Monday, September 7, 2026

 *సంపెంగ పూలు* 

ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ ప్రయాణం తరువాత ఆనందరావుకి రిటైర్మెంట్ వచ్చింది. చదివింది తక్కువ కావడం వల్ల ప్రమోషన్స్ లేకపోయినా, ఒకే పనిలో ఎక్కువ కాలం చేయడం వలన 'భీష్మాచార్యుడు' అనే అధికారికం కాని బిరుదు ఆయన పేరు పక్కన చేరింది. ఎస్.ఈ. ఆఫీస్‌లో హెడ్ డ్రాఫ్ట్స్‌మెన్ ఆయన. తన అనుభవంతో తిమ్మిని బమ్మిని చేయగల దిట్ట. అయినా ఏనాడూ గీత దాటని నిబద్ధత గల ఉద్యోగి. అందుకే అతనంటే ఆఫీసులో అందరికీ ఎంతో అభిమానం.

“శ్రీ మక్కువ ఆనందరావు గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు” అని రాసిన పెద్ద బ్యానర్, ఆనందరావు భార్య సుమతి ఫోటోతో అందంగా వేలాడదీయబడింది. దాని ముందు టేబుల్స్, కుర్చీలు వేయబడ్డాయి. ఓ పక్కగా వెజ్, నాన్-వెజ్ వంటల సువాసనలు గుప్పుమంటున్నాయి.
"ఎస్.ఈ. గారు వస్తున్నారు" అన్న మాట వినగానే అంతా బయటకి పరుగు తీశారు. "ఆనందరావు గారు వచ్చారా?" అన్న ఎస్.ఈ గారి ప్రశ్నకు, "ఈ.ఈ. గారి కారు పంపాము సార్, వస్తూ ఉంటారు" అని సమాధానం ఇచ్చాడు సీనియర్ అసిస్టెంట్ రామానుజం. ఒకసారి ఏర్పాట్లు పరిశీలించి కుర్చీలో కూర్చున్నారు ఎస్.ఈ. ముకుందరావు.

ఈ.ఈ. గారి కారు ఆగడంతోనే అంతా సాదరంగా ఆనందరావుని, ఆయన భార్య సుమతిని వేదికపైకి తీసుకుని వచ్చారు. "నమస్తే సార్.." అన్నారు ఆనందరావు ఎస్.ఈ గారిని చూస్తూ. "నమస్తే.. మీరు ఆఫీస్‌లో లేకపోతే ఈ వర్క్ హ్యాండిల్ చేయడం కష్టం ఆనందరావు గారు" అన్న ముకుందరావు మాటలకు, "ఫరవాలేదు సార్.. మన వాళ్లకు అన్నీ వచ్చు. పైగా ఫైల్స్ అన్నీ అప్‌టు డేట్‌గా ఉన్నాయి. ఏదైనా అవసరం అయితే నేను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను" అన్నారు ఆనందరావు వినయంగా.

అప్పుడే ఆనందరావు కొడుకులు, కోడళ్ళు, మనవలు అంతా వచ్చారు. సభ ప్రారంభమైంది. "ఆనందరావు గారు మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీరు పదవీ విరమణ చేసే సరికి పిల్లలు చక్కని ప్రయోజకులయ్యారు. మీకిక ఏ బాధ్యత లేదు. హాయిగా మనవళ్లతో, మనవరాళ్ళతో కాలక్షేపం చేయడమే" అన్నారు వేదికపై మాట్లాడిన వక్తలు.
"నాన్న గారి మంచితనం, క్రమశిక్షణే మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టాయి" అన్నాడు ఆనందరావు పెద్దకొడుకు హర్ష. అతను ఎల్.ఐ.సి.లో డెవలప్‌మెంట్ ఆఫీసర్. "మమ్మల్ని చాలా క్రమశిక్షణతో పెంచారు మా నాన్నగారు. అందుకే మేము ఈ రోజు ఏ లోటు లేకుండా ఉన్నాము” అన్నాడు చిన్న కొడుకు శేఖర్. అతను ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో డివిజనల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అతని భార్య లక్ష్మి జూనియర్ లెక్చరర్.

