*భట్టివిక్రమార్క కథలు-29*
(శ్రీ ఇచ్ఛాపురపు రామచంద్రం)
155/374
*మృతజీవి కథ*
పట్టువదలని విక్రమార్కుడు మరల మోదుగ చెట్టునెక్కి భేతాళుడిని తాళ్ళతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు.
అప్పుడు శవంలోంచి భేతాళుడు, "విక్రమార్కమహారాజా! నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను. విను. అంటూ ఇలా ప్రారంభించాడు.
సర్వసిద్ధి గ్రామంలో శారద, శిరోమణి అనే బ్రాహ్మణ దంపతులుడేవారు.
వారికి లేకలేక కలిగిన పుత్రుడికి సకల విద్యలూ నేర్పించారు. యౌవనం రాగానే పెళ్ళి ప్రయత్నాలు చేస్తూంటే ఏదో రోగమొచ్చి అతను చనిపోయాడు. అతని మరణానికి తల్లితండ్రులేకాక అగ్రహారంలోని వారందరూ కూడా దుఃఖించారు.
శవాన్ని బంధువులు చితిమీద పెట్టడానికి ప్రయత్నిస్తుంటే పరకాయ ప్రవేశవిద్య తెలిసిన సన్యాసి ఒకడు అటుపోతూ విషయం తెలుసుకుని.. తన శరీరాన్నొక పొదలో వదలి విప్రకుమారుడి కళేబరంలో ప్రవేశించాడు. తక్షణమే శవం లేచికూర్చుంది. ఆ వింత చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు.
చచ్చిబతికిన బ్రాహ్మణ కుమారుడు వాళ్ళని చూసి మొదట ఏడ్చి తరవాత నవ్వాడు. బంధువుల కతని అభిప్రాయం తెలియక.. ఏమీ పట్టించుకోక అతన్ని యింటికి తీసుకుపోయారు.
రాజా! అతని ఏడుపుకీ, నవ్వుకీ కారణమేమిటో చెప్పగలవా?" అడిగాడు భేతాళుడు.
"తల్లిగర్భంలో జన్మించింది మొదలు ఎన్నో కష్టాలనుభవించిన శరీరాన్ని విడిచాను కదా అని దుఃఖం, మళ్ళీ వయసువాడి శరీరంలో ఉండడం లభించింది కదా అన్న ఆనందం ఈ రెండూ సన్యాసి ఆత్మకి కలగడం వల్లనే ఆ ఏడుపూ, నవ్వూ బ్రాహ్మణకుమారుడికి వచ్చాయి.” అని చెప్పాడు విక్రమార్కుడు.
విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే భేతాళుడు కట్లు విడిపించుకుని రివ్వున ఎగిరిపోయి మోదుగ చెట్టుకొమ్మకి తలకిందులుగా వ్రేలాడసాగాడు.
విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు.
*ఒక మోహనాంగీ - ముగ్గురి మృతి*
పట్టువదలని విక్రమార్కుడు మరల మోదుగ చెట్టునెక్కి భేతాళుడిని తాళ్ళతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు.
అప్పుడు శవంలోంచి భేతాళుడు, "విక్రమార్కమహారాజా! నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను. విను. అంటూ ఇలా ప్రారంభించాడు.
మృగాంకుడనే క్షత్రియ కుమారుడు పనిమీద పొరుగూరు వెళ్ళి అరణ్యమార్గంలో వస్తూ ఒక చెట్టుకింద సౌందర్యవతి ఒకతె ఏడుస్తూ కూర్చోడం చూశాడు.
అతనాశ్చర్యపోయి, ఆమె నోదార్చి మెల్లగా ఆమె పేరూ, వూరూ, అలా ఎందుకు ఒంటరిగా కూర్చుని ఏడుస్తూందో అడిగాడు.
అప్పుడామె - "నేనొక వైశ్యుని కుమార్తెను నా పేరు మోహనాంగి నా తల్లి నా చిన్నతనంలోనే చనిపోయింది.
నా తండ్రికి నేనొక్కతెనే మరి సంతానం లేదు. అతనే నన్ను పెంచి పెద్ద చేశాడు. నేనింకా అవివాహితనే.
నా నివాస స్థలం యిక్కడికి రెండామడల దూరంలోని కుగ్రామం. బంధువులని చూసి రావడానికి దూరపు ఊరికి నేనూ మా తండ్రీ వెళ్ళాం.
వస్తూంటే దొంగలిక్కడ మమ్మల్నడ్డగించి నా తండ్రిని చంపి, నా అభరణాలన్నీ పట్టుకుపోయారు.
వాళ్ళ పుణ్యాన నన్ను మానభంగం చేయలేదు. దిక్కులేక ఒంటరిగా మిగిలి.. ఏంచెయ్యాలా అని ఏడుస్తున్నాను.” అంది.
ఆమెమీద మనసుపడిన మృగాంకుడు “జరిగినదానికి విచారించి లాభంలేదు. నిన్ను మా వూరు తీసుకెళ్ళి పెళ్ళి చేసుకుని సుఖపెడతాను రా.” అన్నాడు. ఆమెకు కూడా అతనిమీద వలపుకలిగి
అతనితో పాటు గుర్రమెక్కింది.
