*భట్టివిక్రమార్క కథలు-30*
(శ్రీ ఇచ్ఛాపురపు రామచంద్రం)
160/374
*ఎవరు ఎవరికి ఏమౌతారు?*
పట్టువదలని విక్రమార్కుడు మరల మోదుగ చెట్టునెక్కి భేతాళుడిని తాళ్ళతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు.
అప్పుడు శవంలోంచి భేతాళుడు, "విక్రమార్కమహారాజా! నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను. విను. అంటూ ఇలా ప్రారంభించాడు.
రాజా! ఒక పట్నంలో దివాకరుడనే క్షత్రియుడుండేవాడు. అతని భార్య వసుమతి. వారికి ముక్తాలత అనే కుమార్తె ఉండేది.
ఆమె యౌవనవతి, అవివాహితా. సంసారంలో ఏదో కలతరేగి దివాకరుడు భార్యనీ, కూతురినీ వదలి మరోదేశం పోయాడు.
దానితో వారిద్దరూ చాలా దుఃఖించి అతనిని వెదుక్కుంటూ యిల్లువిడిచి బయలుదేరారు. ప్రయాణిస్తూ ఎండ ఎక్కువగా కాస్తూంటే ఒక చెట్టు నీడన కూర్చున్నారు.
ఆ సమయంలోనే వారి వెనుక తండ్రి కొడుకలైన బ్రాహ్మణులిద్దరు వస్తూ.. స్త్రీల అడుగుజాడలు చూసి.. "ఈ అడుగులెవరివో? ఈ వనితలొకవేళ మనకి లభిస్తే చెరొకరిని స్వీకరిద్దాం." అన్నాడు కొడుకు.
అందుకు తండ్రి - "అలాగే. ఇద్దరిలో పెద్ద అడుగులది పెద్దదౌతుంది కనుక నేను స్వీకరిస్తాను. చిన్న అడుగులదాన్ని నువ్వు తీసుకో." అన్నాడు.
అలాగే అన్నాడు కొడుకు. వాళ్ళు మరికొంత దూరం రాగానే చెట్టుకింద కూర్చున్న తల్లీకూతుళ్ళు కనిపించారు.
వారి వృత్తాంతం కనుక్కుని తమ కోరిక తీరుతుందని ఎంచి.. వారికి అనుకూలమైన మాటలు చెప్పి తమతో వివాహానికి ఒప్పించారు..
కాని.. తల్లిపాదాలు చిన్నవిగాను, కూతురిపాదాలు పెద్దవిగాను ఉన్నాయి.
అయినా మొదట అనుకున్న ప్రకారమే తల్లిని కుమారుడు, కూతురిని తండ్రి స్వీకరించి కాపురం చేయసాగారు.
కొంతకాలానికి ఇద్దరికీ పుత్రులు పుట్టారు. ఆ శిశువులు పెద్దవారయ్యాక ఒకరినొకరు ఏ వరసతో పిలుచుకోవాలి? చెప్పు." అని అడిగాడు భేతాళుడు.
విక్రమార్కుడు చాలాసేపు ఆలోచించి తగిన సమాధానం తట్టక మాట్లాడకుండా పోసాగాడు. తన ప్రశ్నకు సమాధానం తోచకే రాజు మౌనంగా పోతున్నాడనీ అందుచేత పూర్వంలా తప్పించుకుపోడం తనకి సాధ్యంకాదని నిశ్చయించుకుని.. భేతాళుడు అతని ధైర్యసాహసాలకీ బుద్ధివిశేషానికి సంతోషించి.. అతనికి మేలు చేయదలచి అతని ముందు ప్రత్యక్షమై ఆపాడు.
*భేతాళుడి చరిత్ర*
"విక్రమాదిత్యా! నువ్వు పట్టుకోడానికి వచ్చినప్పుడు చెట్టుమీద వేలాడుతున్నది నా నిజమైన ఆకారం కాదు. నిన్ను భయపెట్టడానికే అలా పిశాచాకారం ధరించాను.
నీ ధైర్యసాహసాలకీ, సుగుణాలకీ మెచ్చి నా నిజరూపం చూపుతున్నాను. నా చరిత్ర కూడా నేను చెప్పవలసి ఉంది." అంటూ తన కథ మొదలు పెట్టాడు భేతాళుడు.
“పూర్వం - నేనొక బ్రాహ్మణుడిని.
కాలత్తయ్య నా పేరు. చోళ మండలంలోని త్రిశిరపురం శివాలయంలో సర్వవిధులూ నా పర్యవేక్షణలోనే జరిగేవి. ఆలయం తలుపులు తీయించడం.. పూజలు.. చివరగా తాళం వేయించి ముద్ర కొట్టడం.. అన్నీ చేసేవాడిని.
ఒకనాడు తాళం వేయించాక పరిచారకులు అందరూ వెళ్ళిపోయినా ఆలయంలో అటూ యిటూ తిరుగుతూంటే గర్భగుడిలోంచి ఎవరో మాట్లాడుతున్నట్లు వినిపించి ఆశ్చర్యపోతూ అదేమిటో చూద్దామని వెళ్ళాను.
