Sunday, April 2, 2023

రామయ్యా

 రామయ్యా 

ఏ పుత్రుడు 
నీలా తండ్రి ఇచ్చిన
మాట నిలుపటానికి 
రాజ్య సుఖములను 
సౌఖ్యములను విడిచి 
కట్టుబట్టలతో 
కానలకేగ గలడు

ఏ శిష్యుడు 
నీలా అతి సామాన్యముగా 
వెంటనడిచి 
అనితరసాధ్యమైన సేవలు
చేయగలడు

ఏ భర్త 
నీలా భార్యను  ప్రాణప్రదముగా చూసుకొని 
ప్రతి భర్తా శ్రీరామచంద్రునిలా ఉండాలి 
అనిపించేలా ఏకపత్నీవ్రతము 
ఆచరించగలరు 

ఏ సోదరుడు 
నీలా తమ్ములను ఆదరించగలరు 

నీ పాదుకలు పరిపాలించినా చాలని 
భావించి శిరస్సున ఉంచుకొనేలా 
ప్రేమను పంచగలరు 

ఏ మిత్రుడు 
నీలా రాజ్యము కలిగి 
అమిత పరాక్రమమైన వాలిని వదిలి
ధర్మాన్ని పట్టుకుని రాజ్యాన్ని కోల్పోయిన 
సుగ్రీవునికి స్నేహ హస్తాన్ని ఇవ్వగలరు 

ఏ ప్రభువు 
నీలా సేవకుని ఆలింగనము చేసుకొని
ఆనంద భాష్పాలు రాల్చగలరు 

నీవు తప్ప ప్రపంచములో మరేమీ 
లేనంతగా నీ నామములోనే 
తరించి తరించి ఆర్తితో 
ఆనంద భాష్పములు రాలుస్తూ 
నృత్యము చేయగలరు 

ఏ చక్రవర్తి 
నీలా ప్రజల మాటకోసము
ధర్మనిరతి కోసము
ప్రాణప్రదమైన సీతమ్మని 
దూరము చేసుకొని 
జీవితమును త్యాగము చేయగలరు 

రాజ్యము అంటే రామ రాజ్యమే అని
యుగయుగాలు నిలిచేలా పాలించగలరు 

ఏ దేవుడు 
భువికి దిగివచ్చి 
భక్తుని మొరలు ఆలకించి 
తానీషాకు కప్పము కట్టి 
భక్తుల కష్టాలకు భక్తికి
మరల మరల అవతరిస్తూ 
నమ్మిన వారిని బ్రోవగలరు 

ఏ అవతారము 
ముసలి అవ్వ శబరి భక్తికి మెచ్చి తరింపచేయగలదు

ఏ పుణ్యమూర్తి నీలా 
శాపము వలన రాతిలా మారిన అహల్యకు 
శాపవిమోచనము ఒసగి
తల్లిలా భావించి ఆమె గొప్పతనము 
లోకానికి చాటగలరు 

ఏ మహనీయుడు 
నీలా నిలిచి నడచి 
ఈశ్వరుడు సైతం 
మనమున నీ నామము 
తలచేలా ఉండగలడు

రామయ్యా..
నీవు ధర్మమును ఆచరించలేదు 
ధర్మమే నీవు 
నీవు సత్యము తెలుపలేదు 
సత్యమే నీవు 

నిన్ను తలచిన శక్తి కలుగు 
నిన్ను స్మరించిన  భక్తి కలుగు 
నిన్ను సేవించిన ముక్తి కలుగు 

నా ఎదలో నీవు 
స్థిరముగా నిలిచి 
ఈ జీవుని రాజ్యమును 
సుభిక్షంగా పరిపాలించి 
నీ దాసాను దాసునిగా 
ఏలుకోవయ్యా

లక్ష్మణ భరత శత్రుఘ్న 
హనుమత్ సేవిత  
శ్రీ రామచంద్రా 
సీతా మనో వల్లభా 

జై శ్రీ రామ్ 
జై శ్రీ రామ్
జై శ్రీ రామ్

ఆత్మీయులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

No comments:

Post a Comment