Monday, September 7, 2026

 *పదిమంది సూర్యుల కథ*  (చైనా జానపద కథ) - డా. ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*******************
చందమామలో ఒక ముసలవ్వ ఉంటుందని చిన్నప్పుడు మనకు చాలామంది చెప్పేవాళ్ళు కదా... అలాగే చైనా దేశంలో ముసలవ్వ కాదు ఒక అందమైన దేవత ఉంటుందని వాళ్ళు నమ్ముతారు. చైనా పురాణాలలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఒకప్పుడు చైనాలో పదిమంది సూర్యులు ఉండేవారట. వీరంతా స్వర్గలోకానికి అధిపతి అయిన జేడ్ చక్రవర్తి కుమారులు. ఈ పదిమంది సూర్యులు తూర్పు సముద్ర తీరంలో వున్న ఒక పెద్ద కొండ మీది చెట్టు పైన నివసిస్తూ ఉండేవాళ్లు. ఒక్కొక్కరోజు ఒక్కొక్క సూర్యుడు రథం మీదికి ఎక్కి భూమి చుట్టూ ఆకాశంలో తిరుగుతూ, లోకానికి వెలుగును, వెచ్చదనాన్ని ఇస్తూ ఉండేవాళ్లు. మిగిలిన తొమ్మిదిమంది ఆ చెట్టుకింద హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఆడుతూ పాడుతూ గడిపేవాళ్ళు. దాంతో ప్రపంచమంతా ప్రశాంతంగా ఉండేది. కానీ ఒకసారి ఈ పదిమంది సూర్యులకు అలా ఒక్కొక్కరే ఒంటరిగా పోయి రావడం విసుగనిపించింది. దాంతో అందరూ కలసి ఒకేసారి పోయి ఒకేసారి రావాలని అనుకున్నారు. తర్వాతరోజు నుంచి పదిమంది కలసి పొద్దున్నే రథం పైన పోవడం మొదలుపెట్టారు.
ఒక్క సూర్యుని వేడిని భరించడమే చాలా కష్టం. అట్లాంటిది పదిమంది సూర్యులు కలసి ఒకేసారి ఉదయిస్తే ఎట్లా ఉంటుంది. ఆ వేడికి రాళ్లు సైతం వేడెక్కి సలసల మరిగి కరిగిపోసాగాయి. చెరువులు, నదులు, సముద్రాలలోని నీళ్లు ఆవిరై ఎండిపోసాగాయి. పంటలు మండి బూడిద అయిపోసాగాయి. జంతువులు మనుషులు పురుగుల్లా మాడి మసికాసాగారు. ప్రపంచమంతా అగ్నిగోళంగా మారిపోసాగింది.
అంత జరుగుతున్నా ఆ పదిమంది సూర్యులకు చీమ కుట్టినంత బాధ కూడా కలగలేదు. మరింత వేడిని వెదజల్లుతూ అందరూ అట్లా చస్తావుంటే పకపకపక నవ్వుకోసాగారు. ఇదంతా స్వర్గలోక అధిపతి జేడ్ చక్రవర్తికి తెలిసింది. దాంతో జేడ్ చక్రవర్తి చాలా బాధపడ్డాడు.
స్వర్గలోకంలో 'హౌయీ' అనే వీరుడు ఉన్నాడు. అతడు గొప్ప విలుకాడు. కళ్ళు మూసి కూడా చప్పుడు వచ్చిన వైపు గురి చూసి బాణం వేయగలడు. ఎగిరే పక్షినైనా, కదిలే చేపనైనా ఒక్క దెబ్బతో పడగొట్టగలడు. కత్తి చేతబడితే ఒకేసారి పదిమందిని ఎదిరించి నిలబెట్టగలడు. ఆరడుగుల ఎత్తుతో, పెద్ద కళ్ళతో, మెలి తిరిగిన మీసాలతో, కండలు తిరిగిన ఒంటితో ఉండేవాడు. అతని భార్య చాంగే. వీరిద్దరిది ముచ్చటైన జంట. ఎప్పుడూ ఒక్క మాట కూడా అనుకోకుండా కలసిమెలసి కలకల నవ్వుతూ ఉండేవాళ్ళు.
