Monday, September 7, 2026

 *భట్టివిక్రమార్క కథలు-2*
(శ్రీ ఇచ్ఛాపురపు రామచంద్రం)

*విక్రమార్కుడి సింహాసనం*

"భోజరాజా! ఈ సింహాసనం ఎక్కాలని కుతూహలంగా వచ్చావు కానీ, దీనినధిరోహించడం కాని, దీనిమీద కూర్చోడంకాని సామాన్యులకి సాధ్యంకాదు. సాహసం, వితరణ మొదలయిన గుణ సంపదలకీ, ప్రపంచంలో అతి ప్రఖ్యాతి కాంచినవాడూ అయిన. విక్రమార్కుడి సింహాసనమిది.

దీనిని అధిరోహించడానికి అతనూ, అతనితో సమానులూ మాత్రమే అర్హులు. 

ఇది మానవులు నిర్మించినది కాదు. దేవేంద్రుడి చేత విక్రమార్కుడి కివ్వబడినది. అతను గతించాక యిది పూడ్చిబెట్టబడింది.

నాలాగే యీ సింహాసనం మీదున్న ముప్పయి రెండు బొమ్మలూ మాట్లాడగలవు. బొమ్మలమైనా, మేము మాట్లాడేశక్తి కలిగి ఉండడానికి కారణం లేకపోలేదు. నీకు మెల్లగా అన్ని విషయాలూ తెలుస్తాయి. నేనిప్పుడు చెప్పేదేమిటంటే-

నాలుగు దిక్కుల చివరల వరకూ కీర్తి వ్యాపించినవాడూ, అరవైనాలుగు కళలలోనూ ప్రవీణుడూ, సాహసం, వితరణ మొదలయిన సుగుణాలను సంపూర్ణంగా కలిగినవాడూ అయిన విక్రమార్కుడి లక్షణాలు నీకుంటే - యీ సింహాసనం ఎక్కు. లేదా, వెళ్ళిపో. 

నా మాటలను కాదని ఎక్కబోయావో నీకు హాని కలుగుతుంది. ఆలోచించకుండా.. తొందరపడి ఏపనీ చేయకూడదని గుర్తుంచుకో.” అంది.

భోజరాజుకి ఆ మాటలు వినడంతో కలిగిన ఆశ్చర్యం అంతా యింతా కాదు. సభలో ఉన్నవారూ అలాగే ఆశ్చర్యంలో ములిగిపోయారు.

భోజరాజు ఆ ప్రతిమను చూస్తూ “ఓ బొమ్మా! నీ మాటలు వింటూంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. 

విక్రమార్కుడని నువ్వు చెప్పావే, అతని చరిత్ర నేనెరుగను. అతని గుణాలవంటివి నాలో ఉన్నాయో లేదో నువ్వే నిర్ణయించాలి. నువ్వు సమర్థురాలి వనిపిస్తూంది. విక్రమార్కుడి చరిత్ర చెప్పు.” అన్నాడు.

అందుకా ప్రతిమ “రాజా! విక్రమార్కుడి గుణగణాలు వర్ణించడం నా తరం కాదు. అయినా నాశక్తిమేరకు చెబుతాను.” అంటూ చెప్పసాగింది.

*1వ బొమ్మ చెప్పిన కథ* :-

ఈ భూమిమీద ఎంతో ప్రసిద్ధి చెందిన నందిపురం అనే పట్నం ఉండేది. 

ఆ పట్నంలో - వేద పారంగతులైన విప్రులూ, శత్రుభయంకరులైన క్షత్రియులూ, విశేషముగా వ్యాపారంచేసే వైశ్యులూ, సత్ప్రవర్తన వల్ల శూద్రులూ ఎందరో ఉండేవారు.

ఆ పట్టణములోని విప్రులలో చంద్రవర్ణుడనేవాడు ఉండేవాడు. 

అతను చాలా అందమైన వాడు. అతను నాలుగువేదాలూ, ఆరుశాస్త్రాలూ, పద్దెనిమిది పురాణాలూ, ఎన్నో గాధలూ చదివినా తృప్తిలేక ఇంకా విద్యారహస్యాలు తెలుసుకోవాలని తగిన గురువులని వెదుక్కుందుకు ఒక శుభ ముహూర్తంలో యిల్లు వదలి బయలుదేరాడు.

ఎన్నో దేశాలు తిరిగినా తగిన గురువు కనిపించక నిరాశతో వెనుతిరిగి తనవూరు వచ్చెయ్యసాగాడు.