తరువాత ఒక్కొక్కరుగా ఆనందరావు గురించి మాట్లాడారు. ఆపై సన్మాన కార్యక్రమం జరిగింది. శాలువాలు, పూలదండలతో ఆనందరావు దంపతులు మునిగిపోయారు. నాన్నగారి చేతికి బంగారు బ్రేస్‌లెట్ తొడిగింది కూతురు పద్మ. “ఇప్పుడేందుకమ్మా ఇవన్నీ?” అన్నాడు ఆనందరావు సున్నితంగా వారిస్తూ. “సర్వీస్‌లో ఉండగా ఇటువంటివి పెట్టుకుంటే బాగోదు అన్నారు కదా నాన్న. అందుకే రిటైర్ అయ్యాక తెచ్చాము” అన్నాడు అల్లుడు శివ.

అప్పుడే మామ గారి చేతిలో 'ప్రసాద్ ఇంక్ పెన్' పెట్టింది పెద్ద కోడలు కావ్య. ఆయనకు మొదటినుండీ ఇంక్ పెన్ అంటేనే ఇష్టం. తప్పని పరిస్థితిలో మాత్రమే బాల్ పెన్ వాడేవారు. “ఇక ఈ పెన్ అవసరం పెద్దగా ఉండదు కావ్యా” అన్నాడు ఆనందరావు. “ఎందుకు ఉండదు మామయ్యా.. ఇకపై మీరు రాసే కవితలు, కథలు ఈ పెన్నుతోనే రాయాలి” అంది కావ్య నవ్వుతూ.
తదనంతరం భోజన కార్యక్రమం ప్రారంభమైంది. ఒక ప్లేట్‌లో పలావు వడ్డించుకుని ఆనందరావు పక్కకు చేరాడు సహోద్యోగి రామానుజం. "ఆనందరావు గారు, మీ పెన్షన్ ప్రొపోజల్స్ ఈ రోజే పంపించేశాము. గ్రాట్యుటీ, లీవ్ శాలరీ కూడా అప్రూవ్ చేయించాము. ఆ డబ్బులు జాగ్రత్తగా దాచుకోండి, ఎవరికీ ఇవ్వొద్దు. ఈ వయసులో అవే మీకు కొండంత సపోర్ట్‌గా ఉంటాయి" అన్నాడు నెమ్మదిగా.
రామానుజం వెళ్ళిన తర్వాత ఏ.ఈ. నరసింహం వచ్చి ఆనందరావు పక్కన నిలబడ్డాడు. "రిటైర్మెంట్ అమౌంట్ పోస్ట్ ఆఫీస్‌లో వేయండి. సీనియర్ సిటిజన్లకు 8.2% వడ్డీ ఇస్తున్నారు. ప్రతి మూడు నెలలకు వడ్డీ మీ అకౌంట్‌లో పడుతుంది. ఎవరికీ అప్పులు, చేబదుళ్ళు ఇవ్వకండి. తరువాత మొహమాటంతో తిరిగి అడగలేము" అంటూ తన వంతు సలహా ఇచ్చాడు. “మీ రిటైర్మెంట్ ఉద్యోగానికి మాత్రమే... మీ సేవలు, సలహాలు మాకెప్పుడూ కావాలి” అంటూ ఆఫీస్ సిబ్బంది అంతా తలో మాట అన్నారు. మొత్తానికి ఆనందోత్సాహాల మధ్య ఆనందరావు పదవీ విరమణ సభ ముగిసింది.