జేడ్ చక్రవర్తి హౌయీని పిలిపించాడు. "ఓ మహావీరా... నువ్వు భూలోకం పోయి ఆ పదిమంది సూర్యులకు నచ్చచెప్పి, అవసరమైతే వాళ్ళని మందలించి, వాళ్ళ గర్వాన్ని అణచివేసి, భూలోకాన్ని మామూలు స్థితికి తీసుకురా" అంటూ అద్భుతమైన ఒక ఎర్రని విల్లును, పది వెండి బాణాలను కానుకగా ఇచ్చాడు. ఆ విల్లు మామూలుది కాదు. ఎక్కు పెడితే ఆ చప్పుళ్ళకి ఆకాశమంతా దద్దరిల్లి పోతుంది. బాణం వదిలితే వెయ్యి మెరుపుల వేగంతో దూసుకుపోయి శత్రువులను అంతం చేస్తుంది.
హౌయీ తన భార్యతో కలసి భూలోకానికి వచ్చాడు. భూమంతా అల్లకల్లోలంగా గందరగోళంగా ఉంది. ప్రజలంతా ఆ ఎండలకు తట్టుకోలేక ఎక్కడికక్కడ చల్లని ప్రదేశాలను వెతుక్కుంటూ పారిపోతున్నారు. పాతాళంలో దాక్కున్న భయంకరమైన రాక్షసులంతా భూమి మీదకు వచ్చి ప్రజల మీద పడ్డారు. దొరికిన వాళ్లను దొరికినట్టు చంపి తినసాగారు. మానవులు తమను కాపాడే దిక్కులేక కన్నీళ్ళతో కనపడని దేవుళ్ళకు మొక్కుకుంటూ ఉన్నారు. అది చూసిన హౌయీ ఆ సూర్యులతో "ఓ వీరులారా... స్వర్గలోక అధిపతి కుమారులారా... దయచేసి మీ ప్రవర్తన మార్చుకోండి. ఇంతకుముందులాగే ఒక్కొక్కరు ఉదయించండి. భూమిని అల్లకల్లోలం చేయకుండా మానవులను ప్రశాంతంగా బతకనివ్వండి. ఇది మీ నాన్న గారి ఆజ్ఞ. దానిని కాదనకుండా పాటించండి" అని వేడుకున్నాడు.
కానీ వాళ్ళు అతని మాట వినలేదు. పకపకపక నవ్వుతూ "ఇప్పుడు ఈ భూలోకమంతా మా గుప్పిట్లో ఉంది. మేమే దీనికి అధిపతులం. మేము ఎలా ఉండాలో చెప్పడానికి నువ్వెవరు. మా నాన్నెవరు. ఇంకొక మాట మాట్లాడావంటే నీతో సహా ఈ భూమి మొత్తాన్ని అగ్నిగుండంగా మార్చి వేస్తాము. అంతేకాదు మిగిలిన లోకాల మీద కూడా దాడి చేసి స్వర్గాన్ని సైతం ఆక్రమిస్తాం. మా శక్తి నీకు అర్థం కావడం లేదు. ముందు నిన్ను నువ్వు కాపాడుకో చూద్దాం" అంటూ మరింత వేడిని పుట్టించారు. తమ పదునైన కిరణాలతో హౌయీని చంపడానికి వెంటపడ్డారు.
