పొగరుబోతుతనం
మనుషుల్లో రకరకాల వ్యక్తిత్వాలు కలవారు ఉంటారు. సాత్వికులు, మూర్ఖులు, మధ్యస్థంగా ఉండేవారు, తెలివైన వారు, కోపిష్ఠులు... వీరందరిలోనూ ప్రత్యేకంగా కనిపించే మరొక తరహా మనుషులు పొగరుబోతులు!
పొగరు అంటే ఆత్మాభిమానం అవసరానికి మించి ఉండటమే. పొగరన్న మాట విన్న ప్పుడు ఓ కొండో, ఆకాశాన్ని తాకే చెట్టో గుర్తుకు రాక మానదు. ఎందుకంటే కొంత మందిలో అహంకారం ఆ స్థాయిలో ఉంటుంది. ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలించినప్పుడు ఇలాంటివారిలోనూ ఒక స్థాయిలో జ్ఞానం దాగిఉందని బోధపడుతుంది. పొగరుబోతులు సహజంగా గర్వంతో ప్రవర్తిస్తారు. ఎందుకంటే వారు తమకంటూ ఏదో ప్రత్యేకమైన గొప్ప విలువుందని నమ్ముతారు. ఆత్మన్యూనతా భావం లేకుండా స్వశక్తి మీద విశ్వాసం ఉండటం ఆధ్యాత్మిక జగత్తులో ఓ గొప్ప పరిణామమే! 'ధీరులు ఆత్మవిశ్వాసంతో భాసిస్తారు' అని భగవానుడు గీతలో చెబుతారు. అయితే... పొగరు వేరు, ఆత్మవిశ్వాసం వేరు. ఆ రెండింటి మధ్య ఉండే సన్నటి గీతను గుర్తించాలి. సాధకుడు తనను తాను శక్తిమంతుడిగా నమ్మాలి. కానీ, అది తలబిరుసు తనంగా మారకూడదు. ఆత్మావలోకనం చేసుకునే సాధకుడు తన లోపలి ప్రపంచాన్ని దర్శించగలు గుతాడు. తనలో ఉన్న గొప్పతనాన్ని వినయపూ ర్వకంగా గ్రహించడం మాత్రమే అతడి ప్రగతికి తోడ్పడుతుంది.
పొగరును వినయంగా మార్చుకోవడంతో వ్యక్తి సాధన పరిపక్వతకు చేరుకుంటుంది. జ్ఞాని మౌనంగా ఉన్నప్పటికీ అతడి విజ్ఞత లోకానికి వెల్లడవుతుంది. అవసరమైనప్పుడు అతడు మాటల్లోనూ తన జ్ఞానాన్ని వ్యక్తపరుస్తాడు. అది అతిశయం ఎంతమాత్రం కాబోదు. అంత ర్లీనంగా ఉన్న అతడి వినయాన్ని లోకం అర్ధం చేసుకుంటుంది.
అందరిలోనూ 'నేను' అనే రూపంలో ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది. కోటానుకోట్ల 'నేను'ల ఏకత్వాన్ని తెలుసుకున్న సాధకుడు జ్ఞానిగా వ్యక్తమవుతాడు. లోకంలో ప్రతి వ్యక్తిలోనూ కొద్దో గొప్పో అహంకారం ఉంటుంది. అహం లేకుండా మనిషి లేడు. ఆ అహం, అహంకారంగా మారకుండా చూసుకుని పరమాత్మను చేరే మార్గం సాధకుడు అన్వేషించాలి. పొగరుబోతుతనం శాశ్వతం కాదు. మనిషి ఆధ్యాత్మికంగా ఎదిగేకొద్దీ అదే పొగరుబోతుతనం వినయంగా మారుతుంది. అందుకు సాధకుడి అకుంఠిత దీక్ష తోడ్పడుతుంది.
ఏ విషయం తనలో పొగరుబోతుతనానికి ప్రేరణ కల్పించిందో దాన్ని మిథ్యగా తెలుసుకుని తొలగించుకోవాలి. వినయభావనను సాధన చేయాలి. పండు సువాసనతో, మాధుర్యంతో తినేవారిని ఆకర్షిస్తుంది. అది పిందెగా ఉన్నప్పుడు వగరుగానో, చేదుగా నో, పుల్లగానో ఉండవచ్చు. కాలగతిన ఆ స్థానంలో మాధుర్యం చోటు చేసుకుంటుంది. పొగరుబోతుతనం తొలుత వెగటు కలిగించినా, జ్ఞానంతో కూడిన సాధనతో అటువంటి వ్యక్తి కూడా తీయని ఫలంలాగా లోకానికి తప్పక ప్రీతి కలిగిస్తాడు. పొగరుబోతుతనం తప్పుకాదు. అదొక తెలియనితనం! అమాయకులైన పిల్లలు విద్యతో వినయాన్ని, జ్ఞానాన్ని సాధించినట్లు పొగరుబోతులు జీవితం బోధించే పాఠాలు ఒంటబట్టించు కున్నాక విలువలు నేర్చుకుని తప్పక జ్ఞానవంతులవుతారు... అవ్వాలి!
గోపాలుని రఘుపతిరావు
No comments:
Post a Comment