు వెనకాడలేదు.

అంతలో వాడుక ప్రకారం గరుడుడు ఆహారం కోసం వచ్చాడు. 

శంఖచూడుడు తల్లికి మొక్కి గరుడుడికి కబళమవడానికి తయారవుతూంటే రాజు అతని కడ్డుపడి ముందు గరుడుడి వద్దకు వచ్చి - "వైనతేయా! నేను సిద్దంగా ఉన్నాను. 

నా మనవి విని యివాళి వంతుకి శంఖచూడుడుని వదలి అతనికి బదులు నన్ను నీ ఆహారంగా తీసుకుని తృప్తిపడు." అని ప్రార్థించాడు. 

గరుత్మంతుడా రాజు పరోపకారచింతనకీ, దయాగుణానికీ ఎంతో సంతోషించి “ఓ రాజా! నీ పరోపకార తత్పరతకి ఎంతో సంతోషించాను. వరమడుగు యిస్తాను." అన్నాడు.

రాజతనికి నమస్కరించి "వక్షేశ్వరా! వరం ప్రసాదించదలుచుకుంటే - నేడు మొదలు యీ అడవిలోని పాములను తినడం మాను. ఇదే నా కోరిక." అని ప్రార్ధించాడు. గరుత్మంతుడు అందుకంగీకరించి వెళ్ళిపోయాడు.

శంఖచూడుడూ, అతని తల్లీ తమకి మహోపకారం చేసి రక్షించిన రాజుని పొగుడుతూంటే ఆ విషయం తెలిసి పాములన్నీ తమ కులాన్ని రక్షించిన ఆ రాజుని స్తుతించాయి.

విక్రమార్క మహారాజా! సుధర్మ, గరుత్మంతులలో ఎవరధికులు? అని భేతాళుడు అడుగగా - "రాజుకి దయ, పరోపకారబుద్దీ సహజగుణాలే కనుక ప్రాణహాని చెందే నాగకుమారులకి ఉపకారం చేశాడు. 

కాని.. గరుడుడు తన కాహారం కావలసిన నాగునే కాక అక్కడి సర్పాలను చంపనని వరమిచ్చి ఆకలి భరించి వెళ్ళిపోయాడు. కనుక అతనే అధికుడు.” అన్నాడు విక్రమార్కుడు

విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే భేతాళుడు

కట్లు విడిపించుకుని రివ్వున ఎగిరిపోయి మోదుగ చెట్టుకొమ్మకి తలకిందులుగా వ్రేలాడసాగాడు.

విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు.

(సశేషం)

No comments:

Post a Comment