దాంతో ఇక లాభం లేదనుకున్న హౌయీ తనకు జేడ్ చక్రవర్తి ఇచ్చిన అత్యంత శక్తివంతమైన విల్లును బయటకు తీశాడు. వెండి బాణాన్ని తీసి ఎక్కు పెట్టాడు. అది ఎక్కు పెడతావుంటే ఆకాశం నుంచి సింహగర్జనలు వినపడ్డాయి. గురి చూసి ఒక సూర్యుని పైకి బాణం వదిలాడు. అది మామూలు బాణం కాదు. ఒక్కసారి వదిలితే మెరుపు వేగంతో గమ్యాన్ని చేరి నేల కూలుస్తుంది. దెబ్బకు ఒక సూర్యుడు విలవిలలాడి నేల కూలాడు. అది చూసి మిగతా సూర్యులు "మా కళ్ళముందే మా సోదరుడిని చంపుతావా... ఎంత ధైర్యం నీకు" అంటూ ఎర్రని మంటలతో చుట్టుముట్టారు. భయమంటే తెలియని హౌయీ ఏమాత్రం తడబడలేదు. ఊహించనంత వేగంగా కదులుతూ సరసరసర బాణాలు అన్ని దిక్కులా వేశాడు. దెబ్బకు ఒకరు చొప్పున తొమ్మిదిమంది సూర్యులు తొమ్మిది క్షణాల్లో నేలకూలారు. ఇక ఒక్క సూర్యుడు మాత్రమే మిగిలాడు. కళ్ళముందే ఒక్క క్షణంలో తన సోదరులంతా చనిపోయేసరికి అతను భయంతో వణికిపోయాడు. ఇంకొక క్షణం అక్కడ వుంటే తాను కూడా చావడం ఖాయం అనుకుని కనపడకుండా పారిపోయి దాక్కున్నాడు. హౌయీ ఎరుపెక్కిన కళ్ళతో ఆ సూర్యుని కోసం వెదకసాగాడు.
సూర్యుడు లేకపోవడంతో లోకమంతా చీకటి అలుముకుంది. చలి పెరిగిపోయి మంచు కురవసాగింది. నదులు చెరువులు గడ్డకట్టసాగాయి. మనుషులు జంతువులు ఏమీ కనపడక అల్లాడిపోసాగారు. అప్పుడు భూమి మీది జనాలంతా హౌయీ దగ్గరికి వచ్చి "మహావీరా... ఇక శాంతించి ఆ ఒక్క సూర్యున్ని వదిలేయండి. సూర్యుడే లేకపోతే వెలుగు వెచ్చదనం ఉండవు. మానవుల్లో పశువుల్లో శక్తి ఉత్సాహం నశిస్తాయి" అని వేడుకున్నారు. అప్పుడు హౌయీ సరేనని క్షమించి ఆ సూర్యున్ని వదిలివేశాడు.
"ఈరోజు నుంచి నువ్వు ప్రతిరోజు పద్ధతి ప్రకారం ఉదయిస్తూ ప్రపంచాన్ని అంతా వెలుగులతో నింపాలి. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నీ సోదరులకు పట్టిన గతే నీకూ పడుతుంది" అని హెచ్చరించాడు. అప్పటినుంచి మిగిలిన ఆ ఒక్క సూర్యుడు క్రమం తప్పకుండా రోజు రథం మీద లోకమంతా వెలుగులు విరజిమ్ముతా అందరికీ మేలు చేస్తా ఉన్నాడు.
కానీ తన తొమ్మిదిమంది కుమారులు చనిపోయిన విషయం తెలిసి జేడ్ చక్రవర్తి చాలా బాధపడ్డాడు. ఆ పదిమంది సూర్యులని భయపెట్టి లొంగదీసుకుని శాంతిని నెలకొల్పమని పంపితే ఏకంగా తొమ్మిది మందిని చంపేసరికి చాలా కోపం వచ్చింది. దాంతో ఆ వీరున్ని పిలిపించి అతను చెప్పేది ఏమీ వినకుండా "నా మాట ధిక్కరించినందుకు శిక్షగా ఈరోజు నుంచి నిన్ను, నీ భార్యను స్వర్గలోకం నుంచి బహిష్కరిస్తున్నాను. ఇకపై మీకున్న దేవతా శక్తులన్నీ నశించి సాధారణ మానవుల్లాగే జీవిస్తారు" అన్నాడు. దాంతో ఆ మహావీరుడు తిరిగి స్వర్గం చేరుకోలేక భూమి మీదనే ఉండిపోయాడు. దాంతోపాటు ఎప్పటికీ చావులేని అమరత్వాన్ని కూడా వాళ్ళు కోల్పోయారు.