రిటైర్ అయిన మరుసటి రోజు ఆనందరావు ఆఫీసుకు బయలుదేరుతుంటే, చేతికి సరికొత్త తాళాలు ఇచ్చింది చిన్న కోడలు లక్ష్మి. “ఇదేమిటి?” అన్నాడు ఆనందరావు ఆశ్చర్యపోతూ. “మీ కోడలు మీకు స్కూటర్ కొనిపించిందండీ” అంది సుమతి మురిపెంగా. “ఇప్పుడెందుకు అంత ఖర్చు?” అన్నాడు ఆనందరావు సంకోచిస్తూ. “అదేమిటి నాన్నగారు, మేము ఏం చేసినా ఖర్చు అంటున్నారు? లక్ష్మి మీకు ఎప్పటి నుంచో కొంటానంది. నేనే రిటైర్మెంట్ రోజున సర్ప్రైజ్ ఇద్దామని ఇన్నాళ్లూ ఆపాను“ అన్నాడు శేఖర్. “పాలపిట్ట రంగు మీకు బాగా సూట్ అవుతుందని మన పురోహితులు సత్యం గారు కూడా చెప్పారు మామయ్యా” అంది లక్ష్మి నవ్వుతూ. “అబ్బో! అన్నీ పద్ధతి ప్రకారం కనుక్కునే తెచ్చారన్నమాట” అన్నాడు ఆనందరావు సంతోషంగా.
కొత్తగా వచ్చిన ఎల్.ఎం.ఎల్. వెస్పా స్కూటర్ చూస్తూ.. “తాతయ్యా.. కొద్దిరోజుల తర్వాత నేను కూడా నడిపేస్తా” అన్నాడు ఆనందరావు మనవడు, హర్ష కొడుకు బాబీ. స్కూటర్ పక్కన నిలబడి తన ఎత్తు కొలుచుకున్నాడు. “పూజ చేయించాను. ఇక ఈ నిమ్మకాయలు కట్టేస్తే ఓ పనైపోతుంది” అంటూ శేఖర్ నిమ్మకాయలను స్కూటర్‌కి కట్టాడు. “నాన్న గారు, దీనికి రెండు చేతులకే బ్రేకులు ఉంటాయి. అలవాటు అయ్యేదాకా కొంచెం నెమ్మదిగా వెళ్ళండి” అని జాగ్రత్తలు చెప్పాడు హర్ష.

రిటైర్మెంట్ తరువాత ఆనందరావు ప్రవర్తనలో మెల్లగా మార్పు వచ్చింది. కొన్ని రోజులు ఆఫీసుకు వెళ్లినా, అక్కడ పలకరింపులు క్రమంగా తగ్గడం గమనించి వెళ్లడం మానేశాడు. తనకి వచ్చిన లీవ్ శాలరీ, గ్రాట్యుటీ అమౌంట్‌ను పోస్ట్ ఆఫీసులో డిపాజిట్ చేశాడు. ఆ విషయం పిల్లలకి చెప్పలేదు. పిల్లలతో పూర్వంలా చొరవగా మాట్లాడటం లేదు. సరిగ్గా అదే సమయంలో పెన్షన్ మంజూరైనట్టు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది.

ఆ రోజు అలవాటు కొద్దీ ఆఫీసు వైపు వెళ్ళాడు ఆనందరావు. అక్కడ అతనికి గత సంవత్సరం రిటైర్ అయిన రమణ కనిపించాడు. రమణ ఒకప్పుడు తన కింద ట్రేసర్‌గా పని చేశాడు. ఆ తర్వాత 'లాంగ్ స్టాండింగ్' అనీ, ఏజెన్సీ సర్వీస్ పూర్తి చేయలేదనీ అతనిని వేరే చోటికి బదిలీ చేశారు. ఆ తర్వాత అతన్ని కలవడం ఇదే మొదటిసారి. "ఏం రమణా.. బాగున్నావా?" అన్నాడు ఆనందరావు పలకరిస్తూ.
"ఏం బాగుంది గురువు గారు? ఎదిగొచ్చిన పిల్లలు ఎగిరిపోయారు. నమ్మి నా డబ్బులు చేతిలో పెడితే, నా భార్య కూడా నన్ను మోసం చేసి వాళ్లతో వెళ్ళిపోయింది. ఏదో చిన్న డిపార్ట్‌మెంటల్ కేసు నెపం చూపి నాకు రావలసిన బెనిఫిట్స్ అన్నీ ఆపేశారు. అన్నీ పోయి ఇలా రోజులు వెళ్లబుచ్చుతున్నాను" అన్నాడు రమణ కన్నీళ్లు పెట్టుకుంటూ. 

అప్పుడే "రమణ గారు, మిమ్మల్ని ఏ.ఓ. గారు రమ్మంటున్నారు" అని ఆఫీస్ సబార్డినేట్ పిలవడంతో, ఆనందరావుకి చెప్పకుండానే అటువైపు పరుగు తీశాడు రమణ. 'పిల్లలు ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నారు!' అనుకున్నాడు ఆనందరావు మనసులో బాధగా.

