అద్దె ఇంట్లో ఉన్నవాడు, ఆ ఇంట్లో ఉన్నంతకాలం
'మా ఇల్లు' అనే అంటాడు.
తన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు
ఇంటి యజమానితో కూడా అదే అంటాడు
'ఏమండీ! రేపు మా ఇంటికి రండి...' అని.
'మా ఇల్లు' అన్నాడని అతనితో యజమాని గొడవపడడు.
యెందుకంటే వ్యవహారం కోసమే అలా అంటారని
ఇరువురికీ తెలుసు.
అలాగే ఈ తనువు తనకు అద్దె ఇల్లు లాంటిది.
వ్యవహార నిమిత్తం నా శరీరం, నా సంసారం, నా ప్రపంచం, నా దైవం అంటాడు.
కానీ యజమాని భగవంతుడు.
యజమాని భగవంతుడు అనేది
జ్ఞప్తి కలిగి ఉన్నవాడు - జ్ఞాని.
మరచి ఉన్నవాడు - అజ్ఞాని.
అద్దె ఇల్లు పెచ్చులూడితే అద్దెకున్నవాడు ఏమీ చింతించడు.
ఆ ఇల్లు ఖాళీ చేసి మరొక ఇల్లు చూసుకుంటాడు.
ఇక ఈ శరీరం నిలబడని వ్యాధి వచ్చింది...
వదిలేసి మరొక ఉపాధిని వెతుక్కుంటాడు.
అదే పునర్జన్మ.
ఇల్లు మారితే యజమాని మారుతాడు.
కానీ శరీరం మారితే యజమాని(భగవంతుడు) మారడు.
సకలసృష్టికీ యజమాని ఆయనే.
సృష్టి యావత్తు భగవంతునికి ఓ సంకల్పం అంతే.
ఆయన ఒకేసారి మొత్తాన్ని ఖాళీ(లయం) చేసేస్తాడు.
అనగా సంకల్పరాహిత్యంగా ఉంటాడు.
నీవు నిద్రలో ఉన్నట్టు.
దేవుని సంకల్పరాహిత్యమే
జీవునికి జన్మరాహిత్యము.
కాబట్టి బంధమైనా, మోక్షమైనా భగవంతుని సంకల్పమే.
అందుకే అన్నమయ్య ఓ సంకీర్తనలో ఇలా అన్నారు-
"మదిలో చింతలు, మైలలు మణుగులు, వదలవు నీవవి వద్దనక."
భగవంతుడు "వద్దు" అనుకుంటే ఉండవు.
అంతేగానీ మనం వద్దు అనుకుంటే పోవు.
నా సంకల్పం కూడా భగవంతుని సంకల్పంలో అంతర్భాగమే కదా అంటావేమో!
ఇక బాధేముంది?
నీ శరీరం భగవంతుని శరీరంలో(సృష్టిలో) అంతర్భాగం.
నీ మనస్సు భగవంతుని మనస్సులో(మాయలో) అంతర్భాగం.
జీవుని బంధమోక్షములు దేవుని లీలావిలాసములు.
శరీరం ఉంటే ఉండనీ... ఊడితే ఊడనీ...
బంధం ఉంటే ఉండనీ... మోక్షం వస్తే రానీ...
ఏదైనా సరే ఉంటే ఏమి? లేకుంటే ఏమి?
అని ఉండటం జ్ఞానిలక్షణం.
* * *
No comments:
Post a Comment