పదిమంది సూర్యులు భూమి మీద ఒక్కసారి చెలరేగి అల్లకల్లోలం చేసిన సమయంలో అనేకమంది రాక్షసులు పాతాళం నుంచి భూమ్మీదికి వచ్చారు కదా... వాళ్లంతా దొరికినవాళ్లను దొరికినట్టు చంపుతావున్నారు. దాంతో వాళ్లు పెట్టే బాధల్ని భరించలేని ప్రజలు ఆ రాక్షసుల నుంచి తమకు విముక్తి కల్పించమని హౌయీని వేడుకున్నారు. అతను మహావీరుడు. దేనికి భయపడనటువంటివాడు. దాంతో హౌయీ సరేనని భూమంతా కొండలూ, కోనలు, అడవులు అన్నీ వెతుకుతూ రాక్షసులను అందరినీ చంపి శాంతిని నెలకొల్పాడు. దాంతో ప్రజలందరూ సంతోషించి తమను కాపాడిన ఆ మహావీరున్నే తమకు రాజుగా ఎన్నుకున్నారు. హౌయీ తన భార్యతో కలసి ప్రజారంజకంగా పరిపాలించసాగాడు. కానీ అతనికి దేవలోకానికి చెందిన తామిద్దరూ సాధారణ మానవులలాగే అతి త్వరలో చనిపోతాం కదా అనే బాధ ఎక్కువైంది. దాంతో ఎప్పటికీ చావులేని ఆ అమృతాన్ని తిరిగి ఎలాగైనా సాధించాలి అనుకున్నాడు.
ఆ అమృతం పశ్చిమ దిశలో వున్న ఎత్తయిన పర్వతాలలో ఉండే ఒక వనదేవత దగ్గర ఉందని తెలుసుకున్నాడు. కానీ అక్కడికి చేరుకోవడం చాలా కష్టం. వేల మైళ్ళు అతి కష్టమైన దారిలో ప్రయాణించాలి. మామూలు మానవులకు ఎవరికీ సాధ్యం కాదు. కానీ హౌయీ వెనుకడుగు వేయలేదు.  ఎత్తయిన నిప్పులు కక్కుతున్న పర్వతాలు, భయంకరమైన దట్టమైన అడవులు, వేగంగా ప్రవహిస్తున్న పెద్దపెద్ద నదులు దాటుకుంటూ ఆఖరికి ఆ దేవత ఉండే పర్వతం దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఒక చక్కని తోట ఉంది. చెట్లకు రత్నాలు కాస్తూ వుంటే, పక్షులు బంగారు రెక్కలతో ఎగురుతున్నాయి. చెరువులు స్వచ్ఛమైన తీయని నీటితో విందు చేస్తావుంటే, పువ్వులు ఇంద్రధనస్సును తలదన్నే రంగులతో మెరిసిపోతున్నాయి. ఆ అద్భుతమైన వింతలన్నీ చూస్తూ ఆఖరికి వనదేవతను చేరుకున్నాడు.
ఆమె కాళ్ళకు మొక్కి "తల్లీ... నేను ఈ భూమిని కాపాడడం కోసం తొమ్మిది మంది సూర్యులను నేలకూల్చాను. లోకాన్ని పట్టి పీడిస్తున్న రాక్షసులందరినీ వెతికి వెతికి అంతమొందించాను. ఈ లోకంలో ధర్మాన్ని శాంతిని నెలకొల్పాను. నీ ప్రతిరూపాలయిన పచ్చని మొక్కలన్నీ మాడి మసైపోతుంటే అడ్డంగా నిలబడ్డాను. కానీ నేను చేసిన సేవకు నాకు ఇచ్చిన బహుమతి స్వర్గలోక బహిష్కరణ. దైవత్వాన్ని కోల్పోయి మామూలు మనిషిగా మరణించడం. ఇదేనా తల్లీ నా సేవకు ప్రతిఫలం. స్వర్గలోకానికి తిరిగి తలుపులు తెరవకపోయినా పరవాలేదు. కనీసం అమృతమైనా ఇచ్చి మా ఇద్దరికీ మరణం లేకుండా చూడు" అని వేడుకున్నాడు.