ఇంటి దగ్గర... "అమ్మా! నాన్న గారి పెన్షన్ మంజూరైందట. వాళ్ళ ఆఫీసు రామానుజం గారు చెప్పారు" అన్నాడు పెద్దకొడుకు హర్ష. "అయినా నాన్నగారే ఈ విషయం మనతో స్వయంగా చెబితే బాగుండేది కదా" అన్నాడు లోపలి గదిలోకి చూస్తూ. "ఏమోరా! ఆ విషయం నాకు కూడా తెలియదు. అయినా మీ నాన్నగారు ఇదివరకులా ఉండటం లేదు. ఎప్పుడూ చూడు డైరీలో ఏవో లెక్కలు వేసుకుంటూ గంభీరంగా ఉంటున్నారు" అంది సుమతి.
"ఏం రాస్తున్నారో?" అంటూ నవ్వుతూ లోపలికి వచ్చాడు చిన్న కొడుకు శేఖర్. "అది నువ్వే అడుగు మీ నాన్నని" అంది సుమతి కూడా నవ్వుతూ. "అది నాకెందుకులే గానీ... అన్నయ్యా! నాన్న గారు రిటైర్ అయ్యారు కదా, అందరం కలిసి తిరుపతి వెళ్ళివద్దాం ఓసారి" అన్నాడు శేఖర్. "ఇప్పుడు సడన్‌గా దర్శనం టిక్కెట్లు, గదులు దొరకవు కదా! పైగా కొండ మీద చాలా రద్దీగా ఉంటుంది" అన్నాడు హర్ష అనుమానంగా.

 "అదంతా నాకొదిలేయ్, నేను చూసుకుంటా. మన మినిస్టర్ గారు రెకమండేషన్ లెటర్ ఇస్తా అన్నారు. ముందు నాన్న రాగానే అడిగి ఓకే అనుకుంటే ఫోన్ చెయ్యి" అన్నాడు శేఖర్. అతను ఆఫీస్ ఇచ్చిన క్వార్టర్స్‌లో ఉంటున్నా, ఎక్కువ సమయం అమ్మానాన్నలతోనే గడుపుతాడు.

“తమ్ముడు తిరుపతి వెళదాం అంటున్నాడు నాన్నగారు" అన్నాడు హర్ష ఆనందరావు రాగానే. “ఇప్పుడెందుకురా అనవసరంగా ఖర్చు?" అన్నాడు ఆనందరావు నీరసంగా. “అదేమిటి నాన్నగారూ అలా మాట్లాడుతున్నారు? తిరుపతి వెళ్ళి రావడానికి ఖర్చు గురించి ఆలోచించాలా? అయినా డబ్బు గురించి మీకెందుకు చింత? నేను, తమ్ముడు ఉన్నాం కదా!" అన్నాడు హర్ష ఆత్మీయంగా. “అవునండీ, మనం తిరుపతి వెళ్లి చాలా కాలం అయ్యింది. కిందటి సంవత్సరం అడిగితే రిటైర్ అయ్యాక వెళ్దాం అన్నారుగా,” అంది సుమతి గుర్తు చేస్తూ. “ఇప్పుడు దర్శనం టికెట్లు దొరకడం కష్టం కదా,” అన్నాడు ఆనందరావు వంకలు వెతుకుతూ. “అవన్నీ నేను, తమ్ముడు చూసుకుంటాం. మీరు సరే అనండి చాలు,” అన్నాడు హర్ష.