తలుపు కన్నంలోంచి లోపలికి చూడగా.. పార్వతిని ఒడిలో కూర్చోబెట్టుకుని పరమేశ్వరుడు సరస సల్లాపాలాడుతున్నాడు.
పార్వతి -"దేవా! అపూర్వమైన విషయమేదైనా చెప్పు." అని అడిగింది. అప్పుడు .శివుడు - ఇప్పుడు నేను నీకు చెప్పిన ఇరవైనాలుగు కథలు చెప్పి,
ఇరవైమూడింటికి అంతరార్థం వివరించాడు. ఇరవైనాలుగవదానికి ఎవడూ తగిన సమాధానం చెప్పలేదు. బ్రహ్మకైనా తెలియదు." అన్నాడు.
నేను ఆశ్చర్యంతో ఏమీ ఎరగనట్లే ఇంటికి వచ్చేశాను.
“ఇవాళ యింతాలస్యంగా వచ్చారేం?" అడిగింది నా భార్య. నేనేది బొంకినా ఒత్తి ఒత్తి అడగడంతో - దాచడానికి మనసురాక జరిగినదీ ఆ కథలూ చెప్పేసి “ప్రాణేశ్వరీ! ఇది భగవద్విషయం కనుక పరమ రహస్యం. ఎవరికీ చెప్పకు." అన్నాను.
కాని ఆమె నా మాటలు వినకుండా.. మర్నాడు నీళ్ళకు కొలనుకి పోయినపుడు అమ్మలక్కలతో తాను విన్న వింతకథలూ వాటి అంతరార్ధమూ చెప్పేసింది. అవి అలా ఒకరినుంచి ఒకరికి లోకమంతా నిండిపోయాయి.
ఒకరోజు పరమశివుడు నాకు మాత్రమే కనిపించి- "నేను నా భార్యకి రహస్యంగా చెప్పిన కథలు మరుగునుండి విని పోయి నీభార్యకి చెప్పి లోకమంతా వ్యాపించేటట్లు చేశావు. బయట పెట్టకూడని విషయమని వెరవలేదు. ఇది మొదలు నువ్వీ మానవాకారం వదలి భేతాళుడివయి ఉండు. ఫో" అని శపించాడు.
నేనతని పాదాలమీద పడి నా తప్పు మన్నించి శాపవిముక్తిని ప్రసాదించమని వేడుకోగా - పరమశివుడు- "ఉజ్జయిని అనే నగరముంది. దాని రాజు విక్రమాదిత్యుడు. న్యాయమార్గంలో పరిపాలన చేస్తున్నాడు. ఆ నగరానికి రెండామడల దూరంలో కాళికాలయం ఉంది. దానికి రెండు కోసులదూరంలో ఎత్తయిన మోదుగ చెట్టుకొమ్మకి తలకిందులుగా వేలాడుతూండు.
కొన్నాళ్ళకి ఒక సన్యాసి ఆ అరణ్యంలో కాళి గురించి తపస్సు చేసి ఆ మహాదేవి కరుణపొందడానికీ నిన్ను తన వశం చేసుకుందుకూ తొంభై తొమ్మిది మంది రాజుల తలలు హోమం చేసి నూరవవాడిగా విక్రమాదిత్యుడిని తీసుకువచ్చి అతని చేత మొదట నిన్ను తెప్పించి తరవాత అతనిని చంపబోతాడు.
విక్రమాదిత్యుడు నిన్ను పట్టుకుందుకు వచ్చినప్పుడు నువ్వీ కథలు చెప్పు. అతను ఇరవైమూడు కథలకు సమాధానం చెబుతాడు. ఇరవై నాలుగోదానికి ఏమీ చెప్పలేక మౌనంగా ఉంటాడు.
అప్పుడతనికి ప్రత్యక్షమై నీ కథ చెప్పి, సన్యాసి మోసం బయట పెట్టి.. రాజుచేత ఆ దుష్టుడిని చంపించి.. సన్యాసిని హోమగుండంలో వేయించు.
కాళికాదేవి ప్రసన్నురాలై రాజుకి వరాలిస్తుంది. అతను రాజ్యం చేస్తున్నంత కాలమూ నువ్వతనికి వాహనంగా ఉండి, అతను స్వర్గానికి వెళ్ళాక నువ్వు నన్ను చేరుకుంటావు” అని నన్ను మోదుగు చెట్టు వద్దకు పొమ్మన్నాడు.
తక్షణమే నేను భేతాళుడినై వచ్చి యిక్కడ వేలాడుతున్నాను. నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాను.
రాజశ్రేష్ఠా! పరమేశ్వరుడి ఆజ్ఞమేరకు ఇది మొదలు నేను వాహనంగా ఉండి నువ్వు చెప్పిన పనులు చేస్తూంటాను. నా సేవలనంగీకరించు." అని ప్రార్ధించాడు.
(సశేషం)
No comments:
Post a Comment