చాలాదూరం నడవడం.. తగిన ఆహారం లేకపోవడం.. తీక్షణంగా ఎండ కాస్తూండడం.. వీటివల్ల అతను నడవలేక.. దాహ బాధతో నీటికోసం వెదుకుతూ ఎంతో కష్టంమీద నడుస్తూంటే - ఒక చెరువు కనిపించింది. దానితో.. అతనికి పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్లయి, ఆ తటాకంలో స్నానం చేసి, కడుపునిండా నీరు తాగి, ఆ సరస్సు ఒడ్డున నీడనిస్తున్న రావి చెట్టుని చూసి దానికిందకి నడిచి, ఆ చెట్టువేరు మీద తలపెట్టుకుని నిద్రపోయాడు.

మానవ సంచారం లేక నిశ్శబ్దంగానూ, ప్రశాంతంఁ నీడపట్టున చల్లగానూ ఉండి చక్కగా రావి ఆకులు గాలి వీస్తుంటే అతనికి గాఢంగా నిద్రపట్టేసింది.

ఆ రావి చెట్టుమీద చాలాకాలం నుంచీ ఒక రాక్షసుడు ఉంటున్నాడు: ప్రతీరోజూ మధ్యాహ్నం అతను మానవరూపంలో చెట్టుదిగి వస్తూంటాడు. 

ఆ వేళ కూడా అలాగే వచ్చిన ఆ రాక్షసుడు చెట్టుమొదలున నిద్రపోతున్న బ్రాహ్మణుని చూసి చాలా ఆశ్చర్యపడి తన పనులు చూసుకుని తిరిగివచ్చి అప్పటికీ నిద్రలోనే ఉన్న అతనిని చూసి.. అతని సంగతేమిటో తెలుసుకోవాలని అతన్ని నిద్రలేపాడు.

తన ముందు నిలబడిన, కళ్ళు తెరచిన చంద్రవర్ణుడు మహాతేజస్వి అయిన బ్రహ్మరాక్షసుణ్ణి చూసి, భయంతోనూ ఆశ్చర్యంతోనూ నమస్కరించాడు. 

అప్పుడా రాక్షసుడు "ఓ బ్రాహ్మణుడా! నువ్వెవరివి? నీదే ఊరు? ఈ నిర్జన ప్రదేశానికెందుకు వచ్చావు? ఇక్కడెందుకు నిద్రపోతున్నావు? నీ వృత్తాంతం ఏమిటి?” అని ప్రశ్నలు కురిపించాడు.

చంద్రవర్ణుడు చాలా వినయంగా తన కథ చెప్పాడు. “తిరిగి తిరిగి చాలా అలసిపోడం వల్ల ఒళ్ళు మరిచి నిద్రపోయి తమ రాకను గమనించలేకపోయాను. నా తప్పుని క్షమించండి.” అని ఆ రాక్షసుణ్ణి వేడుకున్నాడు.

అతని కథవిన్న రాక్షసుడికి - అతనికి విద్యలో ఉన్న ఆసక్తికి విస్మయం కలిగింది. 

“చంద్రవర్ణా! నువ్వు చాల బుద్ధిమంతుడివి. నీకు విద్యలో కల ఆసక్తి మెచ్చుకోదగింది. 

ఎన్నో చదివినా, యింకా తెలుసుకోవాలని గురువు కోసం దేశదేశాలూ తిరిగావు. అయినా నీప్రయత్నం ఫలించలేదు. నీ మీద నాకు జాలేస్తూంది. నువ్వడక్కుండా నీకు నా చరిత్ర చెప్పి, యోగ్యుడివైన నీకొక ఉపకారం చేయదలుచుకున్నాను." అన్నాడు. 

“మహాప్రసాదం -” అన్నాడు చంద్రవర్ణుడు

*బ్రహ్మరాక్షసుడి కథ*

"చంద్రవర్ణా! నా రూపం చూసి నన్నో ఋషి గా అనుకుని ఉంటావు. కాని నేను అలాటి గొప్పవాడిని కాదు. ఇది నా అసలు రూపం కాదు. కామరూప విద్య ఎరిగిన నేను నువ్వు నన్ను చూసి భయపడతావని మనుష్యరూపం ధరించానే తప్ప, నా నిజరూపం చాలా భయంకరమైనది.

నేనొక బ్రహ్మరాక్షసుడిని.