అప్పుడు దేవత "నీవు చెప్పింది నిజమే. నీకు జరగకూడని అన్యాయం జరిగింది. దానిని సవరించటానికి అమృతాన్ని కానుకగా ఇస్తాను. కానీ ఒక్క విషయం అది కొంచమే ఉంది. ఒక్కరు మాత్రమే తాగితే అమరత్వం పొందడమే కాకుండా తిరిగి స్వర్గలోకానికి చేరి దేవతలతో కలసిపోవచ్చు. అలా కాక ఇద్దరూ తాగితే ఇద్దరికీ మరణం ఉండదు కానీ స్వర్గలోకం మాత్రం ఎవరూ చేరుకోలేరు. ఎప్పటికీ భూమి మీదనే ఉండిపోవాలి. మరి ఏం చేస్తావో ఆలోచించుకో" అంది. హౌయీకి తన భార్య అంటే చాలా ప్రేమ కదా. దాంతో తన భార్య లేని స్వర్గం వున్నా ఒకటే, లేకున్నా ఒకటే అనుకొని చావైనా బతుకైనా ఆమెతోనే పంచుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ అమృతాన్ని తీసుకొని తిరిగి రాజ్యానికి చేరుకున్నాడు. భార్యకు జరిగినదంతా చెప్పి "మనం ఇద్దరము వచ్చే పున్నమి రోజు ఈ అమృతాన్ని కలసి తాగుదాం. అంతవరకు భద్రంగా దాచిపెట్టు" అని ఇచ్చాడు. మధురమైన కమ్మని వాసన వెదజల్లుతావున్న ఆ అమృతాన్ని ఆమె తీసుకపోయి వంటగదిలో అటక పైన ఒక బంగారు పెట్టెలో భద్రంగా దాచి పెట్టింది.
హౌయీ చాలా అద్భుతమైన విలుకాడు కదా... దాంతో ఆ రాజ్యంలో చాలామంది అతని వద్ద విలువిద్య నేర్చుకునేవాళ్ళు. ఆ శిష్యులలో అందరికన్నా ప్రతిభావంతుడు 'పెంగ్ మెన్'. గురువు ఏది చెప్పినాసరే క్షణంలో ఆ కిటుకుల్ని పట్టేసేవాడు. తనకు వచ్చేంతవరకు రాత్రి పగలు తేడా లేకుండా సాధన చేసేవాడు. అందరికీ అతనంటే చాలా ఇష్టం. దాంతో స్వేచ్ఛగా గురువు ఇల్లంతా తిరుగుతూ ఉండేవాడు. కానీ ఆ శిష్యుడు పైకి మామూలుగా, సరదాగా కనపడినా లోపల మాత్రం చాలా దురాశపరుడు. మేక వన్నె పులి. తొందరగా అన్ని విద్యలు నేర్చుకుని గురువును మించిన శిష్యుడు కావాలని, ఇంతకన్నా పెద్ద సామ్రాజ్యానికి రాజు కావాలని అతని కోరిక.
పెంగ్ మెన్ ఒకసారి ఆ ఇంటిలో మధురమైన వాసనను గమనించాడు. ఇంతవరకు ఎప్పుడూ ఎక్కడా చూడని వాసన. పీలుస్తావుంటే మనసు మధురమైన లోకాల్లో విహరిస్తూ ఉంది. ఆ వాసన ఎక్కడినుంచి వస్తుందా అని ప్రతి గది వెతికాడు. కానీ కనుక్కోలేక పోయాడు. దాంతో రహస్యంగా భార్యాభర్తల మాటలు తలుపు చాటునుంచి వినడం మొదలుపెట్టాడు. దాంతో అతనికి హౌయీ అమృతం తీసుకువచ్చి భార్యకు ఇచ్చిన విషయం తెలిసిపోయింది. ఎలాగైనా ఆ అమృతాన్ని చేజిక్కించుకుంటే తాను కూడా దేవతగా మారి స్వర్గలోకానికి వెళ్లవచ్చు కదా అని అనుకున్నాడు. దాంతో అవకాశం కోసం ఎదురుచూడసాగాడు.
కొన్ని రోజుల తర్వాత హౌయీ తన శిష్యులతో కలసి వేటకు పోవాలి అనుకున్నాడు. కానీ పెంగ్ మెన్ తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి అక్కడే ఉండిపోయాడు. హౌయీ వెళ్లిన కాసేపటికి రహస్యంగా ఇంట్లోకి దూరాడు. అమృతం కోసం ఇల్లంతా వెతికాడు గానీ ఎక్కడా కనపడలేదు. దాంతో ఇక లాభం లేదు అనుకొని కత్తి తీసుకొని హౌయీ భార్య ఉన్న గదికి పోయాడు. "మర్యాదగా అమృతం ఎక్కడుందో చెప్పు. లేదంటే జాలీ దయ ఏమీ లేకుండా నిన్ను ఇక్కడికి ఇక్కడే చంపి పాడేస్తా" అంటూ బెదిరించాడు.