కొంతదూరం వెళ్ళాక మరో దొంగల గుంపు వారినడ్డగించింది. మృగాంకుడు ఆమెని గుర్రం మీదే ఉండమని కత్తితీసి వారితో ఘోరంగా పోరాడి అందరినీ చంపేశాడు.
సాయంత్రాని కొక గ్రామం కనపడగా మోహనాంగినినీ, గుర్రాన్నీ ఆ వూరు మొదలు పాడుగుడిలో ఉంచి.." ఊళ్ళో కెళ్ళి ఆహారం తెస్తాను." అని వెళ్ళాడు.
అతనా వూరిలోని వీధిలో వెళ్తూంటే ఒక వేశ్య అతని చక్కదనానికి మోహించి యింట్లోకి పిలిచి అతనిని కామకేళిలోకి దించింది. ఆ సుఖాలలో అతను మోహనాంగి మాట మరచిపోయాడు.
మర్నాడు ఉదయం మోహనాంగి మృగాంకుణ్ణి వెదకడానికి ఊరిలోకి వెళ్ళబోతూంటే - దారినపోతున్న ఒక వైశ్య వయసుకాడామెను చూసి.. దగ్గరకు వచ్చి వృత్తాంతం అడిగాడు. ఆమె అంతా చెప్పింది.
"అయ్యో! అబలా! దారినపోయేవాడిని నమ్మివచ్చి ఎన్ని చిక్కులు పడ్డావు! అతను రావడం కల్ల. నీ మీద ప్రేమున్నవాడే అయితే రాత్రి నిన్నీ పాడుగుడిలో ఒంటరిగా వదిలి ఉంటాడా? అతని మీద ఆశ పెట్టుకోవడం వృధా. నా వెంటరా. ఎంతో సుఖపెడతాను.” అని ఎన్నో ఆశలు పెట్టాడు.
దిక్కుతెలియక కలతపడి ఉన్న ఆమె అతనితో వెళ్ళి అతన్ని పెళ్ళిచేసుకుంది. వాళ్ళిద్దరూ మంచంమీద పడుకుని ఉండగా ఒక ఎలక పడితే దానిని తను చంపి.. ఎంతో గొప్పపని చేసినట్లు పదేపదే చెప్పసాగాడు.
ఆ మాటలు ఆమెకు అసహ్యం కలిగించి "ఎలకని చంపినందుకే నిన్ను నువ్వు యింతగా పొగుడు కుంటున్నావు!
అంతమంది దొంగలను ఒంటిచేత్తో చంపిన ఆ క్షత్రియ కుమారుడు ఒక్కమాటైనా అనలేదు.
అల్పుడివి కనుకనే యిలా డంబాలు పలుకుతున్నావు. నీలాటి అయోగ్యుడికి
భార్యగా బతకడం కంటె చావడం మేలు" అని తటాలున ఉరిపోసుకుని మరణించింది.
తన అవివేకానికి చింతించి అలాటి భార్యలేనప్పుడు తను బతకడం వృధా అని వైశ్యుడూ ఉరిపోసుకుని చచ్చాడు.
వారంరోజులయ్యాక మృగాంకుడికి మోహనాంగి గుర్తుకొచ్చింది.
ఎంతో దిగులుతో వేశ్యయిల్లు వదలి గుడివద్దకు వచ్చాడు. అక్కడ ఆమె లేదు. ఎక్కడికి పోయిందో తెలియలేదు. తన అవివేకానికి దుఃఖిస్తూ మోహనాంగినే స్మరిస్తూ అతనక్కడే ఉండి ప్రాణాలువదిలాడు.
అతని మీద ఎంతో అనురాగంకల వేశ్య అతను తనని విడచి వెళ్ళినందుకు ఎంతో బాధపడి కృశించి ప్రాణాలువదిలింది. ఇలాగ మోహనాంగి మరణం వలన ముగ్గురు మరణించారు.
విక్రమార్కమహారాజా! ఆ ముగ్గురిలోనూ ఎవరి మరణం చెప్పుకోదగినది?” అడిగాడు భేతాళుడు.
దానికి రాజు “మొదటి ముగ్గురూ ఒకరిపై ఒకరికి కలిగిన ప్రేమ, మోహం వలన చనిపోయారు. కాని ఏ సంబంధమూ లేనిది వేశ్య.. మృగాంకుడు పోతే మరొకడు వస్తాడని తలచక అతనికోసమే మరణించిన వేశ్యదే ప్రత్యేకంగా చెప్పుకోవలసింది.” అని చెప్పాడు విక్రమార్కుడు.
విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే భేతాళుడు కట్లు విడిపించుకుని రివ్వున ఎగిరిపోయి మోదుగ చెట్టుకొమ్మకి తలకిందులుగా వ్రేలాడసాగాడు.
విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు.
(సశేషం)
No comments:
Post a Comment