Monday, August 22, 2022

ఏ పని చేసినా ఆ పనిచేసిన దానికి ఏదో ఒక ఫలితం కలుగుతుంది. అది సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, రెండూ మిళితమైంది కావచ్చు. కాని బ్రహ్మజ్ఞాని....

 సాధారణంగా మానవులు ఏ పని చేసినా ఆ పనిచేసిన దానికి ఏదో ఒక ఫలితం కలుగుతుంది. అది సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, రెండూ మిళితమైంది కావచ్చు. కాని బ్రహ్మజ్ఞాని ఆ ఫలితాలకు ప్రభావితుడు కాదు. బ్రహ్మజ్ఞానం పొందిన తరువాత ఎలా ఉంటాడు అనే దానికి కొన్ని గుర్తులు చెప్పాడు పరమాత్మ..
బ్రహ్మజ్ఞానం కలిగితే బుద్ధి స్థిరంగా ఉంటుంది. మోహం ఉండదు. మనస్సు నిలకడగా ఉంటుంది. అతనికి సంతోషం, దుఃఖం సమంగా ఉంటాయి.  బ్రహ్మజ్ఞానం పొందిన వాడికి ఈ ప్రపంచమంతా మాయగా కనపడుతుంది. ఇందులో ఏదీ సత్యం కాదు అని తెలుసుకుంటాడు. మాయలో పడడు. ఈ మాయా ప్రపంచములో సుఖదుఃఖాలు వస్తు,పోతుంటాయి. వాటికి మనం పొంగి పోవడం బాధపడటం వృధా అని తెలుసుకుంటాడు. నిశ్చలంగా ఉంటాడు. 

బ్రహ్మజ్ఞానం పొందినవాడి బుద్ధి స్థిరంగా ఉంటుంది. అజ్ఞాని బుద్ధి కామము,మోహం మొదలగు వాటితో చంచలంగా ఉంటుంది. వెలుగులో ఉన్న వాడికి చీకటి అంటే ఏమిటో తెలియదు. అలాగే జ్ఞానము కలవానికి అజ్ఞానము అంటే ఏమిటో తెలియదు. అతనికి సందేహహములు కలుగవు. మోహంలో పడడు. ప్రాపంచిక వస్తువులు అన్నీ ఎండమావులు అని తెలుసుకొని వాటి మోహములో పడడు. ఇది తెలియని అజ్ఞానులు మాత్రమే ఎండమావుల వెంట పరుగెత్తి అక్కడ ఏమీ లేకపోతే దుఃఖపడుతుంటారు. కాబట్టి స్థిరబుద్ధి, సమత్వము కలిగి, మోహము లేకపోవడం జ్ఞని లక్షణములు.

ఇక్కడ మనకు ఒక సందేహము వస్తుంది. జీవన్ముక్తుడికి కర్మలు చేయవలసిన అవసరం ఆ ఫలితాలను అనుభవించవలసిన అవసరం ఏముంది అని. ఈ జన్మలోనే మోక్షము కలిగినా, మరణించేదాకా ఈ దేహము ఉంటుంది. దేహం ఉన్నప్పుడు ఆకలి దప్పులు, ఎండ, చలి, ఉంటాయి. మనసు ఉంటుంది. బయట ప్రపంచంలో తిరుగుతూ ఉండాలి. వీటిని ఎవరూ ఆపలేరు. జ్ఞాని కూడా దేశం, కాలం వీటి ప్రభావానికి అతీతుడు కాడు. అజ్ఞాని వీటి ప్రభావానికి లోనవుతుంటాడు.

అజ్ఞాని ప్రతి దానికీ స్పందిస్తుంటాడు. భావోద్వేగాలు పొందుతుంటాడు. జ్ఞానికి తనకు అనుకూల పరిస్థితులలో సంతోషిస్తాడు. కాని పొంగిపోడు. ఎగిరి గంతెయ్యడు. ఎందుకంటే అతని మనసు నిశ్చలంగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు వచ్చినపుడు కుంగి పోడు. దుఃఖమునకు లోను కాడు. దానిని కూడా సుఖాలు గానే భావిస్తాడు.

మూఢత్వం అంటే తాను నమ్మిందే వేదం, ఇతరులు ఏం చెప్పినా వినకపోవడం. ప్రతి దానికీ సందేహించడం. ప్రతి దానినీ “ఇదిమన వల్ల కాదు, ఇది అయ్యే పని కాదు" అనే వ్యతిరేక భావంతో ఉండటం. ఆత్మజ్ఞానిలో ఈ మూఢత్వము మచ్చుకైనా కనిపించదు. అతని మనసు నిర్మలంగా ఉంటుంది. ఇదంతా ఆత్మజ్ఞానం వలన వస్తుంది. ఆత్మజ్ఞానం కలిగితే ఈ జన్మలోనే ఇక్కడే ముక్తిలభిస్తుంది.

🙏 కృష్ణం వందే జగద్గురూమ్🙏

No comments:

Post a Comment