ఇంతకాలం నమ్మకంగా వుంటూ వినయంగా తన చుట్టూ తిరిగిన శిష్యుడేనా ఇతను అని ఆమె ఆశ్చర్యపోయింది. "ఇలాంటి మేక వన్నె పులుల చేతిలో అమృతం పడితే అంతే సంగతులు. ప్రపంచమంతా ప్రమాదంలో పడుతుంది. నా ప్రాణాలకు ఏమైనా పరవాలేదు. ఇలాంటి దుర్మార్గునికి మాత్రం ఇది దక్కకూడదు" అనుకొంది. చంపడానికి మీదికి వస్తున్న పెంగ్ మెన్ కి దొరక్కుండా పారిపోయి మెరుపువేగంతో అటక మీది బంగారుపెట్టె తీసి అందులోని అమృతాన్ని ఒక్కసారిగా గడగడా తాగేసింది.
అంతే... ఆ మరుక్షణమే అక్కడంతా వేయి చందమామల వెలుగు కళ్ళు మిరమిట్లు గొలిపేలా పరుచుకుంది. నెమ్మదిగా ఆమె శరీరం గాల్లోకి లేచింది. చూస్తుండగానే దేవతగా మారిపోయి కిటికీలోంచి ఆకాశంలోనికి ఎగిరిపోయింది. అది చూసిన పెంగ్ మెన్ భయపడి అక్కడినుంచి పారిపోయాడు.
దేవతగా మారిన చాంగే తిరిగి భూమి మీదికి రాలేకపోయింది. తను ఎంతగానో ప్రేమించే తన భర్తను వదిలి ఒక్కతే స్వర్గలోకానికి వెళ్లిపోవడం ఆమెకు ఇష్టం లేదు. దాంతో భూమికి దగ్గరగా ఉన్న చంద్రలోకంలోనికి అడుగు పెట్టింది. తన భర్త ఎప్పుడైనా సరే తనకోసం అక్కడికి రావచ్చును అనే నమ్మకంతో, ఆశతో అతని కోసం ఎదురుచూడసాగింది. సాయంత్రం వేట ముగించుకుని ఇంటికి వచ్చిన హౌయీకి తన భార్య ఎక్కడా కనపడలేదు. జరిగిన విషయమంతా సేవకుల ద్వారా తెలుసుకొని కోపంతో ఊగిపోయాడు. కానీ అప్పటికే పెంగ్ మెన్ రాజ్యం వదిలి ఎవరికి కనపడకుండా పారిపోయాడు.
ఆ రోజు పున్నమి. వారిద్దరూ అమృతాన్ని కలసి తాగి అమరులు కావలసిన రోజు. సంతోషంగా గడపాల్సిన ఆ రోజు ఎంతో విషాదంతో నిండిపోయింది.
హౌయీ ఆకాశంలో వెలుగొందుతున్న చందమామను చూస్తూ తన భార్యను తలుచుకొని వెక్కివెక్కి ఏడుస్తూ చంద్రునికి నైవేద్యం పెట్టాడు.
అది చూసిన ప్రజలు అప్పటినుంచి ప్రతి సంవత్సరం వారిద్దరూ ఎప్పటికైనా తిరిగి కలుసుకోవాలన్న కోరికతో పెద్ద ఎత్తున దేశమంతా పండుగ చేసి చంద్రునికి నైవేద్యాలు పెట్టడం ప్రారంభించారు. ఇది చైనాలో చేసే అతి పెద్ద పండగలలో ఒకటి. ప్రతి సంవత్సరం శరదృతువు కాలంలో ఈ పండుగ అక్కడ జరుగుతుంది
*******************
డా.ఎం.హరికిషన్- కర్నూలు-9441032212
*******************
కథ నచ్చితే SHARE చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.

No comments:

Post a Comment