శీర్షిక : తరాల వారధి
రచన : పాలకుర్తి గిరిజా మూర్తి✍️
రగిలిపోతుంది రవళి. మనసు కుతకుతలాడిపోతుంది. "లేకపోతే! ఎంత ధైర్యం మంజులత్తయ్యకి.. అంత మాట అంటుందా? తనకి తెలియదూ.. నా గురించి. నన్నేమన్నా కొత్తగా చూస్తుందా?".
పరిపరి విధాల తనకు జరిగిన అవమానాన్ని తలుచుకొని ఆవేశపడిపోతుంది రవళి. ఇంతకు ఏమైందంటే...
రవళి, ప్రతిభ ఇద్దరూ తోడికోడళ్ళు. అన్నదమ్ముల పిల్లలు. వరుసకు మొదటి నుంచి అక్క చెల్లెల్లే. ఒక రకంగా చెప్పాలంటే రవళి ప్రతిభను తన తోడికోడలుగా తెచ్చుకోవడానికి ఉత్సాహపడింది.
అత్తగారు రజిత నిదానస్తురాలు. రవళిని చాలా ప్రేమగా చూసేది. ఇంట్లో మామగారు, తన భర్త, మరిది తో పాటు.. అత్తగారి అత్తగారు, మామగారు కూడా ఉండేవాళ్ళు. ఇప్పటి లెక్కలో పెద్ద కుటుంబం. పైగా మడి,పూజలు,ఆచారం.
డిగ్రీ వరకు చదివిన రవళి పెళ్లయ్యాక ఇంకా చదువుకోవాలనుకుంది. అత్తగారు, భర్త ప్రోత్సహించినా.. ఇంట్లో అత్తగారి పరిస్థితి, పనుల ఒత్తిడి గమనించి, దూరవిద్యలో చేరింది.
ప్రతిభ కూడా పెళ్లయ్యేటప్పటికి డిగ్రీ చేసింది. కానీ తనకి టీచర్ అవ్వాలనే కోరిక ఉండడంతో బీ.ఈడీ. చేస్తానని, అందుకు సహకరించాలని పెళ్లికి ముందే షరతు పెట్టింది. పోనీలే, తనకు సాగకున్నా.. ప్రతిభైనా చదువుతుందిలే! అనుకుంటూ రోజు టైం కి అందరికీ బాక్సులు సర్దుతూ సంతోషపడేది రవళి.
ట్రైనింగ్ పూర్తి అవ్వడం.. ప్రతిభకు గవర్నమెంట్ టీచర్ గా పక్కూర్లోనే జాబ్ రావడంతో, రోజు స్కూటీ మీద స్కూల్ కి వెళ్లి వస్తుంది.
ఇంతకు ఇప్పుడు కోపం ఎందుకు అంటారా? శ్రావణమాసం పేరంటానికని పక్క వీధిలోని మంజుల అత్తయ్య ఇంటికి అత్తగారితో కలిసి వెళ్ళింది రవళి. ఆవిడ ఒక్క ముత్తయిదువకైనా.. పసుపు బొట్టు ఇచ్చుకుంటే కానీ, భోజనం చేయదు. అందుకని రవళి గబగబా పని పూర్తి చేసుకొని, వాళ్ళ అత్త గారితో సహా పేరంటానికి వెళ్ళింది.
అక్కడ మంజుల అత్తయ్య వాయనం ఇస్తూనే.. "ఇంత పొద్దున్నే రావడం అందరికీ కుదరదు. మనమంటే ఇంట్లో ఉంటాం కానీ నీతో పాటు, నీ పెద్ద కోడలు కూడా ఇంట్లోనే ఉంటుంది. అందుకే తీరికగా వస్తారు. మా ఇంట్లోనూ ఉన్నారు కోడలు, కూతురు. పొద్దున లేస్తే నీ చిన్న కోడలికి మల్లె ఉద్యోగం అంటూ స్కూటీ మీద ఒకరు, క్యాబ్లో ఒకరు బయలుదేరుతారు.
అయినా! ఇప్పుడు భర్త ఒక్కడి సంపాదనతోటి గడవడం కష్టం. ఓ ఇల్లు, ఓ కారు నాలుగు డబ్బులు వెనకేసుకోవద్దూ.. పైగా లక్షలకు లక్షలు పిల్లల స్కూలు ఫీజులు. నువ్వేమైనా అనుకో రజితా! ఇంట్లో తిని కూర్చునే ఆడవాళ్లు ఈ కాలానికి కరెక్ట్ కాదు. చదవడానికి, ఉద్యోగం చేయడానికి వళ్ళు వంగక, ఇంట్లో కూర్చునే వాళ్ళంటే నాకు చిరాకు" అంటూ ఓరగా రవళిని చూసింది మంజుల.
