*అవకాశమే ఆయుధం*
మనిషిని బతికించే మధురసాయనం లాంటి మహాశక్తి- ఆశ. అది మరణశయ్యపై నుంచీ లేపి మళ్ళీ నడిపించగల మహామంత్రం. మనిషిని నిట్టనిలువునా చీల్చి మసి చేసే మారణాయుధం- నిరాశ. అది ఎంతటి శక్తిమంతుడినైనా దుర్బలుణ్ని చేసే
మహమ్మారి. ఏ రంగంలోనైనా జయాపజయాలు, కష్టసుఖాలు సహజం.
ఎదగాలనుకున్నవారికి ఎదురుదెబ్బలు తప్పవు. ఓరిమితో తట్టుకుని నిలబడాలి.
దెబ్బ తగిలితే గాని నొప్పి తెలియదు. తగిలిన ప్రతి గాయాన్ని ఓపికతో మాన్పుకొని మళ్ళీ ప్రయత్నం కొనసాగించాలి. మధుర పదార్థం మోతాదుకు మించి స్వీకరిస్తే వెగటు పుడుతుంది. విజయాలకే అలవడిన జీవితానికి ఓటమి బాధ తెలియదు. అందుకే ఎప్పుడైనా పరాజయం ఎదురైనా కుంగిపోకూడదు. కష్టాల్ని
అనుభవించాలి. రాటు తేలాలి. ఓటమి కాటుతోనే గెలవాలన్న కసి, పట్టుదల మొదలవుతాయి. పరాజయాన్ని డీ కొట్టి స్థిరంగా నిలిచినప్పుడు, కష్టాన్ని తట్టుకుని సుఖానికి ఎదురుచూసినప్పుడు- వాటి శక్తి తెలుస్తుంది. వీటికి తగిన ప్రణాళికల్ని సిద్ధంచేసుకోవాలి. అహరహం శ్రమించాలి. ఎత్తుకు వైయెత్తులు వెయ్యాలి. చాణక్యుడిలా గెలుపు సూత్రాన్ని సొంతం చేసుకోవాలి. విజయ కంకణధారుల ధాటికి తలవంచి ఓటమి పలాయనం చిత్త గిస్తుంది. చిమ్మచీకటిలో పొరుగూరికి బయలుదేరాడో వ్యక్తి దారిలో కుంభవృష్టి మొదలైంది. రక్షణ కోసం ఓ చెట్టునీడకు చేరాడు. ఆ పక్కనే ఓ దిగుడు బావి. జారి అందులో పడిపోయాడు. ప్రాణా లపై ఆశ కోల్పోయి చీకట్లో కాలం. గడిపాడు. తెల్లవారింది. వర్షం తగ్గింది. బయటపడే మార్గం కనపడలేదు. ఇంతలో ఈదురుగాలికి చెట్టుకొమ్మ బావిలోకి ఒరిగింది. వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదా వ్యక్తి, మూడు, నాలుగు సార్లు ప్రయత్నించాక కొమ్మ పట్టుకుని పైకి వచ్చాడు. దైవానికి కృతజ్ఞతలు చెప్పి ముందుకు సాగిపోయాడు. జీవితంలో యాదృచ్ఛికంగా లభించిన అవకాశాల్ని తెలివిగా దక్కించుకున్నవారే విజ్ఞులు, తగిన కృషి, పట్టుదల, విశ్వాసం, దైర్యం- ప్రయత్నానికి తోడవ్వాలి. అప్పుడు విజయం తలవంచి దాసోహమనక తప్పదు.
అవకాశాలు తమంత తాముగా మన చెంతకు చేరవు. మనం అన్వేషించాలి. తపించాలి. శ్రమించాలి. చేజిక్కించుకుని కార్యనిర్వాహణలో విజయం సాధించాలి. మనలోని ఆసక్తి, శ్రద్ధ గమనించిన వివేకులు కొందరు తమ చెయ్యి అందించి అవకాశాల బాటలు పరుస్తారు. ఆ చేతులను బలంగా పట్టుకుని ఎగబాకి ఆ బాటలో విజయ ధ్వజాన్ని నాటాలే గాని, జారిపోకూడదు. స్వశక్తితో ఇతరులను ఒప్పించి మెప్పించాలి. విజయపరంపరను ఖాతాలో జమచేసుకోవాలి. వేలు వంచనిదే వెన్న అయినా దక్కదని గ్రహించాలి. అనుభవాన్ని, తెలివిని, శక్తిని కలగలుపుకొని గడ్డిపోచలను బలిష్టమైన పలుపు తాడుగా మార్చుకోవాలి. చేతికందిన అవకాశాల్ని స్వార్థ ప్రయోజనాలకు కాకుండా పరహితంగా ఉపయోగించాలి. వాటి ఫలితాలు లోకకల్యాణానికి ఉపకరించిననాడు పరమార్థం నెరవేరినట్లే. పూలబాటలో తాము నడుస్తూ పదిమందినీ తమతో నడిపించాలి. దానం, ధర్మం, సమాజసేవ నిర్వహించే అవకాశం చేతికందినప్పుడు పరమాత్మ ఆదేశంగా స్వీకరించి ఇతరుల సంక్షేమానికి నడుంకట్టేవారు ధన్యజీవులు.
*ಓಂ ನಮಃ ಶಿವಾಯ*
No comments:
Post a Comment