ఆనందరావు ఒప్పుకోవడంతో వెంటనే ట్రైన్ టికెట్లు బుక్ చేశాడు శేఖర్. రెండవ శనివారం, ఆదివారం సెలవులు చూసుకున్నారు హర్ష, శేఖర్‌లు. మినిస్టర్ గారి లెటర్ ఉండడంతో కొండమీద రూమ్‌లు, బ్రేక్ దర్శనం సులభంగా దొరికాయి.
"నాన్నగారు, స్వామి పుష్కరిణిలో స్నానం చేయండి," అన్నాడు హర్ష మెట్లు దిగుతూ. "సరే..." అంటూ పుష్కరిణిలోకి దిగుతున్న ఆనందరావుకు చేయి అందించాడు హర్ష భద్రంగా. "హర్ష, నేనేమైనా ముసలివాడిని అయ్యానని సాయం చేస్తున్నావా?" అంటున్న ఆనందరావుతో, "లేదు నాన్నగారు, మీ వెనుక నేను ఎప్పుడూ ఉన్నానని గుర్తు చేయడానికే ఈ చేయి అందించాను," అన్నాడు హర్ష ఎంతో ప్రేమగా. "నేను కూడా ఉన్నాను నాన్న..." అన్నాడు శేఖర్ వెనుక నుంచి తండ్రి భుజంపై చేయి వేస్తూ.
స్నానం చేసి ఒడ్డుకు వచ్చిన ఆనందరావుకు పొడి టవల్ అందించింది సుమతి. "హలో హర్ష..." అన్న పిలుపుతో అటు చూశాడు హర్ష. "ఒరేయ్ కిరణ్, నువ్వా..." అన్నాడు ఆశ్చర్యంగా. 

"నాన్నగారు, వీడి పేరు కిరణ్, నా స్నేహితుడు. అన్నట్టు వీళ్ళ నాన్నగారు కూడా మీ డిపార్ట్‌మెంట్‌లోని వారే" అన్నాడు హర్ష తండ్రికి పరిచయం చేస్తూ. "ఆయన పేరేమిటి బాబూ..." అన్నాడు ఆనందరావు. "నాన్నగారి పేరు రమణ అంకుల్. ఎస్.ఈ. ఆఫీసులో ట్రేసర్‌గా పనిచేశారు."
ఆ మాట వినగానే ఆనందరావు ముఖం గంభీరంగా మారింది. "ఓహో... మా రమణ కొడుకువి నువ్వేనా? నీలాంటి వాళ్ళ వలనే కదరా పిల్లలంటే పెద్దవాళ్లకు నమ్మకం పోతోంది! వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని అలా అనాథలా వదిలేస్తావా?" ఒకింత కటువుగానే ప్రశ్నించాడు ఆనందరావు.
"ఎవరు చెప్పారో గానీ, మీరు విన్నది తప్పు అంకుల్! నాన్నగారు మీ ఆఫీసులో పనిచేసినంత కాలం చాలా బాగానే ఉండేవారు. కానీ ఏజెన్సీకి బదిలీ అయ్యాక చెడు అలవాట్లకు లోనయ్యారు. ముఖ్యంగా పేకాట అలవాటైంది. దానివల్ల అందిన చోటల్లా అప్పులు చేశారు. అక్కడ డ్యూటీలో చేసిన పెద్ద పొరపాటు వల్లే ఆయనకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆగిపోయాయి. అయినా కొడుకుగా నా బాధ్యతగా ఆయన చేసిన అప్పులన్నీ నేనే తీర్చాను. మాతోనే ఇంట్లో ఉండమని బతిమిలాడినా వినకుండా, మళ్లీ మళ్లీ అప్పులు చేస్తూ మమ్మల్ని కాదని ఎక్కడో తిరుగుతున్నారు" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు కిరణ్.

ఆ మాటలు విన్న ఆనందరావు ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. "ఛ... ఛ... నిజానిజాలు తెలుసుకోకుండా నిన్ను అనవసరంగా నిందించి బాధ పెట్టాను. నన్ను క్షమించు బాబు. కళ్ళు తుడుచుకో. నీవేదో స్వామి దర్శనం కోసం వస్తే..." అంటూ కిరణ్ చేతులు పట్టుకుని పశ్చాత్తాపపడ్డాడు ఆనందరావు.
అప్పటితో ఆనందరావు మనసును తొలుస్తున్న అభద్రతా భావం, కొడుకుల మీద ఉన్న అనుమానం పూర్తిగా పటాపంచలైపోయాయి. "మీరిద్దరూ ఎప్పుడూ నాకు ఇలాగే తోడుగా ఉండాలిరా," అన్నాడు ఆనందరావు కొడుకుల వంక అర్ధ్రత నిండిన కళ్లతో చూస్తూ.