అర్థం చేసుకున్న రజిత "సరే వదినా !వెళ్ళొస్తా! ఇంట్లో పని ఉంది. పద రవళి". అంటూ రవళిని తీసుకొని ఇంటికి బయలుదేరింది. ఇంటికి వచ్చిన రవళి కోపానికి కారణం అది.
కాసేపటికి రజిత అత్తమామలకు భోజనం పెట్టి, తనకు కోడలికి కూడా వడ్డించుకుని, రవళిని పిలిచింది. "నాకెందుకో ఆకలి లేదు అత్తయ్యా !మీరు తినండి. నేను తర్వాత తింటాను." అంటున్న రవళిని చూసి నవ్వుతూ.. కంచంలో అన్నం కలుపుకొని, మంచినీళ్ల గ్లాస్ పట్టుకొని, రవళి దగ్గరికి వచ్చింది రజిత.
"ఇదిగో! వంకాయ కూర చేశాను. ఉప్పు కారం సరిపోయిందా? కాస్త రుచి చూడు." అంటూ కోడలికి తినిపించడం మొదలు పెట్టింది రజిత. రవళి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
"పిచ్చి పిల్లా! మంజులత్తయ్య మాటలకి బాధపడుతున్నావా? నువ్వెంత బంగారానివి. ఇంట్లో పరిస్థితులు, నా ఇబ్బంది చూసి, ఇంట్లోనే అన్ని బాధ్యతలు చూసుకుంటూ.. డిస్టెన్స్లో చదువుకుంటున్న నువ్వు ఎంత గొప్పో.. ఆవిడకేం తెలుసు? ఇంత మంచి మనసు అందరికుంటుందా? ఇంట్లో అన్నీ అమరుతున్నప్పుడు ఉద్యోగం చేయడం గొప్ప విషయం కాదు. అందరి కష్టసుఖాలు చూసుకుంటూ, బాధ్యతగా మెలుగుతూ.. ఇంటినుండే చదువుకుంటూ కలలను నెరవేర్చుకునే నీలాంటి అమ్మాయిలు చాలా గ్రేట్! తన మాటలు పట్టించుకొని, నీ మనసు పాడు చేసుకోకు. ఆ నెగిటివ్ ఆలోచనలు సమయం నీ కొత్త ఆలోచనను చంపేస్తుంది. అది గుర్తుపెట్టుకో! మన కోపం మనలో పట్టుదలను పెంచాలి కానీ, మనల్ని బాధ పెట్టకూడదు". చెబుతూనే భోజనం తినిపించింది రజిత.
అత్తగారి చేయి పట్టుకుని, "థాంక్యూ సో మచ్ అత్తయ్యా!నిజమే! మంజులత్తయ్య అన్న మాటలకి దాదాపు రెండు, మూడు గంటల నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ రెండు, మూడు గంటలు ఆన్లైన్లో ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటే సరిపోయేది. అయినా..ఇంకో రెండు నెలలకి నా కోర్సు పూర్తవుతుంది. జాబ్ గ్యారంటీ! ఇంటి నుండే.."నవ్వుతూ చెబుతున్న రవళిని మురిపెంగా చూస్తూ ఉండిపోయింది రజిత.
"ఏమే రజితా! కోడల్ని చూస్తూనే కడుపు నింపుకుంటావా? అన్నం తినేది ఏమైనా ఉందా? అసలే ఇంటినిండా బోల్డంత పని. అత్తా కోడలు కాస్త కడుపు నిండా తినండి. ఆరోగ్యంగా ఉండండి. పాపం మీ అత్తగారికి కూడా సంగీతం నేర్చుకోవాలని చాలా ఉండేది. అప్పట్లో ఇలా ఇంటి నుండి నేర్చుకునే అవకాశం లేదు. పైగా మా అత్తగారి పెత్తనం. పాపం, ఇంటి కోసం దాని మనసు చంపుకుంది. పిచ్చి పిల్ల!ముందు భోజనం చేయి రజితా!". అంటూ తనను ముద్దుగా గదుముతున్న అత్తగారిని చూస్తూ.."ఇదిగో తింటున్నా అత్తయ్యా!"అంటూ... కోడలితో, "ఆ ఆన్లైన్లో నాకు ఏమైనా సంగీతం నేర్చుకునే కోర్సులు ఉన్నాయేమో చూస్తావా? మధ్యాహ్నం పూట వీలుంటే నేర్చుకుంటా! ఏమంటావ్?"అంటూ నవ్వుతూ భోజనం ప్రారంభించింది.. రెండు తరాల మధ్య వారధి రజిత.
No comments:
Post a Comment