పరకాయప్రవేశం వరకూ సకలవిద్యలూ నేర్చుకున్న మహావిద్వాంసుణ్ణి. ప్రసిద్ధులైన పండితులందరినీ వాదంలో ఓడించి పేరుప్రఖ్యాతులు సంపాదించి గర్వంతో మిడిసిపడేవాణ్ణి. 

నాకు తెలియని విద్య ప్రపంచంలో లేదు. 

ఒకనాడు.. వేదాంతం జరుగుచున్నపుడు.. నేనొక మునిపర్యుడి మాట వినక, తిరస్కరించి, వేళాకోళం చేశాను. 

అందుకతను కోపగించి, "నువ్వు విద్యాగర్వంతో తరతమ భేదాలు తెలుసుకోకుండా నన్ను హేళన చేశావు కనక బ్రహ్మరాక్షసుడివై ఉండు. నీవిద్య నిరుపయోగమగుగాక ” అని ఘోరంగా శపించాడు.

నా ప్రవర్తనకు పశ్చాత్తాపపడి, ఆ మునికి నమస్కరించి “మహాత్మా! పాండిత్యం ఉన్నా ఉచితానుచితాలు పాటింపక మిమ్మల్ని చులకన చేశాను. నా అజ్ఞానానికి తగిన ఫలమే సంభవించింది. శాపం విధించేశారు కనక అనుభవింపక తప్పదు. విచారించి ప్రయోజనం లేదు. 

నా మీద కరుణించి, నా నేరాలను క్షమించి, శాపవిముక్తి అనుగ్రహించ అని వినయంగా ప్రార్ధించాను.

ఆ ఋషి కోపం వదిలి కనికరించి - "నా శాపం అనుభవించక తప్పదు. బ్రహ్మరాక్షసుడివై కొన్నాళ్ళున్నాక విద్యార్థి అయిన ఉత్తమ బ్రాహ్మణుడొకడు నువ్వున్నచోటికి తనంతటతానే రాగలడు. 

అతనికి నీ చరిత్ర చెప్పి విద్యారహస్యాలు ఉపదేశిస్తే నీ రాక్షసత్వం పోతుంది. అప్పటికి నీ ఆయువు కూడా పూర్తయి స్వర్గానికి వెళ్తావు." అని చెప్పాడు. 

అతనే నన్నిక్కడ ఉండమన్నాడు. నేను బ్రహ్మరాక్షసుడనై వచ్చి యీ రావిచెట్టుమీద నివసిస్తున్నాను. నేనిక్కడికి వచ్చి చాలా సంవత్సరాలయింది. 

ముని చెప్పిన బ్రాహ్మణుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాను. నా శాపం తీరే సమయం రాబట్టే దేవుడు నిన్నిక్కడికి పంపాడు. 

బ్రాహ్మణోత్తమా! ఇదే నా చరిత్ర. 

ఇంక - నేను చేద్దామనుకునే ఉపకారం చెబుతాను, విను. 

నువ్వు ఏ విద్యలు కోరుకుని దేశదేశాలూ తిరిగి నిరాశ చెందావో, ఆ కోరికను నేను నీకు సంపూర్ణంగా సిద్ధింపచేస్తాను. నీకు విద్యాదానం చేసి నేను శాపవిముక్తుడి నౌతాను. నువ్వు నా దగ్గర చదువుకుంటున్నంత కాలమూ నేను మానవాకారంతోనే కనిపిస్తాను.”

అది వినగానే చంద్రవర్ణుడికి ఆశ్చర్యం, భయం, సంతోషం ఒక్కసారే కలిగాయి. 

చిట్టచివరికతనెలాగో ధైర్యం తెచ్చుకుని, రాక్షసుడి ముందు తలవంచుకుని "అయ్యా! అల్పుడైన నా మీద మీకిలా అభిమానం కలగడం నా పూర్వ జన్మ పుణ్యమే. 

తలవని తలపుగా నాకు మహాశక్తి సంపన్నులయిన మీరు గురువుగా లభించి విద్యాదానం చేస్తామని వాగ్దానం చేసి - నన్ను ధన్యుణ్ణి చేశారు. 

మీకు శిష్యుడినయ్యే భాగ్యం దేముడి దయవలన సిద్ధించింది. కరుణించి నన్ను కృతార్థుడిని చెయ్యండి.” అన్నాడు.

(సశేషం)

20

No comments:

Post a Comment