"మరి మేము..." అన్నారు కోడళ్లు గారాభంగా బుంగమూతి పెడుతూ. "నేను, తాతయ్య కూడా..." అన్నాడు మనవడు బాబీ చేతులెత్తి. "అందరూ... మన కుటుంబం అంతా కలిసి ఉండాలి" అన్నాడు ఆనందరావు ఎంతో ఆనందంగా.
"ఎందుకు అలా మాట్లాడుతారు? సంపెంగ మొక్కకు సంపెంగ పువ్వులే పూస్తాయి కదండీ. మన పెంపకం మంచిదైనప్పుడు పిల్లలు చెడ్డవాళ్ళు ఎలా అవుతారు? మీరే ఎందుకో అనవసరమైన అభద్రతా భావంలో ఉండిపోయారు" అంది సుమతి భర్త భుజం తడుతూ.

"అవును సుమతీ, ఉద్యోగం నుండి రిటైర్ అయ్యాక పిల్లలు తండ్రిని చులకనగా చూస్తారని, వృద్ధాప్యంలో పట్టించుకోరని ఆఫీస్‌లో సహోద్యోగులు అనడం చాలా సార్లు విన్నాను. రమణ పరిస్థితి చూసి నాకూ ఆ భయం పట్టుకుంది. అందుకే రిటైర్ అయ్యాక నేనూ అదే ఊహల్లో కొట్టుమిట్టాడాను" అన్నాడు ఆనందరావు మనసు తేలికపడ్డాక.

"భలే వారే నాన్నగారు... పిల్లలను ప్రేమతో పెంచడం వేరు, అతిగా గారాభం చేయడం వేరు. ప్రేమతో, విలువలతో పెంచినప్పుడు ఆ పిల్లలు ఎప్పటికీ బంధాలకు కట్టుబడే ఉంటారు" అంది సుమతి.
"అయినా చెడు వ్యాపించినంత వేగంగా మంచి ప్రచారం పొందదు నాన్నగారు. ఇప్పుడు చాలా మంది పిల్లలు తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నారు. ఉమ్మడి కుటుంబాలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. మీడియాలో, సీరియల్స్‌లో తల్లిదండ్రులను చూడని పిల్లల గురించి, ఆశ్రమాలలో వదిలేసే వారి గురించి మాత్రమే ఎక్కువగా చూపిస్తూ సమాజంలో ఒక రకమైన భయాన్ని కల్పిస్తున్నారు. మా ఫ్రెండ్స్ సర్కిల్‌లో అందరూ తల్లిదండ్రులతోనే కలిసి ఎంతో సంతోషంగా ఉంటున్నారు" అన్నాడు హర్ష ధీమాగా.
"అవును మామయ్యా, కోడళ్లు అంటే అత్తల పాలిట విలన్‌లుగా చూపిస్తున్నారు టీవీల్లో. అందరూ అలా ఉండరు కదా" అంది లక్ష్మి నవ్వుతూ.

"అవును సుమతీ, నా ప్రేమని పంచి పెంచిన నాకే నా పెంపకం మీద నమ్మకం లేకపోవడం నా తెలివితక్కువతనం. లోకంలో అందరూ ఒకేలా ఉంటారనుకోవడం నా పొరపాటు. ఈ తిరుపతి ప్రయాణం వల్లే నా మనసులోని మబ్బులన్నీ విడిపోయి పూర్తి క్లారిటీ వచ్చింది" అన్నాడు 

ఆనందరావు పరమానందంగా.
"పదండి... మనకు దర్శనం టైమ్ అవుతోంది" అన్నాడు శేఖర్. అప్పుడే మైకులో ఎంతో మధురంగా వినిపించింది "ఓం నమో వేంకటేశాయ...". ఆనందరావు ఎంతో భక్తితో చేతులు జోడించి స్వామి సన్నిధి వైపు ఆనంద బాష్పాలతో అడుగులు వేశాడు.

కూచిమంచి నాగేంద్ర.
ఉషా ఆగస్టు 26 ప్రచురణ.

No comments:

Post a Comment